‘రజౌరీ’ హెచ్చరిక
ABN , First Publish Date - 2023-11-28T01:39:11+05:30 IST
కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను హెచ్చించే నిమిత్తం పాకిస్థాన్ మాజీ సైనికులు కూడా ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నారంటూ భారత నార్త్నన్ ఆర్మీ...
కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను హెచ్చించే నిమిత్తం పాకిస్థాన్ మాజీ సైనికులు కూడా ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నారంటూ భారత నార్త్నన్ ఆర్మీ కమాండర్ ఉపేంద్ర ద్వివేదీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగంలోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడంతో పాటు, వారిలో కొందరు పాకిస్థాన్ మాజీ సైనికులు కూడా ఉన్నట్టుగా తమకు సమాచారం ఉన్నదని ఆయన అన్నారు. స్థానికయువత నుంచి సహకారం తగ్గుతూండటంతో, నేరుగా ఉగ్రవాదులను చొప్పించేందుకు పాకిస్థాన్ సిద్ధపడుతున్నదని, సరిహద్దుప్రాంతమైన రజౌరీ–పూంచ్ బెల్ట్‌లో కనీసం పాతికమంది విదేశీ ఉగ్రవాదులున్నట్టుగా గుర్తించామని, సార్వత్రక ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు రాబోయే నెలల్లో మరింతమంది చొరబడవచ్చునని కూడా ఆయన అనుమానిస్తున్నారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లలో శిక్షణపొందిన విదేశీ ఉగ్రవాదులకు తోడుగా, పాక్ మాజీ సైనికులు కూడా వారితో చేయికలపడం తీవ్రమైన పరిస్థితికి అద్దంపడుతున్నది.
పదిహేనేళ్లక్రితం ముంబై దాడులు జరిగినప్పటినుంచీ ఇప్పటివరకూ పాకిస్థాన్ వైఖరిలో వీసమెత్తుమార్పులేదనడానికి గతవారం సుదీర్ఘంగా సాగిన రజౌరీ ఎన్‌కౌంటర్ నిదర్శనం. హతమైన ఉగ్రవాదులు ఏడాదికాలంగా ఇక్కడ చురుకుగా ఉంటున్నారని, ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని, వారికి ఆయుధాలు, మందుగుండు స్థానికంగా కొందరు చేరవేశారని సైనికాధికారులు అంటున్నారు. రెండురోజుల పాటు సాగిన రజౌరీ ఎన్‌కౌంటర్ మన సైనికుల ధైర్యసాహసాలకు చక్కని రుజువు. ఎత్తయిన చోట్లనుంచి, ఒకమనిషి మాత్రమే పట్టే చిన్నచిన్న గుహల్లోనుంచి ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూంటే, వారిని పటిష్టమైన వ్యూహంతోనూ, అంతకుమించిన ధైర్యసాహసాలతోనూ ఎదుర్కోవడం చిన్న విషయం కాదు. సంఘటన జరిగిన స్థలం అత్యంత సంక్లిష్టమైన పర్వతప్రాంతాల్లోనిది కావడంతో పాకిస్థాన్‌నుంచి చొరబడిన లష్కరే తోయిబా కమాండర్‌తో పాటు మరో సుశిక్షితుడైన ఉగ్రవాదిని మట్టుబెట్టే క్రమంలో భారత ఆర్మీ ఇద్దరు యువకెప్టెన్లను, ముగ్గురు సైనికులను కోల్పోవాల్సివచ్చింది. ఎత్తయిన పర్వతాలు, చిక్కటి అడవులతో నిండిన రజౌరీ–పూంచ్ సరిహద్దు మనకు ఇంకా సమస్యాత్మకంగానే ఉంది. గత రెండేళ్ళలో ఈ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల్లో ముప్పైమంది సైనికులు మరణించారు. ఒక్క ఉగ్రవాదిని మట్టుబెట్టాలన్నా అనేకమంది సైనికులు బలికావాల్సిన పరిస్థితుల్లో ఈ కీలకమైన చొరబాటు మార్గాన్ని రక్షించుకోవడం అత్యంత క్లిష్టమవుతున్నది. 370 అధికరణ తరువాత, కశ్మీర్‌లోయలోకంటే జమ్మూలోని ఈ జిల్లాల్లో చొరబాట్లు, ఎన్‌కౌంటర్లు అధికమైనాయన్నది కొందరి విశ్లేషణ. జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జరిగిన ఉగ్రఘటనల్లో నలభైశాతం రజౌరీ, పూంచ్ జిల్లాల్లో జరిగినవే. ఇతర చోట్ల ఉగ్రవాదులను సునాయాసంగా మట్టుబెడుతున్న మన సైనికులు ఇకపై భౌగోళికంగా అత్యంత సంక్లిష్టమైన అటవీ ప్రాంతాల్లో భారీ పోరుకు సిద్ధపడాల్సి ఉన్నదని ఈ ఎన్‌కౌంటర్ గుర్తుచేస్తోంది. కొందరు ఉన్నతస్థాయి లష్కర్ నాయకులు కన్నుమూసినా, ఇంకా చాలామంది ఉన్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ జిల్లాల్లోని వాస్తవాధీనరేఖకు ఆవలవైపు ఉన్న గ్రామాలు గతంలో ఉగ్రవాదులకు సహకరించడం మానేసినప్పటికీ, తిరిగి రెండేళ్ళుగా వారి సహకారం హెచ్చుతున్నదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మనవైపున్న గ్రామాల్లో స్థానికుల సహకారం గతంలో కంటే పెరిగినందునే ఈ సంక్లిష్టమైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత సాధ్యపడుతున్నప్పటికీ, ఇప్పుడు జరిగిన ఘటనలో స్థానికుల ప్రమేయం కూడా ఉన్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
మొత్తంగా జమ్మూకశ్మీర్‌లో గతంలో కంటే ఉగ్రవాదసంఘటనలు తగ్గినమాట నిజం. ప్రభుత్వం చెబుతున్నట్టుగా, విదేశీ ఉగ్రవాదులు, చొరబాట్లు, ఉగ్రదాడులు, స్థానికుల భాగస్వామ్యం ఇత్యాది అంశాల్లో పరిస్థితి మారింది, బాగా మెరుగుపడింది. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారన్న అనుమానం ఏమాత్రం కలిగినా, చివరకు ప్రభుత్వోద్యోగులను సైతం ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. పదిహేనేళ్ళనాటి ముంబైదాడుల్లో జరిగిన అపారమైన విధ్వంసాన్ని ఆదివారం తన మన్‌కీబాత్‌లో గుర్తుచేసుకుంటూ, ప్రధాని ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామని దేశప్రజలకు భరోసా ఇచ్చారు. రజౌరీలో సుదీర్ఘంగా సాగిన ఎన్‌కౌంటర్, మన సైన్యానికి జరిగిన అపారనష్టం ఆయన మనసులో కచ్చితంగా ఉండే ఉంటుంది.