సత్యపాల్ మాలిక్ ప్రశ్నలకు బదులేదీ?
ABN , First Publish Date - 2023-04-26T01:05:34+05:30 IST
దేశంలో కొన్ని సంఘటనల వెనుక అంతరార్థం తెలియడానికి ఎంతో కాలం పట్టవచ్చు. అసలు తెలిసే అవకాశమే లేకుండా పోవచ్చు.
దేశంలో కొన్ని సంఘటనల వెనుక అంతరార్థం తెలియడానికి ఎంతో కాలం పట్టవచ్చు. అసలు తెలిసే అవకాశమే లేకుండా పోవచ్చు. పంజాబ్‌లో ఖలిస్తాన్ వాది అమృతపాల్ సింగ్ ఏప్రిల్ 23న తనకు తాను లొంగిపోవడం కూడా అలాంటి సంఘటనే అని చెప్పవచ్చు. ఆరునెలల క్రితం వరకు అమృతపాల్ సింగ్ అనే వ్యక్తి గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రజల దృష్టిలో ఆయన ఒక కరడుగట్టిన తీవ్రవాది. 2021 గణతంత్ర దినోత్సవం నాడు దీప్ సిధు అనే యువకుడు ఎర్రకోట వద్ద రైతుల నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించి, ఆ చారిత్రక కట్టడంపై సిక్కు మత జెండా ఎగురవేశాడు; అతడే ‘పంజాబ్ వారసులు’ (వారిస్ పంజాబ్ దే)అనే పేరుతో ఒక సంస్థ స్థాపించాడు; ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలో ఒక కారు ప్రమాదంలో మరణించాడు; 2022 సెప్టెంబర్‌లో ‘వారిస్ పంజాబ్ దే’కు అమృతపాల్ అధినేత కావడం వరకు జరిగిన పరిణామాలు ఎవరికీ ఎటువంటి అనుమానం కలిగించలేదు. 2023 ఫిబ్రవరిలో అమృతపాల్ సింగ్, ఆయన మద్దతుదారులు ఆయుధాలతో అజ్నాలా పోలీసు స్టేషన్‌పై దాడి చేసి తమ సహచరుడు తూఫాన్‌ను విడుదల చేసుకుని వెళ్లిపోయారు. ఈ సంఘటన తర్వాతే అమృతపాల్ గురించి దేశానికి తెలిసింది. బాల్యం నుంచి దుబాయిలో ఉన్న అమృతపాల్ సింగ్ ఎందుకు, ఎలా ఉన్నట్లుండి పంజాబ్ తిరిగి వచ్చాడు? దీప్ సిధు స్థాపించిన సంస్థ అధ్యక్ష పదవి ఎలా చేపట్టాడు? భింద్రన్ వాలే జన్మించిన మోగా జిల్లాలోని రోడే గ్రామంలోనే ఆ సంస్థ బాధ్యతలు ఎందుకు స్వీకరించాడు? భింద్రన్ వాలే మాదిరే తలపాగా, కుర్తా ధరించడం ఎందుకు ప్రారంభించాడు? సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని ఆయన డిమాండ్ చేయడం వెనుక ఎవరి హస్తం ఉన్నది? మళ్లీ ఇప్పుడు తనకు తానే అదే రోడే గ్రామంలో ఎందుకు గురుద్వారాలో లొంగిపోయాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించడం అంత సులభం కాదు.
దాదాపు రెండు నెలలుగా అమృతపాల్ సింగ్ తప్పించుకుని పంజాబ్‌లోనే వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు, అయిదు జిల్లాల పోలీసు బలగాలు ఆయన ఆచూకీ కనిపెట్టలేకపోయాయి! అమృతపాల్ సింగ్‌కు పంజాబ్ ప్రజల మద్దతు ఉన్నదా? అసలు అమృతపాల్ సింగ్ అనే పరిణామం ఆవిర్భవించడం వెనుక ఏమైనా ఇతరేతర శక్తులున్నాయా? బ్రిటన్ లోనూ, కెనడాలోను ఇంకా ఉన్న ఖలిస్తాన్ ఉద్యమ సానుభూతిపరుల హస్తం ఆయన వెనుక ఉన్నదా? అమృతపాల్ సింగ్ కెనడా ఫోన్ నంబర్‌తో వాట్సాప్‌లో మాట్లాడేవారని, ఆయనకు ఐఎస్ఐ ఏజెంట్ అని పాకిస్థానీ గూఢచార సంస్థ ఆయనకు శిక్షణ నిచ్చిందని వార్తలు వచ్చాయి. మరి ఇంతకాలం కేంద్ర గూఢచార సంస్థలు ఎందుకు దీన్ని పసిగట్టలేకపోయాయి? ఇప్పుడు అమృతపాల్ తనంతట తాను లొంగిపోవడం వెనుక రహస్యం కూడా ఎవరూ చెప్పలేరు. అమృతపాల్ ఎక్కడున్నాడో తెలిసినప్పటికీ ఆయనను ముందే నిర్ణయించిన విధంగా నాటకీయంగా అరెస్టు చేశారని కథనాలు కూడా ఉన్నాయి. పంజాబ్‌లో కాకుండా అస్సాంలోని దుర్భేద్యమైన దిబ్రుఘడ్ జైలుకు తరలించడం వెనుక మతలబు కూడా మనకు తెలియదు. పంజాబ్‌లోనే బంధిస్తే ఆయన మళ్లీ తప్పించుకుపోతాడన్న భయమా? ఉత్తరప్రదేశ్‌లో మాఫియాడాన్‌ను పిట్టలను కాల్చినట్లు కాల్చివేసినప్పుడు పంజాబ్‌లో ఒక ఉగ్రవాదిని అలా కాల్చేయకుండా ఎందుకు వెనుకాడారు? ఆ రాష్ట్రంలో పరిస్థితులు అంత సున్నితంగా ఉన్నాయా? రచయితల్ని, అధ్యాపకులను సైతం యుఏపిఏ చట్టం క్రింద బంధించేందుకు వెనుకాడని వారు అమృతపాల్ సింగ్ విషయంలో అంతే యుద్ధ ప్రాతిపదికగా ఎందుకు వ్యవహరించలేదు? అత్యంత శక్తిమంతులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హయాంలో అమృతపాల్ సింగ్ వంటి పరిణామాలు తలెత్తడం స్పష్టంగా వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థల వైఫల్యానికి నిదర్శనంగా భావించవచ్చు. లేదా ఈ మొత్తం పరిణామాల వెనుక రాజకీయాలు ఉండవచ్చు. జలంధర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అమృతపాల్ సింగ్ అరెస్టు ప్రభావం కూడా ఉండవచ్చని కథనాలు వస్తున్నాయి.
అమృతపాల్ సింగ్ పరిణామం దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివిధ ఏజెన్సీలకు వెల్లడించిన విషయాలు కూడా అంతే సంచలనం సృష్టించాయి. 2019 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్‌లో సిఆర్‌పిఎఫ్ సెక్యూరిటీ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి జరిగి 40 మందికి పైగా జవాన్లు మరణించడం వెనుక ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉన్నదని ఆయన సంచలనాత్మకమైన ఆరోపణ చేశారు. అంతేకాకుండా ఈ భద్రతా సిబ్బంది వెళ్లేందుకు అప్పుడు రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్న హోంమంత్రిత్వ శాఖ విమానాలను ఇచ్చేందుకు నిరాకరించిందని కూడా ఆయన వెల్లడించారు. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్లేందుకు సిఆర్‌పిఎఫ్ కోరిన విధంగా జవాన్లకు విమానాలను ఇచ్చి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని తాను అదే రోజు సాయంత్రం ప్రధానికి చెప్పానని, అయితే దీనిపై పెదవి విప్పవద్దని (తుమ్ అభీ చుప్ రహో) తనను ప్రధాని హెచ్చరించారని ఆయన చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా తనను మౌనం పాటించాలన్నారని తెలిపారు, జమ్ము–శ్రీనగర్ దారిలో 8 లింక్ రోడ్లు ఉన్నప్పటికీ అక్కడ కూడా భద్రతా ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. సత్యపాల్ మాలిక్ సాధారణ నేత కాదు. జమ్మూ–కశ్మీర్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా మోదీ ప్రభుత్వమే ఆయనను నియమించింది. బిజెపి సభ్యుడైన ఆయన పార్టీ ఉపాధ్యక్షుడుగా కూడా ఒకప్పుడు బాధ్యతలు నిర్వర్తించారు.
గవర్నర్ పదవి కోల్పోయిన తర్వాత చేసే వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యం ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అన్నది చర్చనీయాంశం. బహుశా పదవి కోల్పోయినందుకే ఆయన మాట్లాడుతుండవచ్చు. లేదా తన భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకున్నందుకు అవమాన భారంతో ఆయన ఆరోపణలు చేస్తుండవచ్చు. ఆయన తన పదవిలో ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయం గురించి మాట్లాడలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనడంలో కూడా అర్థం లేకపోలేదు. మోదీ, అజిత్ దోవల్ ఇద్దరూ తనను పెదవి విప్పవద్దని చెప్పినప్పుడు మౌనం పాటించి, ఇప్పుడు పెదవి విప్పడంలో అసలు అర్థం లేదు.
కాని సత్యపాల్ మాలిక్ అప్పుడు మాట్లాడకపోయినా ఇప్పుడు ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బిజెపి ప్రభుత్వానికి ఉన్నది. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే బిజెపి నాడు పుల్వామా ఘటనను ఉపయోగించుకున్నదని చెప్పేందుకు సత్యపాల్ మాలిక్ ఆరోపణలు దోహదం చేస్తున్నాయి. పుల్వామా ఘటన తర్వాత పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత యుద్ధ విమానాలు సర్జికల్ దాడులు జరిపాయని మన ప్రభుత్వం ప్రకటించింది, దాని ఫలితంగా 2019 ఏప్రిల్‌లో మోదీ ప్రభుత్వం అఖండమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. సత్యపాల్ మాలిక్ బహుశా అప్పుడే ఇంటెలిజెన్స్ వైఫల్యం, జవాన్లకు విమానాల నిరాకరణ గురించి మాట్లాడి ఉంటే బిజెపికి రాజకీయ ప్రయోజనం దక్కేది కాదేమో?
నిజానికి పుల్వామా ఘటన జరిగినప్పుడే ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి, ఇంటెలిజెన్స్ సమాచారంపై స్పందించకపోవడం గురించి అనేక పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ వైఫల్యం లేకపోతే సరిహద్దులనుంచి పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ దేశంలోకి ఎలా ప్రవేశిస్తుంది? పుల్వామాలో జరిగిన విస్ఫోటనంలో ఉగ్రవాదులు ఒక క్వింటాల్‌కు పైగా ఆర్డీఎక్స్‌ను ఒక వాహనంలో అమర్చి, సిఆర్‌పిఎఫ్ వాహనాలను ఢీ కొనేలా చేయడం ఎలా సాధ్యపడింది? ఎంతో ముందుగా పథక రచన చేస్తే గానీ ఇలాంటి ఉగ్రవాద చర్య సాధ్యపడుతుందా? సిఆర్‌పిఎఫ్ కోరినా వారి ప్రయాణానికి హోంమంత్రిత్వ శాఖ నిజంగా విమానాలను నిరాకరించిందా? సిఆర్‌పిఎఫ్ వాహనాలు వెళ్లే దారిలో ఎందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయలేదు? 40 మంది భారత జవాన్లు అమరులు కావడం వెనుక దోషులు ఎవరు? సత్యపాల్ మాలిక్ మరిన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసలు కశ్మీర్ గురించి మోదీకి ఏ మాత్రం తెలియదు అని అన్నారు. ప్రధానమంత్రికి అవినీతి అంటే అంత వ్యతిరేకత ఏమీ లేదు అని కూడా చెప్పారు. ప్రతిపక్ష నేతలందరూ అవినీతిపరులని మోదీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత లేకపోలేదు.
సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలకు మోదీ ప్రభుత్వం గట్టి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ తనకు తాను దేశభక్తి, జాతీయవాదం మూర్తీభవించిన సంస్థగా చెప్పుకుంటుంది. ఎంత లేదన్నా దేశ భక్తి బిజెపి నేతలకే ఎక్కువ ఉన్నదని అనేకమంది ప్రజలు నమ్మే పరిస్థితిని మోదీ, ఆ పార్టీ నేతలు తమ ప్రసంగాలు, ఉపన్యాసాల ద్వారా కల్పించారు. ఈ ప్రచారం బూటకం కాదని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఈ ‘జాతీయవాద’ పార్టీకి ఉన్నది. ప్రశ్నలకు, విమర్శలకు సమాధానం చెప్పకుండా మౌనం పాటించడం ఈ ప్రభుత్వానికి ఒక లక్షణంగా మారింది. అదానీపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకూ సమాధానం లేదు. పార్లమెంట్‌లో చర్చకు గానీ, జేపీసీ నియామకానికి గానీ అంగీకరించలేదు. ఇప్పుడు పుల్వామాపై కూడా ప్రభుత్వం నీరవ నిశ్శబ్దం పాటిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకో మోదీ ప్రభుత్వం అనేక విషయాల్లో ఆత్మరక్షణలో పడిందనే అభిప్రాయం కలుగుతోంది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)