India-Canada: ఆ మాటంటే ఊరుకునేది లేదు.. కెనడాపై మండిపడ్డ భారత్
ABN , First Publish Date - 2023-10-20T15:54:00+05:30 IST
కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలకు భారత్ తాజాగా తీవ్రంగా స్పందించింది. సమతూకం పాటించేందుకు చేసే ప్రయత్నాలను అంతర్జాతీయ నియమాల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నాలను ఖండిస్తున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలకు భారత్ తాజాగా తీవ్రంగా స్పందించింది. సమతూకం పాటించేందుకు చేసే ప్రయత్నాలను అంతర్జాతీయ నియమాల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నాలను ఖండిస్తున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది (India slams Canada response on diplomats departure). భారత్‌లోని 41 మంది దౌత్యవేత్తలను కెనడా గురువారం వెనక్కు పిలిపించుకోవడంతో(Diplomats departure) ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం మరింత ముదిరిన విషయం తెలిసిందే. భారత్ విధించిన రెండు వారాల గడువు ముగియడంతో కెనడా ఈ చర్య తీసుకుంది.
ఈ పరిణామంపై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ శుక్రవారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దౌత్యవేత్తలు తామంతట తాముగా తిరిగి వెళ్లకపోతే వారి అధికారిక గుర్తింపు రద్దు చేస్తామంటూ భారత్ ఏకపక్షంగా బెదిరింపులకు దిగిందని ఆరోపించారు. ఇది అసాధారణమని, దౌత్యసంబంధాలపై వియన్నా నియమాలను ఉల్లంఘించడమేనని మండిపడింది.
ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా ప్రతిస్పందించింది. ‘‘దౌత్యవేత్తల సంఖ్యపై కెనడా ప్రకటనను మేము పరిశీలించాం. ఇరు దేశాల సంబంధాలు, భారత్‌లో కెనడా దౌత్యవేత్తలు అధికసంఖ్యలో ఉండటం, మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వంటి వాటి వల్ల దౌత్యసంబంధాల్లో సమతూకం పాటించాల్సి వచ్చింది. ఈ అంశంలో భారత్ చేపట్టిన చర్యలన్నీ వియన్నా ఒడంబడిక నియమావళికి అనుగుణంగానే ఉన్నాయి. ఎంతమంది దౌత్యవేత్తలు ఉండాలన్న విషయంలో ప్రత్యేక అగ్రిమెంట్లు ఏమీ లేనప్పుడు వారి సంఖ్యను వీలైనంతగా పరిమితం చేయమని అడిగే హక్కు ఆతిథ్య దేశానికి ఉంది. ఆతిథ్య దేశంలోని పరిస్థితులు, దౌత్యవేత్తల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. కాబట్టి ఈ చర్యలను నిబంధనల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నాలను మేము తిరస్కరిస్తున్నాం ’’ భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
సిక్కు వేర్పాటు వాది, కెనడా పౌరుడు నిజ్జర్ హత్య తరువాత ఇరు దేశాల మధ్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఈ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో భగ్గుమన్న భారత్, దేశంలోని కెనడా దౌత్యవేత్తలను వెనక్కు పిలిపించుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు విధించింది. గురువారం ఆ గడువు ముగియడంతో కెనడా 41 మంది దౌత్యవేత్తలు, వారి డిపెండెంట్లను స్వదేశానికి పిలిపించుకుంది.