జీ20: ప్రజా భాగస్వామ్యంతో దౌత్య కార్యాచరణ

ABN , First Publish Date - 2023-09-09T04:01:28+05:30 IST

భారతదేశ జీ20 అధ్యక్షత ఎన్నో రకాలు విశిష్టమైనదిగా ఇప్పటికే రుజువయింది. ఈ హోదాలో వర్ధమాన దేశాల కీలక సమస్యలు–ప్రాథమ్యాలపై భారత్‌ నిశితంగా దృష్టి సారించింది. అలాగే దక్షిణార్ధగోళ దేశాల గళాన్ని గట్టిగా వినిపించింది.

జీ20: ప్రజా భాగస్వామ్యంతో దౌత్య కార్యాచరణ

భారతదేశ జీ20 అధ్యక్షత ఎన్నో రకాలు విశిష్టమైనదిగా ఇప్పటికే రుజువయింది. ఈ హోదాలో వర్ధమాన దేశాల కీలక సమస్యలు–ప్రాథమ్యాలపై భారత్‌ నిశితంగా దృష్టి సారించింది. అలాగే దక్షిణార్ధగోళ దేశాల గళాన్ని గట్టిగా వినిపించింది. వాతావరణ కార్యాచరణ–నిధుల సమీకరణ, ఇంధన పరివర్తన, ‘ఎస్‌డిజి’ లక్ష్యాల సాధన, సాంకేతిక పరిజ్ఞాన పరివర్తన వగైరాలపై ఆకాంక్షలు పెంచింది. ఇవన్నీ అటుంచితే, సంబంధిత కార్యక్రమాలు–కార్యకలాపాలలో దేశవ్యాప్తంగా విస్తృత ప్రజా భాగస్వామ్యమే భారతదేశ జీ20 అధ్యక్ష పదవికి ఎనలేని విశిష్టతను ఆపాదించింది. ఆ మేరకు భారత అధ్యక్ష హోదా ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలకు పరిమితం కాలేదు. సరికదా... వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ప్రజానీకం చురుకైన భాగస్వామ్యం జీ20 కూటమిని నిజమైన ప్రజావేదికగా మార్చేసింది.

భారతదేశ జీ20 అధ్యక్ష బాధ్యతల్లో భాగంగా దేశంలోని 60 నగరాల్లో నిర్వహించిన సుమారు 220 సదస్సులు, సమావేశాలకు దాదాపు 30,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా అనుబంధ కార్యక్రమాల్లో 1,00,000 మందికిపైగా పాలుపంచుకున్నారు. మొత్తంమీద దేశం నలుమూలల నుంచి పౌరుల భాగస్వామ్యంతో జీ20 అనేక విధాలుగా ప్రజలతో మమేకమైంది. సంబంధిత మంత్రిత్వ శాఖలన్నీ ఈ కార్యక్రమాలు, కార్యకలాపాల్లో ఎంతో శ్రద్ధతో తమవంతు పాత్ర పోషించాయి. విద్యా మంత్రిత్వశాఖ ప్రజా భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం సహా విభిన్న భాగస్వాముల ఉత్సాహభరిత చొరవను చవిచూసింది. రాష్ట్ర, జిల్లా, సమితి, పంచాయతీ, పాఠశాల దాకా వివిధ స్థాయిలలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వీటిద్వారా జీ20, జాతీయ విద్యా విధానం, ప్రాథమిక అభ్యాసం–గణిత పరిజ్ఞానంసహా భారత అధ్యక్ష పదవి కేంద్రంగాగల ప్రాధాన్యతలపై అవగాహన కల్పించబడింది. మొత్తంగా ఈ కార్యకలాపాలు, కార్యక్రమాల్లో 23.3 కోట్ల మంది సమష్టిగా పాల్గొన్నారు. వీరిలో 15.7 కోట్ల మంది విద్యార్థులు, 25.5 లక్షల మంది ఉపాధ్యాయులు, 51.1 లక్షల మంది పౌర సమాజ సభ్యులు కూడా ఉన్నారు.


అయినప్పటికీ ప్రజా భాగస్వామ్యం అన్నది ఈ గణాంకాలన్నిటికన్నా గొప్పది. ఇందులో భాగంగా జీ20 విశ్వవిద్యాలయ అనుసంధానం కింద ఉపన్యాస పరంపర, పరస్పర ప్రయోగాత్మక జీ20 సమావేశాలు, విద్యా సంస్థలలో ప్రత్యేక జి–20 గోష్ఠులు, కీలక ఉత్సవాల్లో జీ20 పెవిలియన్ల ఏర్పాటు, క్విజ్–సెల్ఫీ పోటీలు సహా ఆకర్షణీయ #జీ 20 ఇండియా గాథల దాకా ఎన్నో ఆసక్తికర కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వీటన్నిటిలో ప్రజానీకం విస్తృత స్థాయిలో పాల్గొనగా చర్చలు ఉత్సాహభరిత వాతావరణం నడుమ కొనసాగాయి. ప్రజల ప్రమేయానికి మరింత చోటు కల్పించడంలో జీ20 కార్యాచరణ బృందాలు తమవంతుగా వినూత్న మార్గాలు అనుసరించాయి. ముఖ్యంగా జీ20 మౌలిక సదుపాయాల బృందం జాతీయ యువదినోత్సవం సందర్భంగా జీ20 సైక్లథాన్, బైక్ ర్యాలీలను నిర్వహించింది.

అంతేకాకుండా జీ20 అధ్యక్షత బాధ్యతల్లో భాగంగా సహకార సమాఖ్య వాదాన్ని భారత్‌ విభిన్న నమూనాలో ప్రదర్శించింది. ఈ మేరకు జీ20 ప్రతినిధులను స్వాగతించడంలో, స్థానికంగా/ప్రాంతీయంగా ఉత్సాహప్రోత్సాహాల సృష్టిలో, తమ సంప్రదాయాలు–విజయాలను ప్రదర్శనలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పరస్పరం పోటీపడ్డాయి. అనేక సందర్భాల్లో ఈ పోటీ పలు అభివృద్ధి పనులకు అవకాశం కల్పించింది. మణిపూర్‌లో లోక్తక్ సరస్సు పునరుద్ధరణ, ముంబైలో పట్టణ పారిశుధ్య కార్యక్రమాలు, లక్నోలో మౌలిక సదుపాయాల మెరుగుదల వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు. ప్రపంచ యవనికపై స్వదేశీ సాంస్కృతిక వారసత్వం, శిల్పకళా నైపుణ్యం ప్రదర్శించడానికే కాకుండా విభిన్న వర్గాలకు ఉపాధి అవకాశాలు పెరగడంలోనూ ఈ సమన్వయం దోహదపడింది. చాలామంది ప్రతినిధులు ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ (ఒడిఒపి) వంటి కార్యక్రమాల ఔన్నత్యాన్ని ప్రత్యక్ష అనుభవంలోకి తెచ్చుకోవడంతోపాటు హస్తకళా ఉత్పత్తుల కేంద్రాలను సందర్శించగలిగారు.

అంతేకాకుండా భారతదేశంలోని ఆకర్షణీయ సహజ ప్రకృతి దృశ్యాలు, శిల్పనిర్మాణ శోభ సమర్థంగా ఆవిష్కృతమయ్యాయి. కొవిడ్ అనంతరం పర్యాటక రంగంలో బలమైన పునరుజ్జీవనం ప్రస్ఫుటమైంది. ఆ మేరకు దేశవ్యాప్తంగా జీ20 కార్యక్రమాలు నిర్వహించిన తీరుతో ఒనగూడిన ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా జీ20 కార్యకలాపాల నిర్వహణతో జాతీయంగా/అంతర్జాతీయంగానూ అనుభవ పూర్వక ప్రయోజనాలు కలిగేలా మేం కృషిచేశాం. మొత్తంమీద ప్రపంచం కోసం భారత్‌ సన్నద్ధత, భారతదేశం కోసం ప్రపంచ సన్నద్ధతకు ఈ కృషి దోహదం చేసిందని చెప్పవచ్చు.

వివిధ కార్యాచరణ బృందాలు, చర్చల బృందాలు ప్రపంచ సమస్యలపై సామాజిక ఆసక్తితోపాటు నిబద్ధత సృష్టికి శక్తిమంతమైన వేదికను సమకూర్చాయి. శాస్త్రవిజ్ఞానం వంటి అంశాల్లో మనం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లపై సహకారాత్మక ఆలోచనకు తోడ్పడ్డాయి. అలాగే కార్మికశక్తిపై పరస్పర ప్రయోజనం కోసం కార్యాచరణ బృందాల ద్వారా అనుభవ మార్పిడి అవకాశాలపై చర్చలు సాగాయి. మరోవైపు యువతరం–20 కార్యాచరణ బృందం ఎంతో ప్రభావవంతంగా కృషి చేయడమేగాక ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోదిచేయడంపై బలమైన సాక్ష్యమిచ్చింది. మొత్తం 1563 సమావేశాలలో 1,25,000 మందికిపైగా ప్రతినిధులు భారత జీ20 అధ్యక్షతను మరింత శక్తిమంతం చేశారు. ఇక ఒక్క సివిల్–20 బృందం ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందిని భాగస్వాములను చేయగలిగింది. జీ20 ప్రక్రియలో సామాజిక మాధ్యమ వేదికలు కీలక సాధనాలయ్యాయి. పౌరులలో ఉత్సాహం రగల్చడం, ప్రజల మధ్య చర్చలకు తోడ్పడటం వగైరా చర్యలతో 14 ట్రిలియన్ సామాజిక మాధ్యమ ముద్రలు ఏర్పడ్డాయి.

ప్రజా భాగస్వామ్యానికి సంబంధించి రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. వారణాసిలో నిర్వహిచిన జీ20 క్విజ్‌లో 800 పాఠశాలల నుంచి 1.25 లక్షల మంది విద్యార్థులు పాల్గొనడం ఇందులో ఒకటి. అలాగే 450 మంది లాంబనీ చేతివృత్తులవారు తమ నైపుణ్యాన్ని హస్తకళా కౌశలాన్ని ప్రదర్శించారు. ఈ మేరకు వారు 1,800 ప్రత్యేక కుట్లు–అల్లికల ఉత్పత్తులతో అద్భుత కళాఖండాలను సృష్టించారు.

భారత జీ20 అధ్యక్షత ప్రపంచ సామూహిక భవిష్యత్తు సంబంధిత ఇతివృత్తాల ఆధారంగా విస్తృత సంభాషణలు, చర్చాగోష్ఠులు వంటివాటికి వేదిక సమకూర్చింది. వీటిలో అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఆచరణీయ సందేశం ద్వారా మాత్రమే ఇతర సమాజాలు నేర్చుకోవడమన్నది ఒక లక్ష్యం. మన దైనందిన కార్యకలాపాల్లో పర్యావరణ అనుకూల మార్పులు చేసుకునే జీవనశైలి (పర్యావరణం కోసం జీవనశైలి–లైఫ్‌) ఇందుకు ఒక ఉదాహరణ. అదేవిధంగా డిజిటల్ సేవా ప్రదానంపై విస్తృత అవగాహన కల్పన మన రోజువారీ లావాదేవీలలో డిజిటల్ సౌకర్యం మెరుగుదలకు తోడ్పడుతుంది. మహిళా చోదక అభివృద్ధిపై దృష్టి సారిస్తే సామాజిక పురోగమనంలో వారు పోషించే కీలక పాత్ర గురించి తెలుస్తుంది. చివరకు ప్రపంచ శ్రేయస్సుకుగల కేంద్రీకృత ప్రాధాన్యంపై లోతైన అవగాహన ఉన్నపుడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కూడా వేగవంతం అవుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ– భారత జీ20 అధ్యక్షత బాధ్యతను ‘ప్రజల అధ్యక్ష పదవి’గా అభివర్ణించారు. ఇది ఒక వివరణ మాత్రమే కాదు... ప్రేరణ కూడా! ఎందుకంటే– దేశవ్యాప్త మేధస్సుతోపాటు శక్తిసామర్థ్యాల సద్వినియోగం చిరస్మరణీయ జీ20 సృష్టికి ఎలా దోహదం చేయగలదో ఈ వ్యాఖ్య ప్రస్ఫుటం చేస్తుంది.

భారతదేశ జీ20 అధ్యక్షత బాధ్యతను ‘ప్రజల అధ్యక్ష పదవి’గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. అది ఒక వివరణ మాత్రమే కాదు... ప్రేరణ కూడా! ఎందుకంటే– దేశవ్యాప్త మేధస్సుతోపాటు శక్తిసామర్థ్యాల సద్వినియోగం చిరస్మరణీయ జీ20 సృష్టికి ఎలా దోహదం చేయగలదో మోదీ వ్యాఖ్య ప్రస్ఫుటం చేసింది.

ఎస్‌. జైశంకర్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

Updated Date - 2023-09-09T04:01:32+05:30 IST