మరోసారి ఇలా జరగనివ్వం
ABN , First Publish Date - 2023-09-18T02:31:26+05:30 IST
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై పోలీసు అధికారి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సియాటెల్ మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు...

జాహ్నవి ఘటనపై సియాటెల్ మేయర్ క్షమాపణలు
నగరాన్ని సురక్షితంగా తీర్చిదిద్దుతామని భరోసా
జీవితానికి విలువ కట్టలేం: ప్రియాంక చోప్రా
దక్షిణాసియా సమాజం గళం విప్పాలి: సిద్ శ్రీరామ్
వాషింగ్టన్, సెప్టెంబరు 17: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై పోలీసు అధికారి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సియాటెల్ మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. డేనియల్ అడెరర్ చేసిన వ్యాఖ్యలకు గాను భారతీయ సమాజానికి మేయర్ బ్రూస్ హారెల్ క్షమాపణలు చెప్పారు. జాహ్నవి కుటుంబానికి సానుభూతి తెలిపారు. కాగా, జాహ్నవి మృతి పట్ల సియాటెల్ పోలీస్ చీఫ్ ఆడ్రియన్ డియాజ్ కూడా సంతాపం ప్రకటించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శనివారం సియాటెల్‌లోని దక్షిణాసియా కమ్యూనిటీకి ప్రాతిని ధ్యం వహిస్తున్న నాయకులు, దాదాపు 20మంది సియాటెల్ నగర మేయర్, పోలీస్ చీఫ్‌ను, ఇతర నగర నాయకులను కలిశారు. పోలీసు అధికారి అడెరర్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ, మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలంతా సురక్షితంగా, గౌరవప్రదంగా నివసించే విధంగా సియాటెల్ నగరాన్ని తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అంతకుముందు జాహ్నవి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన స్థలం నుంచి భారత సమాజం ప్రతినిధులు 100 మందికి పైగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. జాహ్నవికి న్యాయం చేయాలని, ఆ ఇద్దరు పోలీసులకు జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కాగా, జాహ్నవి మృతిపై సత్వర, నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని అమెరికా ప్రభుత్వం భారత్‌కు హామీ ఇచ్చింది.
మరీ ఇంత ఆలస్యంగానా?: ప్రియాంక
జాహ్నవి మృతిచెందిన ఘటనపై ప్రముఖ భారతీయ నటి ప్రియాంక చోప్రా జొనాస్ స్పందించారు. దాదాపు తొమ్మిది నెలల క్రితం జరిగిన ఘటన ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావడం బాధాకరమన్నారు. జీవితం ఎవరికైనా జీవితమేనని, దానికి ఎవరూ విలువ కట్టలేరని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శనివారం పోస్టు చేశారు. కాగా, అమెరికాలో దక్షిణాసియా కమ్యూనిటీని ఎలా పరిగణిస్తారో ఈ ఘటనతో వెలుగులోకి వచ్చిందని ప్రముఖ సినీ గాయకుడు సిద్ శ్రీరామ్ పేర్కొన్నారు. భారతీయ విద్యార్థిని మృతిపై అక్కడి పోలీసు అధికారి మాట్లాడిన తీరు... మనల్ని అక్కడ ఎలా చూస్తున్నారనే విషయాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు. దక్షిణాసియా సమాజం ఇప్పటికైనా గళం విప్పాలని, తమ అస్తిత్వాన్ని కాపాడుకొనే విషయంలో నిర్భయంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.