Liver health: కాలేయం కులాసాగా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2023-01-10T12:05:08+05:30 IST

నచ్చింది తింటాం, తాగుతాం. నచ్చినట్టు బ్రతుకుతాం. అయితే అందుకు కాలేయం బలి కాకుండా చూసుకోవాలి. అలవాట్ల మూలంగా, జన్యుపరంగా, వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా కాలేయాన్ని

Liver health: కాలేయం కులాసాగా ఉండాలంటే..!
కులాసాగా ఉండాలంటే..!

నచ్చింది తింటాం, తాగుతాం. నచ్చినట్టు బ్రతుకుతాం. అయితే అందుకు కాలేయం బలి కాకుండా చూసుకోవాలి. అలవాట్ల మూలంగా, జన్యుపరంగా, వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా కాలేయాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించక తప్పదు.

కాలేయం (Liver health) తనను తాను రిపేర్‌ చేసుకోగలుగుతుంది కాబట్టి సాధారణంగా కాలేయ వ్యాధుల లక్షణాలు బయల్పడవు. కేవలం కామెర్ల (Jaundice) వ్యాధి ఒక్కటే కాలేయం జబ్బు పడిందనడానికి సూచనగా మనం భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి కాలేయ వ్యాధుల లక్షణాలు చాప కింద నీరులా శరీరంలో అంతర్గతంగా చోటు చేసుకుంటూ ఉంటాయి. కాలేయం దెబ్బతిన్నప్పుడు, శరీరంలో లివర్‌ ఎంజైమ్స్‌ పెరిగిపోవడం, నిస్సత్తువ, లైంగికాసక్తి తగ్గిపోవడం లాంటి లక్షణాలు కొందర్లో కనిపిస్తాయి. ఇలాంటప్పుడు బలహీనతను వదిలించుకోవడం కోసం, ఎక్కువ మంది మల్టీవిటమిన్‌ సప్లిమెంట్ల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ మనం తీసుకుంటే ప్రతి మాత్రనూ కాలేయం శోషించుకుంటుంది. ఫలితంగా అప్పటికే దెబ్బతిన్న కాలేయం మరింత దెబ్బ తింటుంది. కాబట్టి కాలేయం జబ్బు పడిందని అనుమానించి వైద్య పరీక్షలను ఆశ్రయించాలి.

l25.gif

ఈ లక్షణాలు మీదా కన్నేయాలి

  • కాలేయం పని చేయడం మానేసినప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు మొదలవుతాయి. అవేంటంటే...

  • కళ్లు, మూత్రం పచ్చబడడం కాళ్లు, పొట్ట వాపు

  • సాయంత్రానికి పాదాలు వాచి, చెప్పులుపట్టకపోవడం

  • కొద్ది దూరాల నడకకే ఆయాసం రావడం

  • చర్మం తేలికగా గాయపడుతూ ఉండడం నిద్ర లేమి

  • ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం

  • మలం రంగులో మార్పులు

వీళ్లు మరింత అప్రమత్తం

మధుమేహులు (Diabetics), ఊబకాయులు, డిస్‌లిపిడీమియా, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ (నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్నవాళ్లు), హైపర్‌టెన్షన్‌, మందులతో మధుమేహం అదుపులోకి రాని వాళ్లు, మద్యపానం అలవాటు ఉన్నవాళ్లు తప్పనిసరిగా కాలేయ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కుటుంబ చరిత్రలో కాలేయ వ్యాధులు కలిగి ఉంటే, మహిళలు 35 ఏళ్ల వయసు నుంచి, పురుషులు 40 ఏళ్ల నుంచి కాలేయ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

మద్యం పరిమితంగా...

l-2.gif

ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్యపానానికి సంబంధించి కొన్ని పరిమితులను సూచిస్తోంది. వారానికి ఏడు డ్రింక్స్‌కు మించి తీసుకునే మహిళలు, వారానికి 14 డ్రింక్స్‌కు మించి మద్యం సేవించే పురుషులు మోడరేట్‌ నుంచి హెవీ డ్రింకింగ్‌ కోవకు చెందుతారు. ఒక డ్రింక్‌ 10 నుంచి 12 గ్రాముల ఆల్కహాల్‌ (Alcohol)తో సమానం. వారంలో ఒకటిన్నర నుంచి రెంగు పెగ్గుల విస్కీకి మించి లేదా మూడు క్యానుల బీర్లకు మించి సేవించే వాళ్లను హెవీ డ్రింకర్లుగానే పరిగణించాలి. కేవలం రెండు గంటల వ్యవధిలో ఐదు బీర్లు తాగేస్తూ ఉంటారు. యువతలో ఇలాంటి బింజ్‌ డ్రింకింగ్‌ కూడా ప్రమాదకరమే! ఇలాంటి అలవాటు లివర్‌ డిస్‌ఫంక్షన్‌కు దారి తీస్తుంది.

ప్రాధమిక పరీక్షలు ఇవే!

lk.gif

లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌, మంచి నాణ్యతతో కూడిన ఇమేజింగ్‌, అబ్డామిన్‌ అలా్ట్రసౌండ్‌, వైరల్‌ సిరాలజీ పరీక్షలతో కాలేయంలో ఏర్పడిన స్కార్‌ టిష్యూ పరిమాణాన్ని కనిపెట్టవచ్చు. ఈ టిష్యూ ఎంత గట్టిపడిందనే దాని మీద వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుంది. స్కార్‌ టిష్యూతో పాటు, ఫైబ్రోసిస్‌ కూడా ఎక్కువగా ఉంటే, కాలేయం సిర్రోసి్‌సకు, సెల్యులర్‌ కార్సినోమాకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

ఇలా కాలేయం ఆరోగ్యం

lkkkh.gif

స్కాన్‌ (Scan)లో గ్రేడ్‌ వన్‌ లేదా గ్రేడ్‌ టు ఫ్యాటీ లివర్‌ అనే ఫలితం వస్తే, అందర్లోనూ ఎంతో కొంత ఫ్యాటీ లివర్‌ ఉంటుందిలే అని విషయాన్ని తేలికగా తీసుకుంటాం. కానీ నిజానికి ఈ స్థితిని సీరియ్‌సగానే పరిగణించాలి. వెంటనే కాలేయంలోని కొవ్వును కరిగించే చర్యలకు పూనుకోవాలి. సమతులాహారం తీసుకోవడంతో పాటు, క్రమం తప్పక వ్యాయామం చేయాలి. అలాగే మద్యపానం అలవాటు ఉన్నవాళ్లు పరిమితంగా తీసుకోవాలి. అలాగే బరువును అదుపులో ఉంచుకోవాలి. బాడీ మాస్‌ ఇండెక్స్‌ 23 కంటే ఎక్కువ ఉన్నవాళ్లు హైపోక్యాలరి డైట్‌ను అనుసరించాలి. అలాగే వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో 500 కిలో క్యాలరీలు కోత పడే ఆహారశైలిని అవరుచుకోవాలి. వారంలో 150 నుంచి 180 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం గుండె కొట్టుకునే వేగాన్ని పెంచేలా ఉండాలి. ఇలా చేయగలిగితే కచ్చితంగా వారానికి ఒక పౌండు చొప్పున బరువు తగ్గే అవకాశం ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ బరువును తగ్గించేలా చేసే డైట్‌లు, ఇతరత్రా ప్రత్యామ్నాయ విధానాలతో శరీరంలోని నీరును కోల్పోతామే తప్ప, కొవ్వును కోల్పోలేం. పైగా అలాంటి పద్ధతుల్లో కోల్పోయిన బరువు, వాటిని ఆచరించడం ఆపేసిన వెంటనే తిరిగి పెరుగుతుంది. కాబట్టి శరీరంలోని కొవ్వు కరిగే వ్యాయామాన్ని ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా చర్మం కింద ఉండే కొవ్వు కంటే అంతర్గత అవయవాల చుట్టూరా పేరుకునే కొవ్వు (విసరల్‌ ఫ్యాట్‌) ప్రమాదకరం. కాబట్టి ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటూ, క్రమం తప్పక వ్యాయామం చేస్తూ, క్రమేపీ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. బరువు తగ్గడం మూలంగా కాలేయంలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గడంతో పాటు, స్కార్‌ టిష్యూ సాధారణ స్థితికి చేరుకోవడం మొదలుపెడుతుంది.

ఆ చిట్కాలతో చేటే ఎక్కువ

కలబంద రసం తాగడం, నోని ఫ్లవర్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ తీసుకోవడం లాంటి సొంత ఆరోగ్య చిట్కాలు పాటించేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. నిజానికి ఇలాంటి చిట్కాలన్నీ కాలేయానికి ప్రమాదకరం. బదులుగా తులసి, అల్లం, మిరియాలు, తేనె, పసుపు.. ఇవన్నీ కాలేయానికి మేలు చేస్తాయి. అలాగే ‘మిల్క్‌ థిసిల్‌’ మూలిక, అన్ని రకాల కాలేయ వ్యాధులకు విరుగుడుగా పని చేస్తుందనే నమ్మకం విశ్వవ్యాప్తంగా ఉంది. నిజానికి దీన్లోని థైలిమెరీన్‌ అనే మూలకం కాలేయ వ్యాధులను నయం చేస్తుందని ఇప్పటివరకూ శాస్త్రీయంగా రుజువు కాలేదు.

హెపటైటిస్‌ టీకా

ఫ్యాటీ లివర్‌ సిండ్రోమ్‌కు తోడ్పడే నాలుగు రకాల జన్యువులను ఇప్పటివరకూ గుర్తించడం జరిగింది. ఈ జన్యువులను కలిగి ఉన్నవాళ్ల కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుంటూ ఉంటుంది. ఫైబ్రోసిస్‌, సిర్రోసిస్‌, కేన్సర్‌ ముప్పులూ ఉంటాయి. కాబట్టి కుటుంబ చరిత్రలో కాలేయ వ్యధిగ్రస్తులు ఉన్నవాళ్ల సంతానం రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహార, జీవనశైలులను పాటించడంతో పాటు హెపటైటిస్‌ బి (Hepatitis b) వైరస్‌ సోకకుండా టీకాలు కూడా వేయించుకోవాలి.

ఈ డైట్‌తో కాలేయం క్షేమం

మెడిటరేనియన్‌ డైట్‌ కాలేయ ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారమని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. పొట్టు తీయని పప్పు ధాన్యాలు, ఎక్కువ మొత్తాల్లో కూరగాయలు, ఆలివ్‌ నూనెలు కాలేయానికి మేలు చేస్తాయి.

das.gif

-డాక్టర్‌ ధర్మేష్‌ కపూర్‌

సీనియర్‌ హెపటాలజిస్ట్‌

అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ స్పెషలిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌

Updated Date - 2023-01-10T12:22:46+05:30 IST