CM JAGAN: ‘ఆణిముత్యం’... మరో ప్రచారాస్త్రం! ఒక్కరోజులో ఇంత మార్పా?

ABN , First Publish Date - 2023-05-19T11:37:00+05:30 IST

మహిళలు, విద్యార్థులు, ఇతర వర్గాలకు ఏదొక రూపంలో ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం... కాదేదీ ప్రచారానికనర్హం అన్నట్టుగా ఆయా ఆ పథకాలకు

CM JAGAN: ‘ఆణిముత్యం’... మరో ప్రచారాస్త్రం! ఒక్కరోజులో ఇంత మార్పా?
CM JAGAN

విద్యార్థులు సాధించిన మార్కులతో ప్రచారం

‘జగనన్న ఆణిముత్యాలు’ అంటూ కొత్త పథకం

ఉత్తమ మార్కులు వచ్చిన వారికి పతకాలు

ప్రభుత్వ బడులు, కాలేజీల్లో దారుణ ఫలితాలు

అవి బయటకు రాకుండా విశ్వప్రయత్నాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): మహిళలు, విద్యార్థులు, ఇతర వర్గాలకు ఏదొక రూపంలో ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం... కాదేదీ ప్రచారానికనర్హం అన్నట్టుగా ఆయా ఆ పథకాలకు జగన్‌ (CM JAGAN) పేరు కలిపి పెట్టింది. కానీ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు పతకాలు ఇస్తామని, సత్కారాలు చేస్తామని, కొంత నగదు బహుమతి అందజేస్తామన్న ప్రభుత్వం... వారి ప్రతిభను జగన్‌ పేరు ప్రచారానికి వాడుకోవాలని నిర్ణయించింది. ఈ పథకానికి ‘జగనన్న ఆణిముత్యాలు’ అని నామకరణం చేసేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి సత్కరిస్తాం, నగదు బహుమతులు ఇస్తాం అని మాత్రమే ప్రకటించారు. కానీ ఒక్కరోజులో ఏమైందో గానీ గురువారం మళ్లీ ప్రెస్‌మీట్‌ పెట్టి సత్కారాలకు ‘జగనన్న ఆణిముత్యాలు’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. నిజంగా ఆ పేరు ముందే పెట్టి ఉంటే బుధవారమే ఆ విషయం చెప్పేవారు. కానీ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రచారానికి వాడుకోవాలనుకున్న ప్రభుత్వం... దీనికి ఒక్కరోజులోనే పేరు పెట్టింది.

అసలు ఫలితాలేవీ?

ఈ పథకంలో ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థల్లో చదివి పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించినవారికి పతకాలు ఇచ్చి సత్కరిస్తారు. టెన్త్‌లో... ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మోడల్‌, కేజీబీవీ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, ఏపీ గురుకులాలు లాంటి యాజమాన్య పాఠశాలల్లో చదివినవారికి ఈ అవార్డులు ఇస్తారు. ఇంటర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, హైస్కూల్‌ ప్లస్‌లు, రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో చదివిన వారికి ఇస్తారు. ఈ సంవత్సరం హైస్కూల్‌ ప్లస్‌లలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థుల్లో సగానికిపైగా ఫెయిల్‌ అయ్యారు. వందకు పైగా హైస్కూల్‌ ప్లస్‌లలో, 30కి పైగా కేజీబీవీల్లో ఇంటర్‌లో సున్నా శాతం ఫలితాలు వచ్చాయి. మోడల్‌ స్కూళ్ల తీరు దాదాపుగా ఇలాగే ఉంది. ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియంలో టెన్త్‌ చదివినవారు దారుణంగా ఫెయిల్‌ అయ్యారు. టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలను రాష్ట్ర స్థాయిలో విడుదల చేసిన ప్రభుత్వం... మేనేజ్‌మెంట్ల వారీగా, ప్రైవేటు, ప్రభుత్వానికి వేర్వేరుగా రిజల్ట్‌ ప్రకటించలేదు. అలా ఇస్తే అసలు విషయం బయటపడుతుందని వాటిని గోప్యంగా ఉంచింది. ఓవైపు అవే మేనేజ్‌మెంట్లలో చదివిన విద్యార్థులకు అవార్డులు ఇస్తామంటూనే, మొత్తం ఫలితాలు లేవని చెబుతున్నారు.

టాపర్లకు రూ.లక్ష బహుమతి

జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే నగదు బహుమతులు ఉంటాయన్న ప్రభుత్వం ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలోనూ ఇస్తామని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. టెన్త్‌లో... నియోజకవర్గ స్థాయిలో టాపర్లలో ముగ్గురికి రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు, జిల్లాస్థాయిలో టాపర్లకు రూ.50వేలు, రూ.30వేలు, రూ.15వేలు, రాష్ట్ర స్థాయిలో రూ.లక్ష, రూ.75వేలు, రూ.50వేలు నగదు బహుమతిగా ఇస్తారని తెలిపింది. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ/ ఎంఈసీ గ్రూపుల్లో టాప్‌ మార్కులు సాధించిన విద్యార్థులకు గ్రూపునకు ఒకరికి చొప్పున బహుమతులు ఇవ్వనున్నట్లు వివరించింది. నియోజకవర్గ స్థాయిలో రూ.15వేలు, జిల్లా స్థాయిలో రూ.50వేలు, రాష్ట్ర స్థాయిలో రూ.లక్ష ఇస్తామని పేర్కొంది. ఈ కార్యక్రమాలు నియోజకవర్గాల్లో ఈ నెల 25న, జిల్లా స్థాయిల్లో 27, రాష్ట్ర స్థాయిలో 31న జరుగుతాయని వివరించింది.

Updated Date - 2023-05-19T11:37:35+05:30 IST