Share News

కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటి?

ABN , First Publish Date - 2023-12-06T02:15:34+05:30 IST

కాలం ఎంత వేగంగా పయనిస్తోందని? రైలు ప్రయాణంలో చెట్లూ, ఊళ్లూ, మనుషులూ వేగంగా వెనక్కి వెళుతున్నట్లు చరిత్ర ప్రయాణంలో రాజకీయ నాయకులూ, ఘటనలూ...

కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటి?

కాలం ఎంత వేగంగా పయనిస్తోందని? రైలు ప్రయాణంలో చెట్లూ, ఊళ్లూ, మనుషులూ వేగంగా వెనక్కి వెళుతున్నట్లు చరిత్ర ప్రయాణంలో రాజకీయ నాయకులూ, ఘటనలూ కూడా వేగంగా వెనక్కి వెళుతున్నట్లనిపిస్తోంది. ఇంకా తుగ్లక్ రోడ్‌లో కేసీఆర్ నివాసంలోని ఒక గదిలో జయశంకర్, కోదండరామ్ వివిధ పార్టీల నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖలు సేకరించే విషయంపై మాట్లాడుతున్నట్లు, కేసీఆర్ మీడియాతో పాటు రకరకాల వ్యక్తులతో చర్చిస్తున్నట్లు, జంతర్ మంతర్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ నిరాహార దీక్ష చేస్తున్నట్లు, ఇండియా గేట్ వద్ద చెట్టుకు ఆదిరెడ్డి ఉరేసుకుని ఊగుతున్నట్లు, తెలంగాణ జర్నలిస్టులు మౌలంకర్ హాలులో నిర్వహించిన సభలో గద్దర్ ‘పొడుస్తున్న పొద్దుమీద..’ అంటూ ఆలపిస్తున్నట్లు, పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే కళ్లు మండిస్తునట్లు అనిపిస్తోంది. ‘మా రాము.. యూఎస్‌లో ఉంటాడు.. తెలంగాణ రాకపోతే నాకు పోయేది ఏమి లేదు. మావాడు నెలకు 300 డాలర్లు పంపితే కాలుమీద కాలేసుకుని కాలం గడుపుతా’ అని కేసీఆర్ ఒక మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ వద్ద షార్ట్ వేసుకుని నిలబడ్డ కేటీఆర్‌ను పరిచయం చేసిన దృశ్యమూ ఇంకా కళ్లముందాడుతోంది. ఎంత విన్నా వినాలనిపించే కేసీఆర్ మాటలు, తెలంగాణ యాసలో ఛలోక్తులు, విమర్శలు, ప్రత్యర్థులపై వాగ్బాణాలు, పుస్తకాలలోంచి ఉటంకింపులు ఇంకా గింగురుమంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘట్టంలో లెక్కలేనన్ని దృశ్యాలు, ఘటనలు, వ్యక్తులు ఎన్నో.. దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగునేలలో జరిగిన ఉద్యమాలు, వినపడ్డ నినాదాలు, ఆర్తనాదాలు, ఉద్యోగులు, మేధావుల నిరసనధ్వనులు, ఆత్మహుతి ఆర్తరావాలు ఇంకా ప్రతిధ్వనిస్తూ, ప్రకంపింప చేస్తూ ఉన్నాయి. చితి చల్లారిపోయింది. అస్తికలూ గంగలో కలిశాయి. గత జ్ఞాపకాలను తలుచుకుని బాధపడితే వచ్చేదేమిటి?

అసలు భౌగోళిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, అత్యంత కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి తన పేరు మార్చుకుని, రూపం మార్చుకుని భారత రాష్ట్ర సమితిగా అవతరిస్తుందని, తెలంగాణ అస్తిత్వ వాదం క్రమంగా ఒక చర్చలో లేని అంశంగా మారుతుందని, చివరకు కేసీఆర్ కూడా పరాజయం చెందుతారని, ఢిల్లీలో తుగ్లక్ రోడ్ నివాసం ఖాళీ చేయవలసి వస్తుందని ఆ నాడు ఊహించలేదు. అసలు ఈ పరిణామాలు జరిగాయని ఈనాడు నమ్మశక్యంగా లేదు. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగి పదేళ్లు పరిపాలించిన ఒక పార్టీ పాలన ముగిసింది. అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అందరు రాజకీయ నాయకుల్లాగే కేసీఆర్ పాలించి, తన చుట్టూ కొద్ది మందిని పోగేసుకుని ఇష్టారాజ్యంగా పాలన సాగించి, ఒక వ్యక్తి చుట్టూ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించి, పలు ఆరోపణలు, విమర్శలు కూడగట్టుకున్నప్పటికీ తనదైన చరిత్ర కొంత మిగుల్చుకుని నిష్క్రమించారు. అయిదేళ్ల తర్వాత ఆయన, ఆయన పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎంతవరకు ఊపిరి నిలబెట్టుకుంటుందీ అన్నది ఇప్పుడు అసంగతం. అది వారి అస్తిత్వ సమస్య కాని తెలంగాణ అస్తిత్వ సమస్య ఇక ఎంత మాత్రమూ కాదు.

కేసీఆర్ ఆవిర్భావం, నిష్క్రమణ నమ్మశక్యంగా లేనట్లే, అదే సమయంలో నరేంద్రమోదీ దేశ రాజకీయాల్లో ఒక ప్రబలశక్తిగా అవతరించడం, పదేళ్లు గడిచినా ఇప్పటికీ దేశ రాజకీయాలను పూర్తిగా తన చుట్టూ తిప్పుకోవడం, ఎంతో ఘన చరిత్ర గల కాంగ్రెస్ ఇంకా ముక్కుతూ మూల్గుతూ ఉండడం కూడా నమ్మశక్యంగా కనపడడం లేదు. అనేక వివాదాస్పదమైన, అప్రజాస్వామికమైన నిర్ణయాలు, ఏకపక్ష వ్యవహార శైలి, పార్టీని, ప్రభుత్వాన్నీ తన చుట్టూ తిప్పించుకోవడం, వ్యక్తిపూజకు ఆస్కారం కల్పించడం, నాటకీయ హావ భావాలు మొహం మొత్తించడం, ప్రతిపక్షాలను, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడం మొదలైనవి ఎన్నో ఉన్నప్పటికీ ఇవాళ నరేంద్రమోదీ అన్న వ్యక్తిని విస్మరించి ప్రజలు ప్రతిపక్షాలను ఆదరించే పరిస్థితి అంతగా కనపడడం లేదు. మూడు రాష్ట్రాల్లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ప్రకటించలేదు. ఒక పథకం ప్రకారం స్థానిక నాయకులకు ప్రాధాన్యం కల్పించలేదు. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్, మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ భగేల్‌కూ నరేంద్రమోదీకి మధ్య పోటీ ఏర్పడిన మాదిరి ఎన్నికలు జరిగాయి. ఇవి జాతీయ ఎన్నికలా అన్న భ్రమను మోదీ కల్పించారు. రాహుల్, ప్రియాంక ఎంత తిరిగినప్పటికీ, ఎంత మాట్లాడినప్పటికీ మోదీకి తామే పోటీ అన్నట్లుగా వ్యవహరించలేకపోయారు. తన నాయకత్వంలో దేశమంతా జిగేల్ జిగేల్ మంటున్నట్లు, జాతీయ వాదం, దేశ భక్తి తమ స్వంతమే అన్నట్లు, ప్రతిపక్ష నేతలంతా అవినీతి పుట్టలో పురుగులన్నట్లు మోదీ చేసిన ప్రచారాన్ని వమ్ము చేయగల సామర్థ్యం కాంగ్రెస్‌లో ఉన్నట్లు కనపడలేదు. మోదీ, అమిత్ షాలను ఢీకొనగల నాయకత్వం ప్రతిపక్షాలకు లభించేందుకు ఎంత కాలం పడుతుంది?


మధ్యప్రదేశ్‌లో 20 ఏళ్లుగా ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నది. పేదరికం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు లాంటివి ఎన్నో ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ తనకు అనుకూలంగా ఉపయోగించుకోలేకపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘేల్ ప్రభుత్వం బాగానే పరిపాలిస్తోందని, బీజేపీ అక్కడ అధికారంలోకి రావడం కష్టమని అనేక మంది తేల్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోలేకపోయింది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని, ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ అధిగమిస్తుందని కూడా అంచనాలు వినపడ్డాయి. అయినా తన సానుకూల అంశాల ద్వారా ప్రజలను ఆకట్టుకునే శక్తి కాంగ్రెస్‌లో లేకపోయింది. కాంగ్రెస్ వివిధ బడుగు, బలహీన వర్గాల మైనారిటీల సామాజిక వేదికగా ఉండేందుకు ఎంతో కొంత పనిచేసినా ప్రజల్లోకి తమ భావాలను సమర్థంగా తీసుకువెళ్లలేకపోయింది.

అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో అనేక మంది జాతీయ నేతల్ని, ఎంపీల్నీ బీజేపీ రంగంలోకి దింపి ఒక కొత్త నాయకత్వం ఏర్పడనున్నట్లు భ్రమ కల్పిస్తే కాంగ్రెస్ వృద్ధ నేతలతోనే ప్రజల ముందుకు వెళ్లింది. తెలంగాణలో కూడా కాలం చెల్లిన వృద్ధనేతలతో ఎన్నికలకు వెళ్లి ఉంటే పరాజయం తప్పేది కాదేమో. అక్కడ రేవంత్‌ను రంగంలోకి దించడం వల్లే ఈ మాత్రం మార్పు కనపడింది. 2014లో ప్రశాంత్ కిషోర్‌ను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ టీమ్ ఆయనను పక్కనపెట్టింది. ఇవాళ మోదీ, అమిత్ షాలకోసం అనేక ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్, ఏక్సిస్ మై ఇండియా వంటి అనేక సంస్థలతో పాటు అంతర్గతంగా అనేక బృందాలు బీజేపీకోసం పనిచేస్తుంటాయి. ప్రకటనలు, వీడియోలు, సర్వేలు, సమాచార సేకరణలు చేసే వారికి ఎక్కడి నుంచి ఎవరు డబ్బిస్తారో తెలియనంతగా పకడ్బందీగా పనులు జరుగుతుంటాయి. ఎన్నికల్లో గెలిస్తే మాత్రం ఘనత మోదీ, అమిత్ షాలే దక్కించుకుంటారు. కాని కాంగ్రెస్‌లో ఇలాంటి పనులు చేసే మేనేజర్లను తలపై పెట్టుకోవడం కనిపిస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసిన సునీల్ కనుగోలుకు ముఖ్యమంత్రి సలహాదారుగా మాత్రమే కాక కేబినెట్ హోదా ఇచ్చారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ సర్వేలను, ఎన్నికల వ్యూహరచనను కూడా ఆయన నిర్వహించారు. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్ డిజైన్ బాక్స్‌డ్‌కు చెందిన నరేశ్ అరోరా చేతుల్లో రాష్ట్ర ఎన్నికల నిర్వహణను అప్పజెప్పారు. అశోక్ గెహ్లోత్ పూర్తిగా తన వల్లే గెలుస్తాడన్న విధంగా నరేశ్ అరోరా వ్యవహరించారు. ఇతడి ఆధిపత్యం తట్టుకోలేక ఒక దశలో పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ కూడా అలిగి ఇంటికి పరిమితమయ్యారు. పార్టీలో పనిచేసే నేతలు, కార్యకర్తలు తగ్గిపోయి, సూక్ష్మ స్థాయిలో ఎన్నికల నిర్వహణ చేయగల సమర్థతను నాయకత్వం కోల్పోయి పూర్తిగా ఏజెన్సీలపై ఆధారపడితే ఏమి జరుగుతుందో మూడు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

ఈ నేపథ్యంలో 2024లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా ర్యాలీలో పాల్గొని పౌరసత్వ చట్టం అమలును ఎవరూ ఆపలేరని ప్రకటించారు. బీజేపీ నిరంతరం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పనిచేస్తుందనడానికి ఇది నిదర్శనం. ఎన్నికల ఫలితాలు వెలువడగానే నరేంద్రమోదీ దీనదయాళ్ మార్గ్‌లోని బీజేపీ కార్యాలయానికి వెళ్లి మూడు రాష్ట్రాల్లో విజయం లోక్‌సభలో బీజేపీ హ్యాట్రిక్‌కు దారి తీస్తుందని ప్రకటించారు. ఈ ఫలితాల తర్వాత దేశంలో మెజారిటీ రాజకీయ పరిశీలకులు బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చ్ేందుకు ఎలాంటి అడ్డంకులూ లేవని ప్రకటించారు. ఒక రకంగా ఈ విజయం ద్వారా దేశంలో ప్రతిపక్షాల భవిష్యత్తును మోదీ అంధకారబంధురం చేయగలిగారు.

ఇవాళ దేశంలో బీజేపీని వ్యతిరేకించే మేధావులు, ఇతర సామాజిక వర్గాలు, వామపక్షీయులు ఎక్కువగానే కనపడుతున్నప్పటికీ వారు కాగితపు పులులుగానో, సోషల్ మీడియా సింహాలు గానో కనపడుతున్నారు కాని బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడంలో విఫలమవుతున్నారు. వీరిని నమ్ముకుని రాహుల్, ప్రియాంకలు రంగంలోకి దిగితే లాభం లేదు. భారత్ జోడో యాత్ర వల్ల కొంత కదలిక ఏర్పడినప్పటికీ దాన్ని ప్రజల్లో ఓటు బ్యాంకుగా మలచడంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు. కాంగ్రెస్‌తో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో ఆ పార్టీని ఓడించడం సులభమని బీజేపీ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. బీజేపీని ముఖాముఖి ఎదుర్కోగల రాష్ట్రాల్లో కాంగ్రెస్ చతికిలపడ్డ తీరు ఇవాళ కాంగ్రెస్ భవిష్యత్‌పై కన్నా దేశ భవిష్యత్ గురించి మేధావులను చింతాక్రాంతులను చేస్తోంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-12-06T02:15:35+05:30 IST