Kotha paluku : ఊసరవెల్లి సిగ్గుపడేలా..!

ABN , First Publish Date - 2023-08-27T02:04:01+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మమ్మల్ని అవమానించారు.. ఇది కమ్యూనిస్టుల ఆవేదన! మిమ్మల్ని ఇప్పుడు మోసం చేస్తే మమ్మల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయగానే మోసం చేశారు.. ఇది కాంగ్రెస్‌ పార్టీ ఆక్రోశం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులను సన్నిహితంగా గమనించాను కానీ కేసీఆర్‌ వంటి అధమ స్థాయి రాజకీయ నాయకుడిని చూడలేదు.. ఇది రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌ వ్యాఖ్య!

Kotha paluku : ఊసరవెల్లి సిగ్గుపడేలా..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మమ్మల్ని అవమానించారు.. ఇది కమ్యూనిస్టుల ఆవేదన! మిమ్మల్ని ఇప్పుడు మోసం చేస్తే మమ్మల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయగానే మోసం చేశారు.. ఇది కాంగ్రెస్‌ పార్టీ ఆక్రోశం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులను సన్నిహితంగా గమనించాను కానీ కేసీఆర్‌ వంటి అధమ స్థాయి రాజకీయ నాయకుడిని చూడలేదు.. ఇది రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌ వ్యాఖ్య! ఇక ఎప్పటికప్పుడు అవసరం కోసం బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న నాయకుల బాధ గురించి చెప్పే పనే లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో విశ్వసనీయత కోసం నాయకత్వ పగ్గాలు అప్పగించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను అధికారంలోకి వచ్చిన తరువాత ఎలా ట్రీట్‌ చేస్తున్నారో చూస్తున్నాము. ఒక్కో ఎన్నిక సందర్భంగా ఒక్కో పథకాన్ని ప్రకటించి గండం గట్టెక్కుతూ ప్రజలను కూడా ఎప్పటికప్పుడు మభ్యపెడుతూనే ఉన్నారు.

రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్‌ తమిళిసై జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు కనీసం ప్రొటోకాల్‌ నిబంధనలు కూడా పాటించకుండా అధికారులను కట్టడి చేసిన కేసీఆర్‌, తాజాగా ఆమెకు స్వయంగా స్వాగతం చెప్పారంటే అందులో ఏదో పరమార్థం ఉండకుండా ఉంటుందా? కేసీఆర్‌ రాజకీయ జీవితంలో ఎంతో మందిని వాడుకుని వదిలేశారు. ఈ జాబితాలో ఆలె నరేంద్ర, విజయశాంతి వంటి వాళ్లు ప్రథమ వరుసలో ఉంటారు. పార్టీ వేదికల్లో కేసీఆర్‌ పక్కన చోటు పొందినవాళ్లకు అది తాత్కాలికమని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేది కేసీఆర్‌ విధానం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కమ్యూనిస్టులను దూరం పెట్టిన కేసీఆర్‌, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వారి మద్దతు అవసరమని గుర్తించి ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. కరెన్సీ కట్టలు కూడా సరఫరా చేశారని ప్రచారం జరిగింది. మునుగోడులో పోలింగ్‌ జరిగే వరకూ కమ్యూనిస్టులను పక్కనపెట్టుకుని తిరిగారు.

ఆ తరువాత కొద్దిరోజులపాటు సాధారణ ఎన్నికలలో కూడా కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని నమ్మబలికారు. పొత్తులో భాగంగా చెరో రెండు సీట్లయినా దక్కకపోతాయా అని కమ్యూనిస్టులు కూడా ఆశపడ్డారు. సీన్‌ కట్‌ చేస్తే, ఎన్నో సందర్భాలలో ఎంతోమందికి జరిగినట్టుగానే కమ్యూనిస్టులకు ఇప్పుడు మొండిచేయి చూపించారు. భారతీయ జనతా పార్టీని ఓడించడానికే తాము పుట్టామని భ్రమలో బతికే కమ్యూనిస్టులు.. మునుగోడు సందర్భంగా కేసీఆర్‌ వలలో చిక్కారు. అప్పట్లో బీజేపీపై ఒంటికాలిపై లేచిన కేసీఆర్‌, ఆ తరువాత మెత్తబడిపోయారు. కేసీఆర్‌ మాటలను సీరియస్‌గా తీసుకున్న కమ్యూనిస్టులు ఇంకేముంది తెలంగాణలో బీజేపీని బొందపెడతామని నమ్మారు. ఇప్పుడు సాధారణ ఎన్నికలలో కమ్యూనిస్టులను వదిలించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన కేసీఆర్‌, అందుకు ఒక సాకును ఎంచుకున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు కూడా భాగస్వాములు. దీన్నో అవకాశంగా మలుచుకున్న కేసీఆర్‌, ‘‘మేం ఎన్డీఏ, ఇండియా కూటములకు దూరంగా, తటస్థంగా ఉన్నాం.

మీరు కాంగ్రెస్‌తో కూడిన ఇండియా కూటమిలో చేరారు. కనుక మీతో పొసగదు’’ అని కమ్యూనిస్టులకు కబురు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఇంటికి పంపేవరకూ తాను విశ్రమించనని శపథం చేసిన కేసీఆర్‌ను కమ్యూనిస్టులు గుడ్డిగా నమ్మి ఇప్పుడు భంగపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ కడతానని చెప్పి శరద్‌ పవార్‌ వంటి నాయకులను ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ కలిశారు. ఇదంతా చూసి బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ నిజాయితీగా పోరాటం చేస్తున్నారని కమ్యూనిస్టులు సర్టిఫికెట్‌ ఇచ్చేశారు. ఇంతలోనే కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకున్నారు. ఇండియా కూటమిలో చేరారు కనుక మీతో పొత్తు కుదరదు అని కమ్యూనిస్టులకు తెగేసి చెప్పారు. ఈ పరిణామాన్ని కమ్యూనిస్టులు అవమానంగా భావిస్తున్నారు. నిజానికి కేసీఆర్‌ నైజం తెలుసుకోకపోవడం కమ్యూనిస్టుల తప్పు. తెలంగాణలో కమ్యూనిస్టులు బలహీనపడుతూ వచ్చిన మాట కూడా వాస్తవమే. చంద్రబాబునాయుడు, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కొంతమంది కమ్యూనిస్టు నాయకులు అధికారంతో అంటకాగారు. అప్పటి నుంచి కమ్యూనిస్టుల పతనం ప్రారంభమైంది. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే స్వభావాన్ని కోల్పోతూ వచ్చారు. బూర్జువా పార్టీలలో వలె కమ్యూనిస్టు పార్టీలలో కూడా కొందరు తమ జీవన విధానాన్ని మార్చుకున్నారు. అదే సమయంలో ప్రపంచీకరణ కారణంగా వచ్చిన మార్పులతో కమ్యూనిజానికి ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలో అవసరం తీరిన తర్వాత మహామహులనే వదిలించుకున్న కేసీఆర్‌, కమ్యూనిస్టులను వదిలించుకోవడం కష్టమేమీ కాదు కదా!

ఈ పరిస్థితులలో కేసీఆర్‌ తమను మోసం చేశారని కమ్యూనిస్టులు వగచి ప్రయోజనం లేదు. తెలంగాణలో అనేక మంది బాటలోనే కమ్యూనిస్టులు కూడా కేసీఆర్‌ మాయలో చిక్కుకున్నారు. మునుగోడులో పది వేలకు పైగా ఓట్లు ఉన్నందున అప్పుడు కమ్యూనిస్టుల అవసరం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పది వేల మెజారిటీతోనే విజయం సాధించడం గమనార్హం. సాధారణ ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ నుంచి అదే ఆదరణ లభిస్తుందని నమ్మడం కమ్యూనిస్టుల అవివేకం. పైగా ఇప్పుడు బీజేపీతో నిగూఢ బంధం ఏర్పడింది కనుక కేసీఆర్‌ సహజంగానే కమ్యూనిస్టులను వదిలించుకుంటారు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్‌ పార్టీ అయినా ఆదరించక పోతుందా అని కమ్యూనిస్టులు ఎదురుచూస్తున్నట్టు భోగట్టా!


..బంచ్‌ ఆఫ్‌ ఫూల్స్‌!

చాలా రోజుల నుంచి రాజ్‌భవన్‌లో జరిగే ఏ కార్యక్రమానికి కూడా హాజరు కాని కేసీఆర్‌, శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా అతిథి మర్యాదలు చేశారు. కేసీఆర్‌ వైఖరిలో వచ్చే మార్పులను చూస్తే ఊసరవెల్లి కూడా ఆశ్చర్యపోతుందేమో. అవసరం పడినప్పుడు బొంత పురుగునైనా ముద్దాడే కేసీఆర్‌, అవసరం లేకపోతే గవర్నర్‌ అయినా గడ్డిపోచ విలువ కూడా ఇవ్వరు. మోసపోయేవాడు ఉంటే మోసగించేవాళ్లు ఉంటారు. కేసీఆర్‌ చేతిలోనే ఇంతమంది ఇన్ని సందర్భాలలో మోసపోతున్నారంటే అది ఆయన గొప్పతనం కాదు, అవతలి పక్షం వారి బలహీనత. కేసీఆర్‌ నైజం తెలుసుకోకుండా ఆయనకు ఉపయోగపడ్డారు. కమ్యూనిస్టులు మాత్రమే కాదు– కాంగ్రెస్‌ పార్టీ కూడా కేసీఆర్‌ చేతిలో మోసానికి గురైంది. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తానని అప్పట్లో కేసీఆర్‌ నమ్మబలికారు.

ఆ మాటలను నమ్మిన కాంగ్రెస్‌ నాయకత్వం తెలంగాణను ఏర్పాటు చేసింది. అంతే.. అంతా తూచ్‌ అని కేసీఆర్‌ అనేశారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం కంగుతిన్నది. 2014 ఎన్నికల ప్రచారం ముగుస్తున్న దశలో తెలంగాణ బిల్లు రూపకర్తలలో ఒకరైన జైరాం రమేశ్‌ నన్ను కలిశారు. కాంగ్రెస్‌ విజయావకాశాల గురించి ప్రస్తావించగా, కాంగ్రెస్‌ ఓటమి తథ్యమని నేను చెప్పాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఎందుకు ఓడిస్తారు అని జైరాం రమేశ్‌ ప్రశ్నించగా, ‘కాంగ్రెస్‌ అధిష్ఠానం అంటే బంచ్‌ ఆఫ్‌ ఇంటలెక్చువల్స్‌ అనుకునేవాళ్లం. తెలంగాణ ఏర్పాటు తీరు చూసిన తర్వాత బంచ్‌ ఆఫ్‌ ఫూల్స్‌ అనే అభిప్రాయానికి నాబోటి వాళ్లం వచ్చాం’ అని నేను అన్నాను. ఈ మాటలకు నొచ్చుకున్న ఆయన అలా ఎందుకు అనుకుంటున్నారు అని అడిగారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి కూడా పొందాలనుకుంటే కాంగ్రెస్‌ నాయకులను ముందు పెట్టి పోరాటం చేయాల్సిందిగా సూచించాల్సింది. ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతోందని ప్రజల్లో నమ్మకం ఏర్పడ్డాక తెలంగాణ ఇచ్చి ఉంటే మీరు తెలివిగా ఆలోచించారని నమ్మేవాళ్లం. ఇప్పుడు ప్రజల దృష్టిలో కేసీఆర్‌ మాత్రమే తెలంగాణ సాధించారన్న అభిప్రాయం బలంగా ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఎలా గెలుస్తుంది అని నేను వివరించాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో కోలుకోలేదు.

ఇంతటి అధమ స్థాయా?

ఇప్పుడు శరద్‌ పవార్‌ వ్యాఖ్యల విషయానికి వద్దాం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా శరద్‌ పవార్‌ను వాడుకున్న కేసీఆర్‌, ఆ మధ్య కూడా మహారాష్ట్ర వెళ్లి మరీ ఆయనను కలిశారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ పార్టీకి చెందిన నాయకులను కూడా డబ్బులిచ్చి ఆకర్షించే పనిలో కేసీఆర్‌ బిజీగా ఉన్నారు. ఎన్సీపీకి చెందిన ఒక మున్సిపల్‌ చైర్మన్‌కు పది కోట్ల రూపాయలు ఇచ్చి మరీ బీఆర్‌ఎస్‌ కండువా కప్పారు. ఈ విషయాన్ని శరద్‌ పవార్‌ తన మిత్రుడి వద్ద చెబుతూ, ‘కేసీఆర్‌ వంటి అధమ స్థాయి నాయకుడిని నా రాజకీయ జీవితంలో చూడలేదు’ అని వ్యాఖ్యానించారు.

2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్‌ ఇతర పార్టీలకు చెందిన ఎంతో మందిని తన పార్టీలో చేర్చుకున్నారు. వారిలో కొందరిని అవసరం తీరాక పక్కన పెట్టేశారు. ఉదాహరణకు మోత్కుపల్లి నర్సింహులు విషయమే తీసుకుందాం. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్‌ను ఓడించడం కోసం మాదిగల మద్దతు అవసరం పడి బీజేపీలో ఉన్న మోత్కుపల్లిని తన పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్‌ కోసం తీసుకువచ్చిన దళితబంధు పథకానికి ప్రచారకర్తగా మోత్కుపల్లిని కేసీఆర్‌ వాడుకున్నారు. ఉప ఎన్నిక ముగిసే వరకు ఆయనను పక్కన కూర్చోబెట్టుకొనేవారు. యాదాద్రి వెళ్లినప్పుడు కూడా మోత్కుపల్లిని పక్కనే కూర్చోబెట్టుకున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసింది. మోత్కుపల్లికి ప్రగతిభవన్‌ గేట్లు మూసుకుపోయాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌లో తన బిడ్డ కవిత గెలుపు కోసం మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అవసరం ఏర్పడి ఆయన ఇంటికి వెళ్లి మరీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నట్టు ప్రకటించారు. నిజామాబాద్‌లో కవిత ఓడిపోయింది.

మండవకు ఆదరణ లేకుండా పోయింది. మరో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది కూడా ఇదే రకమైన పరిస్థితి. 2014 తర్వాత తుమ్మలను కూడా ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా మంత్రిని కూడా చేశారు. 2018 ఎన్నికల్లో పాలేరులో ఓడిపోయిన తర్వాత తుమ్మలను పక్కన పడేశారు. ఇప్పుడు టికెట్‌ కూడా ఇవ్వలేదు. తెలంగాణలో సెటిలర్లు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి మద్దతు అవసరం కనుక మండవ, తుమ్మల వంటి వారిని కొంతకాలం చేరదీసిన కేసీఆర్‌, ఇప్పుడు వారిని పక్కనపెట్టారు. సెటిలర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్‌– బీజేపీలు ఈ తొమ్మిదేళ్లలో ప్రయత్నం కూడా చేయకపోవడం వల్ల వాళ్లంతా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో తుమ్మల, మండవ వంటి వారు లేకపోయినా సెటిలర్లు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు తనకు మాత్రమే లభిస్తాయన్న నమ్మకం కేసీఆర్‌లో ఏర్పడింది.

కేసీఆర్‌ రాజకీయాలు ఇలాగే ఉంటాయి. తనను ద్వేషించే వారిని కూడా అవసరం పడితే, కేసీఆర్‌ అక్కున చేర్చుకుంటారు. ప్రైవేట్‌ సంభాషణల్లో కమ్మ సామాజిక వర్గాన్ని ఆయన దూషించడం విన్న వాళ్లు ఎందరో ఉన్నారు. అయితే వారి ఓట్లు అవసరం కనుక కేసీఆర్‌ ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈ కారణంగానే తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచి ఉన్న పత్రికలకు కూడా కులం ఆపాదించే ప్రయత్నాన్ని కేసీఆర్‌ చేశారు. రాష్ట్రంలో కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయని నిందించడానికి కూడా వెనుకాడలేదు.


రెండుచోట్ల వెనుక వ్యూహం!

కేసీఆర్‌కు ఎవరి మీదా ప్రత్యేకంగా ప్రేమ ఉండదు. అవసరం మాత్రమే ఆయనకు కనబడుతుంది. అందుకే ఆయన తన రాజకీయ రంగస్థలం పైకి ఎన్నో పాత్రలను ప్రవేశపెట్టి మాయం చేస్తుంటారు. మరో మూడు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. మూడవ పర్యాయం ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్‌ ఉవ్విళ్ళూరుతున్నారు. అధికారం దక్కితే లోక్‌సభ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత తాను జాతీయ రాజకీయాలలోకి వెళ్లడం కోసం సీఎం పదవిని కేటీఆర్‌కు కట్టబెట్టాలన్నది కేసీఆర్‌ ప్రస్తుత ఆలోచన. గతంలో కూడా ఇంకేముందీ కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళతారు.. కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారు అని ప్రచారం చేయించారు.

తన కుమారుడైన కేటీఆర్‌కు ప్రజామోదం లభించడం కోసం అప్పట్లో అలా ప్రచారం చేయించారు. ఆయన వ్యూహం ఫలించింది. హరీశ్‌రావు వంటి వారు రాజీ పడిపోయారు. కేటీఆర్‌ మాత్రమే కేసీఆర్‌ వారసుడిగా నిలిచారు. ఇప్పుడు గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా అసెంబ్లీకి పోటీ చేయబోతున్న ఆయన లోక్‌సభ ఎన్నికల నాటికి మెదక్‌ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని సమాచారం. కామారెడ్డిని ఎంచుకోవడంలో కూడా పరమార్థం ఉంది. ఈసారైనా నిజామాబాద్‌ నుంచి కవితను గెలిపించుకోవడం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి అసెంబ్లీకి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగడానికి కేసీఆర్‌ మొగ్గు చూపుతారు. అప్పుడు కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో తనకు ఏ పాత్రా ఉండదని తేలితే ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగవచ్చు. అదే జరిగితే కేసీఆర్‌ చేతిలో మోసానికి గురైన వారి జాబితాలో కేటీఆర్‌ కూడా చేరిపోతారు. ఎందుకంటే ఎన్నికల తర్వాత తాను ముఖ్యమంత్రి అవడం ఖాయమని కేటీఆర్‌ నమ్ముతున్నారు. అధికారం లేకుండా కేసీఆర్‌ ఉండలేరు. ఆ క్రమంలో ఆయనకు ఎవరైనా ఒక్కటే.

ప్లాన్‌–బీ.. కాంగ్రెస్‌ అభ్యర్థులపై గురి!

మరో మూడు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం పట్ల కేసీఆర్‌ అండ్‌ కోకు ప్రస్తుతానికి ధీమా ఉంది. 60 శాతం మంది తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ ఓట్లు కాంగ్రెస్‌, బీజేపీల మధ్య చీలి 40 శాతం ఓట్లతో కనీసం 70 స్థానాలు గెలుచుకుంటామని కేసీఆర్‌ భరోసాగా ఉన్నారు. ఈ లెక్క తప్పితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సమకూరని పక్షంలో మజ్లిస్‌–బీజేపీకి చెందిన కనీసం పది మంది మద్దతు తనకు లభిస్తుందని కేసీఆర్‌ అంచనా వేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఇష్టం ఉండదు కనుక బీజేపీ తనకే మద్దతు ఇస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ అంచనాలు కూడా తప్పితే ఏం చేయాలన్న దానిపై ప్లాన్‌–బీని కూడా కేసీఆర్‌ సిద్ధం చేసుకున్నారట. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయబోయే కొంత మంది అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం కోసం నిధులు అందజేసి ఇప్పటినుంచే వారితో అవగాహన కుదుర్చుకోవాలన్నదే ఈ ప్లాన్‌–బీ.

కేసీఆర్‌ వద్ద కావాల్సినంత డబ్బు ఉంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత వారిలో విజయావకాశాలు ఉన్న వారిని గుర్తించి, వారిలో అవసరాన్ని బట్టి తనకు మద్దతు ఇచ్చే వారిని గుర్తించి ఒక్కొక్కరికి 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంత మంది బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని ఆ మధ్య విస్తృతంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతానికి వారు మనసు మార్చుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ లభించి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే అప్పటివరకు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నవాళ్లు ఎన్నికల తర్వాత ఆయనకు జై కొట్టే అవకాశం ఉంది. అందుకే ప్లాన్‌–బీని కూడా అమలు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు.

ప్రస్తుత సర్వేల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి 45 స్థానాల వరకు లభించే అవకాశం ఉంది. ఈ సంఖ్య 60కి చేరకుండా ఎక్కడ ఆగిపోయినా మళ్లీ కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వలసలు ఉంటాయి. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న పలువురు సిట్టింగ్‌లకు కూడా కేసీఆర్‌ మళ్లీ టికెట్లు కేటాయించినందున ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభించకపోతుందా? అన్న ఆశతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సొంతంగా మెజారిటీ సమకూరితే తప్ప ఒక్క సీటు తక్కువైనా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా బీఆర్‌ఎస్‌–బీజేపీ–మజ్లిస్‌ ఏకమవుతాయి. అందుకే కేసీఆర్‌ ప్రస్తుతం ధీమాగా ఉన్నారు. అంగ బలం, అర్థ బలం, అధికార బలం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తమతో సరితూగలేదు కనుక మూడవ పర్యాయం కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని కేసీఆర్‌ బలంగా నమ్ముతున్నారు.

కేసీఆర్‌కు మళ్లీ అధికారం దక్కితే ఆయనలోని నియంత మరింత విజృంభిస్తాడని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురించే మీడియాలో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయించబోమని కేసీఆర్‌ ఇప్పుడే అంటున్నారంటే, మళ్లీ అధికారంలోకి వస్తే ఆయనలోని నియంతృత్వ పోకడలు ఇంకెంత వికృతంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావించేవాళ్లే ఇటువంటి విపరీత ఆలోచనలు చేస్తారు. తన సొంత ఆస్తిని ఇష్టం వచ్చిన వాళ్లకు ఇచ్చుకోవచ్చును గానీ ప్రభుత్వ భూములను కూడా సొంత ఆస్తిగా భావించి గిట్టని వాళ్లకు ఇవ్వను అని చెప్పడానికి కేసీఆర్‌కు అధికారం ఉందా? ఈ ధోరణులను ప్రారంభంలోనే అరికట్టడానికి ప్రజాస్వామ్య ప్రియులే పూనుకోవాలి. లేని పక్షంలో కేసీఆర్‌ వంటివారు పది తలల రావణుడిలా అవతరిస్తారు.

ఆర్కే

Updated Date - 2023-08-27T07:02:09+05:30 IST