సహజీవనమే సంరక్షణ సూత్రం

ABN , First Publish Date - 2023-05-26T04:44:59+05:30 IST

వన్య ప్రాణుల సంరక్షణకై భారత్ చేపట్టిన కార్యక్రమాలలో అత్యంత ముఖ్యమైనది ప్రాజెక్ట్ టైగర్. యాభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ గణనీయమైన విజయాలను

సహజీవనమే సంరక్షణ సూత్రం

యాభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రాజెక్ట్ టైగర్ ఫలితంగా దేశంలో పులుల జనాభా పెరిగింది. అదే సమయంలో పులులు సంచరించే భూ వైశాల్యం తగ్గిపోయింది. వ్యాఘ్రాల సంరక్షణ చర్యలను, స్థానిక జన సముదాయాల శ్రేయస్సుకు తోడ్పడే కార్యకలాపాలతో సమన్వయపరిచే ఎజెండా ఆధారంగా టైగర్ ప్రాజెక్ట్‌ను పునరావిష్కరించుకోవాలి. పులులు సువిశాల ప్రాంతాలలో స్వేచ్ఛగా సంచరిస్తూ, ఉజ్వలంగా వర్ధిల్లేందుకు ఇది తప్పనిసరి.

వన్య ప్రాణుల సంరక్షణకై భారత్ చేపట్టిన కార్యక్రమాలలో అత్యంత ముఖ్యమైనది ప్రాజెక్ట్ టైగర్. యాభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ గణనీయమైన విజయాలను సాధించింది. రాజస్థాన్ లోని సరిస్కా అభయారణ్యం (టైగర్ రిజర్వ్)లో పులులు పూర్తిగా అంతరించిపోవడంపై 2005లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌కు నేను నేతృత్వం వహించాను. ప్రభుత్వానికి సమర్పించిన మా నివేదికలో పులుల సంరక్షణకు ఒక స్పష్టమైన ఎజెండాను సూచించాము. అయితే అది పులుల భద్రతకు కాకుండా మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చిందని పులుల సంబంధిత వ్యవహరాల్లో నిపుణులు అయిన వారు అభిప్రాయపడ్డారు.

అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు మా నివేదిక సమర్పించిన తరువాత అనేక హేమంతాలు గడిచిపోయాయి. మా సూచనలు, సిఫారసులపై పలు చర్యలు చేపట్టారు. పులుల జనాభా గణనలో మరింత శాస్త్రీయమైన పద్ధతులను అనుసరిస్తున్నారు. జాతీయ వ్యాఘ్ర సంరక్షణ ప్రాధికార సంస్థ నేర్పాటు చేశారు. వన్యప్రాణుల వ్యతిరేక నేరాలను నిరోధించేందుకు ఒక సంస్థ నేర్పాటు చేశారు. ఈ రెండిటికీ బడ్జెట్ కేటాయింపులు గణనీయమైన స్థాయిలో ఉంటున్నాయి. అలాగే అభయారణ్యాల ఏర్పాటులో భాగంగా గ్రామస్తులకు ఇతర ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే వ్యయాలకు కూడా ప్రభుత్వం నిధుల కేటాయింపును పెంచింది.

మా సూచనలు, సిఫారసుల మేరకు ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ మంచి ఫలితాల నిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పులుల జనాభా పెరిగింది. అయితే గత యాభై సంవత్సరాలుగా టైగర్ ప్రాజెక్ట్ అమలవుతున్న తీరు తెన్నులను నిశితంగా సమీక్షిస్తే పులుల సంరక్షణ ఎజెండా అమలు అసంపూర్ణంగా మిగిలిపోయివుందని అర్థమవుతుంది. ఈ విషయంలో భారత్ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. అవి: అడవులలో పులులకు భద్రత కల్పించడం; అభయారణ్యాల సామర్థ్యానికి మించి పులుల సంఖ్యను పెంచడం. ఈ దృష్ట్యా పులుల సంరక్షణకు సహజీవన ఎజెండా– సంరక్షణ చర్యలను, స్థానిక జన సముదాయాల శ్రేయస్సుకు తోడ్పడే కార్యకలాపాలతో సమన్వయపరచడం– స్ఫూర్తి కావాల్సిన అవసరమున్నది.

భవిష్యత్తు ఆశాజనకంగా ఉన్నది, సందేహం లేదు. ఎందుకని? 2006లో నిర్వహించిన ఒక సర్వేలో దేశ వ్యాప్తంగా 1411 పులులు ఉన్నట్టు వెల్లడయింది. 2010లో వాటి సంఖ్య 1706కు పెరిగినట్టు మరో సర్వేలో నిర్ధారితమయింది. 2014 నాటికి వాటి సంఖ్య 2226కు అధికమయింది. 2018లో నిర్వహించిన ఒక సర్వేలో తేలిన పులుల సంఖ్య 2967. పులుల జనాభా పెరుగుదల టైగర్ ప్రాజెక్ట్ మహత్యమే అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఈ సందర్భంగా ఒక ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని కూడా ప్రస్తావించి తీరాలి. 2006లో మన దేశంలో పులులు ఇంచుమించు 93,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో సంచరిస్తుండేవి. 2018 నాటికి పులుల సంచార భూమి వైశాల్యం 89,000 చదరపు కిలోమీటర్లకుకు తగ్గిపోయింది. పులుల అభయారణ్యాలలో వాటికి మంచి సంరక్షణ లభిస్తుంది. అయితే పులుల ఆవాస ప్రాంతాల వైశాల్యం క్రమేణా తగ్గిపోతోంది! ప్రదర్శిత జంతువులుగా పులులను బందీ చేశామా? ఒక విధంగా అవుననే చెప్పాలి. 2018 సర్వేలో 65 శాతం పులుల అభయారణ్యాల పరిధిలోనే ఉంటున్నాయని, మిగతావి వాటి ఇరుగు పొరుగు ప్రాంతాలలో కూడా తిరుగుతున్నాయని వెల్లడయింది. మరి పులుల అభయారణ్యాలను ఆనుకుని వున్న ప్రాంతాలు వివిధ వన్యప్రాణులకు, ప్రజలకు ఆవాస స్థలాలుగా ఉన్నాయి.

ఈ కారణంగానే పులుల, ప్రజల సహ జీవనంపై నా సునిశ్చిత అభిప్రాయాన్ని పదే పదే పునరుద్ఘాటిస్తున్నాను. టైగర్ రిజర్వ్‌లోని కోర్ ఏరియా ఈ ప్రాంతంలో మానవ సంచారం, ఇతర కార్యకలాపాలకు అవకాశం ఉండదు గనుక పులులకు అధిక భద్రత లభిస్తుంది– వెలుపలి ప్రాంతాల ప్రజలకూ లబ్ధి సమకూరేలా పులుల సంరక్షణ జరగాలన్నదే నా సునిశ్చిత అభిప్రాయం. అయితే నా ఈ అభిప్రాయంతో పులుల సంరక్షణ వాదులు ఏకీభవించడం లేదు. పైగా పరుష విమర్శలు చేస్తున్నారు ఏమైనా నేను నా సునిశ్చిత అభిప్రాయానికే కట్టుబడి ఉన్నాను. దానికి తప్పకుండా విస్తృత స్థాయిలో ఆమోదం లభించగలదని కూడా నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.

పులుల అభయారణ్యాలకు సమీప వెలుపలి ప్రాంతాలలో ఉన్న ప్రజలకు లబ్ధి సమకూరే విధంగా పులుల సంరక్షణ చర్యలు అమలుకావడం లేదు. అసలు పులుల సంరక్షణ విధానమే ఆ విధంగా ఉన్నదనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. సంరక్షణ కార్యకలాపాల నుంచి వారు నేరుగా లబ్ధి పొందగలగాలి. పులుల ఆధారిత పర్యాటక రంగంలో వారు భాగస్వాములు అవ్వాలి. ఈ విషయాన్ని మరింత వివరంగా చూద్దాం. నేడు పర్యాటక రంగంలో వన్యప్రాణులను వాటి సంరక్షణ కేంద్రాలలోనో లేదా సహజ స్థలాలలోనో సందర్శించడం ఒక ప్రముఖ పరిణామంగా ఉన్నది. ఈ వన్యప్రాణి పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందాలి. అయితే వ్యాఘ్రాల సహజ ఆవాస ప్రాంతాలలోనూ, వాటి పరిసరాలలోనూ ఉన్న ప్రజలకు లబ్ధి సమకూర్చేలా ఆ పర్యాటక రంగం పెరగాలి. ఇదే సంభవించడం లేదు.

నిజమేమిటంటే వన్యప్రాణుల సంరక్షణ అనేది ఇప్పటికీ జంతువులు, స్థానిక జనసముదాయాల మధ్య సంఘర్షణను తీవ్రతరం చేసే రీతుల్లోనే అమలవుతోంది. తత్ఫలితంగానే చాలా చోట్ల గిరిజనులను అభయారణ్యాల నుంచి కొత్త ప్రదేశాలకు బలవంతంగా తరలించడం జరుగుతోంది. ఆ అటవీ ప్రాంతాలను స్వాధీనం చేసుకుని, విలాసాలకు నెలవైన పర్యాటక ప్రదేశాలుగా మార్చి వేస్తున్నారు. దీనివల్ల అటవీ భూములు మరింతగా అన్యాక్రాంతమవుతూ సంఘర్షణలు తీవ్రమవుతున్నాయి.

పులుల అభయారణ్యాల పరిసర ప్రాంతాలలోని హోటల్స్‌పై 30 శాతం సెస్ విధించి, తద్వారా సమకూరిన ఆదాయాన్ని అక్కడి ప్రజల సంక్షేమానికి, ఆ అభయారణ్యాల అభివృద్ధికి వెచ్చించాలని 2005 టైగర్ టాస్క్‌ఫోర్స్ నివేదికలో మేము సూచించాము. స్థానికులు పులుల సంరక్షణలో భాగస్వాములు అయ్యేందుకు గాను వారి వ్యవసాయక్షేత్రాల ఆధారిత పర్యాటకాన్ని కూడా ఇతోధికంగా ప్రోత్సహించి తీరాలని కూడా సిఫారసు చేశాము. పులుల భావి భద్రత వారి ప్రయోజనాలకు మేలు చేస్తుంది. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి అయితే లేవు. అటువంటి మార్పులు సత్వరమే రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

పులుల సంరక్షణ కొత్త ఎజెండా పులులు వర్సెస్ గిరిజనులు అనే అంశం చుట్టూ పరిభ్రమించకుండా, పులులు– ప్రజలకు సంబంధించినదిగా ఉండి తీరాలి. రాబోయే యాభై ఏళ్లలో పులుల సంరక్షణలో భారతీయ నైతిక విలువలను అనుసరించాల్సిన అవసరమున్నది. పులులకు భద్రత, వాటి సహజ ఆవాసాల సమీప ప్రాంతాలలో నివశించే ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చే విధంగా టైగర్ ప్రాజెక్ట్‌ను పునరావిష్కరించుకోవాలి. పులులు సువిశాల ప్రాంతాలలో స్వేచ్ఛగా సంచరిస్తూ, ఉజ్వలంగా వర్ధిల్లేందుకు ఇది తప్పనిసరి.

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’

సంపాదకురాలు)

Updated Date - 2023-05-26T04:45:03+05:30 IST