Japan: మనకు ఇదే చివరి ఛాన్స్.. జపాన్ ప్రధాని కీలక వ్యాఖ్య

ABN , First Publish Date - 2023-01-23T16:57:35+05:30 IST

జపాన్ జనాభాలో తగ్గుదలను అరికట్టేందుకు ఇదే చివరి ఛాన్స్ కావచ్చని ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదా తాజాగా వ్యాఖ్యానించారు.

Japan: మనకు ఇదే చివరి ఛాన్స్.. జపాన్ ప్రధాని కీలక వ్యాఖ్య

టోక్యో: జపాన్‌లో(Japan) జననాల రేటు(Birth rate) తగ్గిపోవడాన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపడతామని దేశ ప్రధాని ఫుమియో కిషిదా(Japan PM Fumio Kishida) సోమవారం పార్లమెంటులో ప్రకటించారు. జనాభాలో తగ్గుదలను అరికట్టేందుకు ఇదే చివరి అవకాశమని వ్యాఖ్యానించారు. జపాన్‌లో సంతానోత్పత్తి పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. దంపతులను పిల్లల్ని కనేందుకు ప్రోత్సహించేలా ఆర్థికసాయాన్ని ప్రకటించినా ప్రభుత్వం ఆశించిన పురోగతి మాత్రం కానరావట్లేదు. మునుపెన్నడూ లేని విధంగా గత ఏడాది జపాన్‌లో కేవలం 8 లక్షల మంది శిశువులు జన్మించారు. ప్రభుత్వ అంచనాల కంటే ఎనిమిదేళ్ల ముందే జననాల సంఖ్య కనిష్ఠస్థాయిని చేరుకుంది.

‘‘జపాన్ కీలక మలుపులో ఉంది. ఓ సమాజంగా మనం మనగలమా లేదా అన్నది తేలే సమయం ఇది’’ అంటూ సభ ప్రారంభోపన్యాసంలో ప్రధాని కిషిదా వ్యాఖ్యానించారు. పిల్లలకు సంబంధించిన అంశాలకు బడ్జెట్‌లో కేటాయింపులను రెండింతలు చేస్తూ జూన్ నాటికల్లా ప్రతిపాదనలు సిద్ధం చేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా.. చిన్నారులు, కుటుంబ సంక్షేమం కోసం ఏప్రిల్ నాటికి ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జపాన్‌లో పిల్లల పెంపకం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో అక్కడి జంటలు పిల్లల్ని కనేందుకు విముఖత చూపుతున్నాయి. ఓ సర్వే ప్రకారం.. తల్లిదండ్రులకు పిల్లల పెంపకం భారంగా మారిన దేశాల్లో చైనా, దక్షిణ కొరియా తొలి రెండు స్థానాల్లో ఉండగా.. జపాన్ మూడో స్థానంలో నిలిచింది. ఇక చైనాలోనూ జనాభా కుంచించుకుపోవడంపై అక్కడి ప్రభుత్వంలో ఆందోళన నెలకొంది. అరవై ఏళ్లలో తొలిసారిగా 2022లో అక్కడి జనాభాలో తగ్గుదల కనిపించింది.

Updated Date - 2023-01-23T17:03:00+05:30 IST