న్యాయమేనా?

ABN , First Publish Date - 2023-09-09T03:41:51+05:30 IST

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370 రద్దుపై పక్షంరోజులపాటు సాగిన వాదోపవాదాలు ముగించి, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. భారత

న్యాయమేనా?

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370 రద్దుపై పక్షంరోజులపాటు సాగిన వాదోపవాదాలు ముగించి, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. భారత యూనియన్‌లో జమ్మూకశ్మీర్‌ విలీనం సంపూర్ణం కావడానికి ఈ అధికరణ రద్దు అవశ్యకమని, 2019 ఆగస్టులో ఈ చర్య తీసుకున్న తరువాత లోయ అభివృద్ధి చెందిందని, ఉగ్రవాదం, చొరబాట్లు బాగా తగ్గిపోయాయంటూ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌, సొలిసిటర్‌ జనరల్‌ ఇత్యాదులు వాదనలు వినిపించారు. కేంద్రప్రభుత్వం లోక్‌సభలో తనకున్న సంఖ్యాబలంతో రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం ఫెడరల్‌ వ్యవస్థకు, రాజ్యాంగానికి వ్యతిరేకమని కపిల్‌ సిబ్బల్‌, దుష్యంత్‌ దవే వంటి న్యాయవాదులు పిటిషనర్ల తరపున వాదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు అంతిమంగా ఏమి చెబుతున్నదన్నది అటుంచితే, ఈ వాదోపవాదాల సందర్భంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) పార్లమెంటు సభ్యుడు మహ్మద్‌ అక్బర్‌ లోన్‌ చేత భారత రాజ్యాంగంపట్ల తన విధేయతను ప్రకటింపచేస్తూ సుప్రీంకోర్టు ప్రమాణపత్రం దాఖలు చేయించిన అంశం తీవ్ర ఆసక్తిని, విస్తృత చర్చను రేకెత్తించింది.

ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తున్న వారిలో అక్బర్‌లోన్‌ ప్రధాన పిటిషనర్‌. ఈనెల 1వతేదీన కశ్మీరీ పండిట్లకు చెందిన ‘రూట్స్‌ ఇన్‌ కశ్మీర్‌’ సంస్థ దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌లో అక్బర్‌ లోన్‌ పాకిస్థాన్‌ అనుకూల వేర్పాటువాద శక్తుల మద్దతుదారుడనీ, 2018లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అని నినదించారని, పిటిషనర్‌గా అతడు అనర్హుడని ఆరోపించింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక విడత స్పీకర్‌గా వ్యవహరించిన ఈయనకు నోటిదురుసు ఎక్కువని అంటారు. ఒమర్‌ అబ్దుల్లాను పొగిడే క్రమంలో పీడీపీ సభ్యులతో గొడవపడుతూ ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మీమ్స్‌గా ప్రచారంలో ఉన్నాయి. 2018లో అసెంబ్లీలో వాతావరణం ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో, బీజేపీ సభ్యులు పాకిస్థాన్‌ ముర్దాబాద్‌ అని నినాదాలు చేస్తుంటే, ఈయన ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అన్నాడు. ఈ దేశంలో ముస్లింలను హీనపరిచేందుకు, శత్రువులుగా చూపేందుకు పాకిస్థాన్‌ పేరును బీజేపీ ఇలా వాడుతుందని, అందుకు ఆగ్రహించే బీజేపీ సభ్యులకు వ్యతిరేకంగా తాను అలా అన్నానని, తప్పేనని అప్పట్లో ఆయన ఓ వివరణ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో, ‘రూట్స్‌ ఇన్‌ కశ్మీర్‌’ ఇంప్లీడ్‌ పిటిషన్‌ వాదనను సమర్థిస్తూ, ఆర్టికల్‌ 32ద్వారా ప్రాథమిక హక్కులను కోరుతున్న ఈ వ్యక్తి దేశరాజ్యాంగంపట్ల తన విధేయత నిరూపించుకోవాలని, జమ్మూకశ్మీర్‌ ఈ దేశ అంతర్భాగంగా గుర్తించాలని, వేర్పాటువాదుల పక్షాన లేనని ప్రకటించుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టును డిమాండ్‌ చేశారు. తదనుగుణంగా ప్రధానన్యాయమూర్తే ప్రమాణపత్రం కోరడంతో వాదనలు ముగుస్తున్న ఆఖరురోజున అక్బర్‌లోన్‌ దానిని సమర్పించారు.

పార్లమెంటు సభ్యుడిగా అక్బర్‌లోన్‌ ప్రమాణం చేస్తున్నప్పుడే ఆయన ఈ విధేయతను ప్రకటించాడు కదా? అన్నది అటుంచితే, సుప్రీంకోర్టు నిర్ణయం పలు ప్రశ్నలకు తావిచ్చింది. ఒక రాజ్యాంగబద్ధమైన హక్కుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన వ్యక్తి ఇలా విధేయతను చాటుకోవాలని రాజ్యాంగం చెబుతున్నదా? అన్నది న్యాయనిపుణుల ప్రశ్న. ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అన్నంత మాత్రాన సదరు వ్యక్తి ఈ దేశ రాజ్యాంగానికి, సార్వభౌమత్వానికి, సమగ్రతకు వ్యతిరేకి అని భావించాల్సిందేనా?, ఇలా రాజ్యాంగానికి విధేయత ప్రకటించిన వారు పాకిస్థాన్‌ అనుకూల వ్యాఖ్యలు చేయకూడదా? అతడు పాకిస్థాన్‌ అనుకూలుడు కాదని ఈ పత్రంతో తేలిపోయినట్టేనా? ఇతరదేశాలకు జైకొట్టినవారు కూడా ఇకపై ప్రమాణపత్రాలు దాఖలు చేయవలసి ఉంటుందా? ఇత్యాది ప్రశ్నలు అనేకం ముందుకు వస్తున్నాయి.

రాజ్యాంగంమీద విశ్వాసంతో నిమిత్తం లేకుండా, పౌరులందరికీ సుప్రీంకోర్టును ఆశ్రయించే, న్యాయం పొందే హక్కు ఉంటుందని, ఇప్పుడున్న రాజ్యాంగం పనికిరానిదని, దానిని సమూలంగా మార్చేయాలని అంటున్నవారికి కూడా ఇది వర్తిస్తుందని న్యాయనిపుణులు గుర్తుచేస్తున్నారు. ఆర్టికల్‌ 32 ప్రకారం, అక్బర్‌ లోన్‌ మాత్రమే కాదు, వ్యక్తులుగా తమ హక్కులకు భంగం కలిగినప్పుడు తమ తమ రాజ్యాంగాలకు విధేయులుగా ఉన్న విదేశీయులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును. ప్రభుత్వ పక్ష న్యాయవాదుల ఒత్తిడికి లొంగిపోయినందువల్లనేమో, రాజ్యాంగబద్ధం కాని ఒక నియమాన్ని అమలు చేయడం ద్వారా సుప్రీంకోర్టు విస్తృతమైన న్యాయచర్చకు తావిచ్చింది. 2018లో ముంబై హైకోర్టులో ప్రసంగిస్తూ, తనపట్ల విశ్వాసం లేనివారికి కూడా ఈ దేశ రాజ్యాంగం రక్షణనిస్తుందంటూ దాని ఔన్నత్యాన్ని ప్రశంసించిన చంద్రచూడ్‌ మాటలు ఇప్పుడు చాలామందికి గుర్తుకొస్తున్నాయి.

Updated Date - 2023-09-09T03:41:52+05:30 IST