Share News

Kim Jong Un: యుద్ధం అనివార్యం.. కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిక

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:27 PM

కొత్త ఏడాది సందర్భంగా ఎవరైనా శుభాకాంక్షలు తెలపడమో లేదా శుభవార్తలు చెప్పడమో చేస్తారు. కానీ.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం యుద్ధం అనివార్యమంటూ హెచ్చరికలు జారీ చేశాడు. అలాగే.. కొత్త ఏడాదిలో..

Kim Jong Un: యుద్ధం అనివార్యం.. కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిక

Kim Jong Un: కొత్త ఏడాది సందర్భంగా ఎవరైనా శుభాకాంక్షలు తెలపడమో లేదా శుభవార్తలు చెప్పడమో చేస్తారు. కానీ.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం యుద్ధం అనివార్యమంటూ హెచ్చరికలు జారీ చేశాడు. అలాగే.. కొత్త ఏడాదిలో తన తదుపరి లక్ష్యాలను ప్రకటించాడు. అమెరికా, దక్షిణ కొరియా కలిసి సైనిక కార్యకలాపాలను విస్తరిస్తున్న తరుణంలో.. వాటిని ఎదుర్కోవడం కోసం యుద్ధ సంసిద్ధత కోసం ఆయన పిలుపునిచ్చారు. ఈమేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది.

‘‘2023లో ప్రయోగించిన తొలి సైనిక నిఘా శాటిలైట్ విజయవంతం అయ్యింది. దానిని ఆపరేషన్ చేసిన అనుభవం ఆధారంగా.. 2024లో మరో మూడు అదనపు సైనిక నిఘా శాటిలైట్స్‌ని పరీక్షిస్తాం. ఫలితంగా.. అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సాహించడానికి వీలవుతుంది’’ అని అధికార వర్కర్స్ పార్టీ సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ చెప్పినట్టు కేసీఎన్ఏ తెలిపింది. అలగే.. మరిన్ని అణ్వస్త్రాలనూ సమకూర్చుకుంటామని, మానవ రహిత పరికరాలనూ ప్రవేశపెడతామని ఆయన వెల్లడించాడు. అమెరికాతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సవాళ్ల నేపథ్యంలో.. తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటామని కిమ్‌ పునరుద్ఘాటించాడు. కొత్త ఆయుధాల ప్రయోగ పరీక్షల పరంపర కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చాడు.


ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, దాని మిత్రదేశాలు 2023లో అనూహ్య చర్యలు తీసుకున్నామని.. తద్వారా కొరియా ద్వీపకల్పంలో ఎప్పుడైనా యుద్ధం చెలరేగే అవకాశం ఉందని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నాడు. కాబట్టి.. సామర్థ్యాలను సమకూర్చుకోవడంతో ఎంతో అవసరమని నొక్కి చెప్పాడు. శత్రువులు తమని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. వాటిని దీటుగా తిప్పికొట్టేందుకు సమగ్ర, పరిపూర్ణమైన సైనిక సంసిద్ధత అవసరమని తెలిపాడు. అవసరమైతే దక్షిణ కొరియా భూభాగాన్ని తుడిచిపెట్టేసేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చాడు. దక్షిణ కొరియాతో ఐక్యమయ్యే అవకాశాన్ని ఉత్తర కొరియా తోసిపుచ్చిందన్న ఆయన.. ప్యోంగ్యాంగ్ తప్పనిసరిగా ప్రత్యర్థి దేశం వైపు తన దిశని ప్రాథమికంగా మార్చుకోవాలని చెప్పుకొచ్చాడు.

ఇదిలావుండగా.. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చలు విఫలమయ్యాక కిమ్ జోంగ్ ఉన్న తబ ఆయుధ సంపత్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఒక్క గతేడాదిలోనే 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందుకు ధీటుగా అమెరికా, దక్షిణ కొరియా కలిసి తమ సైనిక కార్యకలాపాల్ని విస్తరిస్తున్నాయి. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన జలాంతర్గాములను సైతం రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలోనే.. వచ్చే ఏడాది యుద్ధం సంసిద్ధతకు కిమ్ జోంగ్ ఉన్న పిలుపునిచ్చాడు.

Updated Date - Dec 31 , 2023 | 04:27 PM