అయ్యవార్ల ఆకలి కేకల లెక్కలేవీ?

ABN , First Publish Date - 2023-05-26T04:41:42+05:30 IST

మా గ్రామం కోమటిపల్లి, పాత వరంగల్ జిల్లా, ఇప్పటి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోనిది. ఇదొక బ్రాహ్మణ అగ్రహారం. దాదాపుగా 20 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. అన్నీ గౌరవప్రదమైన కుటుంబాలు.

అయ్యవార్ల ఆకలి కేకల లెక్కలేవీ?

మా గ్రామం కోమటిపల్లి, పాత వరంగల్ జిల్లా, ఇప్పటి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోనిది. ఇదొక బ్రాహ్మణ అగ్రహారం. దాదాపుగా 20 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. అన్నీ గౌరవప్రదమైన కుటుంబాలు. అటు వ్యవసాయంలోనూ, ఇటు విద్యలోనూ ముందుండేవి. బ్రాహ్మణ కుటుంబాల మహిళలు విస్తరాకులు కుట్టి ఓ రాజుగారికి పంపించేవారని చిన్నప్పుడు కథలుగా చెబుతుంటే విన్నాను. ఎందుకు పంపించేవారో తెలియదు కానీ, కాయకష్టానికి వెనుకాడేవారు కాదని అర్థమయింది. మా అయ్యవార్లు ‘చిటికెల పందిరి’, ‘రంగవల్లి’ వంటి సినిమాలు తీశారని చెబితే విన్నాం. ‘అన్నమయ్య’, ‘మంజునాథ’ సినిమాల కథా రచయిత జె.కె. భారవి మా ఊరి అయ్యవారే. కన్నడలోనూ చాలా హిట్ సినిమాలకు కథలు అందించారు. ఆళ్వందార్ అనాథ్ అయ్యగారు మా ఊర్లో శ్రీ రామానుజ సంస్కృత పాఠశాల నిర్వహించేవారు. (ఆయన కాలం చేయడంతో గత ఏడాదే పాఠశాలను కూడా మూసివేశారు.) ఇందులో బ్రాహ్మణేతరులకూ ప్రవేశం ఉండేది. ఊర్లో సర్కారు బడి ఉన్నప్పటికీ నన్ను మా నానమ్మ ఇక్కడే చేర్పించారు. అయిదో తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. నాకు వేదవ్యాస లక్ష్మీ అమ్మగారు అక్షరాలు నేర్పించారు. మా పాఠశాల కూడా వారి ఇంట్లోనే నడిచేది. ప్రస్తుతం లక్ష్మమ్మ గారి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని తెలిసింది. గ్రామస్థులంతా బాగున్నా అయ్యవార్లు మాత్రం ఎక్కడెక్కడో ఉంటున్నారు.

బ్రాహ్మణ కుటుంబాలన్నింటికీ భూములు ఉండేవి, వ్యవసాయం చేపించేవారు, చేసేవారు. కారణాలు తెలియవు కానీ వాటిని అమ్మేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆ భూములను కూడా బయటవారికి కాకుండా తమ వద్ద పని చేసిన వారికే విక్రయించారు. ఆ కూలీలు ఇప్పుడు రైతులుగా మారారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో గతంలోకన్నా అభివృద్ధి చెందారు. కానీ అయ్యవార్ల పరిస్థితే బాగా లేదు. చాలామంది హైదరాబాద్ నగరానికి వచ్చి ఉంటున్నారు. కొందరు పౌరోహిత్యం చేస్తుండగా, మరికొందరు ఇతరత్రా పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు.

దీనిపై మిత్రులతో చర్చిస్తున్నప్పుడు ఒక్క కోమటిపల్లి అయ్యవార్లే కాదు, మొత్తం బ్రాహ్మణ సమాజం పరిస్థితే అలా ఉందని తెలిసింది. ఉన్నత విద్యావంతులు, అవకాశాలు ఉన్నవారు కొంతవరకు బాగా బతుకుతున్నా మిగిలిన వారి పరిస్థితి దారుణంగా ఉన్నది. కొందరు కులం పేరు దాచిపెట్టి చిన్నచిన్న పనుల్లో చేరుతున్నారు. కొన్ని పనుల్లో బ్రాహ్మణులను నియమించుకోవడం బాగోదన్న ఉద్దేశంతో కొందరు పనులు ఇవ్వడానికి ఇష్టపడకపోవటమే దీనికి కారణం. వెజిటేరియన్ క్యాటరింగులు నడిపేది, అందులో పనిచేసేవాళ్లు కూడా చాలావరకు అయ్యవార్లే. చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి వీధిలో ఎంతోమంది అయ్యవార్లు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి ఏదైనా పూజ, తద్దినం కార్యక్రమాలు (రోజువారి కూలీ) దొరుకుతాయని ఎదురుచూస్తూ దీనంగా కూర్చుంటారు. యువకులకు వివాహం కావడం కూడా సమస్యగా ఉందంటున్నారు.

సామాజికంగా ఉన్నత వర్గానికి చెందిన వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు పరిష్కారం ఏమిటి? ఏదైనా చేయాలంటే ఇలాంటి వారు ఎంత మంది ఉన్నారో తొలుత లెక్క తేలాలి కనుక కులగణన జరపాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణులు అందరూ వేదపండితులు, పురోహితులే కారు. అందరూ వేద పండితులు కాలేరు కూడా. కొన్ని శాఖల వారికే ఈ అర్హత ఉంటుంది. మిగిలినవారు వివిధ వృత్తుల్లో ఉంటారు. వారి తాజా పరిస్థితి ఏమిటి, వారి అభివృద్ధికి ఏమి జరగాలో నిర్ణయించాలంటే బ్రాహ్మణులలోని శాఖల వారీగా సమాచారం ఉండాలి. వారి ప్రస్తుత సామాజిక పరిస్థితిపై సూక్ష్మస్థాయిలో సమగ్ర సర్వే జరపాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి సర్వే జరిపితే కుల గణన చేసినట్టవుతుందని, అది రాజ్యాంగానికి విరుద్ధమన్న వాదనలు ఉన్నప్పటికీ అది సరికాదు. బ్రాహ్మణుల సంఖ్య ఎంత అని తేల్చడం ఈ సర్వే లక్ష్యం కాదు. వారిలో ఆకలి కడుపులు ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడమే ఉద్దేశం. కొన్ని కులాలు కొన్ని పార్టీలకు ఓటు బ్యాంకులు అన్న అభిప్రాయం కూడా సరైనది కాదు. ఓటు అన్నది వ్యక్తిగత హక్కు. భార్యాభర్తల్లోనే ఎవరికి వారు నచ్చిన పార్టీకి ఓటు వేసుకోవచ్చు. అలాంటిది ఒక సామాజిక వర్గం మొత్తం ఒక పార్టీకి ఓటు వేస్తుందని ఆశించడం భ్రమే. ఓటు బ్యాంకులు తయారవుతాయన్న ఉద్దేశంతోనే కులగణనను వ్యతిరేకిస్తున్నారు. నిజానికి కులగణన లక్ష్యం ఆ సామాజిక వర్గంలోని పేదల ఆకలి కడుపుల సంఖ్యను నిర్ధారించటం. ఒక ఆర్థిక సమస్యను రాజకీయ కోణంలో చూస్తున్నందుల్లనే సమస్య తలెత్తుతోంది. పోనీ రాజకీయ కోణంలోనూ పరిశీలిద్దాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బ్రాహ్మిణ్–బనియా పార్టీగా పేరుపొందింది. అయితే ఈ వర్గాల పేదల సమస్యలను తెలుసుకునే ప్రయత్నమేదీ ఆ పార్టీ చేయలేదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు సమయంలో ఎదురైన ఇబ్బందుల విషయంలో బీజేపీ సామాన్య వ్యాపారులతో సమావేశమైన సందర్భమే లేదు. కనీసం తెలంగాణలో ఈ దిశగా ఒక్క ప్రయత్నమూ జరగలేదు. నిధులు సమకూర్చే వ్యాపారులనే పట్టించుకోకపోతే ఇక బ్రాహ్మణుల సమస్యలను అడిగినదెక్కడ?

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గుడులను నిధుల రూపంలో ఆదుకుంటున్నారు. ధూప దీప నైవేద్యాల కోసం పూజారులను ఎంతో ఆదుకుంటున్నారు. ఆ సామాజిక వర్గం కోసం ఒక కార్పొరేషన్ పెట్టి వారి ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం తోడ్పడుతున్నారు. అదేవిధంగా ఒక భవనాన్ని కూడా నిర్మించి ఇచ్చారు. ఈ భవనమే తదుపరి కార్యాచరణకు వేదికగా ఉండాలి. బ్రాహ్మణుల ఆర్థిక స్థితిగతులు, అవసరాలపై సమగ్ర సర్వేకు ఇక్కడే బీజం పడాలి. ఉపకులాలు/శాఖల వారీ సమాచారం సేకరించాలి. ఇక్కడ విశ్వబ్రాహ్మణుల విషయంలో ఉపకులాల సర్వే అవసరాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. వడ్రంగులు, స్వర్ణకారులు ఒకే సామాజిక వర్గం వారయినా ఎవరి సమస్యలు వారివి. ఎవరి అవసరాలు వారివి. అదేవిధంగా బ్రాహ్మణ శాఖల అవసరాలు కూడా అదే విధంగా ఉన్నాయేమో పరిశీలించాలి. కులగణన వివరాలు సేకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని అంటున్నారు. కానీ ఆయా సామాజిక వర్గాలకు మాత్రం ఉంటుంది. ప్రభుత్వం తగిన నిధులు సమకూర్చితే ఆయా వర్గాలే సర్వే చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో మేధావులైన బ్రాహ్మణులు మార్గం చూపితే ఆ వర్గంతో పాటు, మొత్తం సమాజానికి కూడా మేలు కలుగుతుంది.

ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు వీలుగా కులగణనపై కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. బిహార్‌లో ఇలాంటి ప్రయత్నం జరిగినా చట్టపరంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందుకే కేంద్రమే చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జనాభా లెక్కలు సేకరిస్తున్నా అవి వారి ఆర్థిక పరిస్థితిని పూర్తిగా వెల్లడించడం లేదు. జనాభాలో విద్యావంతులు ఎందరు, యువకులు ఎందరు, మహిళల సంఖ్య ఎంత ఇవన్నీ మార్కెట్ అవసరాలకు ఉపయోగపడుతున్నాయే తప్ప ప్రజల ఆకలి తీర్చడానికి కాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల లెక్కలు ఏదో రూపంలో లభ్యమవుతున్నా అగ్రవర్ణాల పేదల గురించి ఎలాంటి వివరాలూ అందుబాటులో ఉండడం లేదు. దీనిపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత ఆయా వర్గాలపైనా ఉంది.

బ్రాహ్మణుల స్థితిగతులు ఏమిటి, వారి అభివృద్ధికి ఏమి జరగాలన్నది తెలియాలంటే సూక్ష స్థాయిలో సమగ్ర సర్వే జరగాలి. ఇలాంటి సర్వే జరిపితే కుల గణన చేసినట్టవుతుందని, అది రాజ్యాంగానికి విరుద్ధమన్న వాదనలు ఉన్నప్పటికీ సరికాదు. బ్రాహ్మణుల సంఖ్య ఎంత అని తేల్చడం కాక, ఆకలి కడుపులు ఎన్నో తెలుసుకోవడమే సర్వే ముఖ్య ఉద్దేశం.

l గోసుల శ్రీనివాస్ యాదవ్

జనగణన వేదిక నేషనల్ చైర్మన్

Updated Date - 2023-05-26T04:41:42+05:30 IST