మాటామంతీ మంచిదే...!
ABN , First Publish Date - 2023-11-22T00:54:59+05:30 IST
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూచున్న కుర్చీవరకూ వెళ్ళి, ఆయన భుజం మీద ఆప్యాయంగా ఓ చెయ్యివేసి, మరోచేత్తో ఆయనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ షేక్‌హ్యాండ్...
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూచున్న కుర్చీవరకూ వెళ్ళి, ఆయన భుజం మీద ఆప్యాయంగా ఓ చెయ్యివేసి, మరోచేత్తో ఆయనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ షేక్‌హ్యాండ్ ఇస్తున్న వీడియో ఒకటి మాధ్యమాల్లో ప్రచారమవుతోంది. చైనా అధ్యక్షుడికి బైడెన్ బహుశా సారీ చెప్పివుంటారని కొందరు సామాజిక మాధ్యమాల్లో సరదా వ్యాఖ్య చేశారు కూడా. శాన్‌ఫ్రాన్సిస్కోలో వారం పాటు జరిగిన ఆసియాపసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్ (ఎపెక్) సమావేశాల్లోనిది ఈ వీడియో. మిగతా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన జిన్‌పింగ్–బైడెన్ భేటీ ఈ సందర్భంలోనే కాలిఫోర్నియాలో జరిగింది. ఆ నాలుగుగంటల భేటీ ముగిసినవెంటనే జిన్‌పింగ్‌ను మరోమారు బైడెన్ నియంతగా అభివర్ణించిన విషయం తెలిసిందే. బైడెన్ పేరు ఎత్తకుండా చైనా ఈ వాఖ్యను తీవ్రంగా ఖండించింది.
రెండుదేశాల అధ్యక్షుల మధ్యా నాలుగుగంటల భేటీ అద్భుతాలు సృష్టిస్తుందని ఎవరూ ఆశించడంలేదు కానీ, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూంటే, చిచ్చు కాస్తంత అదుపులో ఉంటుంది. అమెరికా పర్యటన సందర్భంలో చైనా అధ్యక్షుడు ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడారు. అమెరికన్ సీఈవోలను ఉద్దేశించి చేసిన ఆకర్షణీయమైన ప్రసంగంలో ఆయన రెండు దేశాల మధ్యా అనాదిగా మంచి స్నేహం ఉన్నదనీ, చక్కని వాణిజ్య వైరం వల్ల రెండుదేశాలూ ఎంతో ఎదుగుతున్నాయన్న అర్థంలో వ్యాఖ్యలు చేశారు. యావత్ ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటే అమెరికా–చైనా రెండూ కలిసికట్టుగా సాగాల్సిన అవసరం ఉందని, అమెరికాకు చైనా శత్రువుకాదని జిన్‌పింగ్ ఎన్నో మంచిమాటలు చెప్పారు. చైనాతో తీవ్రంగా పోటీపడుతూనే ఉంటాం, కానీ అది ఘర్షణలోకి జారకుండా, అనూహ్య పరిణామాలకు దారితీయకుండా జాగ్రత్తపడతాం అని అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన మిగతా ప్రపంచమంతా ఆశిస్తున్న రీతిలోనే ఉన్నది.
ఈ భేటీతో ఉభయదేశాల మధ్యా ఉన్న వివాదాలు, ఉద్రిక్తతలు సమసిపోతాయన్న భ్రమ లేదుగానీ, అగాధం మరింత విస్తరించకుండా ఇది ఉపకరిస్తుంది. ఫిబ్రవరిలో చైనా బెలూన్‌ను నిఘా ఆరోపణలతో అమెరికా కూల్చివేసిన ఘటన ఇరుదేశాల మధ్యా అవిశ్వాసాన్ని మరింత పెంచింది. దీనికి ముందు చైనా ఎంతగా వద్దంటున్నా అప్పటి అమెరికా స్పీకర్ నాన్సీపెలోసీ తైవాన్ వెళ్ళి, అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిమరీ వచ్చారు. దీనికి ఆగ్రహించిన చైనా, ఉభయదేశాల మధ్యా సైనిక ఉద్రిక్తతలు తలెత్తినపక్షంలో నేరుగా సంభాషించుకోగలిగే వ్యవస్థను రద్దుచేసుకుంది. అప్పుడు తెగిన అతి కీలకమైన ఈ కమ్యూనికేషన్‌ను తిరిగి పునరుద్ధరించుకోవాలని అధ్యక్షులిద్దరూ ఇప్పుడు నిర్ణయించుకోవడం చెప్పుకోదగిన పురోగతే. ఇరువురూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడటం, పునరుత్పాదక ఇంధన రంగంలో కలిసిపనిచేయాలని అనుకోవడం బాగుంది. ప్రపంచాన్ని కాలుష్యంలో ముంచెత్తుతున్న ఈ రెండు దేశాలూ పరస్పర ఆరోపణలతో కాలయాపన చేస్తుండటం వల్లనే అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రకటిత లక్ష్యాలు ఆచరణకు దూరంగా మిగిలిపోతున్నాయి. ప్రపంచాన్ని భయపెడుతున్న కృత్రిమమేధ విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తూ సహకరించుకుందామని అనుకోవడం కూడా మానవాళికి మేలు చేసేదే. నోటిమాటలకు కాక, నిర్దిష్టమైన ఒప్పందాల దిశగా ఈ ప్రయత్నం సాగినప్పుడు ఆ సంకల్పానికి మరింత విశ్వసనీయత చేకూరుతుంది.
తమ ప్రాధాన్యతలు, వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకుంటూనే ఘర్షణకు తావులేని రీతిలో నడవాలని రెండుదేశాలూ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఎవరు ఏ కారణంగా దిగివచ్చారు, ఎవరిది పైచేయి అన్న విశ్లేషణలు అటుంచితే, ప్రపంచం ఆశిస్తున్నది ఇదే. రెండేళ్ళుగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంతలోనే గాజాయుద్ధం వచ్చిపడి ప్రపంచాన్ని మరింత చీలికలు పీలికలు చేసింది. ఈ రెండు యుద్ధాల్లోనూ కీలకభూమిక నిర్వహిస్తున్న అమెరికా అధ్యక్షుడు ఏడాదిలోగా ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. కరోనా దెబ్బతో సమస్త వ్యవస్థలు కుదేలైపోయి, అనంతరం అమెరికాతో ఘర్షణ కారణంగా విదేశీపెట్టుబడులు తగ్గి, ఆర్థికపురోగతి దెబ్బతిన్న చైనాను గాడినపెట్టడం జిన్‌పింగ్‌కు తలనొప్పిగా మారింది. ఆయన విధానాలను, ఘర్షణాత్మకమైన వైఖరిని పార్టీ పెద్దలంతా ఇటీవల తీవ్రంగా తప్పుబట్టారని వార్తలు కూడా వచ్చాయి. అమెరికా–చైనా సంబంధాలు ఏ క్షణమైనా దిగజారి, మళ్ళీ మొదటికొచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ, ఎన్ని అభ్యంతరాలు, అవాంతరాలున్నా అధ్యక్షులిద్దరూ ఇలా ముఖాముఖీ నాలుగుమంచిమాటలు మాట్లాడుకోవడం మంచిదే.