Women stoned to death: వ్యభిచారం నెపంతో మహిళను రాళ్లతో కొట్టి చంపారు..

ABN , First Publish Date - 2023-09-03T20:39:10+05:30 IST

వ్యభిచారం ఆరోపణపై ఒక మహిళలను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ అమానుష ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.

Women stoned to death: వ్యభిచారం నెపంతో మహిళను రాళ్లతో కొట్టి చంపారు..

లాహోర్: వ్యభిచారం (Adultry) ఆరోపణపై ఒక మహిళలను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ అమానుష ఘటన పాకిస్థాన్‌ (Pakistan)లో పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. లాహోర్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని రాజన్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. బాధిత మహిళను స్వయంగా ఆమె భర్త, ఆతని ఇద్దరు సోదరులు కలిసి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశారనీ, రాళ్లతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. పంజాబ్-బలూచిస్థాన్ మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలో వీరు తలదాచుకున్నట్టు అనుమానిస్తున్నామని పోలీసులు చెప్పారు.


పరువు హత్య పేరుతో మహిళలను కొట్టిచంపిన ఘటన పాకిస్థాన్‌లో ఇదే మొదటిది కాదు. మానవహక్కుల కార్యకర్తల సమాచారం ప్రకారం, ఆ దేశంలో ఏటా సుమారు 1,000 మంది మహిళలు ఇదే తరహాలో హత్యకు గురవుతున్నారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిళ్లు చేసుకోవడం, అక్రమ సంబంధాల వల్ల తమ కుటుంబ పరువు పోతోందనే కారణంతో ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. వీటిలో కుటుంబ సభ్యులే ఈ తరహా హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అధికంగా ఉంటున్నాయి.


కొద్దిరోజుల క్రితమే, 25 ఏళ్ల వైద్యురాలు పరువు హత్యకు గురైంది. తన కొలీగ్‌ను పెళ్లి చేసుకోవాలని వైద్యురాలు అనుకోగా, అందుకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఇదే విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు వైద్యశాలకు వచ్చిన ఆమె తండ్రి వాగ్వాదానికి దిగాడు. కోపంతో రెచ్చిపోయిన తండ్రి తుపాకీ తీసి కూతుర్ని కాల్చిచంపాడు. పాకిస్థా్న్‌లో మహిళల దయనీయ పరిస్థితికి ఈ పరువు హత్యలు అద్దంపడుతున్నాయని, మహిళలను రెండో తరగతి పౌరులుగా చూస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా హత్యలను నిరోధించి మహిళాభద్రతకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-09-03T21:11:41+05:30 IST