Amma vodi: అమ్మఒడితో జగన్ సర్కారు పిల్లిమొగ్గలు!

ABN , First Publish Date - 2023-06-08T11:58:49+05:30 IST

అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయడంలో ప్రతి ఏటా జగన్‌ సర్కారు వాయిదాలు వేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి విద్యార్థులకు

Amma vodi: అమ్మఒడితో జగన్ సర్కారు పిల్లిమొగ్గలు!
Amma vodi

పిల్లల చదువుతో సర్కారు పిల్లిమొగ్గలు

తొలి రెండేళ్లు సంక్రాంతి టైంలో విడుదల

గతేడాది బడులు తెరిచే ముందు జమ

ఇప్పుడు బడులు తెరిచాక 3 వారాలకు

ఇలాగైతే ఐదేళ్లలో అందేది నాలుగుసార్లే

ఓ ఏడాది కోత.. 6,500 కోట్లు మిగులు

15 వేలు ఇస్తామని ఖాతాల్లోకి 13 వేలే

(అమరావతి-ఆంధ్రజ్యోతి): అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయడంలో ప్రతి ఏటా జగన్‌ సర్కారు వాయిదాలు వేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి విద్యార్థులకు ప్రయోజనం కలిగించకుండా పథకం ఉద్దేశాన్ని నీరుగారుస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చాక మొదటి రెండేళ్లు విద్యా సంవత్సరం సగం గడిచాక తీరిగ్గా అమ్మఒడి నగదు విడుదల చేసింది. గతేడాది జనవరిలో విడుదల కావాల్సిన నిధులను ఉన్నట్టుండి జూన్‌లో విడుదల చేసింది. ఇక ఈ ఏడాది బడులు తెరిచే ముందు కాదంటూ మళ్లీ దాదాపు మూడు వారాలు వాయిదా వేసింది. ఈ నెల 12న బడులు ప్రారంభమవుతుండగా, 28న అమ్మఒడి నగదు విడుదల చేస్తామంటూ కొత్త తేదీ ప్రకటించింది. పిల్లల్ని బడులకు పంపించే తల్లులకు భరోసా కల్పిస్తామంటూ అమ్మఒడి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఏటా జూన్‌లో బడులు తెరుస్తారు. పిల్లల కోసమే నగదు ఇస్తే బడులు తెరిచే ముందు నగదు విడుదల చేయాలి. కానీ 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో సంక్రాంతి పండగ సమయంలో ఖాతాల్లో వేశారు. 2021-22 విద్యా సంవత్సరంలో 2022 జనవరిలో ఇవ్వాల్సిన నగదును ఒకేసారి జూన్‌కు వాయిదా వేశారు. దీంతో రెండు, మూడు విడతల మధ్య ఏడాదిన్నర గ్యాప్‌ వచ్చింది. గతేడాది పలు కారణాలతో బడులు జూలై 5న తెరిచారు. అప్పటికి వారం రోజుల ముందు నగదు విడుదల చేశారు. ఈ ఏడాది ఎప్పటిలాగే జూన్‌ 12న బడులు తెరుస్తున్నందున కనీసం ఒకవారం ముందు అంటే.. ఈ నెల మొదటి వారంలో నగదు ఇవ్వాలి. అయితే ఈ నెల చివరిలో నగదు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అమ్మఒడి నగదుతో పిల్లల్ని ప్రైవేటుబడులకు పంపేవారిపై ప్రభావం పడనుంది.

నగదులో 2 వేలు కోత

అమ్మఒడి నిధులను ఏటా సరైన సమయానికి విడుదల చేయకపోగా, నగదులోనూ కోత పెడుతున్నారు. ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది చెప్పినట్టే రూ.15 వేలు వేసింది. రెండో ఏడాది టాయిలెట్ల నిర్వహణ ఖర్చు పేరుతో రూ.వెయ్యి వెనక్కి తీసుకుంది. మూడో ఏడాది స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ అంటూ మరో రూ.వెయ్యి కోత పెట్టింది. దీంతో గతేడాది నుంచి తల్లులకు అందుతోంది రూ.13 వేలే. ఈ కోతలు ప్రభుత్వ బడులకే పరిమితం కాకుండా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకూ రూ.2 వేలు కోత పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలకు టాయిలెట్లు, భవనాల నిర్వహణకు నిధులు ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. అలాంటప్పుడు ప్రైవేటు బడుల పిల్లలకు కూడా కోత ఎందుకు పెడుతున్నారు? అంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఐదుసార్లు అమ్మఒడి ఇస్తామని ఎన్నికల ముందు వైసీపీ, ప్రతిపక్ష నేత జగన్‌ పదే పదే చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక వాయిదాల పరంపరతో దానిని నాలుగుసార్లకు తగ్గించారు. ఇప్పటి వరకు మూడుసార్లు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వబోయేది నాలుగోది. అంతేగాక ఈ ప్రభుత్వంలో చివరి అమ్మఒడి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఎన్నికలు పూర్తవుతాయి. అంటే జగన్‌ ఐదేళ్ల పాలనలో ఓ ఏడాది అమ్మఒడికి మంగళం పాడేశారు. ఇది మాట తప్పడం కాదా? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-06-08T11:58:49+05:30 IST