ఆర్భాట ప్రచారం

ABN , First Publish Date - 2023-06-03T02:18:20+05:30 IST

ప్రతి తెలంగాణ పౌరుడు ఆనందంగాను, గర్వంగాను జరుపుకునే ప్రత్యేకమైన సందర్భం రాష్ట్ర అవతరణోత్సవం.

ఆర్భాట ప్రచారం

ప్రతి తెలంగాణ పౌరుడు ఆనందంగాను, గర్వంగాను జరుపుకునే ప్రత్యేకమైన సందర్భం రాష్ట్ర అవతరణోత్సవం. ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాన్ని తెలంగాణ ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు.

దేశం వేరు ప్రభుత్వం వేరు. దేశం వేరు అధికార పార్టీ వేరు. ఈ విచక్షణ రాష్ట్రాల విషయంలో కూడా అవసరం. రాష్ట్రం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు, అధికారపక్షం వేరు. రాష్ట్రావతరణను ఘనంగా జరుపుకోవడం అంటే, రాష్ట్ర ప్రభుత్వ విజయాలను వేడుక చేసుకోవడం కాదు. ఇందిరే ఇండియా అన్న డి.కె. బారువా నినాదం ఎంత తప్పో, కేసియారే తెలంగాణ అనుకోవడం కూడా అంతే తప్పు.

తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత, ఉద్యమంలో ప్రధానంగా పనిచేసిన పార్టీయే అధికారంలోకి రావడం వల్ల, రాష్ట్ర ఆకాంక్ష వెనుక ఉన్న లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వం పనిచేయడం సహజం, అవసరం కూడా. తెలంగాణ కావాలని అనుకుని, ఎన్నో త్యాగాలు చేసి, ఇబ్బందులు పడిన తెలంగాణ సమాజం, ప్రతి వార్షికోత్సవం రోజున, తాను పొందిందేమిటి, పొందే దారిలో ఉన్నవేమిటి, ఆశాభంగం పొందినవేమిటి అని సమీక్షించుకుంటూనే ఉన్నది. ఈ ఏడాది కూడా, తెలంగాణ జనం, తమ బాగోగులను, నిరాశలను, సంతోషాలను గుర్తు చేసుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు. 2014 జూన్ రెండో తేదీని కూడా కలుపుకుంటే, 2023 జూన్ 2 పదో అవతరణోత్సవం. అంతే తప్ప, తెలంగాణ అవతరించి దశాబ్దం కాలేదు. పదో ఏటిలోకి నవతెలంగాణ ప్రవేశించింది. సాధారణంగా, రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, శతజయంతులు వంటి సందర్భాలలో, ఉత్సవాలను ఏడాది పొడువునా జరపడం ఆనవాయితీ. ఆజాదీ కా అమృతోత్సవ్ కూడా 2021 నుంచి మొదలై, 2022 దాకా సాగింది. ఎన్టీయార్ శతజయంతి కూడా 2022 మే 28న మొదలై, మొన్న మే 28న ముగిసింది. సాధారణంగా, ఆరంభాలు ఒక మోస్తరుగా మొదలై, వాస్తవ సందర్భం వేళకు ఘనంగా ముగుస్తాయి. పదేళ్ల సందర్భాన్ని ఘనంగా జరపడమే ఒక విశేషం. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక దశాబ్దాలు నిరీక్షించారు కాబట్టి, పదేళ్ల పండుగను కూడా చేసుకోవచ్చు. తొమ్మిదేళ్లు నిండగానే దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించి, ఏడాది పొడుగునా వరుస కార్యక్రమాలు నిర్వహించడం పద్ధతి. కానీ, తొమ్మిదేళ్లు నిండినప్పుడే ఇరవై రోజులకు పైగా వరుస కార్యక్రమాలు ఆర్భాటంగా నిర్వహించడం వెనుక ఉన్నది తెలంగాణ మీద ప్రేమేనా?

ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికలకు కావలసిన ప్రచారాన్ని ప్రభుత్వ ఖర్చుతో చేయడానికే ఈ ‘‘నెహ్లే పై దెహ్లా’’ (తొమ్మిది మీద పది, ఎత్తుకు పై ఎత్తు) వ్యూహం అనుసరిస్తున్నారని విమర్శకులు అంటున్నదాంట్లో తప్పేమీ లేదు. కోట్లాది రూపాయల విలువైన ప్రచార ప్రకటనలు విడుదల చేయడం, ఇతర రాష్ట్రాల పత్రికలలో సైతం ప్రచారానికి భారీగా ఖర్చుపెట్టడం చూస్తే ప్రజల డబ్బుతో పార్టీ ఉత్సవం జరుపుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ ప్రచారాన్నంతా నమ్మి, రానున్న ఎన్నికలలో మళ్లీ కేసిఆర్‌ను గెలిపించాలన్నది వారి ఆలోచన కావచ్చు.

ఏ ప్రభుత్వమైనా తన పనితీరును ప్రచారం చేసుకుని ఓట్లను అభ్యర్థించవచ్చు. అందుకు ఒక భావోద్వేగ సందర్భాన్ని దుర్వినియోగం చేయడం సబబు కాదు. అనేక వాగ్దానాలు నెరవేరక, ఆశలు అడియాసలైన అంశాలున్నాయి. కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సగంలోనే మిగిలిపోయాయి, నిష్పరిపాలన, స్పందనారాహిత్యం, ఆర్థిక అరాచకం, అవధులు మీరిన అవినీతి, ప్రాధాన్యాల అవగాహనారాహిత్యం వంటి అనేక విమర్శలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. రాష్ట్రాన్ని స్వావలంబన వైపు, సుస్థిర అభివృద్ధి వైపు తీసుకువెళ్లడం కాకుండా, విచక్షణారహిత ప్రణాళికేతర వ్యయానికి, అరువు పారిశ్రామికీకరణకు మాత్రమే పాల్పడడాన్ని చూస్తున్నాము. రానున్న ఎన్నికల సందర్భంగా ఈ అంశాల మీద విమర్శ, చర్చ జరగకుండా, ప్రచార హోరుతో జనాన్ని మభ్యపెట్టాలని చూడడం న్యాయం కాదు.

తెలంగాణ సమాజం, రాష్ట్ర అవతరణానంతర పరిణామాలను, పురోగతిని నిష్పాక్షికంగా బేరీజు వేసుకోవడానికి, ప్రజాకాంక్షలను నెరవేర్చడం విషయంలో ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెట్టడానికి ప్రజాస్వామిక ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలి.

Updated Date - 2023-06-03T02:18:20+05:30 IST