బంగ్లా ఎన్నికల వేడి
ABN , First Publish Date - 2023-11-18T02:44:22+05:30 IST
బంగ్లాదేశ్‌లో రాజకీయం నిత్యం ఉద్రిక్తంగానే ఉంటుంది. కక్షలూ కార్పణ్యాలు, రాజకీయ హత్యలు, విపక్షనేతలను జైళ్ళలోకి నెట్టడాలు సర్వసాధారణం. ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు ఇక సరేసరి. జనవరి 7వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.
బంగ్లాదేశ్‌లో రాజకీయం నిత్యం ఉద్రిక్తంగానే ఉంటుంది. కక్షలూ కార్పణ్యాలు, రాజకీయ హత్యలు, విపక్షనేతలను జైళ్ళలోకి నెట్టడాలు సర్వసాధారణం. ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు ఇక సరేసరి. జనవరి 7వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఎన్నికలకోసం ఎంతోకాలంగా పట్టుబడుతున్న విపక్షపార్టీలు ఇందుకు సంతోషించడం లేదు. వాటి ప్రధానడిమాండ్ ఒక తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని. దేశాన్ని భయానకమైన వాతావరణంలోకి నెట్టి, విపక్షనేతలందరినీ కేసులతోనూ, అరెస్టులతోనూ వేధించి 2018 ఎన్నికల్లో షేక్ హసీనా విజయం సాధించినందువల్ల, ఈ మారు అటువంటి నేరాలూఘోరాలు జరగకుండా ఉండాలంటే ముందుగానే హసీనా పదవినుంచి దిగి, సర్వామోదంతో ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు పోవాలన్నది విపక్షాల డిమాండ్. లేనిపక్షంలో హసీనా అక్రమంగా నాలుగోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటారని వాటి వాదన. ఈ డిమాండ్‌ను తోసిపుచ్చి, ఎన్నికల తేదీని ప్రకటించడంతో, వాటిని రద్దుచేయాలన్న డిమాండ్‌తో విపక్ష కూటమి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
దాదాపు నెలరోజులుగా, మాజీ ప్రధాని ఖలీదాజియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బిఎన్‌పి) తన మిత్రపక్షాలతో కలిసి తాత్కాలిక ప్రభుత్వం గురించి ఆందోళనలు చేస్తున్నది. హసీనా అధికారంలో ఉండగా, ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని తమకు నమ్మకం లేదని ఆ పార్టీ చెబుతోంది. 2014లో ఎన్నికలను బహిష్కరించిన ఈ పార్టీ 2018 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. విపక్షాలను అణచివేసి, రిగ్గింగుకు పాల్పడి, ఓటర్లను భయభ్రాంతులను చేశారన్న ఆరోపణల మధ్యనే అధికార అవామీ లీగ్ కూటమి మూడువందల స్థానాల్లో 250పైగా సాధించి, మరింత బలపడింది. ఖలీదాజియా సహా మరికొందరు విపక్ష కూటమి నాయకులు జైళ్ళకు పోవడంతోనూ, ప్రజల్లో ఆదరణ తగ్గినందునా బిఎన్‌పి మరింత బలహీనపడింది. ఈ కారణంగానే విపక్షం తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదని, అటువంటి నిబంధనేమీ రాజ్యాంగంలో లేదని అధికారపక్షం గుర్తుచేస్తోంది. ఇప్పుడు ఎన్నికల ప్రకటనతో పరిస్థితులు మరింత వేడెక్కాయి.
రాబోయే ఎన్నికల్లో వేలుపెట్టేందుకు కొన్ని విదేశీశక్తులు ప్రయత్నిస్తున్నాయని, సహించేది లేదని బంగ్లాదేశ్ విదేశాంగమంత్రి గురువారం ఓ హెచ్చరిక చేశారు. అది అమెరికాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అన్ని పక్షాల మధ్యా సయోధ్య కుదర్చి, దేశంలో ఎన్నికలు చక్కగా, సవ్యంగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరిగేట్టుచేయాలన్నదే తన బాధ అని అమెరికా పైకి చెబుతున్నప్పటికీ, హసీనాను దించి ఖలీదాను ప్రతిష్ఠించడానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారపక్షం నమ్మకం. ఇటీవలి భారత్–అమెరికా టూప్లస్‌టూ స్థాయి మంత్రుల సమావేశంలో బంగ్లాదేశ్ వ్యవహారాలమీద ఎక్కువ చర్చే జరిగిందట. అది ఆ దేశ అంతర్గత వ్యవహారమని భారత్ అంటున్నప్పటికీ, షేక్ ముజిబుర్ రహ్మాన్ కుమార్తె విషయంలో మన సానుకూలత అనాదిగా ఉన్నదే. గతంలో ఖలీదాజియా ప్రధానిగా ఉన్న రెండు విడతల్లోనూ ఇరుదేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈశాన్యరాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని పెంచిప్రోత్సహించే విషయంలో ఆమె చేయూత, చైనా, పాకిస్థాన్ పట్ల ఆమె అనుకూలతలు తెలియనివేమీ కావు. అన్ని పక్షాల మధ్యా సయోధ్య కుదర్చాలన్న అమెరికా ప్రయత్నం వెనుక ఇతరత్రా రాజకీయ లక్ష్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, అటువంటి ప్రయత్నంలో భాగస్వామి కావడం వల్ల భారత్‌కు ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదు.
హసీనా ఏలుబడిలో బంగ్లాదేశ్ ఆర్థికంగా బాగుపడినమాట వాస్తవం. మౌలిక సదుపాయాలు, నీరు విద్యుత్ సరఫరాలు వంటివి మెరుగుపడ్డాయి. గార్మెంట్ పరిశ్రమ వృద్ధిచెంది లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నది. దుర్భరమైన దారిద్ర్యం నుంచి దేశం బయటపడినప్పటికీ, రెండు ప్రధానపక్షాల మధ్య నిరంతరం సాగుతున్న రాజకీయ యుద్ధం ఆ దేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. పలు కేసులు, అరెస్టులు అనంతరం లండన్‌లో తలదాచుకుంటున్న ఖలీదాజియా, ఆమె కుమారుడి తరఫున క్షేత్రస్థాయిలో కొందరు సీనియర్ నాయకులు అనాదిగా చేస్తున్న పోరాటం ప్రజల్లో బిఎన్‌పికి కాస్తంత ప్రతిష్ఠపెంచిందని అంటున్నప్పటికీ, అవి ఓట్లుగా పరిణమిస్తాయో లేదో తెలియదు. ఇక, తాత్కాలిక ప్రభుత్వం పేరిట ఉద్యమిస్తున్న బిఎన్‌పి, చిట్టచివరికి అస్త్రసన్యాసం చేసేపక్షంలో హసీనా ఘనవిజయం ఖాయం.