Modi ji : దేనిపైనా నోరు విప్పరేమి మోదీ జీ?
ABN , First Publish Date - 2023-05-25T03:16:16+05:30 IST
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తొమ్మిదేళ్లు గడిచినప్పటికీ గమ్యానికి, గమనానికి, హామీలకు, అమలుకు పొంతన లేకుండానే పాలన
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తొమ్మిదేళ్లు గడిచినప్పటికీ గమ్యానికి, గమనానికి, హామీలకు, అమలుకు పొంతన లేకుండానే పాలన సాగుతున్నది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, అందరికీ ఇళ్లు వంటి హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. అదే సమయంలో చెప్పాపెట్టకుండా 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రకటించారు. నాకు 50 రోజుల సమయం ఇవ్వండి దేశంలో నల్లధనం బైటికి వస్తుంది, అవినీతి అంతమవుతుందన్నారు. ప్రధాని మాటలు నిజమేనని సగటు జీవి నమ్మాడు. దేశమంతా బ్యాంకుల ముందు బారులు తీరింది. కానీ నల్లధనం, అవినీతి యథాతథంగా కొనసాగాయి.
ఇప్పుడేమో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. పార్లమెంటుకు ముందుగా చెప్పలేదు, ఆర్థిక మంత్రి ప్రకటన చేయలేదు, సంబంధిత వర్గాలతో చర్చలూ జరపలేదు. అసలు రూ.2000 నోట్లను ఎందుకు చెలామణిలో తెచ్చారో, ఎందుకు ఉపసంహరిస్తున్నారో ప్రజలకు ఏ సమాచారాన్నీ ఇవ్వలేదు. పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్ల ముద్రణకు రూ.8000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారు. ఆ నోట్ల రద్దుతో నల్లడబ్బు ఎంత వెలికి తీసారో నేటికీ వెల్లడించలేదు. మొత్తం డబ్బులో 10 శాతంగా ఉన్న రూ.2000 నోట్లు చెలామణీలో లేకుండా రాజకీయ పార్టీల నేతలు, బడా కార్పొరేటు సంస్థల అధిపతులు అల్మారాలలో బందీ అయి ఉన్నాయంటే ఆర్థిక వ్యవస్థను ప్రైవేట్ సంస్థలు, రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారో విశదమవుతున్నది. ప్రజల శ్రమకు సరైన ఫలితమివ్వకుండా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఎలాంటి చీకటి రాజ్యాన్ని నడుపుతున్నారన్నది గమనిస్తే మోదీ ప్రభుత్వ నిజ స్వరూపం అర్థమవుతుంది.
మరోపక్క వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధి విధానాలలోనూ తీవ్ర లోపాలున్నాయి. పెట్రోల్, డిజీల్ మీద జీఎస్టీని ఎందుకు వర్తింపచేయలేదు? పార్లమెంటు ఆమోదించిన క్రమం ప్రకారం జీఎస్టీ 28 శాతానికి మించి వేయకూడదు. కానీ ఇప్పుడేమి చేస్తున్నారు– కేంద్ర సుంకం, కేంద్ర పన్ను, రాష్ట్ర సుంకం, రాష్ట్ర పన్నులు ఇవన్నీ కలుపుకొని అసలు ధరల కంటే ఎక్కువ పన్నులు వడ్డిస్తే సామాన్యులు బతికేదెలా? పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర వస్తువుల ద్వారా కేంద్రానికి 20 లక్షల కోట్ల వరకు ఆదాయం ఉంటుందంటే ఇందంతా ఎవరి శ్రమ? బడాబాబుల మీద ఆదాయపు పన్ను ఎందుకు పెంచరు? పైగా, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా తక్కువ ధరకు కట్టబెడుతున్నారు. ఎన్నికలు వస్తే ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారమెక్కాలన్న లక్ష్యమే తప్ప సామాజిక న్యాయం, మానవాభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు.
ప్రధాని మోదీ మదిలో పడితే చాలు, ఎంతటి కీలకమైన నిర్ణయమైనా ఎవరికీ చెప్పా పెట్టకుండా, పర్యవసానాలు చూడకుండా అమలుజరుగుతోంది. తన వంధిమాగధుడైన ఆదానీకి దొంగ మార్గంలో డబ్బులు వచ్చిన విషయంలోనూ మౌనమే ప్రధానమంత్రి సమాధానం. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ‘మౌన ముని’ అని విరుచుకుపడ్డ బీజేపీ భక్తులు నేడు మోదీ ప్రమాదకర మౌనాన్ని పట్టించుకోరు. మనం ఉన్నది రాచరికంలో కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఇప్పటికైనా మోదీ మౌనం వీడి రూ.2000నోట్ల ఉపసంహరణ, జీఎస్టీ విధివిధానాలపైన సమాధానం చెప్పాలి.
– చాడ వెంకటరెడ్డి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు