Lybia Floods: లిబియాలో మారణహోమం సృష్టించిన జలప్రయళం.. 5 వేల మందికి పైగా మృత్యువాత

ABN , First Publish Date - 2023-09-13T20:32:57+05:30 IST

ఆఫ్రికా దేశమైన లిబియాను డేనియల్ తుఫాను చిన్నాభిన్నం చేసింది. ఆ దేశంలో జలప్రళయం సృష్టించి.. మారణహోమానికి దారితీసింది. వందల్లో కాదు.. వేల సంఖ్యలో మనుషుల ప్రాణాలను బలిగొంది. నిన్నటివరకూ..

Lybia Floods: లిబియాలో మారణహోమం సృష్టించిన జలప్రయళం.. 5 వేల మందికి పైగా మృత్యువాత

ఆఫ్రికా దేశమైన లిబియాను డేనియల్ తుఫాను చిన్నాభిన్నం చేసింది. ఆ దేశంలో జలప్రళయం సృష్టించి.. మారణహోమానికి దారితీసింది. వందల్లో కాదు.. వేల సంఖ్యలో మనుషుల ప్రాణాలను బలిగొంది. నిన్నటివరకూ సుఖసంతోషాలతో కాలం గడిపిన ప్రజల జీవితాల్లో చీకటి రోజులు నింపేసింది. అధికారుల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకూ 5,300 మందికి పైగా వ్యక్తులు మరణించారు. ఇంకా 10 వేల మంది ఆచూకీ తెలియరాలేదని చెప్పారు. డేనియల్ తుఫాను కారణంగా రెండు డ్యామ్‌లు బద్దలు కావడం వల్లే.. ఈ స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లిందని లిబియా అధికారులు చెప్తున్నారు. ఒక్క బుధవారం రోజు మాత్రమే డెర్నా నగరంలోని తూర్పు భాగంలో 2,300 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.

డేనియల్ తుఫాను దెబ్బకు వరదలు పొంగిపొర్లడంతో.. ఆదివారం రెండు డ్యామ్‌లు బద్దలయ్యాయి. దాంతో.. మధ్యధరా నగరాన్ని నీటి ఉప్పెన చీల్చి చెండాడింది. భవనాలు, అందులోని ప్రజలు ఈ ఉప్పెనలో కొట్టుకుపోయారు. ఈ డిజాస్టర్‌పై ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ & రెడ్ క్రెసెంట్ సొసైటీలకు చెందిన టామర్ రంజాన్ మాట్లాడుతూ.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం కచ్ఛితమైన సంఖ్య లేదని, 10 వేల మంది ఆచూకీ కనిపించడ లేదని చెప్పారు. మరోవైపు.. అనేక నగరాలు ఈ వరద ప్రభావానికి గురయ్యాయని, ముఖ్యంగా డెర్నా నగరంలోనే ఎక్కువ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. అటు.. ప్రజలను కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.


కాగా.. డెర్నా నగరం సముద్ర తీరంలోని పర్వత ప్రాంతంలో ఉంది. చుట్టూ కొండ ప్రాంతాలే ఉన్నాయి. ఇక్కడ నివాస గృహాలు సైతం పర్వత లోయలోనే ఉన్నాయి. ఈ నగరానికి సమీపంలోనే ఉండే ఒక డ్యామ్ డేనియల్ తుఫాన్ దెబ్బకు బద్దలు కావడంతో.. భారీగా బురద నీరు చొచ్చుకొచ్చింది. దీంతో.. ప్రజలకు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయాయి. ఈ డెర్నాలో దాదాపు ఒక లక్ష మంది ప్రజలు నివసిస్తున్నారు. భవనాలు ఎక్కువగా నది ఒడ్డునే ఉన్నాయి. ఇప్పుడు ఈ జలప్రళయం దెబ్బకు.. ఈ నగరమంతా చెల్లాచెదురైంది. భవనాలు, ప్రజలు, కార్లు.. ఉధృతమైన బురదలో కొట్టుకుపోయాయి. రెండు డ్యామ్‌లు కూలిపోవడం వల్లే.. వరద తీవ్రత పెరిగిందని లిబియా ప్రధాని ఒసామా హమద్ పేర్కొన్నారు.

లిబియాలో సంభవించిన ఈ విపత్తుపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ దేశానికి సహాయం చేయడానికి అనేక దేశాలు ముందుకొచ్చాయి. రెస్క్యూ బృందాలను పంపించాయి. టర్కీ నుండి రెస్క్యూ బృందాలు తూర్పు లిబియాకు చేరుకున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితితో పాటు అల్జీరియా, ఈజిప్ట్, ఫ్రాన్స్, ఇటలీ, ఖతార్, ట్యునీషియా వంటి అనేక దేశాలు సహాయం పంపడానికి ముందుకొచ్చినట్లు తెలిసింది.

Updated Date - 2023-09-13T20:32:57+05:30 IST