Weekend comment by RK: నోటి దురుసు మంటలు

ABN , First Publish Date - 2023-07-16T02:40:39+05:30 IST

కాలుజారినా వెనక్కు తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేమని అంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు కూడా! ప్రజాజీవితంలో ఉన్నవారు ఈ సూత్రాన్ని వంటబట్టించుకోకపోతే తిప్పలు తప్పవు...

Weekend comment by RK: నోటి దురుసు మంటలు

కాలుజారినా వెనక్కు తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేమని అంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు కూడా! ప్రజాజీవితంలో ఉన్నవారు ఈ సూత్రాన్ని వంటబట్టించుకోకపోతే తిప్పలు తప్పవు. అయితే, తెలుగునాట రాజకీయాలలో ‘వర్బల్‌ డయేరియా’ గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిపోతోంది. విమర్శలంటే బూతులు తిట్టడమని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోపణలు కూడా శ్రుతిమించుతున్నాయి. దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని వ్యాఖ్యానించిన రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష పడటమే కాకుండా లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. ఇదొక అసాధారణ పరిణామం. ఇదే ప్రాతిపదిక అయితే తెలుగు రాష్ర్టాలలో అనేకమంది మంత్రులు, శాసనసభ్యులు తమ పదవులు కోల్పోవాల్సిందే! తాజాగా... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఇరువురు ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలు అధికార పక్షాలకు ఆయాచితంగా కలిసి వచ్చాయి. రాష్ట్రంలో యువతుల అదృశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉందన్న అర్థం వచ్చేలా జన సేనాని పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి ఆయుధంగా మారగా, రైతులకు 3 గంటలపాటు ఉచిత కరెంట్‌ ఇస్తే చాలన్నట్టుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పినట్టుగా ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలతో తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి రైతులను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉసిగొల్పే ప్రయత్నం చేసింది. మాటలను పొదుపుగా వాడకపోతే ఇటువంటి తంటాలు తప్పవు.

రేవంత్‌ మాటల వెనుక...

ముందుగా ఉచిత కరెంటు విషయమై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయానికి వద్దాం. యధార్థ వాది లోక విరోధి అంటారు. రాజకీయాల్లో ఉన్నవారు వాస్తవాలను సైతం బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహార శైలి పట్ల అధికార పార్టీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు ప్రైవేట్‌ సంభాషణల్లో గోస పడుతుంటారు. అయినా వాళ్లెవరూ బహిరంగంగా మాట్లాడరు. పైపెచ్చు మా ముఖ్యమంత్రి ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతుంటారు. రేవంత్‌ రెడ్డికి దూకుడుతో పాటు మాటపై అదుపు ఉండదనేది విస్తృత అభిప్రాయం. ఈ కారణంగానే ఉచిత విద్యుత్‌ విషయంలో ఆయన నోరు జారి వాస్తవాలు మాట్లాడి ఉంటారు. తెలంగాణలో బీజేపీ బలహీనపడి కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటోందన్న అభిప్రాయం బలంగా వ్యాప్తిస్తుండటంతో ఆందోళన చెందుతున్న భారత రాష్ట్ర సమితికి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు అయాచితవరంగా లభించాయి. కేసీఆర్‌ ఆదేశాలతో బీఆర్‌ఎస్‌ మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు విజృంభించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు గానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పార్టీ స్పందన శృతి మించడంతో అది ఎదురుదాడిగా కాకుండా బెదురుదాడిగా మారిపోయింది. నిజానికి ఉచిత విద్యుత్‌ అనేది రాజకీయ పార్టీలకు ఒక అనివార్యత. 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు 2014లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రైతులకు చాలినంత విద్యుత్‌ను ఉచితంగానే అందించారు. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్‌ విధానాన్ని మార్చే దమ్మూ ధైర్యం రేవంత్‌ రెడ్డికి మాత్రమే కాదు ఇంకెవరికీ ఉండవు. అయితే రేవంత్‌ రెడ్డి నోరు జారడం వల్ల అధికార పార్టీ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన రేవంత్‌ రెడ్డి ఎదురుదాడి చేయడంతో అధికార బీఆర్‌ఎస్‌ చల్లబడింది. రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వాస్తవంగా 11 గంటలకు మించి సరఫరా చేయడం లేదని సబ్‌ స్టేషన్లలోని లాగ్‌ బుక్‌ల ఆధారంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రుజువు చేయడంతో అధికార పార్టీ నాయకుల నోళ్లు మూతపడ్డాయి. ఏదేమైనా రేవంత్‌ రెడ్డి దూకుడు తగ్గించుకొని నోటిని కూడా అదుపులో పెట్టుకోవాలని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. తెలంగాణలో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతున్నాయన్న అభిప్రాయం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ నాయకులు వారి నోటి దురదతో తమకు ఆయుధాలు అందిస్తారని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆశపడుతున్నారు. అంతర్గత కుమ్ములాటలకు, స్వేచ్ఛ పేరిట ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డానికి అలవాటు పడిన కాంగ్రెస్‌ నాయకులు తప్పు చేయకపోతారా? తమకు చిక్కకపోతారా? అని అధికార పార్టీ నాయకులు గంపెడు ఆశతో ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ అండ్‌ కోకు దొరికిపోయి చిక్కుల్లో పడటమా? లేక కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఐక్యంగా, క్రమశిక్షణతో పనిచేయడమా? అన్నది ఆ పార్టీ నాయకులు తేల్చుకోవాలి. ప్రాంతీయ పార్టీలలో అధినాయకుడి మాట, ఆదేశాలే పార్టీ శ్రేణులకు శిరోధార్యం. విధానపరమైన అంశాలపై అధినాయకులే మాట్లాడతారు. తెలుగు రాష్ర్టాలలో ప్రజలు కూడా ఈ ధోరణికి అలవాటుపడిపోయారు. అయితే జాతీయ స్థాయిలో, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో ఈ పరిస్థితి ఉండదు. ఎవరు పడితే వారు విధానపరమైన అంశాలపై ప్రకటనలు చేస్తుంటారు. ఈ పోకడలను తెలుగు ప్రజలు హర్షించే పరిస్థితిలో లేరని కాంగ్రెస్‌ నాయకులు గుర్తించాలి. రాజకీయంగా గండరగండడిగా పేరొందిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏ చిన్న అవకాశం దొరికినా కాంగ్రెస్‌ పార్టీని నమిలి మింగకుండా ఉంటారా? నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీపై ఒంటికాలిపై లేచిన కేసీఆర్‌ అండ్‌ కో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై దృష్టి కేంద్రీకరించారు. దీన్నిబట్టి తెలంగాణలో తన ప్రధాన ప్రత్యర్థి ఎవరో ఆయన చెప్పకనే చెబుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కేసీఆర్‌ చేతికి జుట్టు అందించడమా? లేదా? అన్నది తేల్చుకోవాలి.

ఈ విషయం అలా ఉంచితే ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టాయి. పిల్లవాడు అయినప్పటికీ హిమాన్షు మంచి మనసుతో స్పందించి విరాళాల సేకరణ ద్వారా ఒక ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారు. ఇందుకు అతడిని అభినందించాలి. అయితే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేశానని, ఇక దేశానికి మరమ్మతులు చేస్తానంటూ పొరుగు రాష్ర్టాల్లో విస్తరించే పనిలో ఉన్న కేసీఆర్‌ తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితిని ఆయన మనవడే కల్పించాడు. హిమాన్షు ముఖ్య అతిథిగా పాల్గొన్న సమావేశంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొనడం కూడా విమర్శలకు దారి తీసింది. మొత్తానికి మనవడు హిమాన్షు చొరవను అభినందిస్తున్న వాళ్లకు కూడా తాత కేసీఆర్‌ పాలనను విమర్శించే అవకాశం ఈ చర్య ద్వారా కలిగింది. టైం బాగోకపోతే ఇలా కూడా జరగొచ్చు!

జగన్‌ ప్రైవేటు సైన్యమా?

ఇప్పుడు జన సేనాని వ్యాఖ్యల విషయానికొద్దాం! ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ప్రజలకు కొంతవరకు ఉపయోగపడుతున్నప్పటికీ... అనేక ఇతర విషయాలలో వివాదాస్పదమైంది. వలంటీర్లు ప్రభుత్వోద్యోగులా, అధికారపార్టీ కార్యకర్తలా అంటే చెప్పలేని పరిస్థితి. వలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు 5వేల వంతున గౌరవ భృతి చెల్లిస్తున్నారు. అంటే వారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ, ఆచరణలో అలా జరగడం లేదు. ప్రభుత్వం నుంచి గౌరవభృతి పొందుతున్నప్పటికీ అత్యధిక వలంటీర్లు అధికార వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రజలకు సంబంధించిన సమస్త సమాచారం వలంటీర్ల వద్ద ఉంటోంది. వారి నుంచి ఆ సమాచారం అధికార పార్టీకి చేరుతోంది. రాష్ట్రంలో కొత్త ఓట్ల చేర్పు, ఉన్న ఓట్ల తొలగింపు ప్రస్తుతం వివాదాస్పదమై ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వలంటీర్ల ద్వారా సేకరించి పెట్టుకున్న సమాచారం ఆధారంగా ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే ఓటర్లను అధికారపక్షం వైపు మళ్లించేందుకు వలంటీర్లు పథకాల ఆశ చూపుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు గుర్రుగా ఉంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లను వలంటీర్లు ప్రభావితం చేసినట్టు స్పష్టం కావడంతో రానున్న సాధారణ ఎన్నికలలో కూడా అదే జరిగితే ఎలా? అని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వలంటీర్లపై విరుచుకుపడ్డారు. మహిళల అదృశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉందంటారా అని అధికార పార్టీ వాళ్లు వలంటీర్లను రెచ్చగొట్టారు. అధికార వైసీపీ ప్రోద్బలం, అండదండలతో వలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మలను దహనం చేయడమే కాకుండా ఆయన చిత్రపటాలను చెప్పులతో తొక్కారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యల్లో హేతుబద్ధత ఉందా? లేదా? అన్న విషయం పక్కనపెడితే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వలంటీర్లు ఒక రాజకీయనాయకుడి పట్ల ఇలా వ్యవహరించవచ్చా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైసీపీ నాయకులతో కలిసి వలంటీర్లు ఆందోళన చేయడమేమిటనే విమర్శ కూడా ఉంది. తన వ్యాఖ్యలపై వలంటీర్ల నుంచి విమర్శలు రావడంతో పవన్‌ కల్యాణ్‌ కూడా గొంతు సవరించుకున్నారు. వలంటీర్లను అధికార పార్టీ ఎలా దుర్వినియోగం చేస్తున్నదీ చెప్పుకొచ్చారు. అధికార పార్టీ ఆజ్యం పోయడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ వలంటీర్ల ఆందోళనలు మాత్రం పవన్‌ కల్యాణ్‌ క్షమాపణలు చెప్పకుండానే చల్లబడిపోయాయి. పవన్‌ కల్యాణ్‌ నోరుజారితే జారి ఉండవచ్చుకానీ, వలంటీర్ల వ్యవస్థలో మంచి చెడులు ఇప్పుడు చర్చకు వచ్చాయి.

మీరు చెప్పిన మాటే కదా!?

స్థానిక పార్టీ నాయకులు సూచించిన పార్టీ కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించామని మంత్రులు, శాసనసభ్యులు అనేక సందర్భాలలో బహిరంగంగా చెప్పుకొచ్చారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకపోయినా, విమర్శించినా పీకిపారేస్తామని కూడా ప్రకటించారు. వలంటీర్లను బచ్చాగాళ్లుగా అభివర్ణించారు. గిట్టనివారి పైకి వలంటీర్లను ప్రయోగించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులను సిఫారసు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఉండేవి. పార్టీ సభ్యులే ఈ కమిటీలో ఉండేవారు. అయితే, ప్రభుత్వం నుంచి వారికి పారితోషికం ఉండేది కాదు. జన్మభూమి కమిటీలపై అవినీతి ఆరోపణలు పెల్లుబికాయి. చంద్రబాబు అప్రతిష్ఠపాలు కావడానికి జన్మభూమి కమిటీలు కూడా కారణమని ఒక అభిప్రాయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదంతా గమనించిన జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ సొమ్ముతో గ్రామస్థాయిలో పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి స్కెచ్‌ రూపొందించారు. దాని ఫలితమే వలంటీర్‌ వ్యవస్థ. గ్రామస్థాయిలో ప్రభుత్వంతో అవసరం ఉన్నవారందరూ వలంటీర్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పించారు. ప్రభుత్వోద్యోగుల మాదిరిగా జవాబుదారీతనం లేకపోయినా గ్రామ, వార్డు స్థాయిలో వలంటీర్ల పట్టు పెరిగిపోతూ వచ్చింది. వీరిని అధికార పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చింది. ఓటర్ల మనసు మార్చడం వారిని పోలింగ్‌ బూత్‌లకు తరలించే బాధ్యతను కూడా వలంటీర్లు చేపట్టడాన్ని స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చూశాం. తానాశించిన ప్రయోజనాలు నెరవేరడంతో జగన్మోహన్‌ రెడ్డి ఈ వ్యవస్థపై మరింతగా ఆధారపడటం మొదలుపెట్టారు. ఆయా వలంటీర్ల పరిధిలోని ఓటర్ల సమస్త సమాచారాన్ని సేకరించి పెట్టుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా ఎన్నికల్లో గిమ్మిక్కు చేసేందుకు ఐ ప్యాక్‌ టీమ్‌లను రంగంలోకి దించారు. ప్రభుత్వ సొమ్ముతో వలంటీర్లను, పార్టీ సొమ్ముతో ఐప్యాక్‌ టీమ్‌లను సృష్టించి, వారి ద్వారా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నదే జగన్‌రెడ్డి లక్ష్యం. ఇది గమనించిన ప్రతిపక్షాలు ఆలస్యంగానైనా మేల్కొని ప్రజల వ్యక్తిగత సమాచారంతో వలంటీర్లకు ఏం పని అని విమర్శలు చేయడం మొదలుపెట్టాయి.

వారిపైనే... ‘గురి’

ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీతనం లేని ఈ వలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కీలకంగా మారింది. ఈ వ్యవస్థ పట్ల ఆగ్రహంగా ఉన్న ప్రతిపక్షాలు కూడా తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పలేకపోతున్నాయంటే వారి పాత్ర ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. పదిలక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను కూడా లెక్కచేయని జగన్‌రెడ్డి ప్రభుత్వం రెండున్నర లక్షలమంది ఉన్న వలంటీర్ల వ్యవస్థపైనే ఎక్కువ ఆధారపడుతోంది. వైసీపీ కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించారని తెలిసినప్పటికీ తాము అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్పలేని నిస్సహాయతలో ప్రధాన ప్రతిపక్షం కూడా ఉంది. వలంటీర్లకు కోపం తెప్పిస్తే ఎన్నికల్లో వారు నష్టం చేస్తారేమోనన్న భయం ప్రతిపక్షాలను వేధిస్తోంది. నిజానికి ప్రజల్లో మార్పంటూ వస్తే వలంటీర్లు మాత్రం ఏం చేయగలరు! ప్రజల మనసు మార్చలేరు కదా!

ఇతర వ్యవస్థలు నిర్వీర్యం

పైన చెప్పిందంతా నాణానికి ఒక వైపు మాత్రమే. ఇప్పుడు నాణానికి రెండోవైపు చూద్దాం! వలంటీర్ల వ్యవస్థ అమల్లోకి వచ్చాక అప్పటి వరకు గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలు తీర్చుతూ వచ్చిన పంచాయతీరాజ్‌ వ్యవస్థ నిర్వీర్యమైంది. లక్షలు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఆరో వేలుగా మారిపోయారు. వార్డు సభ్యులు, సర్పంచుల అవసరం ప్రజలకు లేకుండా వలంటీర్లు దూరిపోయారు. ఎవరికి ఏది కావాలన్నా వలంటీర్లనే ఆశ్రయించడం మొదలైంది. దీంతో గ్రామస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం బలహీనపడి వలంటీర్లు బలపడ్డారు. తమకు కేటాయించిన యాభై ఇళ్ళపై అజమాయిషీ చెలాయించే అవకాశం రావడంతో భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఐదువేల జీతానికే వలంటీర్లు సంతృప్తి పడిపోతున్నారు. తహశీల్దార్‌ అయినా, కలెక్టర్‌ అయినా వలంటీర్లు చేసిన సిఫారసులనే ఆమోదించే పరిస్థితి కల్పించారు. దీంతో వలంటీర్ల వ్యవస్థ సమాంతర ప్రభుత్వ వ్యవస్థగా మారిపోయింది. సర్పంచులు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కోల్పోయారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు మాత్రమే కాదు... శాసనసభ్యులకు కూడా గ్రామ ప్రజలతో ఏం సంబంధం లేకుండా పోయింది. ప్రభుత్వ స్థాయిలో వ్యవహారాలు, వ్యక్తిగత పనులకు మాత్రమే ఎవరైనా శాసనసభ్యులను కలుస్తున్నారు. శాసనసభ్యులకు గ్రామ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పోవడం అధికార పార్టీకి కూడా మంచిది కాదన్న భావన ఉంది. వలంటీర్లుగా నియమితులైనవారిని మినహాయిస్తే గ్రామస్థాయిలో అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలపై పట్టు కోల్పోయారు. తమ వద్దకు వచ్చే ప్రజల అవసరాలను తీర్చడంద్వారా గ్రామ, వార్డు స్థాయి కార్యకర్తలు, నాయకులు ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఫలితంగా అధికార వైసీపీ కార్యకర్తల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడు ఐ ప్యాక్‌ టీమ్‌ కూడా రంగ ప్రవేశం చేయడంతో అధికార పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కోల్పోయినా, శాసనసభ్యులు మాత్రం దందాలకు అలవాటు పడి సొమ్ము చేసుకోవడానికే పరిమితమయ్యారు. రానున్న ఎన్నికల్లో ప్రజలను కలవడం, డబ్బు పంచడం వంటివి కూడా ఐప్యాక్‌ టీమ్‌లే చేస్తాయని ముఖ్యమంత్రి తేల్చి చెపుతున్నారు. దీంతో తాము నామినేషన్‌ వేసి ఇంట్లో పడుకుంటే గెలిచిపోతామా? అని శాసనసభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు తనకు మధ్య మరో వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశంతోనే వలంటీర్లను, ఐప్యాక్‌ టీమ్‌లను ముఖ్యమంత్రి రంగంలోకి దించారు. ఈ కారణంగా స్థానిక నాయకత్వం కచ్చితంగా బలహీనపడిపోతోంది. దీర్ఘకాలంలో ఈ పరిస్థితి జగన్‌ మోహన్‌ రెడ్డికి కూడా మంచి చేయకపోవచ్చు. పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా తీసుకునే నిర్ణయాలతో సర్పంచుల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఎవరికీ ప్రమేయం లేకుండా చేయడం విపరిణామాలకు దారితీస్తుంది. ఈ కారణంగానే వివిధ స్థాయిలలో అధికార పార్టీ నాయకులు దారి తప్పి పైరవీలకే పరిమితమవుతున్నారు. తెలుగు రాష్ర్టాలలో ప్రభుత్వ వ్యవస్థలు ఇప్పటికే నిర్వీర్యమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అధికారులు కూడా ఉత్సవవిగ్రహాలుగా మారిపోయారు. ఏపీలో వలంటీర్లు, ఐప్యాక్‌ టీమ్‌లే సర్వం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి సైతం బటన్‌ నొక్కడానికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వలంటీర్‌ వ్యవస్థ అనే తేనెతుట్టెను పవన్‌ కల్యాణ్‌ కదిలించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వలంటీర్ల ద్వారా సేకరించడం ఆక్షేపణీయమే. ఈ పరిస్థితిని ప్రతిపక్షాలు ప్రతిఘటించాల్సిందే.

చోటా నేతలు చేసేదేముంది?

తాము నమ్ముకున్న పార్టీలను గెలిపించడం కోసం ఆయా పార్టీల కార్యకర్తలతో పాటు గ్రామస్థాయి నాయకులు వ్యయప్రయాసాలకు వెరవకుండా ఎన్నికలలో తలపడతారు. వలంటీర్లు, ఐప్యాక్‌ టీమ్‌ల పుణ్యమా అని ఇపుడు తమకు ఏ అధికారం లేకుండా పోయినందున ఇకపై వారు ఎన్నికల సందర్భంగా చొక్కాలు చించుకోకపోవచ్చు. ప్రభుత్వ, పథకాలను ప్రజలకు ఇంటివద్దకే వెళ్లి అందించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన వాలంటీర్‌ వ్యవస్థను జగన్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. దీనివలన ప్రతిపక్షాలు మాత్రమే కాదు, అధికార పార్టీ కూడా నష్టపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. దుష్ప్రచారంతో, విష ప్రచారంతో అధికారంలోకి రావాలనుకునే ప్రయత్నాలు ఎల్లవేళలా ఫలించవు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు సదభిప్రాయం లేనప్పుడు వలంటీర్లు, ఐప్యాక్‌ టీమ్‌లు మాత్రం ఏం చేయగలవు? ఈ నేపథ్యంలో జన సేనాని పవన్‌ కల్యాణ్‌ నోరు జారారా? లేదా అన్నది పూర్వపక్షం అవుతుంది.

పవన్‌ను రెచ్చగొట్టే పనిలో...

తెలుగుదేశం పార్టీతో జనసేన చేతులు కలిపితే తమ అధికారానికి ప్రమాదం తప్పదని భావిస్తున్న జగన్‌ అండ్‌ కో పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఎక్కడ ఏ అవకాశం చిక్కినా ఆయనను తిట్టిపోస్తున్నారు. ఆవేశపరుడైన పవన్‌ రెచ్చగొడితే రెచ్చిపోయి నోరుజారతారు... తప్పు చేస్తారన్నది జగన్‌ అండ్‌ కో అభిప్రాయం. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశాన్ని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు, వారి సోషల్‌ మీడియా సైన్యం సైతం పవన్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నాయి. ఏదో ఒకరోజు పవన్‌ కల్యాణ్‌ ఆవేశానికి లోనై రానున్న ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించాలన్నది జగన్‌ అండ్‌ కో కోరిక. ఈ నేపథ్యంలోనే వలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని వలంటీర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తాము ఆశించిన రీతిలో వలంటీర్లు రెచ్చిపోలేదన్న దుగ్ధ వైసీపీ నాయకుల్లో ఉన్నట్టుగా మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక పోయిందన్నట్టుగా పరిస్థితి మారకూడదు. వలంటీర్లును నెత్తిన పెట్టుకుని ప్రభుత్వ వ్యవస్థలను, స్థానిక నాయకత్వాలను నిర్వీర్యం చేయడం ఎవరికీ మంచిది కాదు. పవన్‌ కల్యాణ్‌ తొందరపడ్డారా, లేదా? అన్నది పక్కన పెట్టి వలంటీర్ల వ్యవస్థను సమీక్షించాల్సిన అవసరం మాత్రం ఉంది. రెండున్నర లక్షల వలంటీర్లకు భయపడితే ఐదు కోట్ల ప్రజల పరిస్థితి ఏమిటి? రాజకీయ వ్యవస్థ ప్రజలకు మాత్రమే భయపడాలి కానీ మరే ఇతర వ్యవస్థకు బెదరకూడదు.

ఆర్కే

Updated Date - 2023-07-16T03:07:49+05:30 IST