లండన్‌లో హైదరాబాద్‌ వాసి హత్య

ABN , First Publish Date - 2023-10-03T03:43:27+05:30 IST

ఉపాధి నిమిత్తం లండన్‌లో నివసిస్తున్న హైదరాబాద్‌ వాసిని ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి హతమార్చడంతో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

లండన్‌లో హైదరాబాద్‌ వాసి హత్య

ఈ నెల 5న కుమార్తె పెళ్లి ఉండగా దుర్ఘటన

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉపాధి నిమిత్తం లండన్‌లో నివసిస్తున్న హైదరాబాద్‌ వాసిని ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి హతమార్చడంతో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ఖాజా రయిసుద్దీన్‌(65) లండన్‌లోని వెస్ట్‌ యార్క్‌షైర్‌లో 2011 నుంచి నివాసముంటున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఆయన స్నేహితుడైన ఆఫ్ఘాన్‌ దేశస్థుడి(53)తో కలిసి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వారిద్దరినీ విచక్షణారహితంగా పొడిచి చంపేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనలో రయిసుద్దీన్‌తో పాటు ఆయన స్నేహితుడు మృతి చెందారు. ఈ నెల 5న రయిసుద్దీన్‌ కుమార్తె పెళ్లి ఉండడంతో అందరూ ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఈలోగా ఈ ఘటన చోటు చేసుకుందని మృతుని కుటుంబీకులను పరామర్శించిన ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్‌ తెలిపారు. ఆ కుటుంబానికి సాయం అందించాలని.. వెంటనే మృతుని నివాసం వద్దకు లండన్‌లో ఉన్న ఇండియన్‌ హై కమిషన్‌ ప్రతినిధులు చేరుకుని తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్‌కు మెయిల్‌ చేశారు.

Updated Date - 2023-10-03T03:43:27+05:30 IST