Weekend comment by RK: జవాబేది జగన్‌?

ABN , First Publish Date - 2023-07-23T02:52:36+05:30 IST

వైఎస్‌వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఎట్టకేలకు చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. ఈ హత్యతో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డికి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉందని చార్జిషీటులో...

Weekend comment by RK: జవాబేది జగన్‌?

వైఎస్‌వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఎట్టకేలకు చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. ఈ హత్యతో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డికి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉందని చార్జిషీటులో పేర్కొనడం గమనార్హం. అవినాశ్‌ రెడ్డిని ఈ కేసు నుంచి తప్పించడం కోసం తన శక్తియుక్తులతో పాటు కేంద్రం వద్ద తనకు ఉన్న పలుకుబడిని అంతటినీ ఉపయోగించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి చెందిన మీడియాకు మాత్రం చార్జిషీటు మరోలా కనిపించింది. ఈ చార్జిషీటులో డొల్లతనం ఉందని ఆయన మీడియా యథావిధిగా వక్రభాష్యం చెప్పింది. వివేకానంద రెడ్డిని తామే హత్య చేశామని హత్య చేసిన వాళ్లు చెప్పాక ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని జగన్‌ అండ్‌ కో మొదటి నుంచీ చేస్తున్న వాదన. ఈ వాదనలో పస లేకపోయినా ప్రజలను తప్పుదారి పట్టించడంతో పాటు వివేకా హత్యలో ప్రధాన సూత్రధారులను రక్షించడానికి జగన్‌ అండ్‌ కో ఈ మార్గాన్ని ఎంచుకొని ఉంటుంది. మొత్తానికి చార్జిషీటు దాఖలయ్యే వరకు అవినాశ్‌ రెడ్డి అరెస్టు కాకుండా జగన్మోహన్‌ రెడ్డి కాపాడుకోగలిగారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్యను అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అంటగట్టి రాజకీయ లబ్ధి పొందిన జగన్‌ ఆ తర్వాత సూత్రధారులను రక్షించడానికే ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో వివేకానంద రెడ్డి ఏకైక కుమార్తె డాక్టర్‌ సునీత అభిప్రాయాన్ని, అనుమానాలను పట్టించుకోకపోగా, ఆమె భర్తే హత్య చేయించారనే విష ప్రచారానికి కూడా పూనుకున్నారు. తన కుటుంబంలో కోల్డ్‌ వార్‌ ఉందని జగన్‌ సొంత సోదరి షర్మిల కూడా సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో ధ్రువీకరించారు. సీబీఐ చార్జిషీటు నేపథ్యంలో వివేకానంద రెడ్డికి, అవినాశ్‌ రెడ్డి కుటుంబానికి మధ్య ఎప్పుడు వైరం ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. జగన్‌ తాత వైఎస్‌ రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలు కాగా ఒక భార్యకు రాజారెడ్డి పుట్టారు. మరో భార్యకు అవినాశ్‌ రెడ్డి తాత చిన కొండారెడ్డి పుట్టారు. రాజారెడ్డి కుటుంబం రాజకీయంగా ఎదిగింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు అవినాశ్‌ రెడ్డి కుటుంబం గురించి పులివెందుల వెలుపల వారికి తెలియదు. రాజశేఖర రెడ్డి మరణానంతరం పరిస్థితులు మారిపోయాయి. జగన్‌ సొంత పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు. కుటుంబంలో ఆయన భార్య భారతి ఆధిపత్యం పెరిగిపోయింది. ఈ క్రమంలో వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి కుటుంబం జగన్‌కు దగ్గరవ్వగా రాజశేఖర రెడ్డి కుటుంబం దూరమైంది. ఈ నేపథ్యంలో తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉంటూ వచ్చిన వివేకానంద రెడ్డిపై అవినాశ్‌ రెడ్డి కుటుంబం ఆగ్రహంగా ఉండేది. ఈ దశలోనే వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సీబీఐ చార్జిషీటు ప్రకారమే కాకుండా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం వాంగ్మూలం ప్రకారం కూడా వివేకా హత్య గురించి ప్రపంచానికి వెల్లడి కాకముందే జగన్మోహన్‌ రెడ్డి దంపతులకు తెలుసు అని స్పష్టమైంది. తెల్లవారుజామున నాలుగున్నరకే అవినాశ్‌ రెడ్డి నుంచి భారతికి సమాచారం అందగా, ఆ తర్వాత జగన్‌కు ఆమె విషయం చెప్పారు. ఈ అంశం నేను కొంతకాలం క్రితమే చెప్పాను. ఏ కారణం వల్లనో నాలుగున్నర బదులు ఐదున్నర అని అజేయ కల్లం తన వాంగ్మూలంలో చెప్పారు. అప్పట్లో నేను ప్రస్తావించిన అంశాలపై ఆయన విమర్శలు చేశారు కూడా. ఇప్పుడు జగన్‌ అండ్‌ కో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారని తెలిసి కూడా జగన్‌కు చెందిన ‘సాక్షి’ చానల్‌లో ఉదయం 9 గంటల వరకు వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎందుకు ప్రసారం చేశారు? వివేకా గుండెపోటుతో మరణించారని తొలుత భావించారన్నది నిజమే అనుకుందాం. వివేకా బాత్రూంలో రక్తం మడుగులో విగతజీవిగా ఉన్నారని అవినాశ్‌ రెడ్డి ఫోన్‌లో తెలియజేశారని భారతి పీఏ నవీన్‌, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. గుండెపోటుతో మరణించిన వారు రక్తపు మడుగులో పడి ఉండటం ఎలా సాధ్యమో జగన్‌ దంపతులు సమాధానం చెప్పాలి. అవినాశ్‌ రెడ్డితో పాటు ‘సాక్షి’ చానల్‌ మాత్రమే వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని ప్రచారం చేశారు. వివేకా హత్య గురించి ఐదున్నరకు ముందే తెలిసినప్పుడు.. ఎలా చనిపోయారు? అని జగన్‌ దంపతులు అడగలేదా? గుండెపోటు అయితే రక్తపు మడుగు ఎందుకు ఉందన్న అనుమానం వారికి రాకపోవడం ఏమిటి? వివేకాది హత్య అని తెలిసినప్పుడు గుండెపోటు అని తమ సొంత చానల్‌లో ప్రసారం చేయడాన్ని వారు ఎలా అనుమతించారు? బాబాయ్‌ ఇక లేరని ఉదయం ఐదున్నర గంటలకే వెల్లడించిన జగన్మోహన్‌ రెడ్డి వెంటనే పులివెందులకు వెళ్లకపోవడానికి కారణం ఏమిటి? ఈ అనుమానాలకు సమాధానాలను సీబీఐ మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఏం జరిగిందన్నది ప్రపంచానికి తెలిసిపోయిన తర్వాత అప్పటి వరకు తెలుగుదేశం వారి వైపు వేలెత్తి చూపిన జగన్మోహన్‌ రెడ్డి, ముఖ్యమంత్రిగా నాలుక మడతెయ్యడం నిజం కాదా?

సంజాయిషీ ఇవ్వాల్సిందే!

తామే హత్య చేశామని ఫలానా వాళ్లు చెప్పిన తర్వాత విచారించడానికి ఏముంది? అనే జగన్‌ అండ్‌ కో వాదన విషయానికి వద్దాం. హత్యలు జరిగినప్పుడు ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? అనే కోణంలోనే దర్యాప్తు జరుగుతుంది. వివేకా విషయంలో హత్య చేసిన వాళ్లు స్వయంగా అంగీకరించారన్న జగన్‌ అండ్‌ కో వాదన ప్రకారం చూసినా హత్యకు మోటివ్‌ ఏమిటో వెల్లడి కావాలి కదా? కారణం లేకుండా సరదాగా హత్యలు చెయ్యరు కదా? వివేకాను చంపడానికి నలభై కోట్ల సుపారీ ఇచ్చారని నిందితులు చెప్పినందున ఆ నలభై కోట్లు ఇవ్వజూపినది ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం అన్వేషించాలి కదా? సూత్రధారుల జోలికి వెళ్లడం ఏమిటని నిలదీస్తూ వచ్చిన జగన్‌ అండ్‌ కో.. డాక్టర్‌ సునీత భర్త రాజశేఖర్‌రెడ్డి ప్రోద్బలంతోనే హత్య జరిగిందని, ఆ కోణంలోనే దర్యాప్తు జరగాలని కోరుకోవడం ఏమిటి? హంతకులు ఎవరో తెలిసిపోయాక తదుపరి దర్యాప్తు అనవసరం అన్న వాళ్లు వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డిని సూత్రధారిగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఈ ప్రశ్నలు అన్నింటికీ జగన్‌ అండ్‌ కోనే సమాధానం చెప్పాలి. ‘ఆ దేవుని దయతో..’ అని జగన్మోహన్‌ రెడ్డి తరచుగా అంటుంటారు. అంటే ఆయనకు దేవుడిపై అపారమైన నమ్మకం ఉందని భావించాలి. అదే నిజమైతే జగన్‌ ఆ దేవుడికైనా సంజాయిషీ ఇచ్చుకోవాలి కదా! సీబీఐ చార్జిషీటు దాఖలు చేసినందున వివేకా హత్య కేసు పూర్తిగా కొలిక్కి వచ్చినట్టు చెప్పలేము. అనుబంధ చార్జిషీట్లను ఎప్పుడైనా దాఖలు చేయవచ్చు. సీబీఐని పంజరంలో చిలుకలా జగన్మోహన్‌ రెడ్డి గతంలో అభివర్ణించేవారు. వివేకా కేసులో కూడా సూత్రధారులను కాపాడటం కోసం సీబీఐని పంజరంలో చిలుకలా మార్చింది ఎవరు? కేంద్రంలోని పెద్దల అండదండలు లభించి ఉండకపోతే అవినాశ్‌ రెడ్డి అరెస్టు కాకుండా తప్పించుకోగలిగేవారా? దర్యాప్తు ఇంత సుదీర్ఘ కాలం సాగేదా? కుట్ర కోణాన్ని, సూత్రధారులను నిర్ధారించకుండానే చార్జిషీటు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. సుప్రీంకోర్టులో సీబీఐ తరఫున అఫిడవిట్లు సకాలంలో దాఖలు కాకపోవడానికి కారకులు ఎవరు? ఈ కేసులో కదలిక వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లడం యాదృచ్ఛికమేనా? సీబీఐని పంజరంలో చిలుకలా బంధించడానికి జగన్‌ అండ్‌ కో ప్రయత్నించలేదా? న్యాయ వ్యవస్థలోని లొసుగులను అడ్డుపెట్టుకొని దర్యాప్తు సజావుగా సాగకుండా అడ్డుకున్నది నిజం కాదా? సొంత చిన్నాన్న హత్య కేసు దర్యాప్తు చేసిన అధికారి రాంసింగ్‌పై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టడం వెనుక ఎవరున్నారు? ఎవరిని రక్షించడానికి జగన్‌ ప్రభుత్వం అంత తీవ్ర నిర్ణయం తీసుకుంది? తమ అధీనంలోని సీబీఐ అధికారిపై కేసు పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండిపోయింది? కేంద్ర పెద్దలు కన్నెర్ర చేస్తే జగన్‌ ఈ సాహసానికి పూనుకునేవారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించాల్సి ఉంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా వివేకా హత్య కేసు నీరుకారిపోవడం వెనుక ఎందరో మహానుభావులు ఉన్నారు. సొంత చిన్నాన్న కంటే దాయాదులకు చెందిన అవినాశ్‌ రెడ్డి కుటుంబం జగన్‌కు ముఖ్యం కావడమే ఇక్కడ కీలకం. గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా ప్రస్తుతానికి ఈ కేసులో సూత్రధారులు సేఫ్‌గా ఉన్నారు. రానున్న ఎన్నికల తర్వాత ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో ప్రభుత్వాలు మారితే పంజరం నుంచి సీబీఐకి స్వేచ్ఛ లభించవచ్చు. అప్పుడు సూత్రధారులు పంజరంలో చిక్కుకుంటారేమో! ఏది ఏమైనా వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు బాగోతం చూశాం. ఈ రోజుల్లో డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంటే ఎవరినైనా హత్య చేయించి తప్పించుకోవచ్చునని రుజువవుతోంది. డాక్టర్‌ సునీత పట్టుదలగా ఈ కేసును పట్టించుకోకపోయి ఉంటే ఇప్పటికే కథ కంచికి చేరిపోయి ఉండేది. తన తండ్రిని దారుణంగా హత్య చేయించిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి కేసును ముందుకు తీసుకువెళుతున్న డాక్టర్‌ సునీత భవిష్యత్తులో మరెందరికో ఆదర్శంగా, ఒక ప్రేరణగా మిగులుతారు. దేవుడు ఉన్నాడని జగన్మోహన్‌ రెడ్డితో పాటు మనం అందరం కూడా నమ్ముతాం కనుక వివేకా హత్య కేసులోని నిందితులు చట్టాల నుంచి తప్పించుకున్నప్పటికీ దేవుడి కోర్టులో శిక్షింపబడకుండా ఉండరు. మన దేశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఇకపై ఎవరైనా అంటే కాసేపు నవ్వుకుందాం. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ఆరంభించిన సీబీఐనే చివరికి చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి కల్పించిన పాలకులు చట్టాన్ని తన పని తనను చేసుకుపోనిస్తారా? రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి ఆట వారు ఆడటం ఈ దేశంలో పరిపాటిగా మారింది. అందుకే ఒక దివంగత ముఖ్యమంత్రి సొంత సోదరుడు వివేకానంద రెడ్డి హత్య జరిగినా ఆయనకు పుత్ర సమానుడైన జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సూత్రధారులు తప్పించుకోవడాన్ని వింతగా చూడకూడదు. పలుకుబడి, డబ్బు ఉండాలే గానీ బారా ఖూన్‌ మాఫ్‌.. మేరా భారత్‌ మహాన్‌!

ఆహా.. ఏమి నటనా కౌశలం?

వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయానికి వద్దాం. ఎన్నికలు సమీపిస్తుండటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజల సమక్షంలో ఉన్నప్పుడు చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ అమాయకత్వం నటించే జగన్మోహన్‌ రెడ్డి, తాడేపల్లి ప్యాలెస్‌లో ఎలా ఉంటారో అక్కడికి వెళ్లే వారందరికీ తెలుసు. తాము ఐఏఎస్‌ అధికారులమంటూ విర్రవీగిన వాళ్లు కూడా జగన్‌ ముందు కూర్చోవడానికే భయపడుతున్నారంటే ఆయన ఎలాంటి వారో తెలియడం లేదా? అయితే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జగన్‌ తన నటనా విశ్వరూపాన్ని మరింతగా ప్రదర్శిస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి చెబుతున్న మాటలు వింటున్నప్పుడు తమకు నవ్వు వస్తుందని తెలంగాణకు చెందిన మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇటీవల వ్యాఖ్యానించారు. జగన్మోహన్‌ రెడ్డి అవినీతి గురించి మాట్లాడుతూ ఇతరులను పెత్తందారులని నిందించిన సందర్భాలలో తమకు నవ్వు వస్తుందని ఆయన అన్నారు. నిజమే కదా! అవినీతి గురించి జగన్‌ మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అప్పులు తీర్చడం కోసం సొంత ఇంటిని కూడా అమ్మకానికి పెట్టిన కుటుంబం, ఐదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకొని డజన్లకొద్దీ కంపెనీలను పెట్టడం, సొంత పత్రిక, చానల్‌ ప్రారంభించడమే కాకుండా సిమెంట్‌ పరిశ్రమలు, విద్యుత్‌ ప్లాంట్‌, రాష్ర్టానికో ప్యాలెస్‌ నిర్మించుకోవడం నిజం కాదా! కేవలం ఐదేళ్లలోనే వందల వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్న పెద్ద మనిషి అవినీతి గురించి మాట్లాడటం కడియం శ్రీహరికి మాత్రమే కాదు ఎవరికైనా నవ్వు తెప్పించకుండా ఉండదు. దేశంలోని ముఖ్యమంత్రుల్లోకెల్లా ధనవంతుడై ఉండి కూడా తనను తాను పేదల ప్రతినిధిగా జగన్‌ చెప్పుకోవడం వింతల్లోకెల్లా వింత కాదా? తండ్రి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నందుకే ఇంత సంపద పోగేసుకున్న జగన్మోహన్‌ రెడ్డి, ఇప్పుడు తానే ముఖ్యమంత్రిగా ఉన్నందున ఇంకెంత పోగేసుకొని ఉంటారో ఎవరికి వారు ఊహించుకోవచ్చు. తానేమిటో తెలిసి కూడా తన నటనా కౌశలాన్ని చూసి నమ్మి తనను ముఖ్యమంత్రిని చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆయనకు వెర్రివాళ్లుగా కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? అందుకే తన పోరాటం పెత్తందార్లపై అని ఆయన చెప్పుకోగలుగుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అంతులేని సంపదను పోగేసుకోవడం ఎలాగో జగన్మోహన్‌ రెడ్డికి తెలిసినంతగా దేశంలో వేరెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. అయినా ఆయన నాతో పాటు మరికొందరిని దుష్టచతుష్టయం, గజదొంగలు అని అభివర్ణిస్తున్నారు. మిగతా వారి సంగతి నాకు అనవసరం. నేను గజదొంగలా జగన్‌ బాటలో ప్రభుత్వ సంపదను కొల్లగొట్టి ఉంటే నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన నాపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారో చెప్పాలి కదా? తనను తాను పరిశుద్ధాత్ముడిగా అభివర్ణించుకున్నంత మాత్రాన జగన్‌ వెనుక ఉన్న అపార సంపద కనబడకుండా పోతుందా? అయినా జగన్‌ను మించిన గజదొంగ ఇంకెవరుంటారు? రాష్ర్టాన్ని అప్పులపాలు చేస్తూ పథకాల పేరిట ప్రజల సొమ్మునే ప్రజలకు పంచుతూ అపర దానకర్ణుడిలా పోజులిస్తూ తాను ఏం చెప్పినా ప్రజలు నమ్మకపోతారా? అని జగన్‌ బలంగా నమ్ముతున్నారనుకుంటా! అందుకే ఈ మధ్య సందర్భం ఏదైనా బహిరంగ సభల్లో ఆయన నోరు పారేసుకుంటున్నారు. తన అధికారానికి అడ్డు వచ్చే వారంతా ఆయన దృష్టిలో గజదొంగలు, దౌర్భాగ్యులే! పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపితే తన అధికారానికి ముప్పు తప్పదని భావించిన జగన్‌.. ఇప్పుడు జనసేనానిపై దృష్టి కేంద్రీకరించారు. పవన్‌ కల్యాణ్‌ పెళ్లిళ్ల గురించి తరచుగా విమర్శిస్తున్నారు. అయితే జగన్‌ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ప్రభుత్వ సంపదనే కొల్లగొట్టి అపర కుబేరుడిగా, పారిశ్రామికవేత్తగా, పత్రికాధిపతిగా కూడా మారిన తనను అవేమీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు, పవన్‌ కల్యాణ్‌ పెళ్లిళ్ల గురించి మాత్రం ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్న వేసుకోవాలి కదా! అయినా జగన్మోహన్‌ రెడ్డి పవన్‌పై కడుపు మంటను తీర్చుకుంటున్నారు. తాజాగా వలంటీర్లు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపిస్తావా అంటూ పవన్‌ కల్యాణ్‌ను ప్రాసిక్యూట్‌ చేయడానికి ఏకంగా జీవో జారీ చేయించారు. దీంతో వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా? కాదా? అన్న మీమాంస ఉత్పన్నమవుతోంది. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులైతే వారి నియామకంలో సంబంధిత మార్గదర్శకాలు ఎందుకు పాటించలేదు? అన్న ప్రశ్నకు సమాధానం లభించాలి. ప్రభుత్వ ఉద్యోగులు కాని పక్షంలో వారికి ప్రభుత్వ ఖజానా నుంచి పారితోషికం ఎలా చెల్లిస్తున్నారు? అలాంటి వారిని దూషించారని ప్రాసిక్యూట్‌ చేయాలనుకోవడం ఏమిటి? జగన్‌ మాటలతో పాటు ప్రభుత్వ చర్యలు కూడా ఆయనలోని అసహనానికి అద్దం పడుతున్నాయి. శుక్రవారం నాడు వెంకటగిరి పర్యటనలో మరో మెట్టు దిగజారి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ, లోకేశ్‌లను దౌర్భాగ్యులుగా చిత్రించే ప్రయత్నం జగన్‌ చేశారు. వారందరికీ మహిళల విషయంలో బలహీనతలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. వలంటీర్లను విమర్శించే వారికి సంస్కారం లేదని తేల్చిపారేశారు. అవున్లే.. వలంటీర్లను చెత్త ఏరివేతకి సైతం వాడుకోగలుగుతున్న జగన్మోహన్‌ రెడ్డికి ఇతరుల్లో సంస్కారం కనపడకపోవడంలో ఆశ్చర్యం లేదు. తాను ప్రజలకు మంచి చేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పుకొంటారు. అదే నిజమైతే ఎంత మంది కలిసినా ప్రజలు ఆయననే ఎన్నుకుంటారు కదా. నోరు పారేసుకోవడం ఎందుకు? కేంద్ర ప్రభుత్వ పెద్దల అండ చూసుకొని జగన్మోహన్‌ రెడ్డి చెలరేగిపోతున్నారు. కేంద్రంలోని ఆ పెద్దలు కూడా రాష్ట్రంలోని రాజకీయ పార్టీల బలహీనతలను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు బీజేపీ పెద్దలు కూడా బాధ్యత తీసుకోక తప్పదు. రాజ్యసభలో మద్దతు అవసరం కనుక జగన్మోహన్‌ రెడ్డికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కేంద్ర సహకారం రాష్ర్టానికి మేలు చేస్తే పర్వాలేదు గానీ అలా జరగడం లేదు. కేంద్రానికి రాజ్యసభలో తన బలం అవసరం కనుక జగన్‌ రెచ్చిపోతున్నారు. ఓటర్ల జాబితాలో అడ్డగోలు మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ నుంచి న్యాయం జరగాలంటే ప్రతిపక్షాలు కూడా బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబించక తప్పని పరిస్థితి. ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితులు ఉంటే ప్రతిపక్షాల వైఖరి మరోలా ఉండేది. ప్రతిపక్షాల ఈ బలహీనతతో అటు ఢిల్లీ పెద్దలు, ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆడుకుంటున్నారు. పౌర సమాజం బాధ్యతాయుతంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అస్పష్టత కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణలో ఎన్నికల ఫలితాలను బట్టి జగన్‌కు పరోక్షంగా మద్దతు కొనసాగించడమా? లేక ప్రతిపక్షాలతో చేతులు కలపడమా? అన్నది కమలనాథులు నిర్ణయించుకుంటారు. అప్పటి వరకు జగన్మోహన్‌ రెడ్డి చెలరేగి పోతూనే ఉంటారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు కూడా నిశ్చింతగా ఉండవచ్చు. ఇదెక్కడి అన్యాయం అని ఆక్రోశించినా ప్రయోజనం ఉండదు. యథా ప్రజ తథా రాజా! ప్రజలు ఎన్నుకున్న వాళ్లే కదా పాలకులు అయ్యారు! ఆ మాత్రం శిక్ష అనుభవించక తప్పదు మరి!!

ఆర్కే

Updated Date - 2023-07-23T02:58:45+05:30 IST