Share News

KothaPaluku by RK : కాంగ్రెస్ గెలిస్తే ఆ ఘనత గ్యారెంటీలది కాదు

ABN , First Publish Date - 2023-11-26T01:45:04+05:30 IST

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. పోలింగ్‌కు మరో నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండటం... మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పోలింగ్‌ ముగియడంతో...

KothaPaluku by RK : కాంగ్రెస్ గెలిస్తే ఆ ఘనత గ్యారెంటీలది కాదు

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. పోలింగ్‌కు మరో నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండటం... మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పోలింగ్‌ ముగియడంతో ప్రధాన జాతీయ పార్టీల నాయకులు అందరూ తెలంగాణపైనే దృష్టి సారించారు. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్య నాయకులు తెలంగాణను చుట్టేస్తుండగా... కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావ్‌ హ్యాట్రిక్‌ సాధించడంకోసం చెమటోడ్చుతున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు ఎన్నికల హామీలు కూడా పరాకాష్ఠకు చేరాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యనే ప్రధాన పోటీ ఉందని ప్రచారం జరుగుతున్నందున ఈ రెండు పార్టీలు పోటీ పడి మరీ హామీలు గుప్పిస్తున్నాయి. దీంతో అధికారంలోకి ఎవరొచ్చినా ఈ హామీల భారం తెలంగాణను ఆర్థికంగా కుంగదీయడం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడింది. ఎన్నికల్లో ప్రజలే గెలవాలి కానీ రాజకీయ పార్టీలు కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మధ్య తరచుగా చెబుతున్నారు. అయితే... ప్రజలు గెలిచే పరిస్థితి ఇప్పుడుందా? అంటే లేదనే చెప్పాలి. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొంత మంది అభ్యర్థుల ఖర్చు వంద కోట్లు దాటుతున్నది. కనీసం అరడజను శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వంద కోట్లకంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నారు. ఇదొక అసాధారణ పరిణామం. ఐదేళ్ల ఎమ్మెల్యే పదవి కోసం ఇంత డబ్బు ఖర్చు చేయడం ఏమిటి? పేదరికం ఎక్కువగా ఉండే తెలంగాణలో కొంతమందికి ఇంత ఆర్థిక స్తోమత ఎలా వచ్చింది? తెలంగాణ వంటి రాష్ట్రంలో ఎన్నికలు ఇంత ఖరీదైన వ్యవహారంగా మారడం దేనికి సంకేతం? వంటి ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. అదే సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు... ముఖ్యంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చేసిన హామీల అమలుకు ఏటా లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఒక అంచనా. కళ్లు చెదిరే అభివృద్ధి చేశామని చెప్పుకొనే పాలకులు ఈ విధంగా ప్రజలకు తాయిలాలు పంచుకుంటూ పోవడం సమర్థనీయమా? ఇలా అయితే ఈ హామీలకు అంతెక్కడ? కేసీఆర్‌ కోరుకుంటున్నట్టు ప్రజలు ఎలా గెలుస్తారు? రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాలా తీయించే హక్కు రాజకీయ పార్టీలకు ఎవరిచ్చారు? ఎవరో ముఖ్యమంత్రి పీఠం మీద కుర్చోవడానికి ఇలా అలవికాని హామీలు ఇచ్చుకుంటూ పోవచ్చునా? ఈ ధోరణికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం లేదా? ఈ విషయంలో రాజ్యాంగబద్ధ సంస్థలు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేవు. స్వీయ నియంత్రణ పాటించాల్సిన రాజకీయ నాయకులు ఆ పని చేయరు. మరి ఎలా? మౌలిక సదుపాయాల కల్పనకు డబ్బు లేకపోయినా సంక్షేమం పేరిట ప్రజా ధనాన్ని పప్పూ బెల్లాల్లా పంచడం వల్ల ప్రజల్లో సోమరితనం పెరిగిపోతుండటం నిజం కాదా? ఎన్నికలన్నాక ఏదో ఒక రాజకీయ పార్టీ గెలుస్తుంది. ఆ గెలుపు ఎందుకు? ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతోపాటు రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే అధికారం ఉపయోగపడాలి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు.

మరో హైదరాబాద్‌ కావాలి...

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతున్నదో చూస్తున్నాం. బటన్లు నొక్కుతున్నామని చెప్పుకొంటున్న పాలకులు అభివృద్ధిని, మౌలిక వసతులను గాలికి వదిలేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను చూశాక తెలంగాణ పరిస్థితి కూడా దిగజారబోతోందన్న గుబులు పట్టుకుంది. హైదరాబాద్‌ మహా నగరం ఉన్నందున ఇప్పటివరకు కేసీఆర్‌ ప్రకటించిన పథకాల భారాన్ని ఆ మహా నగర ఆదాయమే భరించింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వంపై పడబోతున్న ఆర్థిక భారాన్ని హైదరాబాద్‌ కూడా తట్టుకోలేదు. దీనికోసం మరో హైదరాబాద్‌ను సృష్టించాలి. తొమ్మిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్‌ అంతటితో సంతృప్తి పడకుండా మరోమారు అధికారంలోకి రావడంకోసం ఆయా వర్గాలకు ‘బంధు’ పేరిట వరాలు ప్రకటిస్తున్నారు. ప్రత్యేక రాష్ర్టాన్ని ఇచ్చి కూడా అధికారం అందుకోలేకపోయామన్న దుగ్ధతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ఆర్థిక భారాన్ని ప్రజలపై వేయడానికి వెనుకాడటంలేదు. ఇక భారతీయ జనతా పార్టీ వరాల జల్లు కురిపించకపోయినా మతం కార్డును నమ్ముకుంటోంది. బీఎస్పీ నాయకుడు ప్రవీణ్‌ కుమార్‌ వంటి వారు చెబుతున్న మాటలు ప్రజల చెవికి ఎక్కే పరిస్థితి లేదు. రాజకీయ పార్టీల వైఖరి పుణ్యమా అని ప్రజలు కూడా ఉచితాలకు అలవాటు పడిపోయారు. కొత్తగా ఏమిస్తారని అడుగుతున్నారు. ఇచ్చేవాడు తన జేబులోంచి తీసి ఇవ్వడు– అది తమ సొమ్మే అన్న స్పృహ ప్రజలకు లేకుండా చేశారు. అధికారంలోకి రావడంకోసం రాజకీయ పార్టీలు ఇంత బాధ్యతా రహితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాయంటే కారణం లేకపోలేదు. రాజకీయాలకు ఇప్పుడు నిర్వచనం మారిపోయింది. అధికారం అంటే బాధ్యత అన్న భావన ఎప్పుడో పోయింది. రాజ్యం వీర భోజ్యం అన్నట్టుగా అధికారంలోకి వచ్చినవాళ్లు విర్రవీగుతున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం– ప్రజలే ప్రభువులు అన్న సోయి లేకుండా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నవారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని నియంతల మాదిరి వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకుంటున్నారు. గతంలో రాజకీయాలు చేసిన వాళ్లు సొంత ఆస్తులు అమ్ముకొనేవారు. ప్రజల నుంచి వచ్చే విరాళాలతో ఎన్నికల్లో పోటీ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న వాళ్లు తమ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును తామే భరిస్తున్నారు. అంత డబ్బు ముఖ్యమంత్రి వద్దకు ఎలా చేరుతోంది? అన్న విషయం ఎవరికీ పట్టడం లేదు. మీరెలాగూ సంపాదించుకుంటున్నారు – మాకేమిస్తారు అని ప్రజలు అడుగుతున్నారు. ఇదో రకమైన క్విడ్‌ ప్రో కో ఒప్పందం వంటిదే ఇది. మంచి చేస్తామంటే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. కనుక తాయిలాల పంపిణీకి అన్ని పార్టీలూ తెరలేపాయి. ప్రస్తుతం రెండు వేలుగా ఉన్న పెన్షన్‌ను ఐదు వేలకు పెంచుతామని ప్రధాన పార్టీలు ప్రకటించాయి. అదేమంటే తమది సంక్షేమ రాజ్యం అని దబాయిస్తున్నారు. 1983లో రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం విప్లవాత్మక సంక్షేమ పథకంగా అందరూ భావించారు. 40 ఏళ్ల తర్వాత అదే కిలో బియ్యాన్ని రూపాయికే ఇవ్వడం సంక్షేమం అని చెప్పగలమా? అంటే, ఈ 40 ఏళ్లలో కిలో బియ్యాన్ని రెండు రూపాయలకు కూడా కొనుక్కోలేనంతగా ప్రజలు దారిద్య్రంలోకి దిగజారిపోయారా? ఇలాంటి పథకాలు కచ్చితంగా బాధ్యతా రాహిత్యమనే చెప్పవచ్చు. ఒక అంచనా ప్రకారం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అందరి ఖర్చూ కలిపితే పదివేల కోట్లు దాటుతోంది. అటు ఎన్నికల ఖర్చుపై నియంత్రణ లేకుండా, ఇటు హామీలపైనా అదుపు లేకుండా విచ్చలవిడితనానికి తెరతీసి ‘ప్రజాస్వామ్యం గెలవాలి–ప్రజలే గెలవాలి’ అనుకోవడం ఆత్మవంచనే అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని, తాము అధికారంలోకి వస్తే ఆయనపై విచారణ జరిపించి శిక్షిస్తామని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు చెబుతున్నారు. కేసీఆర్‌ అవినీతికి పాల్పడి ఉంటే సంబంధిత వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఫలానా పార్టీ అధికారంలోకి వస్తేనే విచారణ జరగడం ఏమిటి? రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితే అప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై ఉండే వారిపై ఇదే కేసీఆర్‌ అవినీతి ఆరోపణలు చేస్తారు. అధికారంలో ఎవరున్నా వారిపై అవినీతి ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల వంతుగా మారిపోయింది. దీంతో ప్రజలు కూడా అవినీతిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. రాజకీయ కక్ష సాధింపు కోసమే అవినీతి కేసులు అస్త్రంగా మారుతున్నాయి. ఈ పరిస్థితి నిజంగా అవినీతికి పాల్పడే వారికి వరంగా మారింది.

ఎంతెంత ఖర్చు...

విచిత్రం ఏమిటంటే, ఎన్నికల్లో పోటీ చేసిన ఎవరిని కదిలించినా ‘ఇలా అయితే రాజకీయాలు చేయలేం. ఈ ఖర్చులేమిటి? ఎమ్మెల్యేగా గెలవడానికి 30–40 కోట్లు ఖర్చు చేయాల్సి రావడం ఏమిటి? అంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలి?’ అని ప్రసూతి వైరాగ్యంతో కూడిన మాటలు అంటూ ఉంటారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్నికల వ్యయం పెరిగిందన్నది నిర్వివాదాంశం. హైదరాబాద్‌ మహానగరం పుణ్యమా అని అటు పాలకులకే కాకుండా ఇటు వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు కూడా డబ్బు చేసుకొనే అవకాశాలు పెరిగాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నికల వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ మించిపోతోంది. హైదరాబాద్‌ చుట్టూ విలువైన ప్రభుత్వ భూములు, వివాదంలో ఉన్న భూములు ఉండటం వల్ల ఎన్నికల ఖర్చుకు వంద కోట్లు అంటే కూడా లెక్క లేకుండా పోయింది. అభివృద్ధి ఉన్న చోట అవినీతి ఉంటుంది. అందుకే తెలంగాణలో అవినీతి ఆరోపణలు వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదు కనుక పాలకుల కన్ను సహజ వనరులపై పడింది. ఇసుక, మద్యం వంటి వ్యాపారాలలో అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. సహజ వనరులను చెరపట్టారు.


గెలుపు సూత్రం ఏమిటి?

ఎన్నికలు జరిగిన ప్రతిసారీ పథకాలు ప్రకటించుకుంటూ పోవడం వల్ల అధికారంలో కొనసాగడమో లేక అధికారంలోకి రావడమో జరిగిపోతుందా? గత అనుభవాలను పరిశీలిస్తే ఇందులో హేతుబద్ధత లేదని స్పష్టమవుతుంది. రాజకీయాలలో ఒకే అస్త్రం మళ్లీ మళ్లీ పనిచేయని మాట వాస్తవమే! కానీ, ప్రజల్లో ఫీల్‌ గుడ్‌ భావన కలిగించకుండా కొత్త పథకాలు ప్రకటించినంత మాత్రాన ఉపయోగం ఉండదు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రకటించారు. అయినా ఫలితం లేకుండా పోయింది కదా? వివిధ అంశాల ఆధారంగా ఎవరిని అధికారంలో కొనసాగించాలి, ఎవరిని అధికారం నుంచి దించాలి అనే విషయమై ప్రజలు నిర్ధారణకు వస్తారు. పథకాలకు ఆశపడి మాత్రమే ప్రజలు నిర్ణయం తీసుకుంటారనడానికి శాస్ర్తీయ ఆధారాలు లేవు. ప్రభుత్వంపై ప్రజల్లో సదభిప్రాయం ఉన్నప్పుడు అలవిగాని హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పొచ్చు. తెలంగాణ విషయమే తీసుకుందాం! ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధితో పాటు సంక్షేమానికీ పెద్దపీట వేశారు. అయినా ఆయన పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది? అంటే కారణం లేకపోలేదు. నిజానికి ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్‌ ఇంతలా ఎదురీదాల్సిన అవసరం లేదు. అయినా ఆయన ఏటికి ఎదురీదుతున్నారంటే అందుకు ఆయన వ్యవహార శైలే ప్రధాన కారణం. ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాస్వామ్యవాదిలా వ్యవహరించి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఉండేది కాదు. కేసీఆర్‌లో నియంత పోకడలు కనిపించడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేని పరిస్థితి. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించరు. ఈ కారణంగానే ఎన్నికల్లో కేసీఆర్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న భావన ఏర్పడటానికి కేసీఆర్‌ మాత్రమే కారణం. అధికారమంతా కేసీఆర్‌ కుటుంబానికే పరిమితమైందన్న భావన విస్తృతంగా వ్యాపించడం వల్లనే కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోగలిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే అందుకు ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కారణం కాబోవు. కేసీఆర్‌పై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేక భావనతో పాటు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా వేసిన తప్పటడుగులు ప్రధాన కారణమని చెప్పవచ్చు. కొంతకాలం క్రితం వరకు బండి సంజయ్‌ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపడింది. బీఆర్‌ఎస్‌కు బీజేపీ మాత్రమే గట్టి పోటీ ఇస్తుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ను ఉన్నపళంగా అధ్యక్ష పదవి నుంచి బీజేపీ కేంద్ర నాయకత్వం తప్పించింది. సంజయ్‌ అధ్యక్షుడిగా కొనసాగితే తాము పార్టీ నుంచి వెళ్లిపోతామని కొంత మంది హెచ్చరించడంతో ఆయనను తప్పించారని చెబుతున్నారు. ఆయనను తొలగించడం పార్టీలో కుదుపునకు దారి తీసింది. సంజయ్‌ను తొలగించకపోతే పార్టీని వీడుతామని బెదిరించిన వాళ్లలో కొందరు ఆయనను తొలగించిన తర్వాత కూడా బీజేపీ నుంచి జారుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో చిక్కుకున్న కవిత వ్యవహారం అటు బీఆర్‌ఎస్‌కూ ఇటు బీజేపీకి కూడా నష్టం చేసింది. కవితను అరెస్టు చేయకపోవడం వల్ల ఈ రెండు పార్టీల మధ్య తెరవెనుక అవగాహన కుదిరిందన్న అభిప్రాయం వ్యాపించింది. లిక్కర్‌ కేసులో కవిత జైలుకు వెళ్లి ఉంటే భారత రాష్ట్ర సమితి పరిస్థితి మెరుగ్గా ఉండేది. అదే సమయంలో ఏపీలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపించడం కూడా తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చాయి. ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజుల వ్యవధి ఉన్నందున పరిస్థితులు ఏ పార్టీకి అనుకూలంగా మారుతాయో చెప్పలేము. కేసీఆర్‌ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటే ఆయనకే మంచిది. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చునుగానీ తెలంగాణలో రాజకీయాలు ప్రక్షాళన జరగాల్సిన అవసరం మాత్రం ఉంది. ఒక చిన్న రాష్ట్రంలో ఎన్నికల వ్యయం ఇంతలా పెరిగిపోవడం సమర్థనీయం కాదు.


ఏపీలో కేసుల రాజ్యం...

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు వద్దాం. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని అధికార వైసీపీ జీర్ణించుకోలేకపోతున్నది. మేం జైల్లోనే ఉంచాలనుకున్న వారికి మీరు బెయిల్‌ ఎలా ఇస్తారు? అన్నట్టుగా జగన్‌ అండ్‌ కో వ్యవహరిస్తోంది. స్కిల్‌ కేసులో 52 రోజులపాటు జైల్లో ఉన్న చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ ఇవ్వగానే సజ్జల రామకృష్ణా రెడ్డి, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి హైకోర్టును ధిక్కరించే విధంగా ప్రకటనలు చేశారు. బెయిల్‌ పొందే హక్కు తమకు మాత్రమే ఉంది, ఇతరులకు లేదన్నట్టుగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయి. చంద్రబాబుకు బెయిల్‌ వచ్చినంత మాత్రాన ఆయన నిర్దోషి అయిపోరని సజ్జల వ్యాఖ్యానించారు. అలా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి కూడా కోర్టు బెయిల్‌ మాత్రమే ఇచ్చింది. అవినీతి కేసులలో ఆయన నిర్దోషి అని క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా బెయిల్‌ మీదనే ఉన్నారన్న విషయాన్ని సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారు విస్మరించి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో తమకు ఇష్టులైన వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్‌ ఇచ్చినప్పుడు ఇలా ఎందుకు అభ్యంతరం చెప్పలేదో? ఇదే కేసులో తమ పార్టీ ఎంపీ అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయాలనుకున్నప్పుడు ఇదే సజ్జల సీబీఐ అధికారులను నిందించారు. దీన్నిబట్టి చూస్తే దర్యాప్తు సంస్థలతో పాటు న్యాయస్థానాలు కూడా తాము చెప్పిన విధంగా మాత్రమే పనిచేయాలని జగన్‌ అండ్‌ కో కోరుకుంటున్నట్టుగా ఉంది. స్కిల్‌ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సీఐడీ అధికారులు కనీసం ఆధారాలు కూడా ఇవ్వలేకపోయారని బెయిలు మంజూరు ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. దీన్నిబట్టి చంద్రబాబును అన్యాయంగా రిమాండ్‌కు పంపారని భావించాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ చంద్రబాబు స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేసుకోకూడదని భావిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లాల్సిందిగా సీఐడీని ఆదేశించారు.

బెయిల్‌పై ఉంటూనే పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ఇతరులకు మాత్రం అటువంటి వెసులుబాటు ఉండకూడదని కోరుకుంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజల్లో తిరగకుండా జైల్లోనే నిర్బంధించాలన్న కుత్సిత బుద్ధితో ఆయనపై కనీసం ఆధారాలు లేకపోయినా వరుస కేసులు పెట్టించారు. స్కిల్‌ కేసులో మనీ ట్రైల్‌ జరిగినట్టుగా ఇంత కాలమైనా సీఐడీ అధికారులు రుజువులు సంపాదించలేక పోయారు. కింది స్థాయి వ్యాపార సంస్థ పన్ను ఎగవేస్తే, దానికీ అప్పటి ముఖ్యమంత్రికీ ముడిపెట్టి కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జగన్‌ ప్రభుత్వానికే సాధ్యం. తాజాగా చంద్రబాబుపై నమోదైన మద్యం కేసునే తీసుకుందాం! ఆ వ్యవహారంలో చంద్రబాబు సంతకం ఎక్కడా లేదు. అయినా ఆయనపై కేసు పెట్టించారు. నిన్నగాక మొన్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు పెట్టించారు. ఈ కేసులో కూడా కనీస ఆధారాలు లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆధారాలు లేకపోయినా రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడమే అజెండాగా జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. ఒక కోర్టు కాకపోయినా ఇంకో కోర్టులోనైనా ఈ ధోరణికి అడ్డుకట్ట పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరో వంద రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోతే తమ పరిస్థితి ఏమిటి? అన్న ఆలోచన లేకుండా జగన్‌రెడ్డి ఈ సమయంలో కూడా ఇలా ఎలా వ్యవహరిస్తున్నారు అని ప్రశ్నించుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వైసీపీ ముఖ్య నేతల వద్ద ఇదే సందేహాన్ని వెలిబుచ్చితే... ‘మా లెక్కలు మాకున్నాయి. ఎన్నికలు సజావుగా జరిగితే కదా! పోలింగ్‌ సిబ్బందిని, పోలీసు సిబ్బందిని కొనేస్తాం. గెలిచేందుకు అవసరమైన ఓట్లను మేమే వేసుకుంటాం. ప్రజలు మమ్మల్ని గెలిపించరని తెలుసు కనుక మా ఏర్పాట్లు మేం చేసుకుంటున్నాం’ అని చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసుకోవడం, దౌర్జన్యాలు చేశారంటే అర్థం చేసుకుంటాం కానీ సాధారణ ఎన్నికల్లో కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో అలాగే చేయాలనుకోవడం జగన్‌ అండ్‌ కో విపరీత మనస్తత్వానికి నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో నిజంగా అదే జరిగితే ప్రజాస్వామ్యం అక్కడితో అంతరించిపోయినట్టే. ప్రజలు అప్రమత్తమై ఇటువంటి కుటిల పన్నాగాలను ఎదిరించి అడ్డుకోని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం పరాకాష్ఠకు చేరుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ లా’ అమలు కావడంలేదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలను కూడా ప్రహసనంగా మార్చితే ఎన్నికల కమిషన్‌ను కూడా రద్దు చేయడం మంచిది. అన్ని వ్యవస్థలనూ డబ్బుతో కొనుగోలు చేసి అధికారంలో కొనసాగాలని జగన్‌ అండ్‌ కో భావిస్తూ ఉండవచ్చునుగానీ, ప్రకృతి ధర్మం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది!

ఆర్కే

Updated Date - 2023-11-26T11:45:45+05:30 IST