KVS Notification: ఏకైక సంతానం కలిగిన వారికి..!

ABN , First Publish Date - 2023-03-29T12:46:09+05:30 IST

న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌) - ఒకటోతరగతి నుంచి పదకొండోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది

KVS Notification: ఏకైక సంతానం కలిగిన వారికి..!
KVS Notification

న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌) - ఒకటోతరగతి నుంచి పదకొండోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు; వాటి అనుబంధ సంస్థలు; రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. గడచిన ఏడేళ్లలో తల్లిదండ్రులు పొందిన ట్రాన్స్‌ఫర్‌ల సంఖ్యను అనుసరించి ప్రవేశ ప్రక్రియలో ప్రాధాన్యం కల్పిస్తారు. పార్లమెంట్‌ సభ్యులు; కేవీఎస్‌ ఉన్నతాధికారులు; కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు సిఫార్సు చేసినవారికి అడ్మిషన్స్‌ ఇస్తారు. ఆసక్తిగలవారు తరగతులకు నిర్దేశించిన మేరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. సీబీఎస్‌ఈ నుంచి పదోతరగతి ఫలితాలు వచ్చిన వెంటనే పదకొండో తరగతిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమౌతుంది.

సీట్లు: ఒకటి నుంచి పది వరకు ప్రతి తరగతిలో కనీసం 40 సీట్లు, పదకొండో తరగతిలో 55 సీట్లు ఉంటాయి. ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయించారు.

వయసు: ఒకటోతరగతిలో ప్రవేశం పొందాలంటే మార్చి 31 నాటికి విద్యార్థి వయసు ఆరు నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి. రెండు, మూడు తరగతుల్లో ప్రవేశానికి ఏడు నుంచి తొమ్మిదేళ్ల మధ్య, నాలుగోతరగతికి ఎనిమిది నుంచి పదేళ్ల మధ్య; అయిదోతరగతికి తొమ్మిది నుంచి పదకొండేళ్ల మధ్య; ఏడోతరగతికి పదకొండు నుంచి పదమూడేళ్ల మధ్య, ఎనిమిదోతరగతికి పన్నెండు నుంచి పధ్నాలుగేళ్ల మధ్య; తొమ్మిదోతరగతికి పదమూడు నుంచి పదిహేనేళ్ల మధ్య; పదోతరగతికి పధ్నాలుగు నుంచి పదహారేళ్ల మధ్య వయసు ఉండాలి. పదకొండు, పన్నెండు తరగతుల్లో ప్రవేశానికి వయోపరిమితి నిబంధనలు లేవు. వీరికి పది, పదకొండు తరగతులు పాసైన ఏడాదే అడ్మిషన్స్‌ ఇస్తారు. రిజర్వ్‌డ్‌ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అడ్మిషన్స్‌

  • ఎనిమిదోతరగతి వరకు ఎటువంటి అడ్మిషన్‌ టెస్ట్‌లు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టం ప్రకారం అడ్మిషన్స్‌ ఇస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

  • తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి అడ్మిషన్‌ టెస్ట్‌ ఉంటుంది. దీనికి పరీక్ష సమయం మూడు గంటలు ఉంటుంది. మొత్తం మార్కులు 100. ఇందులో హిందీ, ఇంగ్లీష్‌, మేథ్స్‌, సోషల్‌ సైన్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే కనీసం 33 శాతం మార్కులు రావాలి.

  • పదకొండో తరగతిలో సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌ విభాగాలు ఎంచుకోవచ్చు. పదోతరగతి(సీబీఎ్‌సఈ) మా ర్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సైన్స్‌ విభాగాల్లో ప్రవేశానికి 60 శాతం, కామర్స్‌ విభాగానికి 55 శాతం మార్కులు ఉండాలి. అడ్మిషన్స్‌ ముగిసేనాటికి ఇంకా సీట్లు మిగిలిన పక్షంలో ఎన్‌ఐఓస్‌, ఐసీఎస్‌ఈ, స్టేట్‌ బోర్డ్‌ల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.

  • పదోతరగతి నుంచి పన్నెండో తరగతి వరకు సీట్లు మిగిలితే ఫ్రెష్‌ అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. సీబీఎ్‌సఈ అనుబంధ పాఠశాలల్లో చదివి తొమ్మిదోతరగతి/ పదకొండోతరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించినవారికి అవకాశం కల్పిస్తారు.

ముఖ్య సమాచారం

  • ఒకటో తరగతికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మిగిలిన తరగతులకు రిజిస్ట్రేషన్‌ ఫారాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని నింపి విద్యార్థి జనన ధ్రువీకరణ పత్రం, ఫొటో, ఆధార్‌ కార్డ్‌ జతచేసి కేవీఎస్‌ ఈ-మెయిల్‌కు పంపాలి.

ఒకటో తరగతి అడ్మిషన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్‌ 17

ప్రవేశం పొందిన విద్యార్థుల మొదటి లిస్ట్‌ విడుదల: ఏప్రిల్‌ 20న

రెండో లిస్ట్‌ విడుదల: ఏప్రిల్‌ 28న

మూడో లిస్ట్‌ విడుదల: మే 4న

రెండు ఆపై తరగతుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ గడువు: ఏప్రిల్‌ 3 నుంచి 12 వరకు

ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: ఏప్రిల్‌ 17

పదోతరగతి వరకు ప్రవేశాల ప్రక్రియ ముగింపు: జూన్‌ 30

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌: https://kvsonlineadmission.kvs.gov.in

వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in

Updated Date - 2023-03-29T12:46:09+05:30 IST