ఆంధ్రాభ్యుదయం తొలి కాంతులు

ABN , First Publish Date - 2023-05-26T04:53:46+05:30 IST

ఆధునిక భారతదేశంలో ఆంధ్రులు తమదైన గుర్తింపును సాధించుకునే ప్రయత్నాలు ‘ఆంధ్ర మహాసభ’తో ప్రారంభమయ్యాయి. 1913 మే 26న తొలి ఆంధ్ర మహాసభ

ఆంధ్రాభ్యుదయం తొలి కాంతులు

ఆధునిక భారతదేశంలో ఆంధ్రులు తమదైన గుర్తింపును సాధించుకునే ప్రయత్నాలు ‘ఆంధ్ర మహాసభ’తో ప్రారంభమయ్యాయి. 1913 మే 26న తొలి ఆంధ్ర మహాసభ జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆంధ్ర మహాసభ వార్షిక సమావేశాలు అలా ప్రారంభమయ్యాయి. సరిగ్గా నేటికి ఆంధ్ర మహాసభ తొలి సమావేశం జరిగి కచ్చితంగా 110 సంవత్సరాలు.

ఈ తొలి సమావేశం జరగటానికి పూనిక కూడా దాదాపు రెండు దశాబ్దాల ముందు నుంచే మొదలయింది. భారత స్వాతంత్య్రానికి ప్రధాన నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్‌లో స్థాపితమయింది. అసలు 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర పోరాటం సిపాయిల తిరుగుబాటుకు ముందే తెలుగువారు తమ ఉనికికై అడుగులు వేయడం మొదలైంది. 1852 ఫిబ్రవరి 26న మద్రాసులో గాజుల లక్ష్మీనరసుశెట్టి ప్రారంభించిన ‘మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌’ అందుకు తొలి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. 1884 మే 16న ప్రారంభమయిన మద్రాస్‌ మహాజనసభ దానికొక కొనసాగింపు. 1885 డిసెంబర్‌ 22న ప్రారంభమైన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి హాజరైన 72 మందిలో అత్యధికులు తెలుగువారే. తర్వాత తెలుగునాట 1906లో కొమర్రాజు లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఏర్పడిన విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి స్వదేశీ ఉద్యమానికి ఒక మలుపు.

1902లో మచిలీపట్నం నుంచి కృష్ణా పత్రిక ప్రారంభమయింది. 1903లో కృష్ణా– గుంటూరు ప్రాంతంలో జొన్నవిత్తుల గురునాథం ఆధ్వర్యంలో ఉన్నవ లక్ష్మీనారాయణ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, చల్లా శేషగిరిరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, కొండా వెంకటప్పయ్య వంటి వారు సభ్యులుగా యంగ్‌మెన్‌ లిటరరీ క్లబ్‌ మొదలైంది. గుంటూరులో జరిగిన ఈ సాహితీ క్లబ్‌ తొలి సమావేశంలో తొలిసారిగా ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే చర్చ జరిగింది.

1908లో ఆంధ్రపత్రిక మొదలయింది. ఈ పత్రికలు ఆంధ్రులలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనపై అవగాహనను పెంపొందించడానికి కృష్ణా, ఆంధ్ర పత్రికలు విశేషంగా తోడ్పడ్డాయి. 1908లోనే ఆంధ్రమహాసభ పేరిట మచిలీపట్నంలో ఒక సభ జరిగింది. అయితే అది సామాజిక సంస్కరణలపై చర్చకే పరిమితమయింది. ఆ తర్వాత తెలుగు వారంతా ఒకే పాలన కింద ఉంటే బాగుంటుందన్న కోరిక ౧911లో భోజ్‌పురి మాట్లాడే బిహార్‌ ప్రత్యేక రాష్ట్రంగా మారినపుడు మరో మారు కలిగింది. 1911 డిసెంబర్‌ 12న ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రముఖులు దీనిపై ఆలోచన చేశారు. 1912 నాటికి బందరులో, నందిగామలో, నిడదవోలులో జరిగిన ఉద్యమ సభలు తెలుగు ప్రజల ఏకీకరణకు దారులు ఏర్పరిచాయి. స్థానిక నేతల పోరాటంతో 1912లో అఖిల భారత కాంగ్రెస్‌కు దేశంలోనే తొలి జిల్లా శాఖ కృష్ణా జిల్లా శాఖ ఏర్పడింది. ఈ జిల్లా తొలి సమావేశం ఉమ్మడి కృష్ణాలోని నిడదవోలులో జరిగింది. ఈ సభలో రాష్ట్రంలోని నేతలెందరో పాల్గొన్నారు. ఈ సభలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానానికి తొలి ప్రయత్నం జరిగింది.

తర్వాత 1912లో కృష్ణా జిల్లా కాంగ్రెస్‌ మహాసభలు నిడదవోలులో జరిగాయి. కృష్ణా, గుంటూరు గోదావరుల నుంచే కాక పరిసర అనేక జిల్లాల నుంచి ఎందరో ఆలోచనాపరులు హాజరయ్యారు. నాడు ఇండియన్‌ కో–ఆపరేటివ్‌ రివ్యూ పత్రికకు ఎడిటర్‌గా ఉన్న వేమవరపు రామదాసు ఈ సభలకు అధ్యక్షత వహించారు. ఈ సభలో ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదనను తొలిసారిగా ప్రవేశపెట్టారు. అయితే అది సరిగ్గా, సమగ్రంగా లేదనే కారణంతో పాటు జిల్లా సభలో ఈ తీర్మానం ప్రవేశం పెట్టడం సరికాదని, ఇందుకోసం ఒక ప్రత్యేక సభ ఉండాలని భావించడంతో ఆ తీర్మానం ఆగిపోయింది. ఈ దశలో యంగ్‌మెన్‌ క్లబ్‌ సహవాసులుగా ఉన్న యువ ప్రతినిధులు నిరుత్సాహం చెందినా, ఉన్నవ, కొండా, చల్లా, జొన్నవిత్తుల, వింజమూరి భావనాచారి వంటి వారితో తిరిగి చర్చించారు. ఈ లక్ష్యం కోసం అఖిల భారత స్థాయి ఆంధ్రుల సభ ఒకటి ఏర్పాటు చేయాలని వారంతా కలిసి నిర్ణయించారు. ఈ ‘ఆంధ్ర మహాసభ’ నిర్వహణ కోసం కొండా వెంకటప్పయ్య ప్రధాన కార్యదర్శిగా ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం తరపున ఇంగ్లీషు, తెలుగులో చిన్న బుక్‌లెట్‌లను, కరపత్రాలను ప్రచురించి విస్తృతంగా ప్రచారం చేశారు. 1913 మే 26న బాపట్లలో జరపాలని నిర్ణయించి ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. పత్రికలలో ప్రకటనలు సైతం ఇచ్చారు. 1913 మార్చి 14న న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన తొలి కార్యవర్గ సమావేశం జరిగింది. ఆంధ్రమహాసభ ఆహ్వాన సంఘ సభ్యులుగా కొండా వెంకటప్పయ్య, న్యాపతి, ఉన్నవ, నోరి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. 1913 మే 13న సమాయత్త సమావేశం జరిగింది. తర్వాత 26వ తేదీన బాపట్ల తొలి సభ జరిగింది. ఈ తొలి సభకు 22 ద్వారాలు ఏర్పాటు చేసి కవులు, సంస్కర్తల పేర్లతో వాటికి నామకరణం చేశారు. అయ్యదేవర కాళేశ్వరరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరు కృష్ణారావు వంటి ప్రముఖులతో పాటు 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మద్రాసు ఎంఎల్‌సి బయ్యా నరసింహశర్మ అధ్యక్షత వహించారు. మద్రాసు రాష్ట్రం నుంచే కాక నిజాం సంస్థానంలోని వరంగల్‌ నుంచి, మహారాష్ట్రలోని నాగపూర్‌ నుంచి కూడా వచ్చారు. తెలుగు జాతిని ఏకం చేయడం, తెలుగులకు ప్రత్యేక గుర్తింపు తేవడం, ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడం, దేశవ్యాపితంగా తెలుగు విశిష్టతను చాటి చెప్పడం, ఆంధ్రులకు ఒక యూనివర్శిటీ కోరడం వంటివి నాటి ఆశయాలు.

చర్చల దరిమిలా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రాయలసీమ ప్రతినిధుల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. దీంతో తీర్మానం కార్యరూపం దాల్చలేదు. కృష్ణా–గుంటూరు మండలాల ప్రతినిధులకు మినహా మిగతా ప్రాంతాల (దత్త మండలాలు, గంజాం వంటి) కొందరిలో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ఈ సమావేశం ద్వారా తెలిసింది. కొండా వెంకటప్పయ్య అధ్యక్షుడుగా, పట్టాభి సీతారామయ్య కార్యదర్శిగా, చల్లా శేషగిరిరావు సహాయ కార్యదర్శిగా ఒక ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం రాయలసీమ, నెల్లూరు, విశాఖ, గంజాం జిల్లాలలో పర్యటించి, సభలను నిర్వహించింది. అక్కడి వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను వివరించింది. ఆయా ప్రాంతాలలో ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆసక్తి మొదలయింది. ముఖ్యంగా దత్త మండలాలలో దేశ

పాండ్య సుబ్బారావు, కల్లూరి సుబ్బారావు, కోలాచలం శ్రీనివాసరావు, నెమిలి పట్టాభిరామారావు వంటి వారు స్వరాష్ట్ర ఉద్యమాన్ని బలపరిచారు. రెండో ఆంధ్ర మహాసభ ౧914 ఏప్రిల్‌ 11వ తేదీన విజయవాడలో జరిగింది. హిందూ పత్రిక స్థాపకుల్లో ఒకరైన న్యాపతి సుబ్బారావు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సభలో కందుకూరి వీరేశలింగం, తిరుపతి వేంకటకవులు వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు కావాలన్న ప్రతిపాదన బెజవాడ సభలలో తీర్మానంగా ఆమోదం పొందింది. ఈ భూమికతోనే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. చివరకు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ దీక్షతో సాకారమయింది.

‘తారీఖులు, దస్తావేజులు/ ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అని మహాకవి అన్నప్పటికీ కొన్ని చారిత్రక సంఘటనలను వాటి తేదీల పరంగా గుర్తు చేసుకోవల్సిన అవసరముంది. సరిగ్గా నేటికి నూటపది సంవత్సరాల క్రితం (1913 మే 26న) బాపట్లలో జరిగిన తొలి ఆంధ్ర మహాసభది అటువంటి విశిష్ట గాథే.

l టి. కొండబాబు సీనియర్‌ జర్నలిస్ట్‌

Updated Date - 2023-05-26T04:53:46+05:30 IST