Share News

దక్షిణాదిలో బీజేపీ వ్యూహమేమిటి?

ABN , First Publish Date - 2023-11-29T02:24:59+05:30 IST

ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఉన్న వారినెవరినీ వదలబోమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల క్రితం తెలంగాణలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రకటించారు...

దక్షిణాదిలో బీజేపీ వ్యూహమేమిటి?

ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఉన్న వారినెవరినీ వదలబోమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల క్రితం తెలంగాణలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రకటించారు. లిక్కర్‌ స్కాంలో ఫోన్లు మార్చి డబ్బు తీసుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు కూడా జైలుకు వెళ్లే సమయం తప్పకుండా వస్తుందని హెచ్చరించారు. ‘ఇది మోదీ గ్యారెంటీ, ఈ గ్యారెంటీకి తిరుగుండదు’ అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ దేశంలో ఎవరైనా నేరం చేస్తే శిక్ష పడేలా చేసే హక్కు న్యాయస్థానాలకే కాని ప్రభుత్వాలకు ఉండదు. ఢిల్లీ మద్యం స్కామ్ ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలో ఉన్నది. మనీలాండరింగ్ చట్టాన్ని నిర్విచక్షణగా అమలు చేయడం పట్ల సుప్రీంకోర్టు ఇప్పటికే అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయినప్పటికీ ప్రధానమంత్రి స్వయంగా తాను రాజకీయ ప్రత్యర్థులను శిక్షిస్తానని బహిరంగ సభల్లో ప్రకటించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన క్రిందకు ఎందుకు రాదో ఎవరూ ప్రశ్నించకపోవడం ఆశ్చర్యకరం.

గడచిన కొద్ది రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఉధృత ప్రచారం చేస్తూ కాంగ్రెస్‌ను విమర్శించడం తగ్గించి కేసీఆర్‌పై బాణాలు సంధించారు. వర్గీకరణకు మద్దతు నివ్వడం ద్వారా, జనసేనతో పొత్తు ఏర్పర్చుకోవడం ద్వారా మోదీ తెలంగాణలో కొత్త వ్యూహానికి తెరతీశారనడంలో సందేహం లేదు. అవినీతిపరులను జైలుకు పంపిస్తామని ప్రకటించిన మోదీ ప్రాజెక్టుల్లో అవినీతి, నిరుద్యోగం, ధరణి పేరిట అక్రమాలు, ఫామ్ హౌజ్‌లో విశ్రమించడం, మూఢనమ్మకాలు వంటి అనేక అంశాలను ప్రస్తావించారు. ఇప్పటి వరకూ బీజేపీ నేతలెవరూ ఇలాంటి విమర్శలు చేసినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కాని నరేంద్రమోదీ ఉన్నట్లుండి బహిరంగ సభల ద్వారానూ, రోడ్ షోల ద్వారానూ మళ్లీ బీజేపీకి ఒక ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. మోదీ తన వ్యూహాన్ని ఎందుకు మార్చారు? బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనన్న ప్రచారాన్ని తిప్పిగొట్టడమే ఆయన ఉద్దేశమా? చివరి రోజుల్లో మోదీ రంగంలోకి దిగడం వల్ల బీజేపీకి ప్రయోజనం ఏమైనా ఉంటుందా? లేక కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు శాతం పెరుగుతుందా? దీనివల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో దేనికి, ఎంత మేరకు నష్టం జరుగుతుంది? లోక్‌సభ ఎన్నికలకోసం మోదీ ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఒక ప్రయోగంగా ఉపయోగించుకుంటున్నారా అన్నది చర్చనీయాంశమవుతోంది.

2014లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం తార స్థాయికి చేరుకున్న దశలో నరేంద్రమోదీ ఈ దేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తం చేయాలని పిలుపు ఇచ్చారు. కాని 9 సంవత్సరాల పాలన తర్వాత కూడా ఆయన దేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తం చేయలేకపోయారు. కర్ణాటకలో బీజేపీ ఘోరపరాజయం చెందిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలే బీజేపీ నుంచి తమను విముక్తం చేసుకున్నాయన్న అభిప్రాయం బలపడింది. కర్ణాటకతో పాటు హిమాచల్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం కోసం ఆయన చెమటోడుస్తున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ మాదిరి ఉధృతి కనపరచడం బీజేపీ చేతకావడం లేదు. మరి ఇప్పుడు ఆయనేమి చేస్తారు? తెలంగాణలో మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతీయ పార్టీల్లో అధికారంలో ఉన్న వైసీపీ రెండోసారి ఎన్నికల్లోనే సంకట పరిస్థితిలో పడింది. తెలుగుదేశంతో రాజకీయంగా పోరాడే బదులు ఎన్నికల సమయంలో కేసులు మోపడమే వైసీపీ అత్మరక్షణలో పడిందనడానికి నిదర్శనం. తమిళనాడులోని రెండు ప్రాంతీయ పార్టీలూ బీజేపీకి దూరంగా మారాయి. కర్ణాటకలో అంతరించిపోయే స్థితిలో జనతాదళ్ (ఎస్) బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల నాటికి దక్షిణాదిలో బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది? తెలంగాణలో మోదీ ఉధృత ప్రచారం చేస్తున్న తీరు ఏమైనా సంకేతాలు పంపిస్తున్నాయా?

నిజానికి కాంగ్రెస్ పార్టీ కంటే మోదీ ప్రాంతీయ పార్టీలను అణిచివేయడంపైనే అధికదృష్టి సారిస్తున్నారేమోనని ఒకరకంగా అనిపిస్తోంది. ఈడీ, సీబీఐలను ప్రయోగించి మహారాష్ట్రలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, శివసేనలను బీజేపీ చీల్చగలిగింది. పంజాబ్‌లో అకాలీదళ్‌ను దెబ్బతీసింది. బిహార్‌లో లోక్ జనశక్తిని ముక్కలు చేసింది. నితీశ్ కుమార్‌కు పొమ్మనకుండా పొగపెట్టి పంపించింది. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీని బీజేపీ నిర్వీర్యం చేసింది. సమాజ్‌వాది పార్టీని అస్తిత్వం కోసం పోరాడే పరిస్థితిని కల్పించింది. ఒడిషాలో నవీన్ పట్నాయక్ తర్వాత బీజేడీ భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్నార్థకమైంది. దేశంలో అనేక చిన్నా చితక, ఉప ప్రాంతీయ పార్టీలు మోదీ భయంతో బీజేపీతో చేతులు కలపక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల తర్వాత ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయో, ఎన్ని మిగిలిపోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.


ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీని, ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను తుదముట్టించడం కోసం బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. నిజానికి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కాంగ్రెస్‌ను దెబ్బతీయడంలో బీజేపీకి సహాయపడ్డారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించగలిగారు. గుజరాత్, గోవాలో కాంగ్రెస్ ఓట్లను చీల్చారు, తన సంక్షేమ ఎజెండాయే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలు అనుకరించేలా చేయగలిగారు. కాంగ్రెస్ బలహీనపడుతున్న కొద్దీ ఆప్ బలపడింది. అయినప్పటికీ ఇవాళ మోదీ సకల ఆయుధాలు తనపై ప్రయోగించడంతో ఆయన తన రాజకీయ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. ఆప్ జీవన్మరణ సమస్యలో ఉంటే, మరో వైపు కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే క్రమం ప్రారంభమైంది.

ప్రాంతీయ పార్టీలు బలహీనపడితే ఇవాళ వాటి స్థానంలో బలపడేందుకు కాంగ్రెస్‌కే ఎక్కువ ఆస్కారం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకునే ప్రాంతీయ పార్టీలు అధికంగా కొల్లగొట్టాయి. బీజేపీ క్రియాశీలకంగా మారడానికి ముందే ప్రజలు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో ప్రాంతీయ పార్టీలను ఆదరించారు. ఇవాళ దేశంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కాంగ్రెస్ అనుసరించిన విధానాలే కారణం. ఇప్పుడు మోదీ కూడా ప్రాంతీయ పార్టీలను బలహీనపరిస్తే చివరకు ప్రధాన పోటీ మళ్లీ బీజేపీ, కాంగ్రెస్‌లకే పరిమితం కావడం ఖాయం. కాంగ్రెస్ విముక్త భారత్ లక్ష్యం సాధించడం కష్టమని గ్రహించినందువల్లే మోదీ ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా పెట్టుకున్నారా? అన్న అనుమానాలకు ఆస్కారం లేకపోలేదు. ఏమైనా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ మధ్య ప్రాంతీయ పార్టీలు నలిగిపోయే పరిస్థితి పలు రాష్ట్రాల్లో కనిపిస్తోంది.

కాంగ్రెస్, బీజేపీ రెండూ దేశానికి చేసింది ఏమీ లేదని, ప్రజల బాధలను ప్రాంతీయ పార్టీలే సరిగా అర్థం చేసుకోగలవని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో మాట్లాడుతూ అన్నారు. మనం ఈ జాతీయ పార్టీల బానిసలుగా మారాలా అని ప్రశ్నించిన కేసీఆర్‌ ప్రాంతీయ పార్టీల యుగం దేశంలో రానున్నదని, ప్రాంతీయ పార్టీలే దేశంలో అధికారంలోకి రాగలవని ప్రకటించారు. కాని ఆయనే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి దేశమంతా విస్తరిస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ దేశంలో ప్రాంతీయ పార్టీలే అస్తిత్వ సమస్యలో ఉన్నప్పుడు అవి ఏ విధంగా అధికారంలోకి రాగలవు? కాంగ్రెస్ అత్యంత బలహీనపడిన పరిస్థితుల్లో కూడా ప్రాంతీయ పార్టీల మొత్తం సంఖ్యాబలం లోక్‌సభలో 180 దాటలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంటున్న పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల సంఖ్యాబలం మరింత తగ్గిపోవడం ఖాయం. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీల గమ్యం, గమనం ఏమిటి?

ఎవరు కాదన్నా, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రతిబింబాలు, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకలు. ఢిల్లీ ఆధిపత్య ధోరణిపై పోరాడి ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రదర్శించాయి. మోదీ హయాంలో ఈ ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి, రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి ఎంతో విఘాతం కలిగింది. రాష్ట్రాలతో సంప్రదించకుండా అనేక చట్టాలు చేసి రాష్ట్రాల అధికారాలను అతిక్రమించారు. అయితే ఏ ప్రాంతీయ ఆకాంక్షలకోసం ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయో అవి ఆ ఆకాంక్షలను విస్మరించి అధికారాన్ని కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం అయ్యేలా చూశాయి. అరాచక పాలనతో పాటు, విపరీత అవినీతికి పాల్పడ్డాయి. రాష్ట్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనుభవాన్ని అవి విస్మరించాయి. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ వైపో, బీజేపీ వైపో మళ్లుతున్నారంటే అందుకు ప్రధాన కారణం ప్రాంతీయ పార్టీల నేతల స్వయం కృతాపరాధాలే అని ఎవరైనా అంటారు. అయినప్పటికీ 2024 ఎన్నికలలోపు ఆయా ప్రాంతీయ పార్టీలు తమ ప్రయోజనాల రీత్యా, దేశ ప్రయోజనాల రీత్యా తమ దారి ఎటో నిర్ణయించుకోవాల్సిన తరుణం అసన్నమయింది. తాము ఎటువైపో తేల్చుకోవాల్సిన పరిస్థితిని ప్రధాన జాతీయ పార్టీలూ రెండూ ప్రాంతీయ పార్టీలకు కల్పిస్తున్నాయి. అందువల్ల రానున్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిల మధ్య సంకుల సమరం అని చెప్పక తప్పదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-11-29T02:25:01+05:30 IST