Share News

సాగుతున్న సమరాలలో ‘సార్వత్రక’ సన్నివేశాలు

ABN , First Publish Date - 2023-11-22T01:04:40+05:30 IST

‘రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఏ విషయమూ చెప్పడం కష్టం’ అని ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనే కాదు..

సాగుతున్న సమరాలలో ‘సార్వత్రక’ సన్నివేశాలు

‘రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఏ విషయమూ చెప్పడం కష్టం’ అని ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనే కాదు, మరో పదిరోజుల్లో జరిగే రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నేతల ఉధృత ప్రచారాలు, టీవీల్లో చర్చలు, సోషల్ మీడియా హోరు వీటన్నిటి మధ్యా ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో కూడా చెప్పడం కష్టంగా ఉంది. చివరి నిమిషం వరకూ ఓటరు ఎటు వైపు ఓటు వేస్తారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ‘ప్రజలనుంచి కూడా ఫీడ్ బ్యాక్ అందడం కష్టంగా ఉన్నది’ అని మధ్యప్రదేశ్‌లో సర్వే నిర్వహించిన సిఎస్‌డిఎస్ –లోక్‌నీతి ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనపడలేదు కాని అదే సమయంలో మమ్మల్ని గతంలో మాదిరి రెండు చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్లు కూడా కనపడడంలేదు’ అని భారత రాష్ట్ర సమితికి చెందిన ఒక సీనియర్ నాయకుడు చెప్పారు.

రాజకీయ నాయకులు లౌక్యంగా, వ్యవహరిస్తారని చాలా మంది భావిస్తారు. కాని ప్రజలు రాజకీయ నాయకుల కన్నా లౌక్యంగా వ్యవహరించే పరిస్థితి ఎన్నికల సమయంలో స్పష్టంగా కనపడుతుంది. ఈ సమయంలోనే పరిశీలకులు ‘ఫిఫ్టీ–ఫిఫ్టీ’ అని తేల్చేస్తుంటారు. కాని ప్రజల్లో ఆ ఊగిసలాట ఉండదు. గతంలో నేతలు చేసే ఉపన్యాసాలకు కొన్ని ప్రమాణాలు ఉండేవి. కొన్ని సిద్ధాంతాలు ఆ ఉపన్యాసాల్లో కనపడేవి. ఇవాళ కొందరు నేతలు చేసే ఉపన్యాసాలు ఊకదంపుడుగా, చర్విత చర్వణంగా మారిపోయాయి. ముఖ్యంగా చాలా కాలం అధికారంలో ఉన్నవారు అధికారంలో లేని పార్టీల గురించి ఉపన్యాసాలు చేస్తే ప్రజలు స్వీకరించే పరిస్థితి పోయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న నేతలు అహంకారంతో వ్యవహరించినప్పుడు ఎన్నికల సమ యంలో వారి ఉపన్యాసాలకు అంత విలువ ఉండదు. అందువల్ల ఒకప్పుడు ఉర్రూతలూగించే ప్రసంగాలు చేసే వారి మాటలు కూడా ఇప్పుడు ఊకదంపుడుగా కనిపించినా, సాధారణ ప్రసంగాలు చేసే వారి వ్యాఖ్యలు అద్భుతంగా అనిపించినా అది కాల మహాత్మ్యం. ప్రజలకు ఈ కాలమహాత్మ్యం గురించి స్పష్టంగా తెలుస్తుంది. కాలం బాగులేనప్పుడు కర్రే పామై కరుస్తుంది.

ఒకరకంగా దేశంలో నేతలు చేసే ప్రసంగాలే మారుతున్న కాలానికి నిదర్శనాలు. 2014 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశానికి కాంగ్రెస్ పట్ల ఒక అభిప్రాయాన్ని కల్పించారు. దేశాన్ని నెహ్రూ– గాంధీ కుటుంబం కబ్జా చేసిందని, దేశంలోని అన్ని అనర్థాలకు కాంగ్రెసే కారణమని నరేంద్రమోదీ విమర్శించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుటుంబపాలన మొదలైన వాటిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. మోదీ ప్రసంగాలు దేశంలో ఒక ఊపును కల్పించాయి. ముఖ్యంగా తమ జీవితాల్లో మార్పును కోరుతున్న యువత ఆయన దేశంలో వినూత్న మార్పును తీసుకువస్తారని ఆశించారు. దీనికి తోడు మోదీ జాతీయవాదం– మతతత్వాన్ని మేళవించి చేసిన ప్రసంగాలు ప్రజలకు కాంగ్రెస్ విధానాల కంటే భిన్నంగా అనిపించాయి. అందువల్ల ప్రజలు ఆయనను ఇన్నాళ్లు భుజాలపై ఎక్కించుకున్నారు.

దాదాపు 9 సంవత్సరాల తర్వాత చూస్తే నరేంద్రమోదీ ప్రసంగాల్లో పెద్దగా మార్పులేదు. ‘అవినీతి, కుటుంబపాలన, మైనారిటీల బుజ్జగింపు దేశానికి మూడు శత్రువులు. కాంగ్రెస్ ఈ మూడు శత్రువులను పెంచిపోషించింది. నీరు, అడవి, భూమిని అమ్మేసింది..’ అని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో మోదీ దాదాపు ప్రతి ఎన్నికల సభలోనూ చెబుతున్నారు. మోదీ ప్రసంగాల్లో కొత్తదనం ఏదీ కనిపించకపోవడమే ఇప్పుడు ఆయన ప్రత్యేకతగా మారింది. భారతదేశం ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది అని గ్రామాలనుంచి తీసుకువచ్చిన పేద జనం ముందు మాట్లాడితే వారి ముఖాల్లో కళ ఎలా కనిపిస్తుంది? వాజపేయి హయాంలో ‘భారతదేశం వెలిగిపోతున్నది’ అని లేజర్ షోల ద్వారా ప్రమోద్ మహాజన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాని 2004 ఏప్రిల్‌లో వాజపేయి పుట్టిన రోజు సందర్భంగా రూ.45 విలువైన చీరల కోసం పేద స్త్రీల మధ్య తొక్కిడి జరిగి 21 మంది మరణించడం వాస్తవ పరిస్థితులను బహిర్గతం చేసింది. ఇవాళ దేశ అభివృద్ధి గురించి మోదీ చెప్పుకుంటున్న గణాంక వివరాలు ఎంతమంది ప్రజలను ఆకట్టుకుంటుందో చర్చనీయాంశం. అందువల్ల ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల సభల్లోనూ, ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలపై పాత విమర్శలే చేస్తే 2014 నాటి ఊపును ఆయన బీజేపీకి కల్పించగలరా అన్నది వేచి చూడాల్సివుంది. విచిత్రమేమంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో మోదీ ప్రసంగాల్లో మతాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంతగా వినపడడం లేదు. కర్ణాటకలో మోదీ ప్రతి ప్రసంగంలోనూ ‘జై బజరంగ్ బలీ’ నినాదం ఇచ్చినా అంతగా ప్రభావం చూపలేదు. బహుశా ఈ అనుభవంతోనే మోదీ స్వయంగా మత ప్రాతిపదికగా ప్రసంగాలు తగ్గించినట్లున్నారు. కాని అమిత్ షా, ఇతర నేతలు మాత్రం మోదీ అయోధ్యలో రామాలయాన్ని, కాశీలో కారిడార్‌ను నిర్మించారని ప్రచారం చేస్తున్నారు. అయినా ప్రజలు కేవలం మత ప్రాతిపదికగా విడిపోతారన్న విశ్వాసం బీజేపీ నేతల్లో కూడా రోజు రోజుకూ సన్నగిల్లుతున్నది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మోదీ హావభావాలు జనానికి అలవాటైపోయాయి. అహ్మదాబాద్ ప్రపంచ క్రికెట్ పోటీలకు నీలిరంగు జాకెట్ ధరించి మోదీ హాజరు కావడం, ఓటమి తర్వాత క్రీడాకారులను ఓదార్చడంపై సానుకూల ప్రతిస్పందనల కంటే వ్యతిరేక ప్రతిస్పందనలే అధికంగా వ్యక్తమయ్యాయి.


మరోవైపు కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా రాహుల్, ప్రియాంకా గాంధీలు 2014లో మోదీ తమపై ప్రయోగించిన ఆయుధాలను ఆయనపైనే ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. యూపీఏ హయాంలో పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోచుకుని విదేశాలకు తరలించారని, తాను అధికారంలోకి రాగానే విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న ఈ నల్లధనాన్ని తిరిగి తీసుకువస్తానని మోదీ ప్రకటించారు. ఈ నల్లధనాన్ని తీసుకువస్తే దేశ ప్రజల ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షల నగదు జమ అవుతుందని ఆయన తెలిపారు. రాహుల్, ప్రియాంక ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మోదీ కేవలం కార్పొరేట్లకోసమే పనిచేస్తున్నారని, కుబేరుల పన్నులనే కాదు, బ్యాంకులకు ఎగ్గొట్టిన వేల కోట్ల రుణాన్ని మాఫీ చేశారన్నది ఇప్పుడు వారి ప్రచారంలో భాగమైంది. మోదీ కులజనగణనను వ్యతిరేకిస్తున్నారని, మోదీకి అదానీ, అంబానీ వంటి బిలియనీర్ల కులమే సన్నిహితమని రాహుల్ ప్రతి సభలోనూ చెబుతున్నారు. మోదీ 24 గంటలూ అదానీకోసమే పనిచేస్తున్నారని, ఆయన రెండు హిందుస్థాన్ ‌లను సృజిస్తే అందులో ఒక హిందుస్థాన్ అదానీ కోసమే అని రాహుల్ వ్యాఖ్యానించారు. రోజుకు మూడుసార్లు డ్రెస్ మార్చి కోట్లాది రూపాయల విలువైన విమానాలు, కార్లలో తిరిగే వ్యక్తిగా మోదీని రాహుల్ అభివర్ణించారు. ‘పేదల జేబుల్లోకి డబ్బు బదిలీ చేయడం కాంగ్రెస్ పని అయితే, అదానీ జేబుల్లోకి డబ్బులు బదిలీ చేయడం బీజేపీ పని. విమానాశ్రయాలు, రేవులు, సిమెంట్ ప్లాంట్లు, రహదారులు అన్నీ అదానీవే. అదానీ ఇక్కడ ఆర్జించిన డబ్బును విదేశాలకు తరలించి విదేశీ కంపెనీలను కొంటున్నారు..’ అని రాహుల్ ఒక సభలో అన్నారు. నిరుద్యోగం, అధిక ధరలపై దృష్టి సారించాల్సిన బీజేపీ ప్రజల్లో మత విద్వేష భావాలు రెచ్చగొడుతున్నదనేది రాహుల్ మరో విమర్శ. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమంటే ఈ ఎన్నికల్లో ప్రియాంక ప్రసంగాలు కూడా జనంలోకి వెళుతున్నాయి. తాము రైతులకు రుణాలను మాఫీ చేస్తే బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేయడంలో తలమునకలై ఉన్నదని ప్రియాంక ఒక సభలో విమర్శించారు. పేదలు, సామాన్యుల స్థితిగతుల గురించి ఆమె ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంక మరో ఆయుధంగా మారడం, స్థానిక నేతలు వారి ప్రచారంపై ఆధారపడడం ఈ ఎన్నికల్లో ఎక్కువగా కనపడుతోంది. బహుశా 2024లో ఈ డబుల్ బారెల్ గన్‌ ను ఎదుర్కోవడం మోదీకి అంత సులభం కాకపోవచ్చు.

ఈ పరిస్థితుల్లో 2024లో ఎన్నికల ప్రచారసరళి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే నిర్ణీతమైనట్లు కనపడుతోంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ఏ రసాయనాన్ని ప్రజలపై ప్రయోగిస్తారనేది ఆసక్తికరంగా వేచి చూడాల్సి ఉన్నది. 2014లో కాంగ్రెస్‌పై చేసిన విమర్శలతోనే ఇప్పుడు రంగంలోకి దిగడం వల్ల ప్రయోజనం ఉంటుందనుకోలేము. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలననే రెండేళ్లలో జనం మరిచిపోయి మళ్లీ పట్టం గట్టిన విషయాన్ని విస్మరించకూడదు. ఇక పదేళ్ల క్రితం జరిగినవి ఎలా గుర్తుంటాయి? హిందూత్వ వంటి పాత ఆయుధాలనే మళ్లీ ప్రయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుందా? వ్యక్తిగత ఆకర్షణ ఎంతవరకు పనిచేస్తుంది? ఉపన్యాసాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఈ పదేళ్లలో తాను చేసిన తప్పులేమిటి? ప్రజలు వాటిని మరిచిపోవడానికి తానేమి చేయవలిసి ఉంటుంది? అన్నవాటిపై మోదీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఆయనపై ఎక్కుపెడుతున్న ఆయుధాలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మోదీని సంపన్న వర్గాల ప్రతినిధిగా, తాము సామాన్యుల, బలహీన, అణగారిన వర్గాల ప్రతినిధులుగా వారు అభివర్ణిస్తున్నారు. మోదీ హయాంలో సంపద ఒక శాతం వర్గం చేతుల్లోనే కేంద్రీకృతమైందని చెబుతున్నారు. ఈ ప్రచారం జనానికి కిక్కుగా మారితే ఫలితాలు భిన్నంగా ఉంటాయి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-11-22T01:04:41+05:30 IST