Vitamin D లోపిస్తే ఈ ప్రమాదం పొంచి ఉంది!

ABN , First Publish Date - 2023-01-31T12:18:48+05:30 IST

డి విటమిన్‌ (Vitamin D).. సూర్యరశ్మి ద్వారా ఎక్కువగా లభించే ఈ పోషకం మానవ శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని కాల్షియం (Calcium), ఫాస్పేట్‌లను క్రమబద్ధీకరిస్తుంది. బలమైన ఎముకలు, దంతాలు, కండరాలకు డి విటమిన్‌ ఎంతో అవసరం. పిల్లల్లో

Vitamin D లోపిస్తే ఈ ప్రమాదం పొంచి ఉంది!
Vitamin D లోపిస్తే..

ప్రతి నలుగురిలో ముగ్గురికి డి విటమిన్ లోపం!

దేశంలో 76 శాతం మందికి సమస్య

అత్యధికంగా 25 ఏళ్ల లోపు వారికే!

న్యూఢిల్లీ, జనవరి 30: డి విటమిన్‌ (Vitamin D).. సూర్యరశ్మి ద్వారా ఎక్కువగా లభించే ఈ పోషకం మానవ శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని కాల్షియం (Calcium), ఫాస్పేట్‌లను క్రమబద్ధీకరిస్తుంది. బలమైన ఎముకలు, దంతాలు, కండరాలకు డి విటమిన్‌ ఎంతో అవసరం. పిల్లల్లో ఎముకలు మెత్తపడడం (వంకర కాళ్ల వ్యాధి), పెద్దల్లో ఎముకల క్షీణత (అస్థిమృదుత్వం)తో నొప్పులు వంటి సమస్యలను నివారించడంలో డి విటమిన్‌ ప్రధాన భూమిక పోషిస్తుందని యూకే నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. విటమిన్‌ డి లోపిస్తే అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ (Prostate cancer), డిప్రెషన్‌, మధుమేహం, కీళ్ల వాతం వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. భారతదేశంలో డి విటమిన్‌ లోపంతో బాధపడే వారి సంఖ్య భారీగా ఉండడం ఆందోళనకర అంశమని టాటా 1ఎంజీ సంస్థ అధ్యయనం పేర్కొంది. దేశంలో దాదాపు 76 శాతం మంది (అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు) డి విటమిన్‌ లోపంతో బాధపడుతున్నట్లు తెలిపింది. అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 2.2 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వివరించింది. మొత్తం మీద పురుషుల్లో 79 శాతం మంది, మహిళల్లో 76 శాతం మందిలో డి విటమిన్‌ స్థాయులు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. దేశవ్యాప్తంగా అధ్యయనం నిర్వహించిన నగరాల్లో అత్యధికంగా వడోదరలో 89 శాతం, సూరత్‌లో 88 శాతం మందికి డి విటమిన్‌ లోపం ఉండగా.. తక్కువగా ఢిల్లీలో 72 శాతం ఉన్నట్లు వెల్లడించింది. ఇక జాతీయ సగటుతో పోలిస్తే డి విటమిన్‌ లోపంతో బాధపడే వారిలో అత్యధికులు 25 ఏళ్లలోపు వారే ఉన్నట్లు టాటా 1ఎంజీ సంస్థ తెలిపింది. 25 ఏళ్లలోపు వారిలో 84 శాతం మంది డి విటమిన్‌ లోపంతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఇక 25-40 ఏళ్ల వారిలో 81 శాతం మంది ఉన్నట్లు వివరించింది.

ఆహారపు అలవాట్లతోనే..

ఆహారపు అలవాట్లు మారడం, ఇంట్లోనే ఎక్కువగా గడపడం, ఎండలోకి వెళ్లకపోవడం వంటి కారణాలతో డి విటమిన్‌ లోపం పెరిగిపోతోందని డాక్టర్‌ రాజీవ్‌ శర్మ తెలిపారు. ఇక యువతలో ఈ లోపం తలెత్తడానికి ప్రధాన కారణం.. బలవర్ధకమైన తృణ ధాన్యాలు, చేపలు వంటి ఆహారాన్ని తినకపోవడమేనని చెప్పారు. సూర్యరశ్మి పెద్దగా సోకని శీతాకాలం (winter) వంటి రుతువుల్లోనూ శరీరానికి కావల్సిన స్థాయిలో డి విటమిన్‌ అందదన్నారు. ప్రణాళిక లేని గర్భం, పౌష్టికాహార లోపం వల్ల తల్లి, వారికి పుట్టే బిడ్డలకూ డి విటమిన్‌ లోపం ఉంటుందని వివరించారు. విటమిన్‌ డి స్థాయులను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని డాక్టర్‌ ప్రశాంత్‌ నాగ్‌ తెలిపారు. కనీసం ఆర్నెల్లు లేదా ఏడాదికి ఒక్కసారైనా ఈ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం, విటమిట్‌ డి ఎక్కువగా ఉండే గుడ్డు పచ్చసొన, చేపలు (Fish), గొర్రె, మేక మాంసం (Goat meat), బలవర్ధకమైన తృణ ధాన్యాలు వంటివి ఆహారంలో భాగంగా చేసుకోవాలని చెప్పారు.

Updated Date - 2023-01-31T12:18:50+05:30 IST