RK : ఫైనల్‌ స్ర్కిప్ట్‌ ప్రజలదే!

ABN , First Publish Date - 2023-03-26T00:27:59+05:30 IST

‘దేవుడు ఎంత గొప్ప స్ర్కిప్ట్‌ రాశాడు’.. నాలుగేళ్లనాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అండ్‌ కో ఎన్నికల్లో విజయాన్ని ఆస్వాదిస్తూ అన్న మాటలివి. ‘నాటి స్ర్కిప్టును దేవుడు ఇప్పుడు తిరగరాస్తున్నాడు’..

RK : ఫైనల్‌ స్ర్కిప్ట్‌ ప్రజలదే!

‘దేవుడు ఎంత గొప్ప స్ర్కిప్ట్‌ రాశాడు’.. నాలుగేళ్లనాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అండ్‌ కో ఎన్నికల్లో విజయాన్ని ఆస్వాదిస్తూ అన్న మాటలివి. ‘నాటి స్ర్కిప్టును దేవుడు ఇప్పుడు తిరగరాస్తున్నాడు’.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అండ్‌ కో ఇప్పుడు అంటున్న మాట ఇది! జగన్మోహన్‌ రెడ్డి, చంద్రబాబు కోసం స్ర్కిప్టులు రాసేంత తీరిక దేవుడికి ఉందో లేదో తెలియదు గానీ ఎన్నికల్లో జయాపజయాలను ఈ ఇరువురు నాయకులే నిర్ణయించుకుంటున్నది మాత్రం వాస్తవం. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితం కావడానికి చంద్రబాబే కారణం కాగా, ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి మూడు ఎమ్మెల్సీ సీట్లు ఓడిపోవడానికి, తాజాగా సొంత ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌ కారణంగా ఎమ్మెల్యేల కోటా నుంచి మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడానికి జగన్మోహన్‌ రెడ్డే కారణం. ఇందులో దేవుడు ప్రత్యేకంగా చేసిందీ రాసిందీ ఏమీ లేదు. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది ప్రజలే గానీ, పరిస్థితులు తారుమారవడానికి మాత్రం ఆయా పార్టీల నాయకులే కారణం అవుతారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు రాజకీయాన్ని, పార్టీని గాలికి వదిలేశారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారం జరిగిన ప్రచారాన్నీ విస్మరించారు. ప్రత్యర్థి సామర్థ్యాన్ని, ఎత్తుగడలను తక్కువగా అంచనా వేశారు. తన అధికారానికి ఢోకా ఉండదని మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. ‘క్షణం తీరిక లేదు.. దమ్మిడీ ఆదాయం లేదు’ అన్నట్టుగా ఐదేళ్లు గడిపేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తూ పార్టీని పట్టించుకోకపోవడం చంద్రబాబుకు అలవాటే. ఈ కారణంగానే 2004, 2019 ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయారు. ఆయన ఏమరుపాటుతో పాటు ఇతర తప్పిదాల వల్ల పెద్దగా రాజకీయ అనుభవం లేని జగన్మోహన్‌ రెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి కూడా తప్పు మీద తప్పు చేస్తూ పరాజయాలను కోరి తెచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే విధ్వంసకర పాలనకు తెర తీశారు. ప్రత్యర్థులను కేసులలో ఇరికించి వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అభివృద్ధిని విస్మరించి, సంక్షేమం పేరిట డబ్బు పంచుతూ తన అధికారానికి తిరుగుండదని నమ్ముతూ వస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో తనకు తిరుగుండకూడదని, తన మాటకు ఎవరూ ఎదురు చెప్పకూడదని భావిస్తున్నారు. ఫలితంగా అటు ప్రజల్లో, ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలలో అసమ్మతి రాజుకుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పుడు, ‘విద్యావంతులను మేం నమ్మడం లేదు. మా ఓటర్లు వేరే ఉన్నారు’ అని జగన్‌ అండ్‌ కో సర్దిచెప్పుకొన్నారు. నిజానికి ఇది ఆత్మవంచనే అవుతుంది. మూడు రోజుల క్రితం నలుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటం వల్ల ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయినప్పటికీ ‘తగ్గేదేలే...’ అన్నట్టుగా ఆ నలుగురినీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి తన అహాన్ని సంతృప్తిపరచుకున్నారు. తెలుగుదేశం పార్టీ పోటీకి దింపిన పంచుమర్తి అనూరాధ గెలవడానికి అధికార పార్టీ అభ్యర్థి కోలా గురువులు ఓడిపోవడానికి జగన్మోహన్‌ రెడ్డిలో పేరుకుపోయిన అహమే కారణం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు లభించాయి. ఈ సంఖ్యా బలంతో ఆ పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సులువుగా గెలుచుకోగలదు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని విమర్శించిన జగన్మోహన్‌ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీకి చెందిన 23 మందిలో నలుగురిని లాగేసుకున్నారు. జనసేన తరఫున ఎన్నికైన ఏకైక సభ్యుణ్ని కూడా కలిపేసుకున్నారు. దీంతో శాసనసభలో వైసీపీ బలం 156కు పెరిగింది. ఈ కారణంగా మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలనూ కైవసం చేసుకోవచ్చునని జగన్‌రెడ్డి ఆశపడ్డారు. ఇక్కడే జగన్‌రెడ్డి అహంకారం ఎదురు తన్నింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చాలా రోజులుగా తిరుగుబాటు స్వరాన్ని వినిపిస్తున్నారు. వారిద్దరూ పార్టీకి దూరమయ్యారని తెలిశాక జగన్‌ జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. ఆనం, కోటంరెడ్డిని మినహాయించినా ఏడు స్థానాలను గెలుచుకోవడానికి అవసరమైన బలం జగన్‌కు ఉంది. అయితే అధికార గర్వంతో కన్నూ మిన్నూ కానని ఆయన మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇచ్చేది లేదని చాలా రోజుల క్రితమే తేల్చి చెప్పారు. రాజకీయాలలో దూకుడు అన్ని వేళలా పనిచేయదు. మావాడు పులి, సింహం అంటూ వందిమాగధులు చేసే భజనకు మురిసిపోయిన జగన్మోహన్‌ రెడ్డి ఏడాది తర్వాత ఏమి చేయబోతున్నదీ ఇపుడే కొందరు సిట్టింగ్‌లకు చెబుతున్నారు. ప్రజాదరణ కోల్పోయిన సిట్టింగ్‌లను మార్చడం ఏ పార్టీ అయినా చేసే పనే. అయితే ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుందని తెలిసి కూడా మేకపాటి, శ్రీదేవిలకు టికెట్‌ ఇవ్వబోమని ముందే చెప్పడం ఏమిటి? పార్టీ టికెట్‌ లేదని చెప్పినా వారిరువురూ తనకు ఎదురుతిరగరని భావించడం జగన్‌లో మూర్తీభవించిన అహంకారానికి నిదర్శనం. నలుగురు ఎమ్మెల్యేలు తన చేయి దాటిపోయారని తెలిసి కూడా ఏడో స్థానానికి అభ్యర్థిని పోటీకి పెట్టడం జగన్మోహన్‌ రెడ్డి చేసిన తప్పు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారని అంచనా వేయకపోవడం అతి పెద్ద తప్పు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ను తక్కువగా అంచనా వేసుకున్నట్టుగానే, ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి కూడా చంద్రబాబును తక్కువగా అంచనా వేశారు. చంద్రబాబు ఇప్పుడు దెబ్బతిన్న పులి. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. శాసనసభ సాక్షిగా తన అర్ధాంగిని అవమానించినా ఆ అవమానాన్ని దిగమింగుకొని, వేట కోసం, సరైన అదను కోసం కాచుకొని ఉండే పులిలా ఈ ఎన్నికల సందర్భంగా తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. జగన్‌కు దూరమైన నలుగురు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొన్నారు. ఇది నైతికమా? అనైతికమా? అన్నది అప్రస్తుతం. రాజకీయాలలో ఇప్పుడు నైతికతకు తావున్నదా? తెలుగుదేశం పార్టీకి 19 మంది శాసనసభ్యులు ఉండగా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎలా పోటీకి పెడతారని సజ్జల రామకృష్ణారెడ్డి గడుసుగా ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం బలం 23 నుంచి 19కి ఎలా తగ్గిందో ఆయన ముందుగా చెప్పాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు వైసీపీ నాయకులు అంతర్మథనం చెందుతున్నారు.

అసలైన పెత్తందారు..!

పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి మూడు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ స్వీప్‌ చేయడానికి కూడా జగన్‌ రెడ్డే బాధ్యులు. పెద్దగా అంచనాలు లేకుండానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీకి దిగారు. అయినా భారీ మెజారిటీలతో వాళ్లు గెలిచారు. తిరుపతిలాంటి చోట చదువుకోని వారిని కూడా పట్టభద్రులుగా చూపించి వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయించుకున్నప్పటికీ కనీసం మెజారిటీని కూడా తగ్గించలేకపోయారు. విశాఖను రాజధానిని చేస్తామని ఊరిస్తున్నప్పటికీ ఉత్తరాంధ్ర పట్టభద్రులు కర్రు కాల్చి వాత పెట్టారు. అయినా జరగని విషయాలు చెప్పి ప్రజలను మోసం చెయ్యలేమని జగన్‌ అండ్‌ కో మాత్రం గ్రహించడం లేదు. నిజానికి పట్టభద్రుల నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇందుకు భిన్నంగా పట్టభద్రులు ఓటింగ్‌కు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీన్నిబట్టి ప్రభుత్వంపైన వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘మా ఓటర్లు వేరు’ అని సజ్జల వంటివారు సమర్థించుకొనే ప్రయత్నం చేయవచ్చు గానీ, ఆ ఓటర్ల కుటుంబాలలో కూడా పట్టభద్రులు ఉంటారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. పెత్తందార్లపై తాను పోరాటం చేస్తున్నానని చెప్పుకొంటున్న జగన్మోహన్‌ రెడ్డి అసలైన పెత్తందారు తానే అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఒక వర్గాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని పాలించే ఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఎక్కువ కాలం మనలేదు. నలుగురు మెచ్చేలా పాలన ఉండాలి. నా చుట్టూ ఉన్న నలుగురూ భజన చేస్తున్నారు కదా? నీలి మీడియా, కూలి మీడియా రాతలు, కూతలూ సొంపుగా ఉంటున్నాయి కదా? అని జగన్మోహన్‌ రెడ్డి మురిసిపోతూండవచ్చు. తన అధికార సౌధం ఎందుకు బీటలువారుతున్నదో గుర్తించడానికి నిరాకరించడం జగన్‌ మూర్ఖత్వమే అవుతుంది. ప్రభుత్వంపై ప్రజల్లో ‘ఫీల్‌ గుడ్‌’ భావన ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా మళ్లీ అధికారంలోకి రాగలదు. 2004 ఎన్నికలకు ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మార్మోగడం శ్రవణానందకరంగా అనిపించి రాష్ట్ర ప్రజలు తనకు దూరం అవుతున్నారన్న విషయాన్ని చంద్రబాబు విస్మరించారు. ఫలితంగా 2004లో ఆయన ఓడిపోయారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పాలకుడిగా చంద్రబాబుకు ఇప్పటికీ మంచి పేరు ఉంది. అయితే పార్టీ వ్యవహారాలను, రాజకీయాన్ని గాలికొదిలేసిన ప్రతి సందర్భంలో ఆయన ఓడిపోయారు. నేల విడిచి సాము చేయడం మంచిది కాదని ఇప్పటికైనా గుర్తించారో లేదో తెలియదు. 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎలక్షనీరింగ్‌ను గమనించిన వైసీపీకి చెందిన ముఖ్యులు జోకులు వేసుకున్నారు. ‘చంద్రబాబుతో ఎన్నికల్లో తలపడటం ఆషామాషీ కాదని అనుకున్నాం..ఓస్‌ ఇంతేనా!’ అని 2019 ఎన్నికలు చూశాక మాకు అనిపించింది అని వైసీపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి అధికారానికి తిరుగుండదని, ఆయనకు ఎవరూ ఎదురు నిలవలేరని జరుగుతున్న ప్రచారంలో డొల్లతనమే ఉంది.

మారకుంటే అంతే..

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీలో నైరాశ్యం, ప్రతిపక్ష పార్టీలో ఉత్తేజం నెలకొన్న మాట వాస్తవం. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. తప్పులు సరిదిద్దుకోవడానికి జగన్‌రెడ్డికి ఇప్పటికీ అవకాశం ఉంది. గత అనుభవాలను గమనిస్తే పరిస్థితి చేయి దాటిపోయిందని అనిపిస్తోంది. అయితే రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు. విజ్ఞత ఉంటే జగన్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తాను ఏం తప్పులు చేశానో తెలుసుకొని వాటిని సరిదిద్దుకొనే పనికి ఉపక్రమించాలి. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రజాస్వామ్యానికి ఊపిరి పోయాలి. అయితే జగన్‌ నైజం తెలిసినవారు అదంతా జరిగే పని కాదంటున్నారు. చంద్రబాబు నాయుడికి అవినీతి మరక అంటించడానికి ఆయన ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. న్యాయ సమీక్షకు నిలబడని అంశాలు తీసుకొని హడావుడి చేయిస్తున్నారు. అయినా అవినీతిని ఇప్పుడు ప్రజలు కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇది జగన్‌కు స్వీయానుభవమే కదా! ఆయనపై పలు అవినీతి కేసులు నమోదైనప్పటికీ ప్రజలు ఆయనకు పట్టం కట్టలేదా? దుష్టచతుష్టయం, ఎల్లో మీడియా అంటూ పెడబొబ్బలు పెట్టడం ఆపి తన తండ్రి రాజశేఖర రెడ్డి పాలనతో పోల్చుకోవడానికి జగన్మోహన్‌ రెడ్డి ప్రయత్నించడం మంచిది. నీలి మీడియా, కూలి మీడియా, పేటీఎం బ్యాచ్‌ల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చలేమని గమనించాలి. అనేక న్యూస్‌ చానళ్లు జగన్‌కు ఊడిగం చేస్తున్నాయి. వీరికి తోడు కూలి కోసం పనిచేస్తున్న రాతగాళ్లు, కూతగాళ్లు ఉండనే ఉన్నారు. అయినా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూనే ఉంది కదా? అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టకుండా ఈ నాలుగేళ్లలో చేసిన తప్పులు, విధ్వంసాలను సరిచేసుకోవడానికి జగన్‌ అండ్‌ కో ప్రయత్నిస్తే వారికే మంచిది. అదే సమయంలో ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ కూడా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చాయని అహం పెంచుకొని అత్యుత్సాహం ప్రదర్శించకూడదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తారు. తెలుగుదేశం నాయకులు మాత్రం స్వల్ప విజయాలకే పొంగిపోతారు. ఓటమి ఎదురైతే అదే స్థాయిలో కుంగిపోతారు. ఈ నాలుగేళ్లలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న ఆటుపోటులే ఇందుకు నిదర్శనం. 2019కి ముందు అధికారం అనుభవించిన పలువురు మంత్రులు, నాయకులు.. ఓటమి తర్వాత కలుగుల్లో దూరిపోయారు. ఫలానా వాళ్లు పార్టీలో ఉన్నారా? లేరా? అంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారుతున్నది అని గ్రహించి చంద్రబాబు చుట్టూ చేరిపోతున్నారు. చంద్రబాబు అనుసరించిన రాజకీయాల వల్ల నిబద్ధత ఉన్న వాళ్ల కోసం ఆ పార్టీలో కాగడా వేసి వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటానికి చంద్రబాబే కారణం. ఎన్నికల సందర్భంగా తరచుగా అభ్యర్థులను మార్చడం వల్ల పరస్పర అపనమ్మకాలు చోటుచేసుకుంటున్నాయి. రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రతిసారీ కొత్త అభ్యర్థులను పోటీకి పెట్టడం వల్ల ఆయా వర్గాల నుంచి నాయకులు ఎదగడం లేదు. మొహమాటాలను పక్కన పెట్టి, కాకారాయుళ్లను, ఆషాఢభూతులను చంద్రబాబు వదిలించుకోవాలి. పార్టీ పునర్నిర్మాణానికి ఈ ఎన్నికలు చంద్రబాబుకు చక్కని అవకాశమని చెప్పవచ్చు. పార్టీ పునాదులను ఇప్పుడు పటిష్ఠం చేయకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి దినదిన గండం నూరేళ్లాయుష్షు అన్నట్టుగానే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీని నమ్ముకొని, అంటిపెట్టుకొని అష్టకష్టాలు పడ్డవారిని చంద్రబాబు విస్మరించకూడదు. గడచిన కొన్ని రోజులుగా పార్టీ నాయకులు కొందరి ప్రకటనలు, వ్యాఖ్యలు గమనిస్తే అధికారంలోకి వచ్చేశామన్న అతి విశ్వాసం కనిపిస్తోంది. ఇలాంటి ప్రగల్భాలను ప్రజలు హర్షించరు. వైసీపీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు కొందరు అడ్డూ అదుపూ లేకుండా నోరు పారేసుకోవడం కూడా జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడటానికి ఒక కారణం అని గుర్తించాలి. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చినంత మాత్రాన అంతా అయిపోలేదు. అసలైన పోరాటం ముందుంది. జగన్‌ వద్ద అధికార, ధన బలం పుష్కలంగా ఉంది. ఎన్నికల సందర్భంగా జగన్‌రెడ్డి ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడతారో స్వానుభవం ఉన్నందున పార్టీ యంత్రాంగాన్ని అందుకు దీటుగా తీర్చిదిద్దడంపై చంద్రబాబు దృష్టి పెట్టాలి. ఎవరి స్ర్కిప్టునూ దేవుడు రాయడు. రాజకీయాలలో మీ తలరాతను మీరే రాసుకుంటారు. మీ చర్యలు, మీ విధానాలను బట్టి మిమ్మల్ని అందలం ఎక్కించాలా? లేదా? అన్నది ప్రజలు నిర్ణయిస్తారు.

అంతా కలిస్తేనే..

ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూకుడు విషయానికి వద్దాం. పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిందో లేదో ఆయనను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించేశారు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ఇంత అసహనం అవసరమా? రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించడంలో నరేంద్ర మోదీకి ప్రమేయం ఉందో లేదో తెలియదు గానీ, కేంద్ర ప్రభుత్వ పనితీరును గమనిస్తున్న వారికి మాత్రం ఆయనకు తెలియదంటే నమ్మే పరిస్థితి లేదు. ప్రధానికి తెలియకుండా కేంద్రంలో చీమ చిటుక్కుమనదని అంటారు. రాహుల్‌ గాంధీ చట్టానికి అతీతుడు కాదన్నది కూడా వాస్తవమే. అయితే అనేక అవినీతి ఆరోపణలు, క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారు దర్జాగా అధికారం వొలకబోస్తున్న తరుణంలో ఒక పరువు నష్టం కేసులో అసాధారణ రీతిలో రెండేళ్ల జైలు శిక్ష విధించడమే సందేహాలకు తావిస్తున్నది. జగన్మోహన్‌ రెడ్డి కేసుల విషయంలో పుష్కరం దాటినా విచారణ ప్రారంభం కాలేదు. అలాంటిది రాహుల్‌ గాంధీపై పరువునష్టం కేసులో నాలుగేళ్లలోనే విచారణ పూర్తయి శిక్ష పడింది. శిక్షా కాలాన్ని రెండేళ్ల కంటే తక్కువగా నిర్ణయిస్తే పిటిషనర్‌ లక్ష్యం నెరవేరకపోవచ్చునని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. ఏదేమైనా రాహుల్‌ గాంధీని హడావుడిగా అనర్హుడిగా ప్రకటించడాన్ని మెజారిటీ ప్రజలు హర్షించలేకపోతున్నారు. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు అంత తీవ్రమైనవి కావన్న భావన కూడా ఉంది. రాజకీయ నాయకులు ఇంతకంటే దారుణమైన దూషణలకు పాల్పడటాన్ని చూస్తున్నాం. అయితే ఈ పరిణామం వల్ల ఇకపై రాజకీయ నాయకుల నోళ్లకు తాళం పడుతుందన్నది పాజిటివ్‌ పాయింట్‌. కాకపోతే రాహుల్‌ విషయంలో శిక్ష పడినంత వేగంగా మిగతా వారి విషయంలో జరగడం లేదే? అధికారంలో ఉన్న వాళ్లు వ్యవస్థలు అన్నింటినీ చెరబడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికే ఏర్పడింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదే పరిస్థితి! కేంద్రంలో మోదీ వద్ద అధికారాలు అన్నీ కేంద్రీకృతం అయినట్టుగానే తెలుగు రాష్ర్టాల్లో కూడా ముఖ్యమంత్రుల వద్దే అధికారాలు కేంద్రీకృతమయ్యాయి. ఫలితంగా నియంతృత్వ పోకడలు కరాళనృత్యం చేస్తున్నాయి. నియంతృత్వ ధోరణులు ఎంతోకాలం మనజాలవు. ఇప్పుడు రాహుల్‌ గాంధీని పార్లమెంటులో అడుగుపెట్టనివ్వకుండా చేస్తే చేయవచ్చును గానీ ఇది ఏ పరిణామానికి దారితీస్తుందో చూడాలి. కేంద్రం ప్రస్తుతం ప్రయోగించిన చట్టాన్ని సరళతరం చేయడానికి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురాగా, ఇదే రాహుల్‌ గాంధీ ఆ ఆర్డినెన్స్‌ కాపీని చింపేసి నిరసన తెలిపారు. దీంతో సదరు ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు అదే ఆయనకు శాపమైంది. అయితే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేసినంత మాత్రాన ప్రధాని మోదీకి ఎదురులేకుండా పోదు కదా? ఈ పరిణామం ప్రధాని మోదీకి శాపంగా కూడా మారవచ్చు. కేంద్ర ఏజెన్సీల దూకుడు కారణంగా విలవిల్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు, ప్రాంతీయ పార్టీల అధినేతలు శషభిషలు విడిచిపెట్టి ఏకం కావడానికి ఇదొక అవకాశం. ప్రధాని మోదీని ఎదుర్కోవడం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పక్షాలకు కష్టంగానే ఉంది. ఈ కారణంగా రాహుల్‌ గాంధీకి సంఘీభావం పేరిట అందరూ ఏకతాటిపైకి చేరే అవకాశం లేకపోలేదు. ఇందిరాగాంధీ రాజకీయాలను తట్టుకోవడం కోసం జయప్రకాశ్‌ నారాయణ్‌ నేతృత్వంలో ప్రతిపక్షాలు అన్నీ ఏకమై జనతా పార్టీని ఏర్పాటుచేసి ఎన్నికల్లో ఇందిరను ఓడించాయి. ఇప్పుడు నరేంద్ర మోదీని ఓడించాలన్నా ప్రతిపక్షాలు అన్నీ ఏకం కావాల్సిందే. అయితే ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఏర్పడకుండా ప్రధాని మోదీ విభజించు–పాలించు విధానాన్ని అమలుచేస్తున్నారు. అన్ని రోజులూ మనవి కావన్న సూత్రం ప్రధాని మోదీకి కూడా వర్తిస్తుంది. రాహుల్‌ గాంధీకి మంచివాడన్న పేరుంది. ఇప్పుడు ఆయనను అనర్హుడిగా ప్రకటించి లోక్‌సభ నుంచి పంపేయడం వల్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడవచ్చు. మరో రెండు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ పరిణామం ఆ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. సానుభూతి పనిచేసి కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కాంగ్రెస్‌ బలపడే కొద్దీ ప్రతిపక్షాల ఐక్యతకు అవకాశాలు మెరుగవుతాయి. చూద్దాం.. తన చర్యల ద్వారా ప్రధాని మోదీ ఎప్పటిలాగే ఏ మేరకు ప్రతిపక్షాలను ఏకం చేస్తారో! అన్నట్టు రాహుల్‌ గాంధీ వాడిన భాష అంత తప్పిదమే అయితే, తెలుగు రాష్ర్టాలలో ఎంతమంది నాయకులు సభ్యత్వాలు కోల్పోయి జైలుకు వెళ్లాల్సి ఉంటుందో!

ఆర్కే

Updated Date - 2023-03-26T06:20:31+05:30 IST