Share News

మనసులు గెలిచారు!

ABN , First Publish Date - 2023-11-21T01:04:30+05:30 IST

నలభైఐదు రోజులపాటు అభిమానుల్ని ఉర్రూతలూగించిన క్రికెట్‌ పండుగ పరిసమాప్తమైంది. అంకితభావం, పట్టుదల, నైపుణ్యం కలగలిసిన ఆస్ర్టేలియా జట్టు...

మనసులు గెలిచారు!

నలభైఐదు రోజులపాటు అభిమానుల్ని ఉర్రూతలూగించిన క్రికెట్‌ పండుగ పరిసమాప్తమైంది. అంకితభావం, పట్టుదల, నైపుణ్యం కలగలిసిన ఆస్ర్టేలియా జట్టు వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. వివిధ ఖండాలకు చెందిన పది జట్లు హోరాహోరీగా తలపడిన ఈ టోర్నమెంటు.. పలు ఉత్కంఠ భరిత పోటీల సమాహారం. స్వదేశంలో నిర్వహించిన ఈ వరల్డ్‌కప్‌లో వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలుపొందిన రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారతజట్టు ఫైనల్లో మాత్రం ప్రత్యర్థికి తలొగ్గి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. కప్పు కైవసం చేసుకున్నది కంగారూలే అయినా, తమ జైత్రయాత్రతో మన క్రీడాకారులు అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న తీరు అసామాన్యం. అంతిమ పోరులో పరాజయానికి కారణమేదైనా మన టీమ్‌ ఆటతీరు చక్కనిది. తాము ఆడుతోంది ఫైనల్స్‌ అనే భావన, ఆపై నీలి సముద్రంలా ఉప్పొంగుతున్న లక్షకుపైగా క్రీడాభిమానుల నినాదాలు, కేరింతల నడుమ రోహిత్‌ సైన్యం కాసింత ఒత్తిడికి గురైనట్టు కనిపించింది. ఇదంతా ఒక ఎత్తయితే ఆస్ర్టేలియన్ల ప్రొఫెషనలిజం మెచ్చుకోదగినది. ట్రావిస్‌ హెడ్‌, లబుషేన్‌ అంకితభావం, కమిన్స్‌ సారథ్యం వారిని విజయంవైపు నడిపించాయి.

ఈ టోర్నీలోని అన్ని విభాగాల్లోనూ భారత క్రికెటర్ల ఆటతీరు అభినందనీయమైనది. బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లీ ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధికంగా 765 పరుగులు చేసి రికార్డులకు ఎక్కాడు. ఈ అంచెపోటీల్లో అధికంగా 24 వికెట్లతో మహ్మద్‌ షమీ చెలరేగిపోయాడు. అటు సారథిగా, ఇటు ఆటగాడిగా రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండ్‌ నైపుణ్యం ప్రదర్శించిన జడేజా... ఇలా ప్రతి ఒక్కరూ తుది అంకం వరకూ సాగిన ప్రస్థానంలో భాగస్వాములయ్యారు. భారత్‌ ఈసారి కప్పు గెలవడం లాంఛనమేనని ఎంతోమంది విజయాన్ని ఖరారు చేసుకున్నారు. 1983లో కపిల్‌దేవ్‌, 2011లో ధోనీ సారథ్యంలో టీమిండియా వరల్డ్‌కప్‌లు గెల్చుకుంది. ఈసారి మూడో కప్పు చేతికి అందినట్టే అంది దూరమైపోయింది. ఇక రోహిత్‌ సేన వరుస విజయాలపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఐసీసీ ఈవెంట్‌లా లేదని, భారత క్రికెట్‌ బోర్డే రాజ్యమేలుతున్నట్టు అనిపిస్తోందని విమర్శించారు. అంతేనా... ఇండియా జట్టుకు మాత్రం వేరే బంతులు ఇస్తున్నారని, అందుకే అన్ని మ్యాచ్‌ల్లోనూ అదే గెలుస్తున్నదని తిట్టిపోశారు. టాస్‌ విషయంలోనూ భారత్‌కు అనుకూలంగా ఏదో జరుగుతోందని పాకిస్థాన్‌కు చెందిన మాజీలు ఆడిపోసుకున్నారు. ఇప్పుడిక ట్రోఫీని ఆస్ర్టేలియా ఎత్తుకుపోవడంతో భారత్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన గొంతుకలన్నీ మూగపోయాయి.

ఈ వరల్డ్‌కప్‌లోని ఇతర జట్ల విషయానికొస్తే, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకతోపాటు మాజీ విజేత పాకిస్థాన్‌ ఆటతీరు నిరాశ కలిగించింది. అనూహ్యమైన ఆటతో అందరి ప్రశంసలు అందుకున్న అఫ్ఘానిస్థాన్‌, నెదర్లాండ్స్‌ తదితర చిన్నజట్లు దిగ్గజ జట్లకు సైతం చుక్కలు చూపించాయి. ఇక, సెమీఫైనల్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. క్రికెట్‌లో చోకర్స్‌గా ముద్రపడిన ఆ జట్టు ఇప్పటివరకూ ఐదుసార్లు వరల్డ్‌కప్‌ సెమీస్‌కు చేరుకుంటే... ఒక్కసారి కూడా ఫైనల్‌దాకా రాలేకపోయింది. ఇక, క్రితంసారి రన్నరప్‌ న్యూజిలాండ్‌ ఈసారి భారత విజయాల హోరుకు తలొగ్గింది. అయితే విరాట్‌ కోహ్లీ, షమీతోపాటు కివీస్‌ జట్టులో రచిన్‌ రవీంద్ర, శ్రీలంక నుంచి మధుశంక, ఆస్ర్టేలియా జట్టులో డబుల్‌ సెంచరీ చేసిన మ్యాక్స్‌వెల్‌, బౌలర్‌ ఆడమ్‌ జంపా అద్భుతంగా రాణించి టోర్నీకి వన్నెతెచ్చారు.

క్రికెట్‌లోకి టీ20 పోటీలు రంగప్రవేశం చేసినప్పటినుంచి ఈ వన్డేల పట్ల సగటు అభిమానిలో ఆసక్తి సన్నగిల్లుతూ వస్తోంది. వన్డే పోటీల రాకతో టెస్టు క్రికెట్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఐదురోజుల మ్యాచ్‌లు చూసేవారు ఆవేదనకు గురవుతున్న తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ చందాన ఏకంగా 20 ఓవర్ల మ్యాచ్‌లు బరిలోకి వచ్చేశాయి. దీంతో టెస్టుల సంగతి సరేసరి, 50 ఓవర్ల వన్డేలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌లోని పది వేదికలపై సాగిన ఈ 48 మ్యాచ్‌ల ప్రపంచకప్‌ వన్డే క్రికెట్‌కు ఊపిరిలూదింది. మాజీ టెస్టు ఆటగాడు, వ్యాఖ్యాత రవిశాస్ర్తి చెప్పినట్టు ఎనిమిది గంటలపాటు కూర్చుని వన్డే మ్యాచ్‌లు చూసే ఓపిక, సమయమూ ఈ తరం కుర్రాళ్లకులేవన్నది నిర్వివాదాంశం. అందుకే ఈ ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిడివిని కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఐసీసీ త్వరలోనే కసరత్తు చేసే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే వన్డేలు మరింత జనరంజకంగా మారడం ఖాయం.

Updated Date - 2023-11-21T07:52:25+05:30 IST