జగన్‌పైకి షర్మిల బాణం!

ABN , First Publish Date - 2023-08-13T00:24:02+05:30 IST

‘నాఅక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలనే.., దేశంలో ఎక్కడా లేని స్కీములు అమలు చేస్తున్నాను’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తరచూ చెబుతుంటారు. ఇందులో నిజం ఉందా? లేదా? అన్నది...

జగన్‌పైకి షర్మిల బాణం!

‘నాఅక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలనే.., దేశంలో ఎక్కడా లేని స్కీములు అమలు చేస్తున్నాను’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తరచూ చెబుతుంటారు. ఇందులో నిజం ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే, సంతోషపెడుతున్నట్టు జగన్‌ చెబుతున్న అక్కచెల్లెమ్మల జాబితాలో తోడబుట్టిన చెల్లెలు షర్మిల లేకపోవడం ఆయనలోని కపటత్వానికి నిదర్శనం. ఒకే రక్తం పంచుకు పుట్టిన షర్మిల సంతోషంగా ఉండకూడదా? ప్రభుత్వ సొమ్మును పంచుతూ నా అక్క చెల్లెమ్మలు అని ఆప్యాయతలు కురిపించే జగన్‌, కుటుంబ ఆస్తులను మాత్రం షర్మిలకు పంచడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ఆస్తుల పంపకాల విషయమై అన్నాచెల్లెళ్ల మధ్య మొదలైన విభేదాలు ఇకపై రాజకీయ విభేదాలుగా రూపుదిద్దుకోనున్నాయి. ప్రారంభంలో అన్నతో నేరుగా తలపడటం ఇష్టం లేని షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించి తన అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నం చేశారు. అయినా సోదరుడి నుంచి వేధింపులు పెరగడంతో ఆమె మనసు మార్చుకొని ఇప్పుడు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అడుగు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో రాష్ట్ర విభజన చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌లో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీ అక్కడ ఎలాగైనా పునరుజ్జీవనం పొందాలన్న పట్టుదలతో పావులు కదపడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ దృష్టి షర్మిలపై పడింది. షర్మిలను పార్టీలో చేర్చుకొని ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ వచ్చారు. ప్రియాంక కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించి తమ ప్రతిపాదనలను షర్మిల ముందు పెట్టారు. సోదరుడిని నేరుగా ఢీకొనడానికి తొలుత అంగీకరించని షర్మిల ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలతో మనసు మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్‌ వ్యాపారాలను దెబ్బ తీయడంతోపాటు తెలంగాణలో కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకుండా జగన్‌ అడ్డుపడటాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తనకు కేటాయించిన సెక్యూరిటీని ఉపసంహరించుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించుకోవడంతో షర్మిలలో సహనం నశించి కాంగ్రెస్‌ ప్రతిపాదనను ఆమోదించినట్టు సమాచారం. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమెకు ఇద్దరు గన్‌మెన్‌ను కేటాయించింది. అయితే కొద్ది రోజుల క్రితం ఆమె వద్ద ఉంటున్న గన్‌మెన్‌కు ఉన్నతాధికారులు ఫోన్‌ చేసి ‘మీరు వెనక్కి వచ్చేయాల్సి ఉంటుంది’ అని సూచించారు. గన్‌మెన్‌ను ప్రస్తుతానికి ఉపసంహరించకపోయినప్పటికీ ఈ పరిణామంతో అన్నపై చెల్లికి కోపం నషాళానికి అంటింది. షర్మిలకు గన్‌మెన్‌ను ఉపసంహరించే పక్షంలో తనకు కూడా గన్‌మెన్‌ వద్దని తల్లి విజయమ్మ ప్రభుత్వానికి సందేశం పంపారు. దీంతో ప్రభుత్వం వెనకడుగువేసి గన్‌మెన్‌ ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం షర్మిలతో సంప్రదింపులు ప్రారంభించింది. కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ వ్యూహకర్త కనుగోలు సునీల్‌ ఆమెతో చర్చలు జరిపారు. తాజా సమాచారం ప్రకారం ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని చేపట్టడానికి షర్మిల సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా రానున్న రాజ్యసభ ఎన్నికల్లో షర్మిలకు కర్ణాటక నుంచి సీటు ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించినట్టు తెలిసింది. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పటికీ తెలంగాణ రాజకీయాలకే పరిమితం కావాలని షర్మిల తొలుత భావించారు. అయితే, తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిలకు తెలంగాణలో ఆదరణ ఉండదనీ, షర్మిలను బూచిగా చూపించి తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రాజేయడానికి కేసీఆర్‌ ప్రయత్నించే అవకాశం ఉందనీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పార్టీ అధిష్ఠానం వద్ద బలంగా వాదించారు. దీంతో పరిస్థితులను బట్టి షర్మిల సేవలను తెలంగాణలో వాడుకొనే విషయం నిర్ణయించుకోవచ్చునని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది. కాంగ్రెస్‌లో విలీనమైనప్పటికీ ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల తొలుత భావించారు. పాలేరులో ఒకవేళ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలతో మీకేం సంబంధమన్న ప్రశ్న అక్కడ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పాలేరులో ఓడిపోతే తెలంగాణలో ఓడిపోయి ఆంధ్రకు వచ్చారని హేళన చేసే అవకాశమూ ఉంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం తరఫున షర్మిలకు గట్టిగా సూచించారు. ఈ నేపథ్యంలో గన్‌మెన్‌ వ్యవహారం తెర మీదకు రావడంతో షర్మిల కూడా మరో మార్గం లేక కాంగ్రెస్‌ అధిష్ఠానం సూచనలకు సమ్మతి తెలిపారు.


ఏపీ కాంగ్రెస్‌లో ఇలా...

షర్మిలను పార్టీలో చేర్చుకొని నాయకత్వ బాధ్యతలు అప్పగించే విషయమై ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీలోని జగన్‌ శ్రేయోభిలాషులు ఆమెకు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. షర్మిల రంగప్రవేశం వల్ల జగన్‌కు నష్టం జరిగి, చంద్రబాబుకు మేలు జరుగుతుందని ఈ వర్గం ఆందోళన చెందుతోంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ పట్ల పూర్తి నిబద్ధత కలిగి ఉన్న జేడీ శీలం, చింతామోహన్‌ వంటి మాజీ ఎంపీలు మాత్రం షర్మిలకు నాయకత్వం అప్పగించాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీవం పొందాలంటే జగన్మోహన్‌ రెడ్డి అధికారం కోల్పోవాల్సిందే అన్నది వారి అభిప్రాయం. రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉంటున్న వర్గాలన్నీ జగన్‌ వైపు వెళ్లిపోయాయని, ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకు పోయిందన్నది ఈ వర్గం వాదన. జగన్మోహన్‌ రెడ్డిలో రాజశేఖర రెడ్డిని చూసుకోవడం వల్లనే తమ ఓటర్లు అటువైపు వెళ్లారని, ఇప్పుడు జగన్‌ పాలన పట్ల ఆ వర్గాలు విరక్తితో ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ నాయకత్వం లేక విధిలేని పరిస్థితుల్లో జగన్‌తోనే ఉంటున్నారని కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి ఒకరు విశ్లేషించారు. ఈ పరిస్థితులలో పార్టీ నాయకత్వాన్ని షర్మిలకు అప్పగించాలని అనుకోవడం తెలివైన నిర్ణయమని, ఎన్నికల్లో జగన్‌ ఫెయిలైతే రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిలను పార్టీ సంప్రదాయ ఓటర్లు ఆమోదించే అవకాశముందని ఆయన చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో షర్మిల వల్ల ఉపయోగం పెద్దగా ఉండకపోవచ్చునుగానీ 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను బతికించుకోవచ్చునని ఆ పార్టీ అధిష్ఠానం కూడా అభిప్రాయపడుతోంది. అటు కాంగ్రెస్‌కు, ఇటు షర్మిలకు ఉమ్మడి శత్రువుగా జగన్మోహన్‌ రెడ్డి ఉన్నందున ఉభయ పక్షాల మధ్య అవగాహన కుదిరింది. షర్మిలకు నేరుగా పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడమా? లేక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించడమా? అన్నది కాంగ్రెస్‌ నాయకత్వం ఇంకా తేల్చుకోలేదు. రాష్ట్ర రాజకీయాలలో జగన్‌ బలంగా ఉన్నంత కాలం కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉండదన్నది బహిరంగ రహస్యమే. ఈ కారణంగా 2024లో చంద్రబాబు అధికారంలోకి రావడం తమ పార్టీకి అవసరమేనని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. షర్మిలకు వయసు ఎడ్వాంటేజ్‌ కూడా ఉంది. ఈ కారణంగానే 2029 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ రోడ్‌ మ్యాప్‌ రూపొందించింది. షర్మిల వల్ల కాంగ్రెస్‌కు ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందా? అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేం.

వివేకా హత్యపై వాస్తవాలు జనంలోకి...

వివేకానంద రెడ్డి హత్యకు కారకులైన వారిని జగన్మోహన్‌ రెడ్డి కాపాడుతున్నారన్న అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో బలంగా వ్యాపించింది. ఈ క్రమంలో షర్మిల రంగప్రవేశం చేసి జగన్‌ వల్ల తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని, అవమానాలను వివరిస్తే ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. వివేకానంద రెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను షర్మిల వివరిస్తే దాని ప్రభావం ప్రజలపై ఉంటుంది. ఆమెకు గన్‌మెన్‌ను ఉపసంహరించాలన్న అభిప్రాయానికి జగన్‌ ప్రభుత్వం రావడానికి కారణం లేకపోలేదు. వివేకానంద రెడ్డి హత్యోదంతంలో ఆయన కుమార్తె డాక్టర్‌ సునీత వాదనకు మద్దతుగా షర్మిల ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కారణంగానే తనకు గన్‌మెన్‌ను ఉపసంహరించాలన్న ఆలోచనకు జగన్‌ వచ్చారని షర్మిల కూడా భావిస్తున్నారు. ఇంటి గుట్టు లంకకు చేటు తెచ్చింది అంటారు. అలాగే రాజశేఖర రెడ్డి కుటుంబంలోని అంతఃకలహాలు బయటపడే కొద్దీ జగన్మోహన్‌ రెడ్డి నిజ స్వరూపాన్ని జనం అర్థం చేసుకుంటారు. ఈ పాయింట్‌ ఆధారంగానే షర్మిలను తురుపు ముక్కగా ఉపయోగించుకొని జగన్‌ను దెబ్బ కొట్టాలని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు కొందరిపై నమ్మకం లేనందునే పార్టీ అధిష్ఠానం చొరవ తీసుకొని నేరుగా షర్మిలతో సంప్రదింపులు జరిపింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితే అవినీతి కేసులలో విచారణ వేగవంతమై జగన్‌కు శిక్ష పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితే.. కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చినా ఇప్పటిలా జగన్‌కు మద్దతు లభించదు. కాగా, షర్మిలను రాజశేఖర రెడ్డి అమితంగా ఇష్టపడేవారు. అందుకే ఆమె కుమారుడికి తన తండ్రి రాజారెడ్డి పేరును రాజశేఖర రెడ్డి పెట్టుకున్నారు. ప్రజలకు ఇవన్నీ చెప్పి రాజశేఖర రెడ్డి వారసురాలిగా షర్మిలను ప్రొజెక్ట్‌ చేయాలన్నది కాంగ్రెస్‌ ఆలోచనగా ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీ అండతో సోదరుడు జగన్‌పై కాలు దువ్వడానికి షర్మిల కూడా సమాయత్తం అవుతున్నారు. షర్మిలకు రాజ్యసభ సీటిస్తానని నమ్మించిన జగన్‌ చివరికి మొండిచేయి చూపించడం తెలిసిందే. దీంతో జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయగలిగితేనే తమ కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని షర్మిల నమ్ముతున్నారు. షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కూడా జగన్‌ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రదర్‌ అనిల్‌ను ప్రోత్సహించి క్రైస్తవులను తమ కుటుంబ ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. ఇప్పుడు జగన్‌కు బలమైన మద్దతుదారులుగా ఉన్న క్రైౖస్తవులను తిరిగి కాంగ్రెస్‌ వైపునకు మళ్లించడానికి తన వంతు ప్రయత్నం చేయాలన్న నిర్ణయానికి బ్రదర్‌ అనిల్‌ కూడా వచ్చారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తే జగన్‌ ఓటు బ్యాంకులో 4 నుంచి 5 శాతం వరకు గండి కొట్టవచ్చునన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా ఉన్నది. రానున్న ఎన్నికల్లో జగన్‌ ఖాయంగా అధికారం కోల్పోవడానికి ఇది చాలు. నిజానికి రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే ఆయన కుటుంబంలో కొన్ని దిగ్ర్భాంతికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే వాటి గురించి షర్మిల ఇకపై మాట్లాడతారో లేదో తెలియదు. ఒకవేళ మాట్లాడితే మాత్రం జగన్‌ ప్రజల ముందు దోషిగా నిలబడవలసి వస్తుంది. చూద్దాం, ఏపీ రాజకీయాలలో షర్మిల ఎటువంటి ప్రభావం చూపబోతున్నారో! ఆమె ఆరోపణలు, విమర్శలను జగన్‌ అండ్‌ కో ఎలా ఎదుర్కోబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగానే ఉంటుంది.


నవ్వి పోదురుగాక...

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన కొంతమంది కీలక నాయకుల నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాల గురించి చర్చించుకుందాం. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణల సందర్భంగా చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపైనే దాడి చేయించారని, అలాంటి వ్యక్తికి రక్షణ కల్పించడం అవసరమా? రాక్షసుడికి రక్షణ కల్పించాలా? అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాజాగా ప్రశ్నించారు. చంద్రబాబుకు నేరచరిత్ర ఉందా? లేదా? అన్నది కాసేపు పక్కన పెడదాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా జగన్మోహన్‌ రెడ్డి ఏ అధికారం లేనప్పుడే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ చెంప వాయించిన విషయం గుర్తుచేసుకోవాలి. ఈ విషయమై దివంగత బాలగోపాల్‌తో పాటు, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డిని ప్రశ్నించగా ‘‘మా వాడిలో నక్సలైట్‌ ఉన్నాడు. సక్రమంగా విధులు నిర్వహించని పోలీసులను నక్సలైట్లు దండించినట్టుగానే జగన్‌ కూడా దండించి ఉంటాడు’’ అని ఆయన మురిపెంగా గడసరి సమాధానం ఇచ్చారు. సదరు పోలీసు అధికారి తప్పు చేశాడనే అనుకుందాం. వివేకానంద రెడ్డి ఏం తప్పు చేశారు? తనకోసం కడప ఎంపీ స్థానాన్ని ఖాళీ చేయడానికి అంగీకరించక పోవడంతో వివేకానంద రెడ్డిపై జగన్‌ చేయిచేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎంపీ పదవికి వివేకా రాజీనామా సమర్పించగా, సోనియాగాంధీ పిలిపించుకొని ఆ నిర్ణయాన్ని వాపస్‌ తీసుకోవలసిందిగా వివేకాను ఆదేశించడం నిజం కాదా? ఆ తర్వాత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని ఢిల్లీ పిలిపించుకొని కుమారుడ్ని అదుపులో పెట్టుకోవలసిందిగా మందలించడం నిజం కాదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్‌తో పాటు మరికొందరు అధికారులపై చేయివేసి మరీ దురుసుగా ప్రవర్తించడం నిజం కాదా? ఇలాంటి చరిత్ర ఉన్న జగన్మోహన్‌ రెడ్డి అంగళ్లులో జరిగిన గొడవల్లో పోలీసు గాయపడటం తనను బాధించిందని చెప్పడం నవ్వు తెప్పించకుండా ఉంటుందా? ఇక వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి వదిలిన మరో హాస్య గుళిక విషయానికి వద్దాం! ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతాలు వెలుగు చూస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో ఆయన కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్‌ రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుల్లో ఆయన కూడా ఒకరు. రకరకాల ఐడీలతో ఫోన్లు ఉపయోగించే పరిస్థితి అధికార పార్టీకి చెందిన తమకు ఎందుకు దాపురించిందో విజయసాయి రెడ్డి చెప్పగలరా? అధికార పార్టీ ముఖ్య నాయకులు అంతరంగిక సమావేశాలకు ఫోన్లు కూడా వెంట తీసుకెళ్లలేని పరిస్థితి ఉందంటే ఫోన్‌ ట్యాపింగ్‌ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్న జగన్‌ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారని భావించాలా? ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది మన దేశంలో ఒకప్పుడు తీవ్ర నేరం. ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారన్న ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నాయి. ఈ విషయం అధికారంలో ఉన్న వారితోపాటు అధికారులందరికీ తెలుసు. చివరకు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం ఈ దేశంలో స్వేచ్ఛగా ఫోన్లలో మాట్లాడుకోలేని పరిస్థితి నిజం కాదా? అందుకే అందరూ ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలనుకుంటే ఫోన్లు మార్చి వాడుతున్నారు.


బీఆర్‌ఎస్‌ ‘గల్లీ’ పార్టీయేనా?

ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నోటివెంట వెలువడిన ఆణిముత్యాల విషయానికి వద్దాం! తమది గల్లీ పార్టీ అయితే కాంగ్రెస్‌–బీజేపీలు ఢిల్లీ పార్టీలని కేటీఆర్‌ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు తమది గల్లీ పార్టీ అని కేసీఆర్‌ అండ్‌ కో చెప్పుకొనేవారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను రద్దు చేసి భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా అన్ని రాష్ర్టాలలో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని ప్రకటించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో బీఆర్‌ఎస్‌ కమిటీలు కూడా వేశారు. అలాంటప్పుడు బీఆర్‌ఎస్‌ గల్లీ పార్టీ ఎలా అవుతుంది? పనిలో పనిగా తెలంగాణ ఆత్మగౌరవం గురించి కూడా కేటీఆర్‌ ప్రస్తావించారు. తెలంగాణకు చెందిన కేసీఆర్‌ నాయకత్వాన్ని అంగీకరించి ఆయన కింద పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ర్టాల ప్రజలకు ఆత్మగౌరవం ఉండదా? తమది జాతీయ పార్టీ కాదని, గల్లీ పార్టీ మాత్రమే అని కేటీఆర్‌ చెప్పదలచుకున్నారా? అలా అయితే ప్రగతి భవన్‌ లేదా ఫాం హౌస్‌లో సేదతీరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర రాష్ర్టాలకు చెందిన వారికి, ముఖ్యంగా మహారాష్ట్ర వాళ్లకు బీఆర్‌ఎస్‌ కండువాలు ఎందుకు కప్పుతున్నారు? రాజకీయంగా కష్టం వచ్చినప్పుడల్లా తెలంగాణ ఆత్మగౌరవం పేరిట సెంటిమెంటును రాజేస్తున్న కేసీఆర్‌ కుటుంబం ఇప్పుడు ఆ అవకాశాన్ని వదులుకుంది. అయినా తాము ఏం మాట్లాడినా చెల్లుబాటవుతుందని, ప్రజలు అమాయకంగా నమ్మేస్తారని కొంత మంది నాయకులు భ్రమల్లో బతికేస్తుంటారు. ప్రజల్లో ఇప్పుడు చైతన్యం పెరిగింది. పబ్లిక్‌ మెమరీ షార్ట్‌ అని అంటారు. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియా పుణ్యమా అని నాయకులు గతంలో ఏం మాట్లాడిందీ, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నదీ వెంటవెంటనే సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు ‘అది అసంభవం. తెలివిలేని పని’ అని ఎగతాళి చేసిన కేసీఆర్‌ ఇప్పుడు తెలంగాణలో కూడా ఆర్టీసీని విలీనం చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు? ప్రజలకు మతిమరపు ఉన్నా, గుర్తు చేయడానికి సామాజిక మాధ్యమాలు సిద్ధంగా ఉన్నందున నాయకులూ... ఇకపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త!

ఆర్కే

Updated Date - 2023-08-13T07:30:22+05:30 IST