RK : కసి కళ్లు చల్లబడ్డాయి!

ABN , First Publish Date - 2023-09-10T04:35:03+05:30 IST

హమ్మయ్య.. క్రోధాగ్ని నింపుకొన్న ఆ కళ్లు ఇప్పుడు చల్లబడి ఉంటాయి. పగతో, ప్రతీకారంతో ఇన్నాళ్లుగా రగిలిపోతున్న ఆ మనిషి ఇప్పుడు శాంతించి ఉంటారు. ఆయన మరెవరో కాదు..

RK : కసి కళ్లు చల్లబడ్డాయి!

హమ్మయ్య.. క్రోధాగ్ని నింపుకొన్న ఆ కళ్లు ఇప్పుడు చల్లబడి ఉంటాయి. పగతో, ప్రతీకారంతో ఇన్నాళ్లుగా రగిలిపోతున్న ఆ మనిషి ఇప్పుడు శాంతించి ఉంటారు. ఆయన మరెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ పోలీసులు హైడ్రామా మధ్య శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సీటులో కూర్చున్న నాటి నుంచి జగన్మోహన్‌ రెడ్డి కసీ కార్పణ్యాలతో రగిలిపోతున్నారు. అవినీతి కేసులలో తాను జైలు జీవితం అనుభవించాల్సి రావడానికి చంద్రబాబు కూడా కారణం అన్న అభిప్రాయంతో ఉన్న జగన్‌, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబును టార్గెట్‌గా పెట్టుకున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధులు దుర్వినియోగం జరిగాయంటూ 2021లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు 2023 చివరిలో, అది కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, నిధుల దుర్వినియోగం జరిగిందంటున్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును అరెస్టుచేశారు. విచిత్రం ఏమిటంటే నిధులు విడుదల చేయడంలోనే కాకుండా అందుకు సంబంధించిన ఒప్పందాలపై నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా, సంబంధిత శాఖ కార్యదర్శిగా సంతకాలు చేసిన ప్రేమచంద్రారెడ్డిని మాత్రం కేసులో ముద్దాయిగా పేర్కొనలేదు. 2021లో కేసు నమోదు చేసినప్పుడు చంద్రబాబును నిందితుడిగా పేర్కొనలేదు. ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత ఎవరో ఆడిటర్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును నేరుగా అరెస్టు చేశారు. అసలు చంద్రబాబుపై ఏపీ సీఐడీ పెట్టిన కేసే డొల్లతనంతో కూడుకున్నది. సీఐడీ అధికారులు అత్యుత్సాహంతో చంద్రబాబుపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ కింద కేసులు పెట్టారు. అదే యాక్ట్‌ కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. ఇక్కడే ఏపీ సీఐడీ పప్పులో కాలేసింది.

ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ను పర్యవేక్షించాల్సిందీ, ప్రయోగించాల్సిందీ అవినీతి నిరోధక శాఖ కదా? మరి సీఐడీకి ఏం పని? ఇటీవల తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫాంహౌజ్‌ కేసును ఇక్కడ ఉదహరిస్తాను. అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నలుగురిని కొందరు వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారని ఉప్పందుకున్న సైబరాబాద్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారిని విచారించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ కిందే అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. సైబరాబాద్‌ పోలీసుల అతి తెలివిని ప్రశ్నించిన ఏసీబీ కోర్టు మేజిస్ర్టేట్‌.. నిందితుల రిమాండ్‌ను తిరస్కరించారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ కింద ఏసీబీ కాకుండా లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు అరెస్టు చేయడం చట్ట విరుద్ధమంటూ రిమాండ్‌ అభ్యర్థనను మేజిస్ర్టేట్‌ కొట్టిపారేశారు. ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ ఏపీ సీఐడీ అధికారులు అదే పొరపాటు చేశారు. మరి ఏపీలో ఏసీబీ కోర్టు మేజిస్ర్టేట్‌ పైన నేను ఉదహరించిన కేసులో మాదిరిగా వ్యవహరిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. అవినీతి కేసులలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లు అరెస్టు కావడం, వారిలో కొందరికి న్యాయస్థానాలలో శిక్షలు పడటం మన దేశంలో కొత్త కాదు. అయితే చంద్రబాబు వ్యవహారాన్ని వారితో పోల్చలేము. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే ఆయన మంత్రివర్గ సమావేశంలో పాల్గొని విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. నిధుల విడుదలతో ఆయనకు ప్రత్యక్ష సంబంధం లేదనే చెప్పాలి. మంత్రివర్గాలు నిర్ణయాలు తీసుకున్న తర్వాత నిబంధనలు, చట్టాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఈ వ్యవహారంలో మంత్రిమండలిలో నిర్ణయమే తీసుకోలేదని సీఐడీ చీఫ్‌ సంజయ్‌ చెప్పుకొచ్చారు.

బాధ్యతగల అధికారి రాజకీయ నాయకుడి వలె వాస్తవాలను వక్రీకరించడం ఏమిటి? ఈ కేసులో నిజంగా తప్పు జరిగినా, నిధుల దుర్వినియోగం జరిగినా అందుకు ప్రథమంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ ప్రేమచంద్రారెడ్డిని బాధ్యుడిని చేయాలి. జగన్‌రెడ్డిపై అవినీతి కేసులను దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు, జగన్‌ కంపెనీలకు నిధులు పంపిన కంపెనీలు, వ్యక్తులకు మేళ్లు చేయడంలో నిబంధనలు పాటించలేదన్న కారణంగా అప్పట్లో పలువురు ఐఏఎస్‌ అధికారులను కూడా అరెస్టు చేశారు. మరికొంతమంది అధికారులపై కేసులు పెట్టారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ప్రత్యేకంగా అరెస్టు చేశారు. ఈ అరెస్టు సందర్భంగా కూడా ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. చంద్రబాబు ప్రధాన నిందితుడని భావించి ఉంటే, అందుకు తగిన ఆధారాలు ఉంటే పగటి పూటే ఆయన ఇంటి వద్దే అరెస్టు చేయవచ్చు. లేదా నోటీసులు ఇచ్చి పిలిపించుకొని అరెస్టు చేసి ఉండవచ్చు. అలా కాకుండా పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి నంద్యాల వెళ్లిన చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటి? విచారణకు సహకరించని పక్షంలో చంద్రబాబును అరెస్టు చేసే అధికారం సీఐడీ అధికారులకు ఎప్పుడైనా ఉంటుంది. జగన్మోహన్‌ రెడ్డిని అవినీతి కేసులలో అరెస్టు చేసినప్పుడు సీబీఐ అధికారులు ఇప్పటిలా హైడ్రామా సృష్టించలేదు. విచారణకు పిలిపించి అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతా చేసి ప్రస్తుత కేసులో చంద్రబాబును ఏ–37వ ముద్దాయిగా పేర్కొనడం విశేషం. వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయడానికి కర్నూలు వెళ్లిన సీబీఐ అధికారులకు ప్రతిఘటన ఎదురు కావడంతో ఉట్టి చేతులతో తిరిగి రావడం మనం చూశాం. రాష్ట్ర పోలీసులు సహకరించకపోవడం వల్లనే సీబీఐ అధికారులు అప్పుడు నిస్సహాయంగా తిరిగి రావాల్సి వచ్చింది.

ఇప్పుడు అదే రాష్ట్ర పోలీసులు మొత్తం నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో నిందితులను అరెస్టు చేయడంలో బిజీగా ఉండిపోయారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి వెళ్లిన డీఐజీ రఘురామ రెడ్డి తన అత్యుత్సాహాన్ని ఎక్కడా దాచుకోలేదు. న్యాయవాదులను కించపరుస్తూ వ్యాఖ్యలు కూడా చేశారు.

సానుభూతి ఫార్ములా..

మొత్తానికి చంద్రబాబు అరెస్టయ్యారు. లండన్‌, ప్యారిస్‌ పర్యటనకు వెళ్లిన జగన్మోహన్‌ రెడ్డి కళ్లలో ఆనందం మెరిసిపోయి ఉంటుంది. తాను మాత్రమే అవినీతిపరుడిని కాదని, చంద్రబాబు కూడా అవినీతిపరుడే అని చెప్పడమే ఈ మొత్తం వ్యవహారంలో జగన్‌ లక్ష్యం అయివుంటుంది. ఇప్పుడు చంద్రబాబుకు కూడా మరక అంటించారు కనుక ఇకనైనా జగన్మోహన్‌ రెడ్డి శాంతిస్తారో లేదో తెలియదు. చంద్రబాబును అరెస్టు చేయడం వెనుక పగ, ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయనను జైలుకు పంపగలిగితే రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చునన్న ఆలోచనలో జగన్‌ ఉన్నారు కాబోలు. అయితే ఈ ఉద్దేశం నెరవేరుతుందో లేదో వేచి చూడాలి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మాటల ప్రకారం గతంలో ఇందిరాగాంధీని అరెస్టు చేసినప్పుడు, ఆ తర్వాత అవినీతి కేసులలో జగన్మోహన్‌ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు వారి పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇప్పుడు 73 ఏళ్ల వయసులో చంద్రబాబును అరెస్టు చేసినందున ఉండవల్లి ఫార్ములా ప్రకారం తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడకుండా ఉంటుందా? రాజకీయాలకే కాదు, రాజకీయ నాయకులకు కూడా నిర్వచనం మారుతోంది.

నాయకుల విషయంలో ప్రజల దృక్పథం మారింది. నాయకుల అవినీతిని ప్రజలు సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. అవినీతి కేసులలో జగన్మోహన్‌ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుడు ఎవరు? అని ప్రజలు మాట్లాడటం విన్నాం. అందుకే తాను నిప్పులా బతికానని చంద్రబాబు చెప్పుకొంటున్నా ప్రజలు విశ్వసించడం లేదు. రాజకీయాల్లో ఉన్న వారందరూ అవినీతికి పాల్పడతారని ప్రజల అభిప్రాయం. ఈ అవినీతి కూడా రెండు రకాలు. రాజకీయ పార్టీల నిర్వహణకు నిధులు అవసరం. అధికారంలో ఉన్న వాళ్లు మేళ్లు చేయడం ద్వారా నిధులు పొందుతారు. ఈ తరహా వ్యవహారాలను ప్రజలు సీరియస్‌గా తీసుకోరు. పార్టీ అవసరాల కోసం కాకుండా సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం అవినీతికి పాల్పడినప్పుడే తంటా అంతా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు శాతం కమీషన్‌ తీసుకొని కాంట్రాక్టులు కేటాయించినప్పటికీ ప్రజలు సీరియస్‌గా తీసుకోలేదు. జగన్మోహన్‌ రెడ్డి రంగప్రవేశం తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డికి మరకలంటాయి. జగన్‌ స్థాపించిన కంపెనీలలోకి వరదలా నిధులు వచ్చి పడ్డాయి. కేవలం నాలుగేళ్లలోనే వ్యాపారపరంగా జగన్మోహన్‌ రెడ్డి బహుముఖంగా విస్తరించారు. అవినీతి అంటే ఇది అని చెప్పవచ్చు. ప్రభుత్వం నుంచి మేళ్లు పొందినవాళ్లు కాంగ్రెస్‌ పార్టీకి ఏమిచ్చారో తెలియదు గానీ జగన్‌ ఏర్పాటు చేసిన కంపెనీల్లో మాత్రం డబ్బు జమ చేశారు. అదే సమయంలో కోల్‌కతాకు చెందిన డొల్ల కంపెనీల నుంచి వందల కోట్లు వచ్చాయి. ఈ కారణంగానే జగన్‌ అవినీతికి పాల్పడ్డారని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. అయితే ప్రత్యేక కారణాల వల్ల అవి విచారణకు నోచుకోవడం లేదు. జగన్మోహన్‌ రెడ్డి అక్రమ సంపాదన కళ్లెదురుగా కనిపిస్తున్నప్పటికీ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తరువాత జగన్‌ను అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి ఏర్పడింది. దేశంలోని అనేక మంది నాయకుల వలె చంద్రబాబు కూడా పార్టీ అవసరాల కోసం డబ్బు తీసుకొని ఉంటారు. ఆయన ఎవరి దగ్గరా డబ్బు తీసుకోలేదని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ మధ్య విలేఖరులతో మాట్లాడుతూ ‘పార్టీ అవసరాల కోసం మేం బరాబర్‌ డబ్బు తీసుకుంటాం.

ఎవరు మాత్రం తీసుకోవడం లేదు?’ అని సవాలు కూడా చేశారు. చంద్రబాబు కూడా అలాగే పార్టీ అవసరాల కోసం తీసుకోకుండా ఎలా సాధ్యం? అయితే చందాల రూపంలో వచ్చే డబ్బుతో సొంత ఆస్తులు కూడబెట్టుకొని ఉంటే అది తప్పే అవుతుంది. అక్రమ సంపాదనతో చంద్రబాబు సింగపూర్‌లో హోటల్‌ నిర్మించారని రాజశేఖర రెడ్డి హయాం నుంచీ ఆరోపిస్తున్నారు. ఇంతవరకూ ఆ విషయాన్ని ఎవరూ రుజువు చేయలేకపోయారు. అలాగే అమరావతిలో చంద్రబాబు బినామీ పేర్లతో వందల ఎకరాలు సమకూర్చుకున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా ఇది కూడా రుజువు చేయలేకపోయారు. వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఎవరైనా రాజకీయ పార్టీలకు నిధులు ఎందుకిస్తారు? ఆ డబ్బుతో తమ భార్యాబిడ్డలకు నగలు, భవంతులు కొనిపెట్టలేరా? తాము నిధులు సమకూర్చిన వాళ్లు అధికారంలోకి వస్తే ఎన్నో కొన్ని మేళ్లు చేయకపోతారా? అన్న ఆశతోనే కదా. ఇప్పుడు కీడు చేయకుండా ఉండటానికి కూడా జగన్‌ వంటి వాళ్లు నిధులు సేకరిస్తున్నారు అది వేరే విషయం. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు కమీషన్‌ ఇచ్చామని ఎవరో చెప్పడమే తప్ప ఆ సొమ్ము చంద్రబాబు ఖాతాల్లోకి వచ్చినట్టు గానీ, ఆయన తీసుకున్నారని చెప్పడానికి గానీ ఆధారాలు లేవు. జగన్‌ కేసులలో అలా కాదే. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మేళ్లు పొందిన వాళ్లు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఆధారాలు ఉన్నాయి. అయినా తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని జగన్‌ చెప్పుకొన్నారు.

ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా రాజకీయ దురుద్దేశంతో కాకుండా వేరే కారణంతో కేసు పెట్టి అరెస్టు చేశారని చెప్పగలరా? ఆదాయపు పన్ను శాఖ ఇటీవల చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు వ్యవహారంలో కూడా జగన్‌ అండ్‌ కో ఇలాగే హడావిడి చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయడం సాధారణ విషయమేనని సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పుడు సెలవిస్తున్నారు. అలా అయితే జగన్మోహన్‌ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసినప్పుడు ఆడవాళ్లను కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి శోకాలు పెట్టించింది ఎందుకో సజ్జల చెప్పాలి.

మారాల్సిన టైమొచ్చింది!

ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనం విషయానికి వద్దాం. చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపితే తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమవుతుందా? అలా అయితే జగన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు వైసీపీ నిర్వీర్యం కాలేదే? ఆయన జైలులో ఉన్నప్పుడు తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల పార్టీ బాధ్యతను నెత్తికెత్తుకున్నారు కదా? ఇప్పుడు అదే విజయమ్మను, షర్మిలను జగన్‌ ఇంటి నుంచీ, పార్టీ నుంచీ గెంటేశారు కదా! నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబును ఎన్ని రోజులు జైల్లో పెట్టగలరు? ఆ సంస్థ ఎండీ ప్రేమచంద్రారెడ్డిని వదిలిపెట్టాక ఈ కేసులో ఇక బలమేం ఉంటుంది? బలం ఉందనే అనుకుందాం. చంద్రబాబును జైలుకే పరిమితం చేస్తే ఆయన కుమారుడు లోకేశ్‌ ఉండనే ఉన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ఆయన తనను తాను రుజువు చేసుకున్నారు. పాదయాత్రకు జనం నుంచి స్పందన పెరుగుతోంది. ఇప్పుడు ఏదో ఒక కారణంపై లోకేశ్‌ను కూడా అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదు. జగన్‌ వంటి వ్యక్తి నుంచి ఫెయిర్‌ పాలిటిక్స్‌ను ఆశించలేము. చంద్రబాబుతో పాటు లోకేశ్‌ను కూడా నిర్బంధించడం జరిగితే ప్రజల్లో సానుభూతి మరింత పెరిగి అది ప్రజాగ్రహంగా మారవచ్చు. అప్పుడు ప్రజలను చైతన్యపరచడానికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌ సతీమణి బ్రహ్మణి ప్రజా క్షేత్రంలోకి రావొచ్చు కూడా. గుణహీనులు పాలకులైతే పరిస్థితులు ఊహించని మలుపులు తీసుకుంటాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేశ్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు అందరినీ గృహనిర్బంధం చేశారు. అన్నమయ్య జిల్లా అంగళ్లు సంఘటన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలోచనతో, సంయమనంతో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి ఏ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా మెలుగుతున్నారు.

దుందుడుకుగా వ్యవహరిస్తే పోలీసులతో కేసులు పెట్టించడానికి జగన్‌ ప్రభుత్వం రెడీగా ఉంది. కేసులలో ఇరుక్కున్న వారందరినీ ఎన్నికల సందర్భంగా అరెస్టు చేసే ప్రమాదం ఉంది. చంద్రబాబును అరెస్టు చేసినంత మాత్రాన పార్టీ శ్రేణులు డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే ఆయన బయటికొస్తారు. కేసుల్లో ఇరుక్కోకూడదన్న బెరుకు స్వభావం కలిగిన చంద్రబాబు ఇప్పటివరకు పిరికితనం ప్రదర్శించారు. ఇప్పుడు ఈ అరెస్టుతో ఆయనలో ఆ బెరుకు కూడా పోతుంది. 30కి పైగా అవినీతి కేసులున్న వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నవారిపై కేసులు ఉండటాన్ని ప్రజలు కూడా సర్వసాధారణంగా భావిస్తున్నారు. నాయకుడి విషయంలో ప్రజల దృక్పథం కూడా మారుతోంది. సోనియాగాంధీ వంటి శక్తిమంతురాలిని ఎదిరించి సొంత పార్టీ పెట్టుకున్నందుకే కదా జగన్మోహన్‌ రెడ్డి పట్ల ఒక వర్గం ప్రజల్లో ఆరాధనా భావం ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేయించినందుకు కూడా జగన్‌ను అభినందించేవాళ్లు ఉంటారు. లోకేశ్‌ విషయమే తీసుకుందాం. పాదయాత్ర చేపట్టడానికి ముందు వరకు ఆయన పప్పు అని జగన్‌ అండ్‌ కో చేసిన ప్రచారాన్ని జనం కూడా నమ్మారు. ఇప్పుడు ఆయన ధిక్కార స్వరాన్ని వినిపించడంతో పాటు ఏ విషయంలో కూడా నాన్చుడు వైఖరి లేకుండా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడాన్ని పార్టీ కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మా గాంధీతో పాటు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను కూడా ఎంతో మంది ఆరాధించారు. ఈ ఇరువురు మహానుభావులవి భిన్నమైన వ్యక్తిత్వాలు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించినందునే నేతాజీని ఆనాడు ఆరాధించారు. భగత్‌ సింగ్‌ను ఇప్పటికి కూడా యువత ఆరాధిస్తున్నది. ప్రజల దృక్పథం ఇంకా మారినందున ఇప్పుడైతే మహాత్మాగాంధీ కంటే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌నే ఎక్కువగా ఆరాధించే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న బలమైన శక్తులను ధిక్కరించిన వారికే ఆదరణ ఉంటుంది. గతంలో జగన్‌కు ఇటువంటి ఆదరణే లభించింది. ఇప్పుడు లోకేశ్‌కు కూడా ఆదరణ లభిస్తోంది. అయితే ధిక్కారం నియంతృత్వానికి దారి తీయకూడదు.

ఇప్పుడు జగన్‌ రెడ్డి పోకడలు నియంతృత్వాన్ని తలపిస్తున్నాయి. అందుకే ఆయనను ధిక్కరించే వారికి తప్పకుండా ఆదరణ లభిస్తుంది. ఏదైతేనేమి జగన్‌రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ముసలోడు అని తాము ఎగతాళి చేస్తున్న చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరిగే అవకాశం లేదంటారా? అందుకే తెలుగుదేశం కార్యకర్తలకు ముందస్తుగా శుభాకాంక్షలు చెబుదాం. అరెస్టుకు ముందురోజు రాత్రి నంద్యాలలో చంద్రబాబు పాల్గొన్న సభకు జనం విపరీతంగా వచ్చారు. ప్రజల్లో మార్పు మొదలైంది. నిర్బంధించడం వల్ల ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు. పోలీసులను అతిగా ఉపయోగించే ఏ ప్రభుత్వమైనా తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదు. అవినీతి కేసులలో తన జీవితంలో అరెస్టు కాకూడదని చంద్రబాబు ఇప్పటివరకూ భావిస్తూ వచ్చారు. జగన్‌రెడ్డి పుణ్యమా అని అవినీతి కేసులోనే ఆయన అరెస్టయ్యారు. నిండా మునిగాక చలేమిటి? అంటారు. చంద్రబాబు కూడా తనను తాను మార్చుకోవడానికి దీన్నొక అవకాశంగా మలచుకోవాలి. జగన్‌రెడ్డి అవినీతికి పాల్పడలేదని నమ్మి జనం ఆయనకు ఓట్లు వేయలేదే? ఆయన అవినీతికి పాల్పడ్డారని అంగీకరిస్తూనే, ఎవరు మాత్రం అవినీతికి పాల్పడటం లేదని సర్ది చెప్పుకొని మరీ అధికారం కట్టబెట్టారు. ప్రజల దృక్పథాన్ని పరిశీలించి అందుకు అనుగుణంగా మారడానికి ప్రయత్నించాల్సిన అవసరం చంద్రబాబు ముందు ఉంది. అవినీతి కేసులో తనను అరెస్టు చేశారని కుంగిపోవాల్సిన అవసరం లేదు. అయినా జగన్మోహన్‌ రెడ్డి ఆదర్శంగా ఉండనే ఉన్నారు. పదహారు నెలలు జైల్లో పెట్టారని కుంగిపోయి ఉంటే జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా? సీఐడీ అధికారులు చంద్రబాబుపై పెట్టిన కేసు న్యాయ సమీక్షకు నిలబడదు. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన నోటీసు కూడా సమీక్షకు నిలవదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా భయం లేదా బెరుకును విడనాడితే ఆయనకు అంతా మంచే జరుగుతుంది. ఆర్థిక నేరస్తుడి పాలనలో పరిస్థితులు ఇలాగే ఉంటాయని ఊహించలేక పోవడమే చంద్రబాబు అండ్‌ కో చేసిన తప్పు. ఇప్పటికైనా క్రిమినల్‌ సైకాలజీని అధ్యయనం చేయడం తెలుగుదేశం పార్టీకి అత్యంత అవసరం. సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందని గుర్తించాలి. ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవడానికి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపజేసి దొంగ ఓట్లు నమోదు చేయించే కుయుక్తులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులన్నీ ఆందోళన పథంలో బిజీగా ఉన్నందున సందట్లో సడేమియా అన్నట్టుగా దొంగ ఓట్ల జాతరకు తెర తీయవచ్చు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో జగన్మోహన్‌ రెడ్డి ఇది వరకే డాక్టరేట్‌ పొందారు కూడా!

పాదయాత్ర చేపట్టడానికి ముందు వరకు లోకేశ్‌ పప్పు అని జగన్‌ అండ్‌ కో చేసిన ప్రచారాన్ని జనం కూడా నమ్మారు. ఇప్పుడు ఆయన ధిక్కార స్వరాన్ని వినిపించడంతో పాటు

ఏ విషయంలో కూడా నాన్చుడు వైఖరి లేకుండా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడాన్ని పార్టీ కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. అధికారంలో ఉన్న బలమైన శక్తులను ధిక్కరించిన వారికే ఆదరణ ఉంటుంది. గతంలో జగన్‌కు ఇటువంటి ఆదరణే లభించింది. ఇప్పుడు లోకేశ్‌కు కూడా ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు జగన్‌రెడ్డి పోకడలు నియంతృత్వాన్ని తలపిస్తున్నాయి. అందుకే ఆయనను ధిక్కరించే వారికి తప్పకుండా ఆదరణ లభిస్తుంది. ఏదైతేనేమి జగన్‌రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ముసలోడు అని తాము ఎగతాళి చేస్తున్న చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరిగే అవకాశం లేదంటారా? అందుకే తెలుగుదేశం కార్యకర్తలకు ముందస్తుగా శుభాకాంక్షలు చెబుదాం.

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మాటల ప్రకారం గతంలో ఇందిరాగాంధీని అరెస్టు చేసినప్పుడు, ఆ తర్వాత అవినీతి కేసులలో జగన్మోహన్‌ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు వారి పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడి ఎన్నికల్లో లబ్ధి పొందారు.

ఇప్పుడు 73 ఏళ్ల వయసులో చంద్రబాబును అరెస్టు చేసినందున ఉండవల్లి ఫార్ములా ప్రకారం తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడకుండా ఉంటుందా?

విచిత్రం ఏమిటంటే నిధులు విడుదల చేయడంలోనే కాకుండా అందుకు సంబంధించిన ఒప్పందాలపై నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా, సంబంధిత శాఖ కార్యదర్శిగా సంతకాలు చేసిన ప్రేమచంద్రారెడ్డిని మాత్రం కేసులో ముద్దాయిగా పేర్కొనలేదు.

చంద్రబాబు ప్రధాన నిందితుడని భావించి ఉంటే, అందుకు తగిన ఆధారాలు ఉంటే పగటి పూటే ఆయన ఇంటివద్దే అరెస్టు చేయవచ్చు.

లేదా నోటీసులు ఇచ్చి పిలిపించుకొని అరెస్టు చేసి ఉండవచ్చు. అలా కాకుండా పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి నంద్యాల వెళ్లిన చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటి? విచారణకు సహకరించని పక్షంలో చంద్రబాబును అరెస్టు చేసే అధికారం సీఐడీ అధికారులకు ఎప్పుడైనా ఉంటుంది. జగన్మోహన్‌ రెడ్డిని అవినీతి కేసులలో అరెస్టు చేసినప్పుడు సీబీఐ అధికారులు ఇప్పటిలా హైడ్రామా సృష్టించలేదు. విచారణకు పిలిపించి అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతా చేసి ప్రస్తుత కేసులో చంద్రబాబును ఏ–37వ ముద్దాయిగా పేర్కొనడం విశేషం.

అవినీతి కేసులలో జగన్మోహన్‌ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుడు ఎవరు? అని ప్రజలు మాట్లాడటం విన్నాం. అందుకే తాను నిప్పులా బతికానని చంద్రబాబు చెప్పుకొంటున్నా ప్రజలు విశ్వసించడం లేదు.

రాజకీయాల్లో ఉన్న వారందరూ అవినీతికి పాల్పడతారని ప్రజల అభిప్రాయం.

ఈ అవినీతి కూడా రెండు రకాలు. రాజకీయ పార్టీల నిర్వహణకు నిధులు అవసరం.

ఈ తరహా వ్యవహారాలను ప్రజలు సీరియస్‌గా తీసుకోరు. పార్టీ అవసరాల కోసం కాకుండా సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం అవినీతికి పాల్పడినప్పుడే తంటా అంతా. చంద్రబాబు కూడా పార్టీ అవసరాల కోసం డబ్బు తీసుకొని ఉంటారు.

ఆయన ఎవరి దగ్గరా డబ్బు తీసుకోలేదని చెప్పడం అతిశయోక్తి అవుతుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ మధ్య విలేఖరులతో మాట్లాడుతూ ‘పార్టీ అవసరాల కోసం మేం బరాబర్‌ డబ్బు తీసుకుంటాం. ఎవరు మాత్రం తీసుకోవడం లేదు?’ అని సవాలు కూడా చేశారు.

Updated Date - 2023-09-10T05:53:14+05:30 IST