Share News

భయపెడుతున్న బర్మా

ABN , First Publish Date - 2023-11-17T00:40:48+05:30 IST

తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలు మయన్మార్‌ మిలటరీ పాలకులకు కొత్తేమీ కాదు కానీ, ఇంతకాలం అణచివేతలో పైచేయి సాధించిన వీరు ఇప్పుడు ఎదురుదెబ్బలు...

భయపెడుతున్న బర్మా

తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలు మయన్మార్‌ మిలటరీ పాలకులకు కొత్తేమీ కాదు కానీ, ఇంతకాలం అణచివేతలో పైచేయి సాధించిన వీరు ఇప్పుడు ఎదురుదెబ్బలు తింటున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఆంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న 2021 ఫిబ్రవరి తరువాత మిలటరీ చవిచూస్తున్న అతిపెద్ద తిరుగుబాటు ఇది. ప్రజాస్వామ్య అనుకూలవాదులు, సాయుధ దళాలు చేయీచేయీ కలిపి జరుపుతున్న ఈ తిరుగుబాటులో పోలీసు, సైన్యం తీవ్రంగా దెబ్బతింటోంది. గత నెలాఖరులో చైనా సరిహద్దులకు చేరువలోని షాన్‌ రాష్ట్రంలో తిరుగుబాటు దళాలు దాడి చేసి, అక్కడి సైనిక బెటాలియన్‌ మొత్తాన్ని లొంగదీసుకుంది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో పలు రాష్ట్రాల్లోని వేర్వేరు తిరుగుబాటుదారులు ప్రభుత్వ బలగాలను లొంగదీసుకుంటున్నారు. మూడుపట్టణాలు కోల్పోయామని మిలటరీ అంటున్నప్పటికీ, కనీసం నాలుగురాష్ట్రాల్లో సైన్యం ఎదురు దెబ్బ తిన్నట్టుగా విశ్లేషణలు చెబుతున్నాయి. సైనిక ప్రభుత్వం అధికారికంగా ‘అత్యయిక’ స్థితి ప్రకటించకపోయినా, సమస్త ప్రభుత్వ సిబ్బంది, మాజీ సైనికాధికారులు పరిస్థితిని ఎదుర్కొనడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. మయన్మార్‌ పరిణామాలు ఇప్పటికే జాతివైరాలతో సతమతమవుతున్న ఈశాన్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం కనిపిస్తోంది.

ఈ అంతర్యుద్ధం కారణంగా, ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం కనీసం రెండు లక్షలమంది నిరాశ్రయులైనారు, లక్షలాదిమంది ఇళ్ళూవాకిళ్ళూ వదిలిపెట్టిపోతున్నారు. త్రీ బ్రదర్‌ హుడ్‌ అలయెన్స్‌ పేరిట మయన్మార్‌ జాతీయ ప్రజాస్వామ్య ఆర్మీ, అరాకన్‌ ఆర్మీ, తాంగ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ కలసికట్టుగా దేశంలో మూడువైపులా సాగిస్తున్న పోరాటం ఇది. సైనిక ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్య పరిరక్షణ నిమిత్తం లక్షలాదిమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చిన విషయం తెలిసిందే. మిలటరీ ప్రభుత్వం ఆ శాంతియుత ప్రజా ఉద్యమాన్ని అత్యంత కఠినంగా అణచివేసింది. కారణాలు ఏమైనప్పటికీ, వీరిలో అత్యధికులు అనంతరకాలంలో ఆయుధాలు చేపట్టి అడపాదడపా తిరుగుబాటు చేసినా, సైనికపరంగా శిక్షణలేని కారణంగా మిలటరీ చేతిలో దెబ్బతిన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ పీపుల్స్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (పీడీఎఫ్‌) ఇప్పుడు వివిధ జాతులు, తెగల ఆధ్వర్యంలోని తిరుగుబాటు సంస్థలతో చేయి కలిపాయి. గతంలో తనతో సయోధ్యగా ఉన్న గ్రూపులు కూడా ఇప్పుడు తిరుగుబాటులో ప్రత్యర్థులతో కలిసిపోవడంతో మిలటరీ పాలకులు చాలా చోట్ల ఎదురుదెబ్బలు తింటున్నారు. మనుగడ, స్వయంపాలన ఇత్యాది లక్ష్యాలకోసం అనాదిగా పోరాడుతున్న గ్రూపులతో అణచివేతకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణకోసం పోరాడుతున్న గ్రూపులు కలవడం, మిలటరీని దించాలన్న లక్ష్యంతో అవన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను తాత్కాలికంగా పక్కనబెట్టడంతో పోరు తీవ్రంగా ఉంది.

ఈ అంతర్యుద్ధం కచ్చితంగా మయన్మార్‌ పొరుగుదేశాలను, ప్రధానంగా భారతదేశానికి ఇబ్బందులు తెచ్చిపెట్టేదే. డ్రోన్లతో సహా అత్యంత శక్తిమంతమైన ఆయుధాలతో సాగుతున్న ఈ తిరుగుబాటు మరింత బలపడి, మరిన్ని ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనిని సైన్యం అణచివేయగలదా లేదా అన్న విషయాన్ని అటుంచితే, మిలటరీ స్థావరాలతో పాటు, వ్యాపార వాణిజ్యమార్గాలు కూడా తిరుగుబాటుదారుల అధీనంలోకి పోతున్నాయి. మయన్మార్‌ సైనిక ప్రభుత్వంతో అంతర్లీనంగా సయోధ్యతో వ్యవహరిస్తున్న భారతదేశం ప్రస్తుత ఉద్రిక్త వాతావరణంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. నవంబరు 12న మిజోరాం సరిహద్దులకు ఆవల ఉన్న మయన్మార్‌ మిలటరీ స్థావరంమీద చిన్‌ తిరుగుబాటుదారులు దాడిచేసినప్పుడు పారిపోయివచ్చిన నలభైఐదుమంది మయన్మార్‌ సైనికులను ఢిల్లీ ఆదేశాలమేరకు మన సైన్యం తలదాచుకొనేందుకు అనుమతించింది. తమ భూభాగంలో పోరాడుతున్న విదేశీసైనికులను మనదేశం కాపాడుకురావడం ఇదే ప్రథమం కావచ్చు. ప్రజాస్వామ్యాన్ని కూలదోసి, ప్రజా ఉద్యమాలను అణచివేసి, ఆంగ్‌ సాన్‌ సూకీని అష్టకష్టాలూ పెడుతున్న పొరుగుదేశపు మిలటరీ ప్రభుత్వాన్ని ఈ చర్యతో మనం సమర్థించినట్టయిందన్న విమర్శలు కూడా వచ్చాయి. మయన్మార్‌ అంతర్యుద్ధంతో మిజోరంలోకి ఇప్పటికే వేలాదిగా వలసలు సాగుతూ, అక్కడి సైనిక ప్రభుత్వం వైమానికదాడులతో విరుచుకుపడుతున్న తరుణంలో, పదహారువందల కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న భారతదేశం ఎంతో అప్రమత్తంగా ఉండకతప్పదు.

Updated Date - 2023-11-17T00:40:50+05:30 IST