గ్లోబల్ పెద్దలకు ‘నీలగిరి దృశ్యాలు’
ABN , First Publish Date - 2023-09-09T03:48:52+05:30 IST
గత నాలుగు దశాబ్దాలుగా నేను అసంఖ్యాక అకడమిక్ సెమినార్లు, సాహిత్య ఉత్సవాలలో పాల్గొన్నాను. ఊటీగా సుప్రసిద్ధమైన ఉదగమండలం అనే దక్షిణాది పర్వత ప్రాంత పట్టణంలో ‘కాన్ఫరెన్స్ ఫర్ ది నీలగిరీస్ ఇన్ ది నీలగిరీస్’ పేరిట ఆగస్టులో

గత నాలుగు దశాబ్దాలుగా నేను అసంఖ్యాక అకడమిక్ సెమినార్లు, సాహిత్య ఉత్సవాలలో పాల్గొన్నాను. ఊటీగా సుప్రసిద్ధమైన ఉదగమండలం అనే దక్షిణాది పర్వత ప్రాంత పట్టణంలో ‘కాన్ఫరెన్స్ ఫర్ ది నీలగిరీస్ ఇన్ ది నీలగిరీస్’ పేరిట ఆగస్టులో జరిగిన ఒక సమాలోచన సమావేశంలో కూడా పాల్గొన్నాను. తమిళనాడులోని ఈ అందమైన, కానీ దుర్బల మవుతోన్న ప్రాంతమైన ఉదగమండలం జిల్లాకు ‘జీవ సాంస్కృతికంగా ఒక సుస్థిర భవిష్యత్తు’ను సమకూర్చే విషయమై జరిగిన సమావేశమది.
నీలగిరులతో నాకు వ్యక్తిగత అనుబంధం ఉన్నది. మా నాన్నగారు ఊటీలో జన్మించారు. యుక్త వయసులో ప్రేమించి, పెళ్లాడిన మా అమ్మతో ఆయనకు తొలి పరిచయం అదే పట్టణంలో జరిగింది. కాగా నేను పుట్టింది, పెరిగింది ఉపఖండం ఉత్తర కొసనున్న గఢ్వాల్ హిమాలయ పర్వత పాద ప్రాంతంలో. నీలగిరులను నేను తొలిసారి సందర్శించినప్పుడు నా వయసు 40 ఏళ్లు. ఏటేటా సెలవుల్లో నేను మా కుటుంబంతో అక్కడే గడిపేవాణ్ణి.
పశ్చిమ కనుమలుగా పిలవబడే ఒక మహా పర్వత శ్రేణిలో నీలగిరులు ఒక ముఖ్య భాగం. పశ్చిమ కనుమల కంటే మహా ఉన్నతమైన హిమాలయ పర్వత శ్రేణిలో గఢ్వాల్ ఒక భాగం. ‘నీలగిరిస్కేప్స్’ (నీలగిరి దృశ్యాలు) సమావేశంలో ఉపన్యాసాలు చర్చలను వింటుండగా నా యవ్వనంలో నాకు బాగా సుపరిచితమైన హిమాలయాలు, వృద్ధాప్యం మీద బడుతున్న ప్రస్తుత దశలో నేను అంతకంతకూ బాగా తెలుసుకుంటున్న నీలగిరుల మధ్య కొన్ని చారిత్రక సాదృశ్యాలు స్ఫురించాయి.
అయితే ఉభయ ప్రాంతాల మధ్య జీవ సాంస్కృతిక వ్యత్యాసాలు విస్తారంగా ఉన్నట్టు నేను అర్థం చేసుకున్నాను. భాష, విశ్వాసాలు, సంస్కృతి, ఆహార అలవాట్లు మొదలైన విషయాలలో నీలగిరుల, గఢ్వాల్ వాసులు పూర్తిగా భిన్నమైన వారు. చెట్టూ చేమ, పశుపక్ష్యాదులు, నేలల పరంగా కూడా ఉభయ ప్రాంతాలు పూర్తిగా భిన్నమైనవి. అయినప్పటికీ ఆధునిక పర్యావరణ చరిత్రలలో ఈ రెండు ప్రాంతాల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. అవేమిటో వివరిస్తాను.
19వ శతాబ్ది తొలిపాదంలో బ్రిటిష్ వలసపాలకులు అటు గఢ్వాల్‌లోనూ, ఇటు నీలగిరులలోనూ తమకొక సుస్థిర ఉనికిని సాధించుకున్నారు. ఈ విదేశీయులు తొలుత వచ్చినప్పుడు ఉభయ ప్రాంతాలలోనూ ప్రజలు నాలుగురకాల జీవనోపాధులపై ఆధారపడి వున్నట్టు కనుగొన్నారు. అవి: వేట, ఆహార సేకరణ; పశుపోషణ; వ్యవసాయం; చేతి వృత్తులు. రెండు ప్రాంతాలు పూర్తిగా కానప్పటికీ చాల వరకు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉండేవి. నీలగిరివాసులు కొండలకు దిగువున ఉన్న కొంగునాడు మైదాన ప్రాంతాల వారితో వర్తక వ్యాపారాలు చేసేవారు; గఢ్వాల్ వాసులు సింధు– గంగా మైదాన ప్రాంతాల ప్రజలతో పాటు హిమాలయాల అత్యున్నత ప్రాంతంలోని టిబెట్ పీఠభూమి వారితో కూడా వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు.
నీలగిరులు, గఢ్వాల్ హిమాలయ ప్రాంతాలలోని స్థానిక జనసముదాయాలు తమ ప్రాకృతిక పరిసరాలతో ప్రగాఢ, సహజమైన సంబంధాలను కలిగివుండేవారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే వారి జీవన శైలులు ఆ పరిసరాలతో పరిపూర్ణంగా పెనవేసుకుని ఉండేవి. ప్రకృతి పరిధులలో వారు మనుగడ సాగించేవారు. చెట్లు, నేలల, వాతావరణ పరిస్థితుల గురించిన వారి సంచిత జ్ఞానం సమున్నతమైనది. అది వారి జీవనాధార కార్యాచరణలలో సంపూర్ణంగా ప్రతిఫలించేది. అదే సమయంలో వారు నిర్దిష్ట వృక్షాలు, శిలలు, వాగులు, వంకలు మొదలైన వాటిని పూజించేవారు. అడవులలోని కొన్ని భాగాలలో వేటినీ ఏ విధంగానూ ఉపయోగించుకోకుండా వాటిని పవిత్ర వనాలుగా గౌరవించేవారు. ఈ ఆధునిక యుగ పూర్వకాల సమాజాలవారు ప్రకృతి పట్ల ఎనలేని వినయశీలతతో వ్యవహరించేవారు.
బ్రిటిష్ రాజ్ రాకతో ఉభయ ప్రాంతాలలోనూ ముఖ్యంగా పర్యావరణ స్థాయిలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. నీలగిరులలో తేయాకు తోటల, హిమాలయాలలో వాణిజ్య అడవుల పెంపకం ప్రారంభమయింది. నీలగిరులలో తేయాకు తోటల పెంపకం, హిమాలయాలలో దేవదారు జాతి వృక్షాల పెంపకంతో జీవ వైవిధ్యానికి అపార నష్టం సంభవించింది. పర్యావరణ సుస్థిరతకు ఎనలేని హాని జరిగింది.
సమాజ స్థాయిలో చూస్తే వలసలు ప్రారంభమయ్యాయి. బయటి ప్రదేశాల నుంచి కూలీలు, అధికారులు, ఉపాధ్యాయులు, సైనికులు, విహార యాత్రికులు తదితరులు ఉభయ ప్రాతాలలోకి వెల్లువెత్తారు. అలాగే ఉభయ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలలోని ఫ్యాక్టరీలు, ప్రభుత్వ కార్యాలయాలలో జీవనోపాధి నిమిత్తం ఎంతో మంది వలసపోయారు. బ్రిటిష్ వలసపాలనతో పట్టణీకరణ ప్రారంభమయింది. ఊటీ, ముస్సోరీ మొదలైన ‘పర్వత ప్రాంత పట్టణాల’ (హిల్ స్టేషన్స్)ను వలసపాలకులు సృష్టించారు.
1947లో స్వాతంత్ర్యానంతరం నీలగిరులు, గఢ్వాల్ హిమాలయ ప్రాంతాల సామాజిక, పర్యావరణ రూపురేఖల్లో మార్పులు మరింత వేగవంతమయ్యాయి. విద్యుదుత్పత్తికై హిమాలయ నదులపై ఆనకట్టలు నిర్మించడం ప్రారంభమయింది. దీంతో అడవులు, పచ్చిక మైదానాలు ముంపునకు గురయ్యాయి. నవీన రహదారుల నిర్మాణం పెరిగి, ఆటోమొబైల్స్ రాకపోకలు ముమ్మరమవడంతో పర్వత ప్రాంతాల నుంచి ప్రజల ప్రయాణాలు, సరుకుల రవాణా మరింతగా అధికమయింది. వలసానంతర రాజ్య వ్యవస్థ చేపట్టిన ‘అభివృద్ధి’ కార్యక్రమాలతో వేలాది ప్రభుత్వోద్యోగులు, తమ కుటుంబాలతో సహా పర్వత ప్రాంతాలకు వచ్చి స్థిరపడ్డారు.
గఢ్వాల్‌లో అడవుల తరుగుదల 1970ల నాటికి సామాజిక, పర్యావరణ సంక్షోభాలకు దారితీసింది. ఈ సంక్షోభాల ఫలితంగానే చిప్కో ఉద్యమం ప్రారంభమయింది. 1980 దశకం తొలినాళ్లకు నీలగిరులలో పౌర సమాజ బృందాలు పర్యావరణ పతనానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం ప్రారంభమయింది. గఢ్వాల్, నీలగిరుల పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తోడ్పడ్డాయి. అడవుల నరికివేత, నేల కోతలు, విషపూరిత వ్యర్థాలు, విదేశీ కలుపు మొక్కల విస్తరణను అడ్డుకోవడంతో పాటు పర్యాటకుల వెల్లువను కూడా నిలువరించాయి. నా యవ్వన కాలం నాటి గఢ్వాల్ హిమాలయాల కంటే నా వృద్దాప్య రోజుల నీలగిరులు మూడు విధాలుగా మరింత అదృష్టవంతమైనవి. ఇందుకు మొదటి కారణం పర్యావరణ సంబంధితమైనది. హిమాలయ నదులు పర్వతోన్నత ప్రాంతాల నుంచి కింది ప్రాంతాలకు ప్రవహించే జీవనదులు కావడంతో వాటిపై జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను విరిగా నిర్మించడం జరిగింది. ఇవి చాలా వ్యయభరితమైనవే కాక, పర్యావరణ విధ్వంసకరమైనవి. నీలగిరులలో ఉన్న జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు చాలా తక్కువ. ఈ కారణంగా హిమాలయ ప్రాంతాలలో చోటుచేసుకున్న పర్యావరణ విధ్వంసం ఇక్కడ సంభవించలేదు.
నీలగిరుల అదృష్టానికి రెండో కారణం భౌమ– వ్యూహాత్మకమైనది. నీలగిరుల చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకలు భారత్‌లో అంతర్భాగాలు. అయితే గఢ్వాల్ పరిస్థితి వేరు. అది టిబెట్ సరిహద్దుల్లో ఉన్నది. భారత్ –చైనాల మధ్య సంబంధాలు ఒక విధంగా శతృపూరితమైనవి కనుక ఆ హిమాలయ ప్రాంతాలలో సైనిక దళాల రాకపోకలకు విశాల రహదారుల నిర్మాణం తప్పనిసరి అయింది. ఈ రహదారుల పర్యవసనాలు ప్రకృతి, సమాజంపై ప్రతికూలంగా ఉన్నాయి. నీలగిరుల అదృష్టానికి మూడో కారణం మతపరమైనది. నీలగిరులలో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, మసీదులు, చర్చ్‌లు అనేకమున్నాయి. అయితే వాటిలో స్థానికులు మాత్రమే పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఉదగమండలం జిల్లా వెలుపలి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చాలా చాలా తక్కువ. నీలగిరులకు భిన్నంగా గఢ్వాల్, ఛార్‌దామ్‌గా ప్రసిద్ధి పొందిన బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రికి నెలవు. యాత్రికులు కాలినడకన లేదా గుర్రాలపై వస్తే సమస్య లేదు. అయితే మతపరమైన పర్యాటకం అమితంగా విస్తరించడంతో నాలుగు వరసల రహదారుల నిర్మాణం అనివార్యమయింది. ఇవి, పర్యావరణాన్ని ధ్వంసంచేయడంతో పాటు సామాజిక పరిస్థితులలో పెను అవాంఛనీయ మార్పులను తీసుకువస్తున్నాయి.
గఢ్వాల్‌తోను, నీలగిరులతోను నాకు ప్రగాఢ ఆత్మీయ అనుబంధాలు ఉన్నాయి. ఈ రెండు పర్వత ప్రాంతాలకు ‘జీవ సాంస్కృతికంగా సుస్థిర భవిష్యత్తు’ను నిండుగా కోరుకుంటున్నాను. అయితే వాస్తవ పరిస్థితులు ఆశాభావాన్ని కాకుండా నిరుత్సాహాన్నే కలిగిస్తున్నాయి. గఢ్వాల్‌కు నేను ఆశిస్తున్న భవిష్యత్తు దాదాపుగా అసాధ్యమనిపిస్తోంది. నీలగిరుల సామాజిక–పర్యావరణ సమగ్రతను పరిరక్షించి, పునర్నవీకరణ చాలా కఠినమైన, దుస్సాధ్యమైన కర్తవ్యమనడంలో సందేహం లేదు. ప్రపంచ స్థితిగతులను చర్చించేందుకు జనాభా, సిరిసంపదలు, అధునాతన సాంకేతికతల పరంగా మహాశక్తిమంతమైన జీ20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమవనున్న రోజున మీరు ఈ కాలమ్ చదువుతున్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం మహా ఔదార్యం, మత ధర్మానురక్తి ఉట్టి పడే మాటలతో నిండిన సంయుక్త ప్రకటనలు జారీ చేస్తారనడంలో సందేహం లేదు. అయితే ఈ ధరిత్రిపై మానవునితో సహా జీవకోటి మనుగడను మెరుగుపరిచే వాస్తవిక కార్యాచరణకు ఆ సదస్సు దోహదం చేస్తుందా? భౌగోళికంగా ఆలోచించడం మంచిదే కాని, ఇటీవల ఊటీలో జరిగిన ‘నీలగిరి దృశ్యాల’ సమాలోచనల స్ఫూర్తితో మానవాళి శ్రేయస్సునకు, పర్యావరణ పరిరక్షణకు ప్రాంతీయంగా పని చేయడం మరింత ముఖ్యం.
ప్రపంచ స్థితిగతులను చర్చించేందుకు జనాభా, సిరిసంపదలు, అధునాతన సాంకేతికతల పరంగా మహాశక్తిమంతమైన జీ20 దేశాల అధినేతల శిఖరాగ్రం న్యూఢిల్లీలో ప్రారంభమవనున్న రోజున మీరు ఈ కాలమ్ చదువుతున్నారు. ఈ ధరిత్రిపై మనిషితో సహా జీవకోటి మనుగడను మెరుగుపరిచే వాస్తవిక కార్యాచరణకు ఆ సదస్సు దోహదం చేస్తుందా? భౌగోళికంగా ఆలోచించడం మంచిదే కాని, ‘నీలగిరి దృశ్యాల’ సమాలోచనల స్ఫూర్తితో మానవాళి శ్రేయస్సుకు, పర్యావరణ పరిరక్షణకు ప్రాంతీయంగా పని చేయడం మరింత ముఖ్యం.
(వ్యాసకర్త చరిత్రకారుడు)