KRPP: గాలి కుటుంబానికి ఎదురు‘గాలి’.. జనార్ధన్ రెడ్డి గెలిచారు కానీ.. షాకింగ్ పరిణామం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-05-13T19:36:50+05:30 IST

తెలుగు రాష్ట్రాలకు సుపరితులైన బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (KRPP) కర్ణాటక ఎన్నికల్లో ఏ కోశానా ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ అధినేత గాలి జనార్ధన్‌రెడ్డి ఒక్కరు మాత్రమే..

KRPP: గాలి కుటుంబానికి ఎదురు‘గాలి’.. జనార్ధన్ రెడ్డి గెలిచారు కానీ.. షాకింగ్ పరిణామం ఏంటంటే..

తెలుగు రాష్ట్రాలకు సుపరితులైన బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (KRPP) కర్ణాటక ఎన్నికల్లో ఏ కోశానా ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ అధినేత గాలి జనార్ధన్‌రెడ్డి ఒక్కరు మాత్రమే గంగావతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం గమనార్హం. బళ్లారి నగరం నుంచి కేఆర్‌పీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి జనార్ధన్ రెడ్డి భార్య లక్ష్మీ అరుణ ఓటమి పాలయ్యారు. గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారిలో అడుగుపెట్టేందుకు సీబీఐ ఆంక్షలు అడ్డు రావడంతో ఆయన భార్య, కుమార్తె బళ్లారిలో కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసినా గాలి భార్యకు ఎదురు‘గాలి’ తప్పలేదు. గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు, బీజేపీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డిపై ఆమె పోటీకి నిలవడం విశేషం.

FswaACJagAEhCB9.jpg

కానీ ట్విస్ట్ ఏంటంటే.. బళ్లారి ప్రజలు గాలి కుటుంబానికి చెందిన ఈ ఇద్దరినీ తిరస్కరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్‌ రెడ్డిని బళ్లారి నగర ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం గాలి కుటుంబానికి షాకిచ్చిన పరిణామం. బళ్లారి అనే పేరు వినగానే ఇన్నాళ్లూ గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబమే గుర్తొచ్చింది. కానీ.. ఈ అపజయంతో గాలి కుటుంబంపై బళ్లారి ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని తేలిపోయింది. గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారి నగరం నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు గానీ ఆయనకు ఆ అవకాశం లేకపోవడంతో భార్యను పోటీకి నిలిపారు. ఫలితం బెడిసికొట్టింది.

FsyIJX0agAAFdud.jpg

బళ్లారిలో అడుగుపెట్టకుండా సీబీఐ ఆంక్షలు విధించడంతో గంగావతి నుంచే ‘గాలి’ వ్యూహాలు అమలు చేశారు. బళ్లారిలో గాలి అరుణ వార్డుల్లో పర్యటిస్తూ జోరుగా ప్రచారం చేశారు. ఆమె వెంట గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన ఎం.అలీఖాన్ రాముడికి హనుమంతుడిలా పనిచేశారు. ముఖ్యంగా ముస్లింలు, బీసీలు, లింగాయత్, బలిజ, కమ్మ ఇలా అన్ని వర్గాలతో ప్రత్యేకంగా కలుస్తూ కేఆర్‌పీపీకి పలువురు నేతలను తిప్పడంలో అలీఖాన్ సఫలీకృతుడయ్యారు. కాంగ్రెస్, బీజేపీ ఓటర్లలో వ్యతిరేకులను తమ వైపు తిప్పుకున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి మామ పరమేశ్వరరెడ్డి, కూతురు బ్రాహ్మణి, పొద్దుటూరు సుబ్బారెడ్డి ఇలా అనేక మంది తెర వెనుక ఉండి గాలి జనార్ధన్ రెడ్డి భార్య లక్ష్మి అరుణ గెలుపునకు బళ్లారిలో విస్తృతంగా పనిచేశారు.

FsWyAK-WcAE6Miz.jpg

గాలి అరుణ కూడా మహిళా ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. తన భర్త జనార్ధన్ రెడ్డి బళ్లారిని అభివృద్ధి చేసిన తీరును వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కూతురు బ్రాహ్మణి కూడా తల్లికి తోడుగా ప్రచారం చేసి తనదైన ముద్ర వేసింది. ‘నాన్న ఉంటే మేము రోడ్డుకు వచ్చేవాళ్లమే కాదు. నాన్న మాకు దూరంగా ఉన్నాడు. మీరే మాకు అన్న,అక్క, అమ్మనాన్నా’ అంటూ ఓటర్లను భావోద్వేగ ప్రసంగాలతో గాలి జనార్ధన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగా చేయడం విశేషం. ఇక అలీఖాన్ అసమ్మతి నేతలను కలిసి వ్యూహాలు రచించారు. ఇంత చేసినా గాలి అరుణ గెలవకపోవడం గమనార్హం.

FswZ_QoakAAxqrN.jpg

కర్ణాటకలో మొత్తం 47 స్థానాల్లో పార్టీ తరపున అభ్యర్థులను గాలి జనార్ధన్ రెడ్డి బరిలో నిలిపినా.. బళ్లారి సిటీ అభ్యర్థి గాలి లక్ష్మీ అరుణ, కొప్పళ జిల్లా గంగావతిలో గాలి జనార్ధన్ రెడ్డి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు సాగాయి. గాలి జనార్ధన్ రెడ్డి గంగావతి నుంచి గెలిచినప్పటికీ బళ్లారి సిటీ నుంచి భార్యను గెలిపించుకోవడంలో విఫలం కావడం, ఆ పార్టీ తరపున అధినేత తప్ప ఏ ఒక్కరూ గెలవకపోవడంతో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. కర్ణాటక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌కు గాలి జనార్ధన్ రెడ్డి మద్దతు తెలిపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-05-13T19:49:37+05:30 IST