ఏ వెలుగులకు ఈ ‘ఏకత్వం’?
ABN , First Publish Date - 2023-09-09T03:57:00+05:30 IST
మీరు అమితంగా పట్టించుకునే ఒక సమస్య గురించి చెప్పండి? ఎంతో మంది స్త్రీ పురుషులకు నేను ఈ ప్రశ్న వేశాను. ఇంచుమించు ప్రతీ ఒక్కరూ తాము ఎక్కువగా పట్టించుకునేది, తమను అమితంగా కలవరపరుస్తున్న ఒక సమస్య లేదా

మీరు అమితంగా పట్టించుకునే ఒక సమస్య గురించి చెప్పండి? ఎంతో మంది స్త్రీ పురుషులకు నేను ఈ ప్రశ్న వేశాను. ఇంచుమించు ప్రతీ ఒక్కరూ తాము ఎక్కువగా పట్టించుకునేది, తమను అమితంగా కలవరపరుస్తున్న ఒక సమస్య లేదా విషయం గురించి మాత్రమే కాకుండా రెండు లేదా మూడింటి గురించి చెప్పారు. ఇది అర్థం చేసుకోదగినదే. మరి ఒక మాతృమూర్తి (గృహిణి) కేవలం ద్రవ్యోల్బణం గురించి మాత్రమే ప్రస్తావించి, తన బిడ్డ భద్రతను ఎలా ఉపేక్షిస్తారు? ఒక పారిశ్రామిక కార్మికుడు ఉద్యోగ భద్రత గురించి మాత్రమే చెప్పి, తన నివాస ఇరుగు పొరుగు ప్రదేశాలలో పెచ్చరిల్లుతున్న మూక హింసాకాండను ఎలా విస్మరిస్తాడు? వివాహం చేసుకోదలిచిన యువ ప్రేమికులు తమ తల్లిదండ్రుల అనుమతి విషయమై సందేహాలను మాత్రమే పేర్కొని నైతిక పోలీసు బృందాల సంభావ్య దాడులపై భయాందోళనలను వ్యక్తం చేయకుండా ఎలా ఉంటారు?
భారత ప్రజలు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యల వైనాన్ని ఆ సమాధానాలు విశదం చేస్తున్నాయి.. ఈ సమస్యలు శతాబ్దాల నుంచి కాకపోయినా దశాబ్దాల నుంచి ఉన్నాయనడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అటువంటి నిర్దయతకు ఇదీ నా స్పందన: ‘ఇంతకు ముందున్న సమస్యలు ఇక ముందూ కొనసాగుతూ తీవ్రమయితే స్వాతంత్ర్యం, స్వపరిపాలన కోసం మూడుతరాల వారు ఎందుకు పోరాడినట్టు?’
ప్రజల యెక్క, ప్రజల చేత, ప్రజల కొరకు ఉన్న ప్రభుత్వమే ఆదర్శ, ఆవశ్యక ప్రభుత్వమనే విషయం గత 250 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆమోదనీయమవుతోంది. ఒక దేశం అభివృద్ధి శిఖరాలు అధిరోహించాలన్నా, సంపద్వంతం కావాలన్నా, మానవ హక్కులను సంపూర్ణంగా పొందాలన్నా, మత స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలన్నా, సాంస్కృతిక పురోగతి సాధించుకోవాలన్నా, సమానత్వం, సౌభ్రాతృత్వంతో విలసిల్లాలన్నా దేశానికి తప్పనిసరిగా, పైన ప్రస్తావించిన తరహా ప్రభుత్వం ఉండి తీరాలన్నదే ప్రతీ ఒక్కరి సునిశ్చిత విశ్వాసంగా ఉన్నది. ఈ లక్ష్యాల సాధన అనేది ఒకే ఒక్క జాతి ప్రజలకు మాత్రమే పరిమితమైన జపాన్ నుంచి అనేక జాతుల సమ్మేళనమైన అమెరికా, భారత్ దాకా ప్రతీ సమాజానికి ఒక బృహత్తర సవాల్‌గా ఉన్నది. సమైక్య ప్రజల యెక్క, నిస్వార్థపరులచేత, సమస్త ప్రజల కొరకు పాలనా కృషి చేసే ప్రభుత్వాన్ని కలిగివుండడమనే ఒకే ఒక్క మార్గంలో మాత్రమే ఆ సవాల్‌ను సమర్థంగా ఎదుర్కోగలమని నేను భావిస్తున్నాను.
బ్రిటిష్ పార్లమెంటరీ నమూనాను భారత్ అనుసరిస్తోంది. బహుళ మతాలు, భాషలు, సంస్కృతులతో అపార వైవిధ్యంతో అలరారుతున్న భారత్ లాంటి దేశం ప్రపంచంలో మరొకటి లేదు. ఈ దేశంలోని వివిధ జాతుల, మతాల, కులాల, భాషల, ప్రజలకు సముచిత ప్రాతినిధ్యమిచ్చేందుకు పార్లమెంటరీ వ్యవస్థ కంటే మేలైన ప్రభుత్వ విధానం లేదు. బ్రిటిష్ నమూనానే భారత్‌కు ఇప్పటికీ ఉత్తమ మార్గమని నేను విశ్వసిస్తున్నాను.
ప్రస్తుత పాలకులు– బీజేపీ, దాని మిత్రపక్షాలు, ప్రచ్ఛన్న మద్దతుదారులు– పూర్తిగా విరుద్ధ నమూనాను ప్రతిపాదిస్తున్నారు. భారతీయులు అందరూ ఒకే జాతి ప్రజలు; వారి మధ్య ఉన్న వ్యత్యాసాలు అన్నిటినీ ఆ ఏకత్వంలో కలిపివేసేయాలి. ఈ ఏకత్వ వాదనకు చరిత్రగానీ, గత 75 ఏళ్ల అనుభవాలు గానీ దృష్టాంతాలుగా లేవన్న వాదనను వారు కొట్టివేస్తున్నారు. ఈ ఏకత్వ సిద్ధాంతాన్ని భాష, ఆహారం, వస్త్రధారణ, సాంఘిక ప్రవర్తనారీతులకు, చివరకు వ్యక్తిగత (మత) చట్టాలకు, ఆచారాలకు కూడా విస్తరించారు.
భాష విషయాన్నే తీసుకోండి. బీజేపీ శ్రేణుల తొలి, మలి, తుది ప్రాధాన్యాలు హిందీయే సుమా! ఈ దేశంలో హిందీకంటే బాగా పురాతనమైన, సమగ్ర వ్యాకరణం, సమున్నత సాహిత్యమున్న భాషలు అనేకమున్నాయన్న వాస్తవాన్ని బీజేపీవారు విస్మరిస్తున్నారు. అలాగే వస్త్రధారణ విషయంలో అధిక సంఖ్యాక వర్గాల వారి నిర్దేశాలనే పాఠశాల బాలలు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాటించితీరాలి. హాస్టళ్లలో మాంసాహారం నిషిద్ధం. కులాంతర, మతాంతర వివాహాలను అనుమతిస్తున్న చట్టాలను మెజారిటీవాద ఆజ్ఞలు త్రోసిపుచ్చుతున్నాయి. యువతీ యువకుల సాంఘిక ప్రవర్తనను క్రమబద్ధీకరించేందుకు నైతిక పోలీసు బృందాలకు ఉచిత లైసెన్స్ ఉన్నది! ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) మైనారిటీ మతస్తుల, ఆదివాసీల ఆచారాల, వ్యక్తిగత చట్టాలను రద్దు చేస్తుంది.
గ్రామీణ ఉపాధి హామీ శ్రామికులకు చెల్లింపులు ఆధార్ ఆధారిత చెల్లింపుల పద్ధతిలోనే జరిపితీరాలన్న ఆదేశాల వెనుక కూడా ఆ ఏకత్వ సాధనా ఆరాటమే ఉన్నదని చెప్పక తప్పదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆగస్టు 28, 2023 నాటికి తమ పేర్లు నమోదు చేయించుకున్న శ్రామికుల మొత్తం సంఖ్య 14.34 కోట్ల మంది కాగా వారిలో ఆ పథకం కింద వేతనాలు తీసుకోవడానికి అర్హులైనవారు 11.72 కోట్ల మంది అని అధికారిక సమాచారం. అంటే అర్హులైన 20 శాతం మంది ఆ పథకం కింద లబ్ధిని పొందలేకపోతున్నారు. వారు పేదలలో నిరుపేదలు అన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. తమ గ్రామంలో ఎటువంటి ఉపాధి పొందలేక పోతున్న అభాగ్యులు వారు.
అలాగే ఈ ఏకత్వం ఆరాటం కారణంగా ఒకే దేశం, ఒకే రేషన్‌కార్డు (ఓఎన్ఓఆర్‌సి) పథకం కింద ఎంతో మంది ఆహార లబ్ధి పొందలేకపోతున్నారు దేశంలో 45 కోట్ల మంది అంతర్గత వలసకారులు ఉన్నారు. వీరిలో 5.4 కోట్ల మంది అంతర్–రాష్ట్ర వలసకారులు. ఓఎన్ఓఆర్‌సి కింద, ఆధార్‌తో ముడివడి ఉన్న రేషన్ కార్డుతో దేశ వ్యాప్తంగా ఎక్కడైనా చౌక ధరల దుకాణం నుంచి ఆహార పదార్థాలను కొనుగోలు చేసుకోవచ్చు. 2019–23 సంవత్సరాల మధ్య ఏటా సగటున 14 లక్షల అంతర్–రాష్ట్ర లావాదేవీలు మాత్రమే జరిగినట్టు అధికారిక సమాచారమే వెల్లడించింది. మరి ఐదు కోట్ల మంది పేద అంతర్ –రాష్ట్ర వలసకారులకు ఈ పథకం కింద ఆహార లబ్ధి ఎందుకు సమకూరడం లేదు? ఓఎన్ఓఆర్‌సి పథకాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఏ ‘రాష్ట్రానికీ’ లేదు!
ఈ ఏకత్వం ప్రాజెక్టు కింద మనం ఒక కీలక దశకు చేరుకున్నాం. అదే ఒకే దేశం, ఒకే ఎన్నిక ప్రతిపాదన. ఇది అమలు కావాలంటే రాజ్యాంగానికి కనీసం ఐదు సవరణలు చేయవలసి ఉంటుందని భారత న్యాయసంఘం (లా కమిషన్) ఇతర బాధ్యతాయుత కమిటీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. రాజ్యాంగ సవరణలతో పాటు పలు రాజకీయ, పాలనాపరమైన అభ్యంతరాలను కూడా అధిగమించవలసి ఉన్నది. అయినప్పటికీ ఆ ప్రతిపాదన అమలును వేగవంతం చేసేందుకై మోదీ ప్రభుత్వం ఒక కీలుబొమ్మ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్రతిపాదన అసలు లక్ష్యం ఒకే ఎన్నిక కానేకాదు. ఒకే ధ్రువం (బీజేపీ) చుట్టూ దేశ రాజకీయ వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించడమే. పార్లమెంటు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా లోక్‌సభలో మూడింట రెండువంతుల మెజారిటీని, సాధ్యమైనంతగా ఎక్కువ రాష్ట్రాలను గెలుచుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. బీజేపీ లక్ష్యం నెరవేరితే మన రాజ్యాంగ వ్యవస్థలో మౌలిక మార్పులకు దారి సుగమమై హిందూ రాష్ట్ర ఏర్పాటుకు ఉన్న అవరోధాలు అన్నీ తొలగిపోతాయి. ఏమైనా ఒకే ఎన్నిక అనేది ఒక సాహసోపేత జూదం. విజేత మోదీనా లేక ప్రజలా?
ఒకే దేశం, ఒకే ఎన్నిక ప్రతిపాదన అసలు లక్ష్యం ఒకే ఎన్నిక కానే కాదు. ఒకే ధ్రువం (బీజేపీ) చుట్టూ దేశ రాజకీయ వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించడమే. అధికార పార్టీ లక్ష్యం నెరవేరితే మన రాజ్యాంగ వ్యవస్థలో మౌలిక మార్పులకు దారి సుగమమై హిందూ రాష్ట్ర ఏర్పాటుకు ఉన్న అవరోధాలు అన్నీ తొలగిపోతాయి.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)