Share News

సహజనటుడు

ABN , First Publish Date - 2023-11-14T02:07:59+05:30 IST

సినిమాకళ ఇరవై నాలుగు విద్యల మేళవింపు అంటారు. అందులో నటనా, మాటలూ గానమూ మాత్రమే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి, వినిపిస్తాయి...

సహజనటుడు

సినిమాకళ ఇరవై నాలుగు విద్యల మేళవింపు అంటారు. అందులో నటనా, మాటలూ గానమూ మాత్రమే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. నటనలో కూడా నాయికా నాయకుల మీదనే మన దృష్టి ఉంటుంది. ఆసాంతం కనిపించేవారో, ప్రధాన పాత్ర పోషించేవారో మాత్రమే కాక, ప్రతి ఒక్క వేషధారి కూడా సినిమాను రంజింపజేయడంలో ముఖ్యపాత్ర వహిస్తారు. మీడియా కానీ, ప్రేక్షకులు కానీ జిగేలుమని వెలిగే తారల మీదనే దృష్టి పెడతారు కానీ, సినిమా సంపూర్ణతకు ప్రతి ఒక్క నటుడి ప్రతిభా అవసరమే.

మేడా గూడూ కాని పొదరిల్లు ఉన్నట్టే, అటు సూపర్‌స్టార్‌లూ, ఇటు జూనియర్లూ కాని సహజ తారలు కొందరు ఉంటారు. శనివారం నాడు హైదరాబాద్‌లో కన్నుమూసిన చంద్రమోహన్ అటువంటి స్వయం ప్రకాశం కలిగిన సహజనటుడు. చాలా మంది పెద్ద హీరోల కంటె ఎక్కువ సినిమాలలో అతను కథానాయకుడు. అనేకమంది గుణనటుల కంటె అధిక చిత్రాలలో అతను నటించాడు. సుమారు యాభై సంవత్సరాలపాటు తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో వినోదింపజేశాడు. అలనాటి మేటి దర్శకుడు బిఎన్ రెడ్డి ద్వారా చిత్రసీమలోకి వచ్చి, దాదాపు అందరు విభిన్న దర్శకులకు, వాణిజ్య దర్శకులకు ఇష్టుడైన నటుడిగా ఎదిగాడు.

చంద్రమోహన్‌ లాంటి నటులు అరుదుగా కనిపిస్తుంటారు. ఒక సినిమాలో హీరో, మరో చిత్రంలో సహాయ పాత్ర, ఇంకో చిత్రంలో కామెడీ వేషం, ఇంకొక సినిమాలో విలన్‌ వేషం. ఎన్నెన్ని పాత్రలు ఆయన పోషించారు! అదీ ఇదీ అని కాదు ఏ పాత్ర ఇచ్చినా కాదనలేదు, చెయ్యనని కానీ చెయ్యలేనని కానీ చెప్పలేదు. హీరో పాత్రలు మాత్రమే చేస్తానని గిరి గీసుకుని కూర్చోలేదు. తన ఉనికి సినిమాకు ఉపయోగపడుతుందని అంటే ఒక్క సీన్‌ వేషం వేయడానికి కూడా వెనుకాడలేదు. ఏ పాత్ర వేసినా, ప్రేక్షకులు తమకు బాగా పరిచితుడైన వ్యక్తిని చూస్తున్నట్టే అనుకుంటారు. ప్రతి నటుడికీ ఒక ఉచ్ఛదశ, తరువాత విరామం సహజం. కొందరికి రెండో దశ చిన్నచిన్న వేషాలతో మొదలవుతుంది. చంద్రమోహన్‌కు రెండో దశ అంటూ ఏదీ లేదు. ఆయన సుదీర్ఘమైన కెరీర్‌లో విరామమే లేదు.

పెద్ద సినిమాలలో చిన్ననటుడిగా, చిన్న సినిమాలలో పెద్ద నటుడిగా చంద్రమోహన్ రాణించాడు. ఇద్దరు హీరోలలో ఒకరిగా, హీరోల మిత్రుడిగా, మధ్యతరగతి కథానాయకుడిగా, పిల్లల తండ్రిగా ఆయన పాత్రలు ప్రత్యేకంగా ఆకట్టుకునేవి. తారల సినిమాల మధ్య చంద్రమోహన్ సినిమాలు ప్రేక్షకులకు కనీస వినోదాన్ని, నిర్మాతలకు కనీస లాభాన్ని అందించేవిగా ఉండేవి. మృదుభాషిత్వం, సంస్కారవంతమైన ప్రవర్తన, ఆర్భాటం లేని వ్యక్తిత్వం ఉన్న పాత్రలు చంద్రమోహన్‌కు ఎక్కువగా వస్తూ ఉండేవి. సర్వసాధారణంగా తారసపడే వ్యక్తుల్లాంటి పాత్రలే ధరించడం వల్ల, చంద్రమోహన్‌కు వీరాభిమానులు ఎవరూ ఉండరు. అట్లాగే ఆయనను ఇష్టపడని వారూ ఉండరు.

హాస్యం, కరుణ, శృంగారం ఇట్లా అన్ని రసాలను చంద్రమోహన్ తన నటనలో చూపించాడు. భావోద్వేగాలను బాగా పండించగలడు. నిజజీవితంలోనూ ఆయన హాస్యప్రియుడు, ఉద్వేగశీలి. తన మిత్రుడు, సీనియర్ నటుడు కృష్ణ గత ఏడాది మరణించినప్పుడు, ఎన్టీయార్ శతజయంతి కార్యక్రమంలోను చంద్రమోహన్ తీవ్ర అనారోగ్యంతోనే పాల్గొని కళ్లనీళ్లు పెట్టుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు.

చంద్రమోహన్ భోజనప్రియుడని, ఆర్థిక విషయాల్లో అతి జాగ్రత్త పరుడని, అతని హస్తవాసి మంచిదని, జోడీగా నటించిన ఆడనటులు పెద్ద తారలుగా మారతారని జనం చెప్పుకుంటారు కానీ, అవి సినిమాపత్రికలకు పనికివచ్చే దినుసులు మాత్రమే. చంద్రమోహన్ వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే, డాంబికాన్ని ఏ మాత్రం ప్రదర్శించకుండా, తనను తాను అణకువగా మిగుల్చుకున్న సాధారణుడని మాత్రమే చెప్పగలం. దాదాపు వెయ్యి సినిమాలలో నటించి, నిండునటజీవితం గడిపిన వ్యక్తి అంతే నిరాడంబరంగా నిష్క్రమించారు. చిత్రపరిశ్రమ నుంచి ఘననివాళి మాత్రం ఆయనకు దక్కలేదేమో అనిపిస్తుంది.

Updated Date - 2023-11-14T02:08:01+05:30 IST