Share News

‘అభివృద్ధి’ ప్రమాదం!

ABN , First Publish Date - 2023-11-16T02:55:54+05:30 IST

ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలి నాలుగురోజులు అవుతున్నది. చిక్కుకుపోయిన నలభైమంది కార్మికులను వెలికితీసేందుకు ప్రయత్నాలు...

‘అభివృద్ధి’ ప్రమాదం!

ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలి నాలుగురోజులు అవుతున్నది. చిక్కుకుపోయిన నలభైమంది కార్మికులను వెలికితీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నా, అనేక అవాంతరాలు అడ్డుపడుతున్నాయి. మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడటం సమస్యను మరింత తీవ్రతరం చేసింది. పనిచక్కబెడుతుందని అనుకున్న డ్రిల్లింగ్‌ మిషన్‌ ఒకటి అనూహ్యంగా విఫలం కావడంతో, పాతికటన్నుల అమెరికా తయారీ ప్రత్యేక డ్రిల్లింగ్‌ సామగ్రిని ఆగమేఘాలమీద భారత వైమానిక దళానికి చెందిన మూడు విమానాలు మోసుకొచ్చాయి. నాలుగేళ్లక్రితం ఒక గుహలో చిక్కుకుపోయిన పిల్లలను సురక్షితంగా కాపాడిన థాయ్‌ల్యాండ్‌ కంపెనీని, నార్వే జియోటెక్నికల్‌ ఇనిస్టిట్యూట్‌ను కూడా మన అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయబోతున్నారట.

సొరంగం పాక్షికంగా కుప్పకూలగానే, ఎనిమిది రాష్ట్రాలకు చెందిన నలభైమంది కార్మికులు సమీపంలోని ఒక ఖాళీప్రదేశంలోకి చేరుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకున్నారు. వారికి ఆక్సిజన్‌, నీరు, ఆహారం నిరంతరం అందించడం ద్వారా బయటకు వచ్చేవరకూ ఏ లోటూరాకుండా అధికారులు చూసుకుంటున్నారు. కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న అందరినీ అభినందించవలసిందే. వారు బయటకు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు కానీ, ఎప్పటికైనా నిక్షేపంగా వస్తారనే ఆశమాత్రం కార్మికుల కుటుంబీకుల్లోనూ, దేశప్రజల్లోనూ అధికారులు నిలబెడుతున్నారు.

ఇంతటి భారీ స్థాయిలో ‘దేశ నిర్మాణం’ జరుగుతున్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగడం సర్వసాధారణం అంటూ ఉత్తరాఖండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ కార్యదర్శి రంజిత్‌ సిన్హా ఓ వ్యాఖ్య చేశారు. ఈ ప్రాజెక్టు విస్తృతి, భారీతనం ఓ సారి గమనించండి, అంతటి భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఇటువంటివి మరిన్ని జరుగుతాయన్న వాస్తవానికి మనం మానసికంగా సిద్ధపడాల్సిందే అని ఆయన హితవు చెప్పారు. ఈ అధికారి మాటలు వివాదాస్పదమైనాయి కానీ, డబుల్‌ ఇంజన్‌ సర్కారు అధినేతలను మాత్రం కచ్చితంగా సంతోషపెట్టి ఉంటాయి. ఇంకా మిగిలిన నిర్మాణపనుల్లో ఇటువంటివే మరిన్ని సంభవించినా, పూర్తయిన తరువాత కూడా ప్రకృతి వైపరీత్యాలు, బీభత్సాలతో ఈ మార్గంలోని రహదారులు, సొరంగాలు ఎన్ని ప్రమాదాలను తెచ్చిపెట్టినా పెద్దగా పట్టించుకోకూడదన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.

ఏడేళ్ళక్రితం అన్నికాలాలను తట్టుకొనే నిలిచే భారీ రహదారుల చార్‌ధామ్‌ ప్రాజెక్టును ప్రధానమంత్రి ఎంతో ప్రేమగా ప్రకటించినప్పుడు పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు హెచ్చరించింది ఇదే. హిమాలయ సానువుల్లో, పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన, భౌగోళికంగా ప్రమాదకరమైన ప్రాంతంలో దాదాపు వెయ్యికిలోమీటర్ల రహదారిని విస్తరించడం, అందులో భాగంగా బైపాస్‌లు, కల్వర్టులు, సొరంగాలు, బ్రిడ్జీల నిమిత్తం భారీ తవ్వకాలు చేపట్టడం అత్యంత ప్రమాదకరమన్నది వారి వాదన. నాలుగు పుణ్యక్షేత్రాలను అనుసంధానించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టులో భాగంగా అడవులు, నదులు, చిన్నచిన్న కాలువలు, పలురకాల వృక్ష జంతుజాలం పెద్ద ఎత్తున నాశనం అయ్యాయని, ప్రాజెక్టు కోసం యథేచ్ఛగా, విచ్చలవిడిగా పర్యావరణాన్ని నాశనం చేశారని సుప్రీంకోర్టు నియమించిన హైపవర్డ్‌ కమిటీ 2020 జూలైలో సమర్పించిన తన నివేదికలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వందకిలోమీటర్లు దాటిన ప్రాజెక్టులకు విధిగా పర్యావరణ ప్రభావాన్ని అంచనావేయవలసి ఉంటుంది కనుక, ఈ చార్‌ధామ్‌ ప్రాజెక్టును 53 ముక్కలుగా చేసి, ఆ నిబంధననుంచి తప్పించారని కూడా చెప్పింది. అశాస్త్రీయంగా, బాధ్యతారహితంగా సాగుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా, కొండలను దొలిచేయడం, నదీమార్గాలను మూసివేయడంతో పాటు వ్యర్థాలను కాలువల్లో పారవేయడం కూడా జరుగుతున్నదని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. పర్వతాల పునాదులు బలహీనపడటంతో మిగతా చోట్ల కంటే, ఈ ప్రాజెక్టు పరిధిలో అతిచిన్న వర్షాలకే కొండచరియలు విరిగిపడిన సంఘటనలు నాలుగురెట్లు పెరిగినట్టు పర్యావరణవేత్తలు కూడా అంటున్నారు. మొన్న జులైలో వర్షాలకు ఉత్తరాఖండ్‌ ఎంత నాశనమైపోయిందో చూశాం. కష్టపడి కట్టినదంతా కుప్పకూలిపోయింది అని ముఖ్యమంత్రి వాపోయారు. రహదారుల విస్తరణతో ట్రాఫిక్‌ పెరిగి, యాత్రికుల సంఖ్య లక్షలుగా హెచ్చి, పర్యావరణపరంగా జరిగే మరింత నష్టం లెక్కలకు అందనిది. కనీసం ఈ ఘటన అనంతరం హిమాలయ సానువుల్లో జరుగుతున్న నిర్మాణాలు పర్యావరణ హితంగా ఉండేట్టు చూడటం అవసరం.

Updated Date - 2023-11-16T02:55:55+05:30 IST