RK : పాలెగాడి కుతంత్రం!

ABN , First Publish Date - 2023-09-24T02:57:15+05:30 IST

ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ ఉంటే కదా.. అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్‌ మంత్రి జనాంతికంగా ఆ మధ్య వ్యాఖ్యానించారు. ఈ మాటను అప్పుడు ఎవరూ సీరియస్‌గా...

RK : పాలెగాడి కుతంత్రం!

ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ ఉంటే కదా.. అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్‌ మంత్రి జనాంతికంగా ఆ మధ్య వ్యాఖ్యానించారు. ఈ మాటను అప్పుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ కాదు. నాలుగు దశాబ్దాలుగా బలంగా పాతుకుపోయిన పార్టీ. స్వర్గీయ ఎన్టీరామారావు ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీని ప్రకటించారో గానీ ఈ నలభై ఏళ్లలో ఆ పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది. తెలంగాణలో ఆ పార్టీకి ఆదరణ తగ్గుతూ వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు మాత్రం ఎంతో కొంత పదిలంగానే ఉంది. ఈ కారణంగానే తెలంగాణకు చెందిన మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యులు కొంతమంది తెలుగుదేశం అధినేత అక్రమ అరెస్టును పోటీ పడి ఖండిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీ బలపడుతూ వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్‌రెడ్డి మంత్రివర్గంలోని ఆ సీనియర్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలను అప్పుడు ఆషామాషీగా తీసుకున్నారు. అయితే ఆ మాటల్లో నిగూఢార్థం ఉందని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. అక్రమ కేసులలో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్‌ను అరెస్ట్‌ చేసి ఎన్నికల వరకు నిర్బంధిస్తే తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోతుందన్నది జగన్‌ అండ్‌ కో కుట్రగా ఇప్పుడు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కమాండర్‌ను జైలుకే పరిమితం చేస్తే ఏ పార్టీకైనా ఇబ్బందే. ఈ కారణంగానే జగన్‌ అండ్‌ కో ఈ కుట్ర లేదా వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్ట్‌ చేయించడం ద్వారా జగన్‌రెడ్డి తప్పు చేశారని సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడినవారు భావించారు. అయితే పాలెగాడి లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్న జగన్‌రెడ్డి ఆడే రాజకీయ క్రీడ భిన్నంగా ఉంటుంది. ప్రత్యర్థులను అష్టదిగ్బంధనం చేయడం కోసం పాలెగాళ్లు ఎటువంటి ఎత్తుగడలు వేస్తారో జగన్‌ సరిగ్గా అటువంటి ఎత్తుగడలనే వర్తమాన రాజకీయాల్లో పాటిస్తున్నారు. ఫలితమే ఎన్నికలకు ఇంకో ఐదారు మాసాల వ్యవధి మాత్రమే ఉన్న తరుణంలో చంద్రబాబును అరెస్ట్‌ చేయించి, లోకేశ్‌ను కూడా అరెస్ట్‌ చేసి జైలుకు పరిమితం చేసే కుట్రలకు తెర తీశారు. స్కిల్‌ కేసులో ఏమి జరిగింది? ఆ కేసులో బలముందా? లేదా? అన్నది అప్రస్తుతమైంది. చంద్రబాబు అయితే జైలుకు వెళ్లవలసి వచ్చింది కదా? ఇంతకాలంగా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ వచ్చిన జగన్‌ అండ్‌ కో ఇప్పుడు తాను మాత్రం అదే పని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫలితంగానే కాబోలు చంద్రబాబుకు న్యాయస్థానాలలో ఉపశమనం లభించడం లేదన్నది విస్తృతాభిప్రాయంగా ఉంది. చంద్రబాబును రిమాండ్‌కు పంపడం దగ్గర నుంచి క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేయడం వరకు జరిగిన తంతు అనేక ప్రశ్నలను మన ముందు ఉంచుతున్నది. న్యాయస్థానాల ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయో కూడా వైసీపీ సోషల్‌ మీడియాలో ముందుగానే చెప్పేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడిని, అది కూడా 14 సంవత్సరాలు ఉమ్మడి రాష్ర్టానికి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చేసి రికార్డు సొంతం చేసుకోవడంతో పాటు, మరో పదిహేనేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా మరో రికార్డును కూడా దక్కించుకున్న వ్యక్తిని అరెస్టు చేయడం, జైలుకు పంపడం తెలుగునాట ఇదే ప్రథమం! ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగి, కాలం కలిసి వస్తే మరో ఐదు నెలల తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వ్యక్తిని ఇంత సునాయాసంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించవచ్చునని ఎవరూ ఊహించి ఉండరు. అందుకే చంద్రబాబు అరెస్టు జరిగిన తీరు పట్ల రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తంచేశారు. ప్రజలు మాత్రం రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతూనే ఉన్నారు. సున్నితంగా ఆలోచించే వ్యక్తులైతే ప్రజల నిరసనను పట్టించుకుంటారు. కానీ పాలెగాళ్ల ఆలోచనలు వేరుగా ఉంటాయి. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతారు. ఆ తర్వాత జనాలను తమ అదుపులో పెట్టుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్నది అదే. కులం, మతం పేరిట ఓటు బ్యాంకును ముందుగా సృష్టించుకున్న జగన్మోహన్‌ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల పేరిట ప్రజలకు డబ్బు పంచుతూ ఓటు బ్యాంకును విస్తరించుకున్నారు. ఈ కారణంగానే నిరసనలు వ్యక్తంచేస్తున్న వారితో గానీ, ప్రస్తుత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాల అభిప్రాయాలతో గానీ తనకు పోయేది ఏమీ ఉండదని జగన్‌ నిమ్మళంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అసలైన కుట్ర లేదా వ్యూహానికి తెర లేపారు. పోలీసు యంత్రాంగాన్ని, ముఖ్యంగా సీఐడీ విభాగంలో కొందరిని కిరాయి సైనికులుగా మార్చుకున్నారు. ఆ వెంటనే ప్రత్యర్థులపై వేటను మొదలు పెట్టారు. పాలెగాళ్లు కూడా ఇలాగే చేసేవారు. పోలీసులను ముందుగా లోబరుచుకొని ఆ తర్వాత ప్రత్యర్థులకు స్పాట్‌ పెట్టేవారు. ఇప్పుడు జగన్‌ కూడా అదే చేస్తున్నారు. తన ప్రత్యర్థులు ఎవరో ఎక్కడా దాచుకోకుండా జగన్మోహన్‌ రెడ్డి చెబుతూనే ఉన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌తో పాటు రామోజీరావును, నన్నూ ప్రత్యర్థులుగా ఆయన ప్రకటించుకున్నారు. మీడియా రంగంలో ఉన్న నేను, రామోజీరావు ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు కాబోము. అయితే పాలెగాడి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు నేను, రామోజీరావు అండగా ఉంటున్నామన్నది జగన్‌ అభిప్రాయం. అందుకే మమ్మల్ని కూడా హిట్‌ లిస్ట్‌లో చేర్చుకున్నారు. ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు ఇబ్బంది పడాలంటే నాతో పాటు రామోజీరావును దెబ్బతీయాలని అనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ప్రకటనలు ఒక్కటి కూడా ఇవ్వకుండా నన్ను ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నం చేశారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ను అడ్డుపెట్టుకొని రామోజీరావును కట్టడి చేసే ప్రయత్నం మొదలెట్టారు. ఎంత శోధించినా నాపై కేసు పెట్టలేక పోవడంతో ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయాలనుకుంటున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో భౌతికంగా దాడి చేస్తారేమో తెలియదు. రామోజీరావును మాత్రం అరెస్టు చేసి జైలుకు పంపాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంలో తనకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జగన్‌ కోరడం కూడా జరిగింది. అయితే జగన్‌కు సహకరిస్తే రాజకీయంగా తనకు నష్టం జరుగుతుందని భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ అభ్యర్థనను తిరస్కరించారు. మొత్తానికి మమ్మల్ని మేము కాపాడుకోవడానికే పరిమితం కావాలన్నది జగన్‌ అభిమతం. చంద్రబాబును జైలుకు పంపించినందున ఇప్పుడు లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ వంతు వచ్చింది. లోకేశ్‌ను కూడా త్వరలో అరెస్టు చేయవచ్చు. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిత్వ హననానికి ఇదివరకే పాల్పడ్డారు. అయినా ఆయన జంకకుండా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఏ మాత్రం అవకాశం చిక్కినా జనసేనానిని కూడా అరెస్టు చేయడానికి కాచుకొని ఉన్నారు. ఏదేమైనా ఎన్నికల వరకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు బయట తిరగకుండా జైలుకే పరిమితం చేసే అతి భయంకరమైన కుట్రను అమలు చేస్తున్నారు.


మేనేజ్‌మెంట్‌ అంటే ఇదీ!

తనపై చార్జిషీటు కూడా దాఖలైన అవినీతి కేసులు విచారణకు నోచుకోకుండా ఢిలీ పెద్దల వద్ద వినయ విధేయతలు ప్రదర్శిస్తున్న జగన్‌, రాష్ట్రంలో మాత్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. తన ప్రభుత్వ విశృంఖల పోకడలను ఎండగట్టిన న్యాయమూర్తులను బదిలీ చేయించగలిగారు. సోషల్‌ మీడియాను ప్రయోగించి న్యాయ వ్యవస్థను భయభ్రాంతులకు గురిచేశారు. మొత్తానికి న్యాయ వ్యవస్థను కూడా పునరాలోచనలో పడవేయగలిగారు. గత కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం వల్లనే చంద్రబాబుకు రెండు వారాలు దాటినా ఉపశమనం దొరకకుండా పోయింది. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో జగన్మోహన్‌ రెడ్డిని మించిన వారు లేరనడానికి అవినాశ్‌ రెడ్డి ఉదంతమే నిదర్శనం. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేసి తీరుతామని ప్రకటించిన సీబీఐ అధికారులు ఆ పని చేయలేకపోయారంటేనే జగన్‌ శక్తియుక్తులు అర్థం చేసుకోవచ్చు. స్కిల్‌ కేసులో ఆధారాలు సేకరించాల్సి ఉందని చెబుతున్న సీఐడీ అధికారులు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని సునాయాసంగా అరెస్టు చేయగలిగారు. ఆధారాలు ఉండి కూడా సీబీఐ అధికారులు మాత్రం అవినాశ్‌ జోలికి పోలేకపోయారు. న్యాయ వ్యవస్థలో కూడా చంద్రబాబుకు లభించని ఉపశమనం అవినాశ్‌కు లభించింది. అంటే సీబీఐ అధికారుల కంటే రాష్ట్ర సీఐడీ అధికారులు సమర్థులు అని కాదు. ఇక్కడ కర్త, కర్మ, క్రియ జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే. ‘మీ మీద వచ్చినవి ఆరోపణలు మాత్రమే. నేరం ఇంకా రుజువు కాలేదు. రిమాండ్‌ను శిక్షగా భావించకూడదు’ అని ఏసీబీ కోర్టు న్యాయాధికారి నిందితుడైన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. రిమాండ్‌ పేరిట జైలుకు పంపడం శిక్ష కానప్పుడు అవినాశ్‌ రెడ్డి అరెస్టు కాకుండా ఇదే న్యాయ వ్యవస్థ ఎలా రక్షణ కల్పించింది? స్కిల్‌ కేసులో చంద్రబాబుకు కమీషన్లు ముట్టాయని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. అయినా పదిహేను రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నారు. ఇంకెన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు. నిజానికి స్కిల్‌ వ్యవహారాన్ని ముందుగా అవినీతి నిరోధక శాఖతో దర్యాప్తు చేయించారు. చంద్రబాబు గానీ, మరొకరు గానీ తప్పు చేశారని చెప్పడానికి ఆధారాలు లేవని ఏసీబీ స్పష్టంచేసింది. ఆ తర్వాత కేసును విజిలెన్స్‌కు అప్పగించారు. ఆ సంస్థ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. ఇలా అయితే లాభం లేదనుకొని కిరాయి సైనికులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటున్న కొందరు సీఐడీ అధికారులకు అప్పగించారు. అదే సమయంలో జీఎస్టీ అధికారులు కింది స్థాయిలో పన్ను ఎగవేతను గుర్తించారు. దాన్ని అడ్డుపెట్టుకొని సీఐడీ అధికారులు ఏకంగా చంద్రబాబును ఇరికించడానికే స్కెచ్‌ వేసుకున్నారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో భాగంగా స్కిల్‌ కేంద్రాలు తనిఖీ చేయాలని నిబంధనలు పెట్టి తర్వాత దాన్ని ఎందుకు తొలగించారో మాత్రం చెప్పడం లేదు. శిక్షణ కేంద్రాలను భౌతికంగా తనిఖీ చేయకుండానే 371 కోట్ల రూపాయలు తినేశారని ప్రచారం చేస్తున్నారు. కింది స్థాయిలో పన్ను ఎగవేతను గుర్తించిన జీఎస్టీ అధికారులు మిగతా రాష్ర్టాల్లోనూ అదే విధంగా జరిగిందని ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో స్పష్టంచేసినా కేంద్ర సంస్థలు కూడా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు మాత్రమే పాపాల భైరవుడు అని నమ్మించడం ప్రధానం కనుక వివిధ స్థాయిలలో ఆ మేరకు కుట్ర అమలైంది. కేవలం నిధులు విడుదల చేయండి అని చెప్పారన్న కారణంగా చంద్రబాబును ఏకంగా అరెస్టు చేసి జైల్లో పడేశారు. నిధులు విడుదల చేయమన్నారు కనుక ఆ నిధుల దుర్వినియోగానికి కూడా చంద్రబాబుదే బాధ్యత అన్నట్టుగా హైకోర్టు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉంది. అసలేం జరిగిందో తెలియాలంటే నిపుణులతో విచారణ చేయించాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడినందున అప్పటి వరకు చంద్రబాబును జైల్లో పెట్టడం ఎందుకు? అధికారులను ప్రభావితం చేయడానికి ఆయన అధికారంలో లేరు కదా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన ఎక్కడికీ పారిపోరు కదా? అవినీతి కేసులలో విచారణ ఎదుర్కోవలసిన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ కేసులలో సహ నిందితులుగా ఉన్న అధికారులు ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నారు. వారిని ఆయన ప్రభావితం చేస్తారని ఇటు సీబీఐ కానీ, అటు న్యాయస్థానాలు కానీ భావించవు. బెయిల్‌పై ఉన్న ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవిని పూర్తిచేసుకుంటున్నారు. తాడూ బొంగరం లేని స్కిల్‌ కేసులో మాత్రం చంద్రబాబు జైల్లో ఉండాల్సిందే అంటున్నారు. ఇది కదా వ్యవస్థలను మేనేజ్‌ చేయడం అంటే జగన్మోహన్‌ రెడ్డీ!


టీడీపీకి ఆటుపోట్లు అలవాటే!

ఇప్పుడు చంద్రబాబు అరెస్టు ప్రభావం తెలుగుదేశం పార్టీపై పడి జగన్‌ లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అన్న అంశానికి వద్దాం. గతంలో జగన్‌ పదహారు నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు అనేక మంది సహ నిందితులు ఆ జైల్లోనే ఉండేవారు. అప్పుడు ఉప ఎన్నికలు మాత్రమే జరిగాయి. అయినా జగన్‌ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల శోకాలు పెట్టడంతో ప్రజలు కరిగిపోయి ఉప ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీలతో గెలిపించారు. ఇప్పుడు అదే విజయమ్మ, షర్మిలకు దిక్కు లేకుండా పోయిందనుకోండి! అది వేరే విషయం. ఏ ప్రాంతీయ పార్టీకైనా అధినేత అందుబాటులో లేకపోతే ఇబ్బందే. జగన్‌ జైల్లో ఉన్నప్పుడు అనేక మంది సహ నిందితులు కూడా అక్కడే ఉన్నందున ములాఖత్‌ల పేరిట కావాల్సిన వారిని పిలిపించుకొని జైలు నుంచే పార్టీ వ్యవహారాలను నడుపుకోగలిగారు. ఇప్పుడు చంద్రబాబుకు ఈ వెసులుబాటు లేదు. అప్పుడు జగన్‌ జైల్లో ఏం చేస్తున్నారన్నది ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో జగన్‌ పార్టీ వ్యవహారాలను సాఫీగా జైలు నుంచే నడుపుకొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రతి కదలికనూ జగన్‌ ప్రభుత్వం వెయ్యి కళ్లతో పరిశీలిస్తున్నది. ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్న లోకేశ్‌, సుప్రీంకోర్టులోనైనా తండ్రి చంద్రబాబుకు ఉపశమనం పొందడం కోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకోవడానికి అలవాటు పడినవారు ఇప్పుడిప్పుడే లోకేశ్‌ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. అయినా చంద్రబాబుకు ఉన్న డెప్త్‌ లోకేశ్‌కు ఇప్పుడే రాదు కదా! ఫైబర్‌గ్రిడ్‌ లేదా మరో కేసులో లోకేశ్‌ను కూడా అరెస్టు చేస్తారని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. అప్పుడు పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న వస్తోంది. ఎన్నికలకు ముందు తండ్రీ కొడుకులు జైలుకే పరిమితం అయితే పార్టీకి కొంత ఇబ్బంది తప్పదు. ఎన్నికలు అంటే ఎన్నో వ్యవహారాలను చూసుకోవాలి. భువనేశ్వరికి గానీ, బ్రాహ్మణికి గానీ రాజకీయ అనుభవం లేదు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి భువనేశ్వరి, బ్రాహ్మణిని లోకేశ్‌ మానసికంగా సిద్ధం చేస్తున్నారు. తండ్రీ కొడుకులు జైల్లోనే ఉండవలసి వస్తే పార్టీ బాధ్యతలను చేపట్టడానికి బ్రాహ్మణి ఇప్పటికే సిద్ధపడ్డారు. పార్టీ సీనియర్‌ నాయకులతో పాటు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సహకారంతో పార్టీకి నాయకత్వ వెలితి కనపడకుండా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నారు. సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్తకాదు గానీ గతంలో ఇటువంటి పరిస్థితి లేదు. శాసనసభలో తనను అవమానించినందుకు 1989 తర్వాత సభను ఎన్టీఆర్‌ బహిష్కరించినప్పుడు చంద్రబాబు సభలో అన్నీ తానై చూసుకునేవారు. 1989–94 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ బదులు చంద్రబాబు పార్టీ వ్యవహారాలను ఎక్కువగా పర్యవేక్షించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు, రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్‌ సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం నుంచి వలసలు అధికంగా ఉండేవి. అప్పుడు వాటన్నింటినీ తట్టుకొని చంద్రబాబు పార్టీని నిలబెట్టుకోగలిగారు. ఈ కారణంగానే ఇప్పుడు చంద్రబాబును పార్టీకి అందుబాటులో లేకుండా చేసే కుట్రకు తెర తీశారు. స్కిల్‌ వ్యవహారంలో దుర్వినియోగం అయ్యాయంటున్న నిధుల రికవరీ తమకు ముఖ్యం కాదని, ఇందులోని కుట్ర కోణం తమకు ముఖ్యమని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ న్యాయస్థానాలలో చెప్పారు. అక్కడ ఏమి కుట్ర జరిగిందో తెలియదు గానీ చంద్రబాబును తెలుగుదేశం పార్టీకి దూరం చేయడమే అసలైన కుట్ర. ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతానికి చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. ‘ఏ తప్పూ చేయకపోయినా ఈ వయసులో నాకు ఇంత పెద్ద శిక్ష ఏమిటి?’.. అంటూ ఏసీబీ న్యాయాధికారి ముందు శుక్రవారంనాడు చంద్రబాబు ఆక్రోశించడంతో ఈ సానుభూతి మరింత పెరిగింది. అయితే ఎన్నికల నాటికి ఈ సానుభూతి నిలబడదని జగన్‌ అండ్‌ కో భావిస్తున్నది. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిగితే ఇంకో ఐదారు నెలల వ్యవధి ఉంటుంది. అప్పటి వరకు చంద్రబాబును జైలుకే పరిమితం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలా జరిగితే మాత్రం తెలుగుదేశం నాయకులు తొట్రుపాటుకు గురవుతారు. అయితే ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెరిగినప్పుడు నాయకులు జైల్లో ఉన్నప్పటికీ ప్రజలు తాము ఇవ్వాలనుకున్న తీర్పునే ఇస్తారు. ఎమర్జెన్సీ సమయంలో జనతా పార్టీ తరఫున అనేక మంది నాయకులు జైళ్లలో ఉండే భారీ మెజారిటీతో గెలిచిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు లేని లోటును లోకేశ్‌ లేదా బ్రాహ్మణి తీర్చలేక పోవచ్చును గానీ ప్రజానుగ్రహం ఉంటే ఆ లోటు కనబడదు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన ముహూర్త బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. తెలుగుదేశం పార్టీకి ఉనికి లేకుండా చేయాలని గతంలో ప్రయత్నించిన వారు ఉనికిలో లేకుండా పోయారు. ఇప్పుడు పరిస్థితి కొంత వేరైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి శ్రేణులు మాత్రం నిబ్బరంగానే పోరాడుతున్నారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినప్పటికీ, జగన్మోహన్‌ రెడ్డి కుతంత్రాలు ప్రస్తుతానికి ఫలించినప్పటికీ, ఔషధ మొక్క బ్రహ్మ జముడులా తనకు చావు లేదని గతంలో నిరూపించుకున్న తెలుగుదేశం పార్టీ ఇకపై కూడా అదే మొక్కవోని ధైర్యం ప్రదర్శించకుండా ఉంటుందా? ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఉనికే లేకుండా చేయాలనే జగన్‌ కుట్రలు వికటించకపోవు. ప్రతి తెలుగుదేశం కార్యకర్తా తానే నాయకుడిగా సంకల్పం తీసుకొని ఎన్నికల రణక్షేత్రంలోకి ఉరకాలి. తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని రుజువు చేయవలసిన బాధ్యత ఇప్పుడు కార్యకర్తల మీదే ఉంది!

ఆర్కే

Updated Date - 2023-09-24T04:38:35+05:30 IST