RK KOTHAPALUKU: సీఎంలకు ఉక్కపోత!

ABN , First Publish Date - 2023-03-12T01:36:25+05:30 IST

తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇరువురినీ సీబీఐ, ఈడీల రూపంలో కష్టాలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఎండలు ముదరక ముందే జగన్మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌ ఉక్కపోతకు గురవుతున్నారు...

RK KOTHAPALUKU: సీఎంలకు ఉక్కపోత!

తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇరువురినీ సీబీఐ, ఈడీల రూపంలో కష్టాలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఎండలు ముదరక ముందే జగన్మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌ ఉక్కపోతకు గురవుతున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉండగా, ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కేసీఆర్‌ బిడ్డ కవితను అరెస్టు చేయడానికి ఈడీ సిద్ధంగా ఉంది. ఈ రెండు పరిణామాలూ ఇరువురు ముఖ్యమంత్రులకూ రాజకీయంగా ఎంతో కొంత నష్టం చేస్తాయి. దీంతో అటు జగన్మోహన్‌ రెడ్డి, ఇటు కేసీఆర్‌ రాజకీయ ఎత్తుగడలకు తెర తీశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్‌ రెడ్డిని రక్షించడానికి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు ఉన్న అనుబంధం వల్ల ఈ కేసు నుంచి అవినాశ్‌ కుటుంబాన్ని తప్పించవచ్చునని జగన్‌ ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు. అయితే ఇంతకాలంగా అవినాశ్‌ రెడ్డిపై చర్యల విషయంలో తాత్సారం చేస్తూ వచ్చిన సీబీఐ ఇప్పుడు వేగం పెంచింది. ఈ పరిణామంతో కంగుతిన్న జగన్‌ అండ్‌ కో ఇప్పుడు వివేకాను హత్య చేయించింది ఆయన ఏకైక కుమార్తె డాక్టర్‌ సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర రెడ్డి అన్న ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వాస్తవానికి వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డి, ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత పీకల వరకు ఇరుక్కుపోయారు. వివేకా హత్యలో అవినాశ్‌ రెడ్డి పాత్ర బహిరంగ రహస్యమే అయినప్పటికీ రాజకీయ కారణాలతో ఇప్పటివరకు సీబీఐ మీన మేషాలు లెక్కించాల్సి వచ్చింది.

ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టే అవకాశం లభించడంతో కవితపై చర్యలు తీసుకోవాలంటే అవినాశ్‌ రెడ్డిని కూడా అరెస్టు చేయక తప్పని పరిస్థితి భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం జరిగిన వివేకా హత్య కేసులో నిందితులు ఎవరో తెలిసినా ఇప్పటి వరకు చర్య తీసుకోకుండా, లిక్కర్‌ కుంభకోణంలో కవితను మాత్రమే అరెస్టు చేస్తే కేసీఆర్‌ సానుభూతి పొందడానికి ప్రయత్నించే అవకాశం ఉన్నందున, అవినాశ్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి సీబీఐకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారన్న అభిప్రాయం వినపడుతోంది. ఈ నేపథ్యంలో ఒక ముస్లిం మహిళతో వివేకానంద రెడ్డికి రెండవ వివాహం జరగడం, వారికి ఒక కుమారుడు జన్మించడం వంటి విషయాలతో పాటు ఆస్తుల కోసం తలెత్తిన వివాదం వల్లనే వివేకాను ఆయన కుమార్తె, అల్లుడు కలిసి హత్య చేయించారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం మొదలెట్టింది. ఈ క్రమంలో తమ సోషల్‌ మీడియాను కూడా రంగంలోకి దించి, కుటుంబ పరువు కోసం అవినాశ్‌ రెడ్డి ఇంతకాలం నిందలు మోశారని బిల్డప్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. హత్య జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించిన జగన్‌ అండ్‌ కో ఇప్పుడు సునీత దంపతులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన జగన్‌ అండ్‌ కో ఇప్పుడు సీబీఐ విచారణను కూడా చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని ప్రచారం చేయడానికీ వెనుకాడటం లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్‌ రెడ్డి మొదటి నుంచీ అవినాశ్‌ రెడ్డి కుటుంబాన్ని రక్షించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో కన్నూ నాదే, వేలూ నాదే అని అసెంబ్లీలో ప్రకటించిన జగన్మోహన్‌ రెడ్డి.. ఇప్పుడు వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన డాక్టర్‌ సునీతను కూడా వదులుకోవడానికి సిద్ధపడటమే కాకుండా, ఆ వేలు తమది కాదని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ కేసులో చిక్కుకున్న చెల్లి కవితకు సంఘీభావం తెలపడం కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ వరకు వెళ్లగా జగన్మోహన్‌ రెడ్డి మాత్రం చిన్నప్పటి నుంచి కలసిమెలసి పెరిగిన చెల్లి సునీతను తండ్రిని చంపించిన హంతకురాలిగా ప్రచారం చేయిస్తున్నారు.

ఎంత తేడా? అవినాశ్‌కు మద్దతుగా, డాక్టర్‌ సునీతకు వ్యతిరేకంగా వైసీపీ సోషల్‌ మీడియాను రంగంలోకి దించారంటే జగన్‌రెడ్డిని వెనుక నుంచి ఆడిస్తున్నది ఎవరో ఊహించుకోవచ్చు. అయితే సీబీఐ అధికారులు ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దర్యాప్తు చేయకుండా దస్తగిరి వాంగ్మూలంపైనే ఆధారపడి ఉంటే జగన్‌రెడ్డి మొదలెట్టిన ప్రచారాన్ని జనం నమ్మేవాళ్లు కావొచ్చు. గూగుల్‌ టేకౌట్‌ అనే పదాన్ని సీబీఐ ఎప్పుడైతే వాడిందో అప్పటి నుంచి జగన్‌ అండ్‌ కో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. ‘ఆ పదమే ఇప్పటివరకు వినలేదు. గూగుల్‌ టేకౌట్‌ ఎక్కడి నుంచి వచ్చింది’ అని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారంటేనే వారి పరిస్థితి తెలుస్తోంది. గూగుల్‌ టేకౌట్‌ పరిజ్ఞానాన్ని ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాలలోనే వాడారు. మొదటిసారిగా వివేకా కేసులో సీబీఐ అధికారులు గూగుల్‌ టేకౌట్‌ను వాడుకున్నారు. దీనివల్ల హత్యకు ముందు, తర్వాత నిందితుల కదలికలు సీబీఐకి తెలిశాయి. ఈ పరిస్థితిని జగన్‌ అండ్‌ కో ఊహించి ఉండరు. ఇప్పుడు డాక్టర్‌ సునీతా రెడ్డి దంపతులే వివేకాను హత్య చేయించారని సొంతంగా విచారణ జరిపి, తీర్పు కూడా ఇస్తున్న వైసీపీ కానీ, ఆ పార్టీ సోషల్‌ మీడియా కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. డాక్టర్‌ సునీత దంపతులే నిందితులని అనుకుంటే హంతకులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నవారు హత్యకు ముందు, తర్వాత భాస్కర్‌ రెడ్డి నివాసంలో ఎందుకు ఉన్నారు? అన్న ప్రశ్నకు జగన్‌ అండ్‌ కో సమాధానం చెప్పగలదా? వైసీపీ చేస్తున్న ప్రచారమే నిజమైతే డాక్టర్‌ సునీత భర్త రాజశేఖర రెడ్డితో భాస్కర్‌రెడ్డి చేతులు కలిపారని భావించాలా? హత్య జరిగిన రోజు అంటే 2019 మార్చి 14వ తేదీ రాత్రి నుంచి భాస్కర్‌రెడ్డి ఫోన్లు ఎందుకు ఆఫ్‌ చేశారు? ఆస్తి తగాదాల వల్లనే హత్య జరిగిందని అనుకుంటే వివేకానంద రెడ్డి పేరిట ఉన్న మూడున్నర కోట్ల ఆస్తుల కోసం నలభై కోట్ల సుపారీ ఇస్తారా ఎవరైనా? ఎన్నికలకు ముందు కోడి కత్తి కేసులో కూడా ఇలాగే డ్రామాను రక్తి కట్టించిన అనుభవం ఉన్న జగన్‌ అండ్‌ కో ఇప్పుడు మళ్లీ అటువంటి ప్రయత్నమే చేస్తోంది. అయితే సీబీఐ అధికారులు శాస్ర్తీయంగా చేపట్టిన దర్యాప్తు వల్ల వారి పప్పులు ఇప్పుడు ఉడక్కపోవచ్చు. వివేకా హత్యతో అవినాశ్‌ కుటుంబానికి సంబంధం ఉన్నట్టు సీబీఐ వద్ద ఆధారాలు ఉండివుంటే తండ్రీ కొడుకులను సాక్షులుగా ఎందుకు పిలుస్తున్నారు? అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే వారిని సాక్షులుగా పిలవడానికి బలమైన కారణం ఉందని అంటున్నారు.

హత్య జరిగిన తర్వాత నేరం జరిగిన ప్రదేశం నుంచి జగన్మోహన్‌ రెడ్డి దంపతులతో అవినాశ్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్టు సీబీఐ వద్ద సమాచారం ఉంది. అయితే జగన్‌ దంపతులతో ఏం మాట్లాడిందీ అవినాశ్‌ రెడ్డి నోటి నుంచి వినడానికే వారిని సాక్షులుగా పిలిపించారని అంటున్నారు. అయితే తనను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అయిన విషయం తెలుసుకున్న అవినాశ్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో, తండ్రీకొడుకుల పాత్ర ఉందని వారిని అరెస్టు చేయబోతున్నామని హైకోర్టుకు సీబీఐ తెలియజేయాల్సి వచ్చింది. అవినాశ్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ లభిస్తే అరెస్టు చేయడం కష్టం కనుక తాము తీసుకోబోయే చర్యలను హైకోర్టుకు సీబీఐ అధికారులు చెప్పాల్సి వచ్చిందని అంటున్నారు. హత్యానంతరం జగన్‌ దంపతులతో అవినాశ్‌ రెడ్డి ఏం మాట్లాడారు? పనైపోయిందని చెప్పారా? తదుపరి ఏం చేయాలో సలహా తీసుకున్నారా? లేక హత్య సమాచారం మాత్రమే ఇచ్చారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయం స్పష్టమైతే వివేకా హత్యలో జగన్‌ దంపతుల ప్రమేయం ఏ మేరకు ఉన్నదో కూడా తేలిపోతుంది. నిజానికి వివేకా హత్యతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దంపతులకు ప్రమేయం ఉందని ఇప్పటివరకు ఎవరూ అనుమానించలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి దంపతుల ప్రమేయం ఎంతో కొంత ఉందేమోనన్న అనుమానానికి ఆస్కారమిస్తున్నాయి. వివేకాను భాస్కర్‌ రెడ్డి కుటుంబమే చంపించిందని కడప జిల్లా ప్రజలతో పాటు లోకం కూడా కోడై కూస్తున్న తరుణంలో డాక్టర్‌ సునీత దంపతులను దోషులుగా చిత్రీకరించడానికి జగన్‌రెడ్డి కుటుంబానికి చెందిన నీలి మీడియా చేస్తున్న ప్రచారం చూస్తే ఈ అనుమానం కలగక మానదు. వివేకానంద రెడ్డి కుటుంబాన్ని కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంలో భాగంగా జగన్‌రెడ్డి పరిగణిస్తూ ఉండివుంటే డాక్టర్‌ సునీత దంపతులకు వ్యతిరేకంగా ఇటువంటి ప్రచారానికి ఆయన అనుమతించి ఉండేవారు కారు.

ఈ ప్రశ్నలకు బదులేది?

జగన్‌ అండ్‌ కో చేస్తున్న ప్రచారం నిజమేనని నమ్ముదామా? అంటే తమకు న్యాయం చేయాలని డాక్టర్‌ సునీత ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఇంత న్యాయ పోరాటం చేసి ఉండేవారు కాదు. నిందితులకు శిక్ష పడాలని పట్టుబట్టి సీబీఐ విచారణ కోసం డాక్టర్‌ సునీత హైకోర్టును ఆశ్రయించి ఉండకపోతే ఈ కేసు ఎప్పుడో అటకెక్కేది. తండ్రిని చంపుకొందన్న అపవాదును మోయాల్సిన అవసరం డాక్టర్‌ సునీతకు ఏర్పడి ఉండేది కాదు. ఈ హత్యలో డాక్టర్‌ సునీత దంపతుల పాత్ర ఉండి ఉంటే కేసు దర్యాప్తు ఇంతదూరం వచ్చి ఉండేది కూడా కాదు. పోయిన మనిషి ఎలాగూ పోయాడు, ఇప్పటికైనా డాక్టర్‌ సునీతకు నచ్చజెప్పవలసిందిగా భారతీరెడ్డి తల్లి సుగుణమ్మ జగన్‌ తల్లి విజయలక్ష్మిని కోరవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే వివేకా హత్యకు బలమైన కారణాలే ఉన్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. తనపై దాఖలైన అవినీతి కేసులలో తనకు శిక్షపడితే తన స్థానంలో భార్య భారతి ముఖ్యమంత్రి అవుతారని జగన్మోహన్‌ రెడ్డి చాలా సందర్భాలలో తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం విదితమే. జగన్‌రెడ్డి భావించినట్టు తన భార్య భారతిని ముఖ్యమంత్రిని చేయాలంటే షర్మిల రూపంలో ప్రతిబంధకం ఎదురయ్యే అవకాశం ఉంది. జగన్‌ జైలుకు వెళితే ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన సొంత చెల్లి షర్మిల పోటీ పడే అవకాశం ఉంది. అదే జరిగితే వివేకానంద రెడ్డి జీవించి ఉంటే షర్మిలకే మద్దతు ఇచ్చివుండేవారని దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఒకరు చెప్పారు. ఈ కారణంగానే ముందుగా వివేకా అడ్డు తొలగించుకొని ఆ తర్వాత షర్మిలను బయటకు గెంటారని రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. భారతికి లైన్‌ క్లియర్‌ చేయడానికే ఇదంతా జరిగిందన్న అభిప్రాయం వైఎస్‌ఆర్‌ కుటుంబంలో బలంగా ఉంది. సీబీఐ దర్యాప్తు కూడా ఈ కోణంలోనే జరుగుతోంది.

ఇది గమనించిన జగన్‌ అండ్‌ కో ఎదురుదాడిని ఎంచుకున్నారు. వివేకా కేసు ఇంత దూరం రావడానికి కారణమైన డాక్టర్‌ సునీతను దోషిగా తెరపైకి తెస్తున్నారు. ఈ విషయంలో సక్సెస్‌ అయితే భవిష్యత్తులో భారతీ రెడ్డికి అడ్డుగా ఎవరూ ఉండరు. అయితే భార్యపై మమకారంతో సొంత కుటుంబాన్నే తృణప్రాయంగా వదులుకోవడానికి కూడా జగన్మోహన్‌ రెడ్డి వెనుకాడకపోవడాన్ని మాత్రం ఆ దివంగత నేత కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. హత్య జరిగిన నాలుగేళ్ల తర్వాత అయినా వివేకా కేసు తుది దశకు చేరుకుందన్న అభిప్రాయం కలుగుతున్నప్పటికీ చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని శిక్ష నుంచి తప్పించుకోవడంలో డాక్టరేట్‌ చేసిన జగన్‌ అండ్‌ కో ఇప్పుడు మౌనంగా ఉంటుందని అనుకోలేం. కంచే చేను మేస్తున్నట్టు సీబీఐ అధికారులే అన్యాయం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? అని అవినాశ్‌ రెడ్డి వాపోవడాన్ని మించిన నటన ఉంటుందా? నటన విషయంలో ఇతగాడు జగన్‌తో పోటీపడుతున్నందున ఆస్కార్‌ అవార్డుకు అర్హత సాధించినట్టే! పదకొండేళ్ల క్రితం బెయిల్‌పై బయటికి వచ్చి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పదవీ కాలాన్ని కూడా పూర్తిచేసుకోబోతున్న జగన్‌రెడ్డి ఎంతటి ఘటనా ఘటన సమర్థుడో తెలియడం లేదా? పుష్కరం క్రితం నమోదైన కేసులలో విచారణ జరగకుండా అడ్డుకోగలుగుతున్న జగన్‌ అండ్‌ కోకు వివేకా హత్య కేసులో ఆటంకాలు సృష్టించడం కష్టం కాదు కదా! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంపై దూకుడు పెంచి ఉండకపోతే వివేకా హత్య కేసు కూడా నానుతూ ఉండేదన్న అభిప్రాయంలో నిజం లేకపోలేదు. అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయకుండా కవితను అరెస్టు చేస్తే భారతీయ జనతా పార్టీ సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చేది. ఈ కారణంగానే జగన్‌రెడ్డి ఎంతగా ప్రాధేయపడుతున్నప్పటికీ వివేకా హత్య కేసులో సీబీఐకి కేంద్రంలోని పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిందని చెబుతున్నారు. ఈ పరిస్థితులలో జగన్‌ అండ్‌ కో ఎన్ని విన్యాసాలు ప్రదర్శిస్తారో, మరెన్ని కపట నాటకాలకు తెర తీస్తారో వేచిచూద్దాం!

మళ్లీ తెలంగాణ పాట!

ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ కవిత విషయానికి వద్దాం. తండ్రి హత్య కేసులో తనకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ సునీతా రెడ్డి ఆవేదన పడుతున్న సమయంలోనే, తనకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణకు చెందిన కవిత రోదిస్తున్నారు. ఈ రెండు సందర్భాలలోనూ విచారణ జరుపుతున్నది కేంద్ర సంస్థలే. అయితే ఒక కేసులో ఇంతకాలం తాత్సారం జరగ్గా, రెండవ కేసులో ఉత్సాహం కనబడుతోంది. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కవిత ఇరుక్కోవడం మాత్రం స్వయంకృతాపరాధమే. ఈ కేసులో కుమార్తె చిక్కుకున్న విషయం తెలుసో, లేదో తెలియదు గానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నపళంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీ అంటూ ప్రకటించుకున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పెద్దలను ఇరికించడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పటికే లిక్కర్‌ కుంభకోణంలో కవితకు ఉచ్చు బిగుసుకుంది. ఏజెన్సీల ద్వారా ప్రత్యర్థి పార్టీలను ఇరికించి ఇబ్బందిపెట్టడంలో ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమాత్రం తీసిపోరు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డిని జైలుకు పంపిన అనుభవం కూడా ఉండటంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. తాను ఎవరితో ఢీకొట్టబోతున్నది కూడా విస్మరించి ప్రాథమిక స్థాయిలోనే తప్పులు చేశారు. రేవంత్‌ రెడ్డి కేసులో అవినీతి నిరోధక శాఖను ప్రయోగించిన కేసీఆర్‌, ఫాంహౌజ్‌ వ్యవహారంలో అందుకు విరుద్ధంగా సైబరాబాద్‌ పోలీసులను ప్రయోగించారు. దీంతో కేసు బలహీనపడింది. వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున అది తేలాక ఫాంహౌజ్‌ వ్యవహారం కూడా సీబీఐ చేతికే వెళుతుంది. ఆ రోజు డబ్బు చేతులు మారనందున కేసు బలహీనపడిన విషయాన్ని గుర్తించకుండా కేసీఆర్‌ రంకెలు వేయగా, ఢిల్లీ బీజేపీ పెద్దలు మాత్రం లిక్కర్‌ కుంభకోణంలో పకడ్బందీగా పథకం రచించి కవితతో పాటు అందరినీ ఇరికించారు. దీంతో కేసీఆర్‌ ఆత్మరక్షణలో పడిపోయారు. ప్రాంతీయవాదాన్ని వదిలి జాతీయవాదాన్ని నెత్తికెత్తుకున్న కేసీఆర్‌, ఇప్పుడు సొంత బిడ్డ కవిత చిక్కుల్లో పడటంతో మళ్లీ ప్రాంతీయవాదాన్ని అందుకుంటున్నారు.

తనకు ఈడీ నోటీసులు ఇచ్చినంత మాత్రాన తెలంగాణ తలవంచదని కవిత చెప్పుకోవడం ఇందులో భాగమే. కేసీఆర్‌ కుటుంబంలో ఎవరికి ఎటువంటి సమస్య ఏర్పడినా తెలంగాణ సమాజం విలవిల్లాడిపోవాలని ఎనిమిదేళ్ల తర్వాత కూడా కోరుకోవడంలోనే గడసరితనం ఉంది. తెలంగాణ ప్రజలకు చెప్పే ఢిల్లీ లిక్కర్‌ వ్యాపారంలో కవిత వేలు పెట్టారా? లేదే! అలాంటప్పుడు ఆమెకు ఈడీ నోటీసు ఇచ్చినా, అరెస్టు చేసినా తెలంగాణ సమాజానికి ఏమి సంబంధం? తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించే బిల్లును ఆమోదించాలంటూ కవిత ఢిల్లీలో దీక్ష కూడా చేశారు. మరోవైపు బిడ్డ కోసం కేసీఆర్‌ రంగంలోకి దిగారు. కవితకు అండగా తన కుమారుడు కేటీఆర్‌తో పాటు మేనల్లుడు హరీశ్‌రావును కూడా ఢిల్లీకి పంపారు. రాజకీయంగా కేసీఆర్‌ ఎన్ని విన్యాసాలు ప్రదర్శించినా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా మాత్రం తాము చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ చట్టం కింద కవితను పకడ్బందీగా ఇరికించారు. లిక్కర్‌ కుంభకోణంలో తొలుత సీబీఐ రంగంలోకి దిగినప్పటికీ ఇప్పుడు ఈడీ క్రియాశీలంగా పనిచేస్తున్నది.

పీఎంఎల్‌ఏ చట్టం సెక్షన్‌ 24 ప్రకారం నిందితులే తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కవితకు వ్యతిరేకంగా ఈడీ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆడిటర్‌ బుచ్చిబాబుతో పాటు కవిత బినామీ అని చెబుతున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఇప్పటికే సెక్షన్‌ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. దీంతో మొత్తం అందరి జుట్టూ ఢిల్లీ పెద్దల చేతికి చిక్కింది. తన బిడ్డ కవితకు కష్టాలు తప్పవని గుర్తించిన కేసీఆర్‌, పూర్వపు తెలంగాణ రాష్ట్ర సమితిని రంగంలోకి దించారు. కవితకు నైతిక మద్దతు ఇవ్వడం కోసం పార్టీ నాయకులంతా ఢిల్లీకి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ వ్యూహం ఎలా ఉండబోతున్నదన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు తన ఎత్తుగడలతో తెలంగాణలో రాజకీయ పార్టీలను ముప్పతిప్పలు పెడుతూ వచ్చిన కేసీఆర్‌, మొదటిసారిగా ఆత్మరక్షణలో పడ్డారు. తాడిని తన్నే వాడుంటే వాడి తలదన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అనడానికి ఇదే నిదర్శనం. ఒక మహిళగా కవిత లిక్కర్‌ కుంభకోణంలో ఇరుక్కోవడం కేసీఆర్‌కు ఇబ్బందికర అంశమే. అవినీతి కేసులలో అరెస్టులు జరిగినప్పుడు ఆయా నాయకులకు సానుభూతి వచ్చిన దాఖలాలు లేవు. ఏడు పదుల వయసు దాటినా కూడా జైలుశిక్ష అనుభవించిన ఓం ప్రకాశ్‌ చౌతాలా, లాలూ ప్రసాద్‌ వంటి వారికి ప్రజల్లో సానుభూతి లభించలేదు. జగన్మోహన్‌ రెడ్డికి కూడా తండ్రి రాజశేఖర రెడ్డి అకాల మరణం సంభవించి ఉండకపోతే సానుభూతి లభించి ఉండేది కాదు.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కుటుంబానికి తెలంగాణ సెంటిమెంట్‌ అక్కరకు వస్తుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఢిల్లీ దాకా వెళ్లి లిక్కర్‌ వ్యాపారంలో వేలు పెట్టిన కవిత కోసం తెలంగాణ సమాజం రోడ్డు మీదకు వస్తుందా? అంటే సందేహమే! మద్యం అంటేనే మహిళలలో వ్యతిరేకత ఉంటుంది. అలాంటప్పుడు ఒక మహిళగా ఉండి లిక్కర్‌ వ్యాపారంలో కవిత జోక్యం చేసుకోవడం నిజమైతే ప్రజల సానుభూతి లభించే అవకాశం లేదు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినందునే తన బిడ్డను లిక్కర్‌ కుంభకోణంలో ఇరికించారని కేసీఆర్‌ చెప్పుకోవచ్చును గానీ ప్రజలు ఏమేరకు ఆలకిస్తారన్నది అనుమానమే. ఈ కారణంగానే మహిళా రిజర్వేషన్ల కోసం శుక్రవారంనాడు ఢిల్లీలో కవిత నిర్వహించిన దీక్షకు ప్రతిపక్షాల నుంచి చెప్పుకోదగిన మద్దతు లభించలేదు. అయితే ప్రతిపక్షాలపైకి సీబీఐ, ఈడీలను ప్రయోగించి ఢిల్లీ పెద్దలు వేధిస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉన్నందున తన బిడ్డను కూడా అలాగే వేధిస్తున్నారని కేసీఆర్‌ చెప్పుకోవచ్చు. కాకపోతే రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఆయన వేధించిన ఉదంతాలు కూడా అదే సమయంలో ప్రజలకు గుర్తుకొస్తాయి. అధికారంలో ఉన్నవారు కేసులు పెట్టడం, అవన్నీ కక్ష సాధింపు చర్యలే అని ప్రతిపక్షాలు వాపోవడం మన దేశంలో పరిపాటే. ఇప్పుడు మహిళా బిల్లును రక్షణ కవచంగా వాడుకోవడానికి కవిత ప్రయత్నించారు. రేపు జగన్‌రెడ్డి కూడా ‘అవినీతిపరులు రాజకీయాల్లో ఉండకూడదు’ అనే బిల్లు తేవాలని ధర్నా చేసినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి అవినాశ్‌ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, బిడ్డ కవిత రూపంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ కష్టాలు మొదలయ్యాయి. ఈ ఆటలో ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ పెద్దలదే పైచేయిగా ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఏదేమైనా ‘అనువుగాని చోట అధికులమనరాదు..’ అన్న సత్యాన్ని కేసీఆర్‌ తెలుసుకుంటే మంచిది!

ఆర్కే

Updated Date - 2023-03-12T04:16:33+05:30 IST