Share News

Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీంపై వస్తున్న వార్తలు నిజమేనా.. నిఘా వర్గాలు ఏం చెప్తున్నాయంటే?

ABN , Publish Date - Dec 18 , 2023 | 07:57 PM

అండర్‌వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని.. అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని ఒక ప్రచారం తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే.. విశ్వసనీయ నిఘా వర్గాలు..

Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీంపై వస్తున్న వార్తలు నిజమేనా.. నిఘా వర్గాలు ఏం చెప్తున్నాయంటే?

Dawood Ibrahim: అండర్‌వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని.. అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని ఒక ప్రచారం తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే.. విశ్వసనీయ నిఘా వర్గాలు ఈ రూమర్లను తోసిపుచ్చాయి. దావూద్‌పై ఎలాంటి విషప్రయోగం జరగలేదు, చావనూ లేదు అని ఆ నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ధృవీకరించని సోషల్ మీడియా నివేదికల ఆధారంగా.. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని, ఆసుపత్రిలో చేరారని ఒక పాకిస్తానీ యూట్యూబర్ ఊహాగానాల్ని సృష్టించాడని తెలిసింది. అంతేకాదు.. ఈ పుకార్లను అతడు పాకిస్తాన్‌లో ఆకస్మిక ఇంటర్నెట్ షట్‌డౌన్‌కు కనెక్ట్ చేశాడని నిఘా వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు.. పాకిస్తాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధ్యక్షుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్వహించిన వర్చువల్ ర్యాలీ కారణంగా ఈ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం జరిగిందని తెలుస్తోంది. దీనిపై గ్లోబల్ ఇంటర్నెట్ స్వేచ్ఛను పర్యవేక్షించే ఇంటర్నెట్ వాచ్‌డాగ్ ‘నెట్‌బ్లాక్స్’.. ఆదివారం సాయంత్రం సుమారు ఏడు గంటల పాటు పాకిస్తాన్‌లోని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై గణనీయమైన పరిమితులను సూచించే కొలమానాలను విడుదల చేసింది. దీన్ని బట్టి.. PTI ఆన్‌లైన్ రాజకీయ సమావేశం నిర్వహించినప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఆంక్షలు విధించారని స్పష్టమైంది. ఈ సంఘటన ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్, అతని పార్టీ పీటీఐని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోందని, గతంలోనూ ఇలాగే జరిగిందని నెట్‌బ్లాక్స్ పేర్కొంది.


ఇదిలావుండగా.. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ దావూద్ ఇబ్రహీంతో పాటు అతని కుటుంబం పాకిస్తాన్‌లో ఆతిథ్యం అందుకుంటోంది. కొన్ని దశాబ్దాల నుంచి అతడు అక్కడే తలదాచుకుంటున్నాడు. 1955లో జన్మించిన దావూద్ ముంబైలోని డోంగ్రీ స్లమ్ ప్రాంతంలో నివసించాడు. 1993 ముంబై పేలుళ్ల తర్వాత అతను భారతదేశాన్ని విడిచిపెట్టాడు. 1993 మార్చి 12వ తేదీన జరిగిన ముంబై పేలుళ్లలో 257 మంది మరణించగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. అప్పటి నుంచి దావూద్ పరారీలో ఉన్నాడు. పాకిస్తాన్‌లో తన కుటుంబంతో ఉంటున్నాడు.

మరోవైపు.. దావూద్‌పై వస్తున్న రూమర్ల మీద ఏ ప్రభుత్వ ఏజెన్సీ గానీ, పాకిస్తాన్ గానీ ధృవీకరించడం లేదు. ఇదొక రూమర్‌గానే మిగిలిపోయిందే తప్ప.. ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియడం లేదు. అటు.. దావూద్ మరణించాడని పేర్కొన్న పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ ఖాతా స్క్రీన్‌షాట్‌లను కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. తీరా చూస్తే.. ఆ ఖాతా కాకర్‌ది కాదని తేలింది. దావూద్ గురించి ఎలాంటి నిర్ధారణ లేదని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి కాబట్టి, ఆ సందేశం ఫేక్ అని తేలింది. మరోవైపు.. ఈమధ్య విదేశాల్లో ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో మరణిస్తున్న తరుణంలో, దావూద్ గురించి ఈ రూమర్లు రావడం నిజమేనన్న అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - Dec 18 , 2023 | 07:57 PM