Share News

నేటి బీజేపీకీ, నాటి కాంగ్రెస్‌కూ తేడా ఏమిటి?

ABN , First Publish Date - 2023-11-08T02:49:53+05:30 IST

‘మీరు మా పార్టీలో ఇమడలేరు. మా సంస్కృతిని మీరు జీర్ణించుకోవడం కష్టం’ అని ఒకప్పుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి తెలుగుదేశం నేత ఉపేంద్రకు చెప్పారట. ఆయన చెప్పిన విధంగానే...

నేటి బీజేపీకీ, నాటి కాంగ్రెస్‌కూ తేడా ఏమిటి?

‘మీరు మా పార్టీలో ఇమడలేరు. మా సంస్కృతిని మీరు జీర్ణించుకోవడం కష్టం’ అని ఒకప్పుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి తెలుగుదేశం నేత ఉపేంద్రకు చెప్పారట. ఆయన చెప్పిన విధంగానే బీజేపీలో ఉపేంద్ర ఇమడలేకపోయారు. అప్పటికీ ఇప్పటికీ కాలం ఎంతో మారింది. భారతీయ జనతా పార్టీలోకి ఎవరైనా స్వేచ్ఛగా రాగలుగుతున్నారు, అంతే స్వేచ్ఛగా పోగలుగుతున్నారు. ‘మా పార్టీలో చేరిన వారు మా విధానాలను అంగీకరించాల్సి ఉంటుంది. అందువల్ల ఎందరు చేరినా మాకు పెద్దగా నష్టం లేదు’ అని కొద్ది సంవత్సరాల క్రితం అప్పుడు బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న అమిత్ షా నాకిచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. కాని కాంగ్రెస్‌కూ, బీజేపీకి పెద్ద తేడా లేదని, ఎవరు ఏ పార్టీలోనైనా ఎప్పుడైనా చేరవచ్చని కాలక్రమేణా మరింత రుజువైంది. ఒకప్పుడు ఇతర పార్టీలనుంచి వచ్చిన వారు బీజేపీలో ఇమ‍డలేకపోయేవారు. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలను గౌరవించినవారు, తమ జీవితమే బీజేపీ అనుకున్నవారు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో చాలామంది బీజేపీనే సర్వస్వం అనుకున్న నేతలకు టిక్కెట్లు దక్కలేదు. కొందర్నయితే వారికి సంబంధం లేని నియోజకవర్గాలకు పంపించారు. ‘మేమే కనుక ఇతర పార్టీల్లో చేరి ఉంటే మాకు మళ్లీ కండువాలు కప్పి ఆహ్వానించేవారేమో.. ఇదే పార్టీలో పడి ఉన్నందుకు బాగా శాస్తి జరిగింది’ అని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. విచిత్రమేమంటే కాంగ్రెస్ ఎవరికి సీటు ఇస్తుందో లేదో ఆఖరు నిమిషం వరకు చూసి సీటు లభించని నేతలను బీజేపీ వెంటనే తమ పార్టీలోకి లాగి ఆ మరుక్షణం టిక్కెట్ ప్రకటిస్తోంది. బాగా ధన బలం ఉన్న వారిని పార్టీలోకి లాగడం బీజేపీ నేతలు కూడా ఒక కళగా అభ్యసించారు. ఇదివరకు ఈ సంస్కృతి కాంగ్రెస్‌కు, ఇతర పార్టీలకు పరిమితమయ్యేది. కాని బీజేపీ ఆ సంస్కృతిని పూర్తిగా జీర్ణించుకుంది.

బీజేపీకి కంచుకోట అయిన మధ్యప్రదేశ్‌లో పార్టీ విజయం సాధించేందుకే కాక, కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు ఆ పార్టీ నేతల్ని పెద్ద ఎత్తున బీజేపీలోకి ఆహ్వానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్వాలియర్ ప్రాంతంలో అప్పటి కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను ఓడించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలు ఆ తర్వాత సింధియా తన అనుయాయులతో సహా బీజేపీలో చేరడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. సింధియా వర్గీయులకు శివరాజ్‌సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో కూడా స్థానం దక్కింది. దీనివల్ల బీజేపీ తాత్కాలికంగా బలపడినట్లు కనిపించినా క్రమంగా బలహీనపడింది. సింధియాతో పాటు బీజేపీలో చేరిన వాళ్లలో అనేకమంది పార్టీలో ఎక్కువ కాలం నిలబడలేదు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ హవా పెరుగుతుందని తెలిసి వారు మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏది జరిగినా నష్టపోయింది బీజేపీయే. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ పక్కన నిలబడి బీజేపీని చిత్తుగా ఓడించాలని ప్రచారం చేసిన జ్యోతిరాదిత్య ఇప్పుడు మోదీతో పాటు వేదిక పంచుకుని స్థానిక నేతలకు అవకాశం లేకుండా చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కైలాశ్ జోషి కుమారుడు, జనసంఘ్ కాలం నుంచీ బీజేపీలో ఉన్న మాజీ మంత్రి దీపక్ జోషి కొద్ది నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. ‘బీజేపీలో సైద్ధాంతిక నిబద్ధత ఉన్న వారిని కొద్ది సంవత్సరాలుగా పక్కన పెడుతున్నారు. ధనబలం, కండబలం ఉన్న వారినే ప్రోత్సహిస్తున్నారు. దీపక్ జోషి కాంగ్రెస్‌లో చేరడం పాతకాలం బీజేపీ నేతల ఆగ్రహానికి సంకేతం’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. 2018లో కాంగ్రెస్ నేత మనోజ్ చౌదరి చేతుల్లో దీపక్ జోషి ఓడిపోయారు. తర్వాత ఇదే కాంగ్రెస్ నేత బీజేపీలో తీర్థం పుచ్చుకుంటే ఆయనకు పార్టీ సీటు ఇచ్చింది. చాలా మంది సింధియా అనుయాయులకు, తమపై పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ నేతలకు సీట్లు ఇవ్వడంతో బీజేపీనే నమ్ముకున్న అనేకమంది తమ అస్తిత్వం కోల్పోయినట్లు భావిస్తున్నారు. పంచాయతి, జిల్లా స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసి గెలిచిన క్రింది స్థాయి కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. ఈ పరిస్థితే ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితిని డోలాయమానంగా మార్చింది.

రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్ నేతల్ని ఎడాపెడా బీజేపీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కుమారుడు ఓం ప్రకాశ్ పహాడియా, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బంధువు విజేంద్రసింగ్ షెఖావత్, సీనియర్ కాంగ్రెస్ నేత రాంనివాస్ మీర్ధా కూతురు జ్యోతి మీర్ధా, జైపూర్ మేయర్ జ్యోతి ఖండేల్వాల్ సహా అనేకమంది బీజేపీలో చేరారు. అనేక చోట్ల టిక్కెట్లు రాని బీజేపీ నేతలు తీవ్రనిరసనలు వ్యక్తం చేయడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం రాజస్థాన్‌లో విస్పష్టంగా కనపడుతోంది.

గతంలో ‘కాంగ్రెస్సే కాంగ్రెస్‌ను ఓడిస్తుంది’ అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించేవారు. ముఠా తగాదాలు, సీనియర్ నేతల మితిమీరిన ఆకాంక్షలు, ఇతర పార్టీల్లోకి ఫిరాయింపులు.. ఇవి కాంగ్రెస్ లక్షణాలుగా ఉండేవి. ఈ లక్షణాలు బీజేపీకి బదిలీ అయ్యాయి. ఇప్పుడు ‘బీజేపీయే బీజేపీని ఓడించుతుంది’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయ వంటి నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అంతర్గత తగాదాలు కూడా ఆ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. జగదీశ్ షెట్టార్ వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యకరంగా కలిసికట్టుగా పార్టీ గెలుపుకు కృషి చేశారు.

బీజేపీలో కాంగ్రెస్సీకరణకు కారణమెవరు? పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతల్ని ఆకర్షించడం గతంలో కూడా బీజేపీ చేసేది కాని అది పరిమితంగానే ఉండేది. టెలికాం స్కామ్‌లో చిక్కుకున్న కాంగ్రెస్ నేత సుఖ్‌రామ్ లాంటి వారిని బీజేపీలోకి ఆకర్షించి హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఒకప్పుడు ఆ రాష్ట్ర బాధ్యుడుగా నరేంద్ర మోదీయే కారకుడయ్యారు. అయితే 2014లో నరేంద్రమోదీ కేంద్రంలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేందుకు ఇతర పార్టీల నుంచి జరిగిన ఫిరాయింపులు ఎంత మాత్రమూ కారణం కాదు. ఇది సహజంగా కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల బీజేపీకి, ఆ పార్టీ సిద్ధాంతాలకు వచ్చిన అనుకూలమైన ఓటు. కాని ఆ తర్వాత నుంచి ఈ అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు, రాష్ట్రాల్లో విస్తరించేందుకు అనుసరించిన విధానాలు బీజేపీకి, కాంగ్రెస్‌కు తేడా లేకుండా చేశాయి. అంతేకాదు, కాంగ్రెస్‌ను మించిన ఘోరాలకు బీజేపీ పాల్పడేలా చేశాయి.

2014–21 మధ్య ఫిరాయింపుల మూలంగా అత్యధికంగా లాభపడింది బీజేపీయే కాగా అత్యధికంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీయేనని ‘అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్స్’ ఒక విశ్లేషణలో తేల్చింది. మాజీ కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల్లో మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, అనుబంధ సంస్థల నేతలు, మాజీ అధికార ప్రతినిధులతో సహా ఎవ్వరినీ బీజేపీ వదలలేదు. అన్ని స్థాయిల్లో బేరసారాలు జరిపేందుకు రకరకాల శక్తుల్ని దింపారు. ఈడీ, సీబీఐ, ఐటీ కూడా బీజేపీకి అనుంగు సంస్థలుగా పనిచేశాయి.

ఆపరేషన్ కమల్‌ను రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకే కాక, కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ఉపయోగించుకుంది. మోదీ ఇచ్చిన ‘కాంగ్రెస్ విముక్త భారత్’ నినాదానికి అనుగుణంగా వివిధ దశల్లో పార్టీ నేతలు రంగంలోకి దిగారు. కాని ఈ క్రమంలో భాగంగా బీజేపీయే తన అస్తిత్వం కోల్పోతున్నదని, కాంగ్రెస్సీకరణ బీజేపీ కాషాయ రంగును వెలిసిపోయేలా చేస్తోందని, అదే సమయంలో కాంగ్రెస్ సర్వశక్తులూ కూడదీసుకుని సాధ్యమైనంత సంఘటితంగా తమను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని కమలనాథులు గ్రహించలేకపోయారు.

అంతేకాదు, కాంగ్రెస్‌లో పేరుకున్న అనేక దుర్లక్షణాలను మోదీ నాయకత్వంలోని బీజేపీ ఇముడ్చుకుంది. కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా చిత్రించి ప్రయోజనం పొందిన బీజేపీ రాష్ట్రాల్లో ఇప్పుడు అదే అవినీతి మూలంగా దెబ్బతింటోంది. కర్ణాటకలో ప్రతి పనీకీ 40 శాతం కమిషన్ వసూలు చేయడంతో బీజేపీ సర్కార్‌ను ప్రజలు వదుల్చుకున్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కూడా 50 శాతం కమిషన్ ఆరోపణలను బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఎక్కుపెడుతున్నారు. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐని ప్రయోగిస్తూ తమ పార్టీలో చేరిన నేతల అక్రమాలను బీజేపీ విస్మరిస్తోందని, అవినీతి విషయంలో కాంగ్రెస్‌కూ, బీజేపీకి తేడా లేదని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది, ఏఏ కార్పొరేట్ కంపెనీలు బీజేపీ వల్ల ప్రయోజనాలు పొందుతున్నాయో ఇప్పుడు చాలా మందికి తెలుసు. కాంగ్రెస్ గతంలో అధిష్ఠాన సంస్కృతిని, కేంద్రీకృత అధికారాన్ని పెంచి పోషించింది. ఇప్పుడు ఈ సంస్కృతిని బీజేపీ కూడా అలవరుచుకుంది. బీజేపీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మోదీ–అమిత్ షా లేనని, మిగతా వారంతా నిమిత్తమాత్రులేనని ప్రతి ఒక్కరికీ అర్థమయింది. బీజేపీ కీలక నిర్ణయాల్లో జాతీయ కార్యవర్గం, జాతీయ మండలి, పార్లమెంటరీ బోర్డు పాత్ర దాదాపు తగ్గిపోయింది. ఈ ఇద్దరిలో మోదీయే సర్వాంతర్యామిగా కనిపిస్తున్నారు. ఆయన ప్రచారంలో దిగితే కాని పార్టీకి ఊపు రాని పరిస్థితి ఏర్పడింది. ఇందిరాయే ఇండియా అని ఒకప్పుడు అనేవారు. ఇప్పుడు మోదీ, మోదీ నినాదాలే బీజేపీకి దిక్కయ్యాయి.

భారతదేశ రాజకీయాల్లో పార్టీలు తమ విశిష్టతనూ, సైద్దాంతిక అస్తిత్వాన్నీ కోల్పోయాయి. అన్ని పార్టీలనూ ఒకే రకమైన వ్యాధులు పట్టి పీడిస్తుంటే ప్రజలు ఏ పార్టీనని ఎన్నుకోగలరు? తక్కువ దుర్మార్గమైన పార్టీని ఎన్నుకోవడమో లేక ఒక పార్టీని కాకపోతే మరో పార్టీని మార్చి మార్చి ఎన్నుకోవడమో తప్ప వారికి గత్యంతరం లేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-11-08T02:49:56+05:30 IST