New names : పేరులోనే ఉన్నది ‘అస్తిత్వం’!

ABN , First Publish Date - 2023-09-10T04:28:43+05:30 IST

ఇండియా దటీజ్‌ భారత్‌– ఈ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పేర్లు మార్చే విషయంలో బీజేపీపైన తీవ్ర విమర్శలే ఉన్నాయి. ముస్లిం సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు, ముస్లిం పాలకులు పెట్టిన పేర్లు తీసివేసి హిందూ పేర్లు

New names : పేరులోనే ఉన్నది ‘అస్తిత్వం’!

ఇండియా దటీజ్‌ భారత్‌– ఈ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పేర్లు మార్చే విషయంలో బీజేపీపైన తీవ్ర విమర్శలే ఉన్నాయి. ముస్లిం సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు, ముస్లిం పాలకులు పెట్టిన పేర్లు తీసివేసి హిందూ పేర్లు పెడతారని, చరిత్ర మార్చాలని మీరు ఎందుకు అనుకుంటున్నారని వారిపై విమర్శ. అలహాబాద్‌ని ప్రయాగరాజ్‌గా మార్చడం, ఢిల్లీ నగరంలో అక్బర్‌ రోడ్ లాంటి చాలా వీథులకు కొత్త పేర్లు పెట్టడం దాకా ఈ విమర్శ సాగింది. బీజేపీ మాత్రమే కాదు, మన దేశంలో పేర్లు మార్చడం చాలా పార్టీలు చేశాయి. చాలా దేశాలు వాటి పేర్లు, రాష్ట్రాల పేర్లను మార్చుకున్నాయి.

ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమించినప్పుడు మొదట చేసేది సాంస్కృతిక దాడి. ఆక్రమించిన దేశం ఉనికిని, సంస్కృతిని మార్చడం, ఆ క్రమంలోనే పేర్లు మార్చడం చేస్తారు. మొగల్‌ తదితర ఇస్లాం మత పాలకులు కానీ, తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలకులు కానీ చేసింది ఇదే. ఆస్ట్రేలియాని ఆక్రమించినప్పుడు అక్కడి వేలాది మూలవాసుల్ని చంపేయడం లాంటి చర్యే పేర్లు మార్చడం. ఇండియా అనే పేరు బ్రిటిషు వారు పెట్టింది కాదు కనీసం రెండు వేల సంవత్సరాల క్రితమే గ్రీకు యాత్రికుడు మెగస్తనీసు పెట్టాడు. ఇండికా గ్రంథం రాసాడు. అప్పుడు చేసింది కూడా పైన చెప్పిన పనే. అప్పుడు ఇక్కడ ఉన్న పేర్లు ఏమిటి, ఎందుకు ఇండియా అన్నాడు అనేది కూడా చర్చించాలి. సింధ్‌ను సింధ్‌ వ్యాలీ అనకుండా వారికి నోరు పలికిన తీరులోనే ఇండస్‌ అని ఎందుకు అనాలి? పర్షియన్లు ‘స’ ని వారి భాషలో ‘హ’ గా పలుకుతారు కాబట్టి అది హింద్‌ అయింది. సింధుస్థాన్‌ అనేది హిందుస్థాన్‌ అయింది. అలాంటప్పుడు భారత్‌ అనే పదం కన్నా ఇండియా అనే పదమే హిందుత్వకి దగ్గరగా ఉండే పదం కదా. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ఎందుకు గ్రహించడం లేదు.

ముస్లిం పాలకులు మన దేశంలోని ఎన్నో పేర్లను మార్చారు, కొత్త నగరాలకు వారి మతాన్ని ప్రతిబింబించే పేర్లనే పెట్టుకున్నారు. అందుకు మన తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా సాక్ష్యమే. పాలమూరు మహబూబ్‌నగర్ అయింది, మానుకోట మహబూబాబాద్ అయింది, ఇందూరు నిజామాబాదు అయింది. అంతే కాదు పరిపాలనలో వచ్చే పదసంచయం అంతా ఇక్కడి ప్రజల భాషలో కాక పాలకుల భాషైన ఉర్దూ చేరింది. పరిపాలన భాష ప్రజల భాషైన తెలుగు కాకుండా పాలకుల భాషైన ఉర్దూగా ఉండింది. ఆక్రమణదారులైన పాలకులు చేసే మొదటి పని అదే. బ్రిటిషు వారు చేసింది ఇదే. పేర్లు మార్చకపోయినా వారు ఆ పేరును ఎలా పలకగలిగితే అలా స్పెల్లింగు రాశారు. విశాఖ వైజాగ్‌ అయింది, రాజమహేంద్రవరం రాజాహ్‌మండ్రి అయింది, కోకోనాడ, కుడపాహ్‌, హైడ్రబాడ్‌, కలక్‌టా, కేలికట్‌ ఇలా వందల పేర్లు ఆంగ్లీసైజ్‌ అయ్యాయి.

స్వాతంత్ర్యానంతరం ఈ పేర్లు మనకు ఎందుకు ఉండాలి అని భావించిన చాలా రాష్ట్రాలు, వాటిని పాలించిన చాలా పార్టీలు పేర్లు మార్చుకున్నాయి. మెడ్రాస్‌ మద్రాసు అయి తర్వాత చెన్నై అయింది. టాంజోర్‌ తంజావూరు అయింది. ఆంగ్లిసైజ్‌ అయిన ఎన్నో పేర్లను తమిళ ప్రభుత్వాలు తిరిగి తమిళీకరించుకున్నాయి. మద్రాస్ స్టేట్‌ని 1969లో కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వం తమిళనాడుగా మార్చుకుంది. 1973లో మైసూర్‌ స్టేట్‌ని దేవరాజ్‌ అర్స్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్ణాటక అని మార్చింది. 2011లో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చింది. 1991లో కరుణాకరన్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ట్రివేడ్రంను తిరువనంతపురంగా మార్చింది. బాంబేని ముంబాయిగా మార్చింది శివసేన ప్రభుత్వం (ముంబా ఆయి అక్కడి గ్రామదేవత పేరు). కలక్‌ట అనే ఇంగ్లీషైన పేరును మార్చింది కమ్యూనిస్టు బుద్ధదేవ్‌ భట్టాచార్య ప్రభుత్వం. నెల రోజుల క్రితమే కమ్యూనిస్టులు పాలించే కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రం పేరు ‘కేరళ’ అని కాకుండా ‘కేరళమ్‌’ అని పిలవాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేర అంటే కొబ్బరికాయ, అలమ్ అంటే ప్రదేశం, కొబ్బరి పంట పండే ప్రాంతం కాబట్టి దీనికి కేరళమ్‌ అనే పేరు ఉండాలని ఈ మార్పుచేశారు. ఎన్టీయార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రతిదానికీ తెలుగుపేరు పెట్టే ప్రయత్నం చేశారు. చివరికి రాష్ట్రం పేరును ‘తెలుగునాడు’గా మార్చాలని పట్టుబట్టారు. అధికారిక తెలుగు మాసపత్రిక ఆంధ్రప్రదేశ్‌ని ‘తెలుగు వెలుగు’ అని మార్చారు. బహుశా వేరే చికాకులకు గురికాకుండా ఉంటే రాష్ట్రం పేరును ఎన్టీయార్‌ ‘తెలుగునాడు’గా మార్చేవారేమో. పొరుగువారు తమిళనాడు అని మార్చుకోవడం ఆయనకు స్ఫూర్తి. బాంబే స్టేట్‌ తర్వాతి కాలంలో మహారాష్ట్ర, గుజరాత్‌లుగా విడిపోయి వారి పేర్లు వారు పెట్టుకున్నారు. కుడపాహ్‌ పోయి కడప అని రాజాహ్‌మండ్రి పోయి రాజమహేంద్రవరం అని కోకోనాడ పోయి కాకినాడగా వైజాగ్‌ విశాఖగా ఇలా మన తెలుగు ప్రభుత్వాలు స్పెల్లింగులు చట్టబద్ధంగా మార్చాయి.

ఇలా స్వతంత్ర భారతదేశంలోనే వేరు వేరు పార్టీలు వారి రాష్ట్రాల, నగరాల పేర్లను మార్చాయి. ఆయా భాషా ప్రాంతంలోని పార్టీలు, ప్రభుత్వాలు తమ ఉనికి, తమ సంస్కృతి, తమ అస్తిత్వం తమకు ఉండాలని భావించాయి. నాటి పాలకులు పాలకభాషని పాలితుల మీద రుద్దిన తప్పిదాన్ని సరిచేశాయి. బ్రిటీషు వారు చేసిన మార్పులను తిరిగి స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు సరిచేసాయి. ఇది కేవలం బీజేపీ మాత్రమే చేసిన పని కాదు. బ్రిటిషు వారు పెట్టిన పేర్లను మార్చడం వారి మతమైన క్రిస్టియానిటికీ వ్యతిరేకం అని ఎలా అనుకోవడం లేదో, బీజేపీ చేసే మార్పులను కూడా అది ముస్లింలకు వ్యతిరేకంగా భావించాల్సిన అవసరం లేదు. ఇటీవల కొత్తగా కేంద్రం మార్చిన ముూడు చట్టాల పేర్లు హిందీలో ఉన్నాయని, ఇది లాంగ్వేజ్‌ ఇంపీరియలిజం అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అన్నారు. ఇంగ్లీషులో ఉంటేనే సమ్మతం అని కూడా ప్రకటించారు. సామ్రాజ్యవాద దేశమైన బ్రిటిషు వారి భాషని వాడడం ఇంపీరియలిజమా లేక మన దేశానికి చెందిన భాషని వాడడం ఇంపీరియలిజమా? స్టాలిన్‌ ఆలోచించాలి. తమ రాష్ట్రంలో తమిళం కాక మిగతా భాషలు పెత్తనం చేస్తే ఆయన ఊరుకుంటాడా?

భారత అనే ఒక చిన్న రాజ్యం పేరు మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహించేది కాదనే విమర్శ కూడా వచ్చింది. ఇది సరైన వాదన కాదు. భరతవర్షం, భరత ఖండం అనేవి భారత ఉపఖండం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే పదం అని చెప్పడానికి ఆధారాలున్నాయి. ఇందులో దక్షిణ భారతదేశం కూడా మొత్తం భాగంగా ఉన్నది.

ఇప్పటికే పదకొండు దేశాలు పేర్లు మార్చుకున్నాయి. మన దేశం పేరు మన దేశంలోని భాష కావడమే మన అస్తిత్వం. రాహుల్‌ గాంధీ ఇండియా జోడో యాత్ర కాకుండా భారత్‌ జోడో యాత్ర చేయడం సంతోషించదగ్గ విషయం.

వివిధ పట్టణాలు, నగరాల పేర్లలో బ్రిటీషువారు చేసిన మార్పులను తిరిగి స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు సరిచేసాయి. పేర్ల మార్పు అనేది కేవలం బిజేపీ మాత్రమే చేసిన పని కాదు. బ్రిటిషు వారు పెట్టిన పేర్లను మార్చడం వారి మతమైన క్రిస్టియానిటికీ వ్యతిరేకం అని ఎలా అనుకోవడం లేదో, బీజేపీ చేసే మార్పులను కూడా అది ముస్లింలకు వ్యతిరేకంగా భావించాల్సిన అవసరం లేదు.

l ప్రొ. పులికొండ సుబ్బాచారి

Updated Date - 2023-09-10T04:28:43+05:30 IST