సావర్కర్‌ ఇంకా సవాలే!

ABN , First Publish Date - 2023-05-26T04:50:19+05:30 IST

ఒక మనిషి స్వీయ అంచనాని గీటురాయిగా తీసుకుని సమాజంలో అతని మంచి చెడులను చర్చించలేం. వ్యక్తి ఎంతో నిజాయితీపరుడై ఉండొచ్చు. నమ్మిన విలువలను త్యజించని

సావర్కర్‌ ఇంకా సవాలే!

ఒక మనిషి స్వీయ అంచనాని గీటురాయిగా తీసుకుని సమాజంలో అతని మంచి చెడులను చర్చించలేం. వ్యక్తి ఎంతో నిజాయితీపరుడై ఉండొచ్చు. నమ్మిన విలువలను త్యజించని గుణసంపన్నుడై ఉండొచ్చు. అష్టకష్టాలు అనుభవించి ఉండొచ్చు. కానీ సమాజం పది ముందడుగులు వేయటానికి అతని నిజాయితీ దోహదం చేయలేకపోవచ్చు. సమాజ తిరోగమనానికి కారణం కావచ్చు. ప్రజా జీవితంపై ఎంతో ప్రభావాన్ని కలగచేసిన వ్యక్తుల మంచి చెడులను విశాల సమాజ హిత దృష్టితో అంచనా వేయటం సంక్లిష్టమైన పని. వి.డి. సావర్కర్‌ పాత్రను అంచనా వేయటం అదే కోవలోకి వస్తుంది. ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనాన్ని ఆరంభించబోతున్నారు. అదే రోజు సావర్కర్‌ పుట్టిన రోజు. ప్రభుత్వం పెట్టుకున్న ముహూర్తాన్ని యాదృచ్ఛికం అనుకోలేం. హిందూత్వ సిద్ధాంతానికి ఆద్యుడు సావర్కర్‌. అట్లాంటి వ్యక్తి పుట్టిన రోజున పార్లమెంటు భవనాన్ని ఆవిష్కరించటం ప్రభుత్వం సముచితం అనుకునే ఉండొచ్చు. సావర్కర్‌ భావజాలంతో విభేదించే కాంగ్రెస్‌.. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఆ నిర్ణయం రాజ్యాంగ నిర్మాతలను అవమానించటమేనని కాంగ్రెస్‌ నేత జయరాం రమేష్‌ విమర్శించారు. ఇటీవల సావర్కర్‌పై ధ్వజమెత్తుతున్న వారిలో రాహుల్‌ గాంధీ ముందు వరుసలో ఉన్నారు. లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన దరిమిలా ప్రభుత్వ గృహాన్ని ఖాళీ చేస్తున్న నేపథ్యంలో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ వ్యక్తం చేస్తారా? అని విలేకరులు రాహుల్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ ‘‘నా పేరు సావర్కర్‌ కాదు. నా పేరు గాంధీ. గాంధీ ఎన్నటికీ క్షమాపణ చెప్పరు’’ అని అనటంతో పెద్ద దూమారమే చెలరేగింది. నా పేరు సావర్కర్‌ కాదని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించటంలో అంతర్లీనంగా తీవ్ర విమర్శ ఉంది. రాజ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే అభియోగాలతో 1911లో సావర్కర్‌ను దోషిగా తేల్చి 50 ఏళ్ల శిక్షని విధించి అండమాన్‌ జైలుకి బ్రిటిషు ప్రభుత్వం పంపించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు రత్నగిరి జైలుకి మార్చారు. అక్కడే 1923తో హిందూత్వని విశదీకరిస్తూ చిన్న పుస్తకాన్ని రాశారు. ఆ తర్వాత ఏడాదికే జైలు నుంచి విడుదల అయ్యారు. అంతకు ముందు తనకు క్షమాభిక్ష పెట్టాలని సావర్కర్‌ బ్రిటిషు ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. అట్లా అర్జీలు పెట్టటం, క్షమాపణలు కోరటం సావర్కర్‌ లాంటి హిందూత్వ వాదే చేస్తారనీ తనది ఆ దారి కాదని చెప్పటమే రాహుల్‌ గాంధీ అసలు ఉద్దేశం అయి ఉండొచ్చు.

సావర్కర్‌ మరణించి 57 ఏళ్లు గడిచిపోయాయి. ఆయన సారథ్యం వహించిన హిందూ మహాసభ ఇప్పుడు నామమాత్రంగానే ఉంది. స్వాతంత్ర్యానికి ముందు కూడా కాంగ్రెస్‌కు అది ఏ దశలోనూ రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగలేదు. మరి సావర్కర్‌పై ఇప్పటికీ ఎందుకింత వివాదం? సావర్కర్‌ భావజాలం ఒకనాడు ఎక్కువ మందిని ఆకర్షించి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడది ప్రబల శక్తిగా ఉంది. ఆయన భావజాలం నుంచి ప్రేరణ పొందిన పార్టీ ప్రస్తుతం కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉంది. సావర్కర్‌ భావాలకు అనుగుణంగా చరిత్ర పుస్తకాలను తిరగ రాస్తున్నారు. అన్యమత చిహ్నాలు, అన్యమత రాజుల ముద్రలు, అన్యమత సంపర్కంతో వచ్చిన నగరాల పేర్లు క్రమేపీ అధికార చరిత్ర గ్రంథాల నుంచి తొలగిపోతున్నాయి. అశోకుడి శాంతి ప్రవచనాల వల్ల దేశం ఎంతో నష్టపోయిందని సావర్కర్‌ విమర్శించారు. ప్రపంచ గొప్ప చక్రవర్తుల పేర్లలో నుంచి అశోకుడి పేరు భవిష్యత్తులో తొలగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యుద్ధ ప్రియులకే తప్ప యుద్ధ విముఖులకు సావర్కర్‌ చరిత్రలో స్థానం లేదు. గతంలో గాడ్సే లాంటి వ్యక్తులకు సావర్కర్‌ భావజాలం ఒక ఉద్దీపనలా నిలిచింది. ఆరెస్సెస్‌ తొలి నాయకులు కూడా సావర్కర్‌ నుంచే ప్రేరణ పొందారు. జనసంఘ్‌ స్థాపనకు ముందు శ్యామప్రసాద్‌ ముఖర్జీ హిందూ మహాసభలోనే ఉండేవారు. సావర్కర్‌ అభిమానుల నోట ఇప్పుడు ముస్లింలీగ్‌ ప్రస్తావన వస్తే అది భయంకరంగానే ఉంటుంది. కానీ ఆయన నేతృత్వంలోని హిందూ మహాసభ ముస్లింలీగ్‌తో కలిసి అధికారాన్ని పంచుకుంది. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని సావర్కర్‌ బహిరంగంగానే వ్యతిరేకించారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో పదవులను త్యజించాలని కాంగ్రెస్‌ పిలుపునిస్తే వాటిని అంటిపెట్టుకుని ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా సావర్కర్‌కు దేవుడంటే నమ్మకం లేదు. మాంసాహారం ఆయనకు ప్రీతిపాత్రమైంది. సైన్స్‌ అన్నా వ్యతిరేకత లేదు. సైనిక శక్తికి సైన్స్‌కు ఉన్న సంబంధం దృష్ట్యా దానికి ప్రాధాన్యం ఇచ్చారు. భగవంతునిపై నమ్మకం లేని హిందూత్వ నేతలు ఇప్పుడు ఒక్కరూ కూడా మనకు తారసపడరు. దేవుడిపై నమ్మకంలేని సావర్కర్‌ హిందూత్వ సిద్ధాంతానికి ఆద్యుడు కావటమే విచిత్రమైంది. మన చరిత్రలో ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయి. వివేకానందుడు మన అధ్యాత్మికత వారసత్వానికి పెద్దపీట వేశారు. దరిద్ర నారాయణులను ఆదుకోవటాన్ని మించిన అధ్యాత్మికత లేదని ప్రవచించారు. ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా భారత ధార్మిక, తాత్విక భావాలను పునఃనిర్వచించటానికి ప్రయత్నించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రచనల్లో కూడా భారతీయ తత్వ సంపదపై ఉదాత్త వైఖరే తప్ప అన్యమత విద్వేష ఛాయలు ఎక్కడా కనపడవు. మహాత్మాగాంధీ తాను హిందువునని నిజాయితీగా చెప్పుకొన్నారు. వేరే మతాన్ని న్యూనతపరచి హిందూమత గొప్పదనాన్ని కీర్తించలేదు. సావర్కర్‌ హిందూత్వలో ఇలాంటి ఉదాత్తతకు, మానవీయ పునఃనిర్వచనానికి చోటులేదు. రాజకీయ కోణం నుంచే హిందూత్వ సిద్ధాంతాన్ని తీర్చిదిద్దారు. సమకాలీన రాజకీయ అవసరాల కోసం చరిత్రను వాడుకున్నారు. అందుకే ఆయన భావాల చుట్టూ తీవ్ర వివాదాలు ముసురుకుంటాయి.

హిందూ అన్న పదం ఎలా వచ్చింది? హిందువులంటే ఎవరు? హిందువుల్లోని శాఖా భేదాల్ని ఎలా చూడాలి? హిందూత్వ సారాంశంలో ముఖ్య అంశాలేమిటి? హిందూ దేశంలో పుట్టిన వాళ్లందరూ హిందువులేనా? ఇస్లాం, క్రైస్తవంలోకి మారిన హిందువుల స్థానం ఏమిటి? మతం మారిన వారికి ఎలాంటి హక్కులు ఉంటాయి? ఇలా ఎన్నో ప్రశ్నలను లేవనెత్తి చాలావరకూ వాటికి నిర్దుష్టంగా జవాబులిచ్చారు. హిందూ అన్న పదం సింధూ నది నుంచి వచ్చిందని మొదలుపెట్టి ప్రజలందరికీ తాము హిందువులం అనే భావన వందలయేళ్ల నుంచి ఉందనీ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆ భావన చెక్కుచెదరలేదనీ ప్రతిపాదించారు. హిందూ జాతీయతా దృక్పథం ఇటీవలది కాదనీ ప్రజల ఆలోచనల్లో అంతర్లీనంగా ఎప్పటినుంచో ఉందనీ దానికి అవరోధాలను తొలగించటమే ఇప్పటి కర్తవ్యమని భావించారు. హిందూ నాగరికతకు తొలి దెబ్బ గజనీ మహమ్మదు దాడులతో మొదలైందనీ ఆ తర్వాత వచ్చిన ప్రధాన ముస్లిం పాలకులందరూ హిందూ వ్యతిరేకులనీ సూత్రీకరించారు. ఎవరు హిందువులు? అన్న ప్రశ్నకు హిందూ దేశంలో పుట్టిన వారందరూ హిందువులేనని చెప్పినప్పుడు ఎంత విశాల దృక్పథమో కదా అనిపిస్తుంది. సిక్కులు, బౌద్ధులు కూడా హిందువులేనని అన్నప్పుడూ సబబుగానే ఉంటుంది. గతకాలపు సదాచారాల నుంచి, గాథల నుంచి, వీరోచిత రాజుల పాలన నుంచి స్ఫూర్తిపొందిన వారందరూ హిందువులే అన్నప్పుడూ అభ్యంతరం ఉండకూడదని అనిపిస్తుంది. భారత్‌ను పితృభూమిగా, కర్మభూమిగా పరిగణించే వారందరూ హిందువులే అన్నప్పుడు విభేదించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. వైచిత్రి ఏమిటంటే ఎవరు హిందువులు.. అన్న ప్రశ్నకు ఇచ్చిన వివరణలన్నిటినీ ఒక్క పెట్టున సావర్కర్‌ స్వయంగా పూర్వపక్షం చేస్తారు. పితృభూమి, కర్మభూమితో సరిపెట్టుకోకుండా భారత్‌ని తమ పుణ్యభూమిగా భావించిన వారినే హిందువులుగా పరిగణించాలని స్పష్టంచేస్తారు. పుణ్యభూమి అనే భావనతో ముస్లింలు, క్రైస్తవులను వేరు చేయటమే హిందూత్వలో ప్రధాన అంశం. ముస్లింలు, క్రైస్తవులు ఏ దేశంలో ఉన్నా మక్కాని, జెరూస్లమ్‌ని కాదని వేరొక ప్రాంతాన్ని పుణ్యభూమిగా భావించరు. భారత్‌ని పుణ్యభూమిగా భావించనంత వరకూ ముస్లింలు, క్రైస్తవులను హిందువులుగా పరిగణించలేం. వారిని హిందూ దేశంలో ఐక్యమైన వారిగా భావించలేం. దేశ సాంస్కృతిక ఐక్యతకు సమస్యలు వారి నుంచే వస్తాయి. సాంస్కృతిక అనైక్యత రాజకీయ అనైక్యతకు దారి తీస్తుంది. ఐక్యం కావటమా? కాకపోవటమా? అన్నది వారి నిర్ణయం. సరైన నిర్ణయం తీసుకోనంతవరకూ సమానుల హోదా వారికి రాదు. అజ్ఞానం పొరలను వలిచేసుకుని చారిత్రక పరిశీలనతో వ్యవహరిస్తే తాము ఎవరిమో ముస్లింలకు, క్రైస్తవులకు అర్థం అవుతుంది. స్థూలంగా సావర్కర్‌ భావాలివి.

సావర్కర్‌ త్యాగాలు గొప్పవే. కాదనలేం. కానీ త్యాగశీలులు, సచ్ఛీలులు, నిరాడంబరులను భావజాల కోణం నుంచి చూడటమే సరైన దృక్ఫథం. ఒక నాయకుడి భావజాలం ప్రజలను ఎటువైపు నడిపించిందన్నదే కీలకం. అలా చూస్తే సావర్కర్‌ భావజాలం ఇప్పటికీ వివాదాస్పదమైందే. విభజనలను రేకేత్తించేదే. పితృ భూమి, కర్మభూమితో పాటు పుణ్యభూమికి విధేయులుగా పౌరులు ఉండాలని చెప్పే సిద్ధాంతాన్ని ఏ ప్రజాస్వామ్యం అంగీకరించదు. నిజ ప్రజాస్వామ్య చింతనలో పుణ్యభూములకూ చోటుండదు, పుణ్యమూర్తులకూ శాశ్వత స్థానం ఉండదు.

త్యాగశీలులు, సచ్ఛీలులు, నిరాడంబరులను భావజాల కోణం నుంచి చూడటమే సరైన దృక్ఫథం. ఒక నాయకుడి భావజాలం ప్రజలను ఎటువైపు నడిపించిందన్నదే కీలకం. అలా చూస్తే సావర్కర్‌ భావజాలం ఇప్పటికీ వివాదాస్పదమైందే. విభజనలను రేకేత్తించేదే. పితృ భూమి, కర్మభూమితో పాటు పుణ్యభూమికి విధేయులుగా పౌరులు ఉండాలని చెప్పే సిద్ధాంతాన్ని ఏ ప్రజాస్వామ్యం అంగీకరించదు. నిజ ప్రజాస్వామ్య చింతనలో పుణ్యభూములకూ చోటుండదు, పుణ్యమూర్తులకూ శాశ్వత స్థానం ఉండదు.

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - 2023-05-26T04:50:19+05:30 IST