Share News

Hyderabad: బంధువుల పెళ్లికి తీసుకెళ్లలేదని.. బాలుడు ఆత్మహత్య

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:56 PM

బంధువుల పెళ్లికి తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో పదోతరగతి చదువుతున్న ఓ బాలుడు ఆత్మహత్య

Hyderabad: బంధువుల పెళ్లికి తీసుకెళ్లలేదని.. బాలుడు ఆత్మహత్య

ఉప్పల్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బంధువుల పెళ్లికి తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో పదోతరగతి చదువుతున్న ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామంతాపూర్‌ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఉప్పల్‌(Uppal) పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్‌ బాలాజీనగర్‌లో నివాసముంటున్న నర్సింహ, గీత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఇంటర్‌ చదువుతుండగా, చిన్న కుమారుడు నిఖిల్‌ స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో తాను చుట్టాల పెళ్లికి వెళుతున్నానని, శనివారం స్కూల్‌కు రావడం లేదని తోటి స్నేహితులకు చెప్పి నిఖిల్‌ ఇంటికి చేరుకున్నాడు. అయితే, అప్పటికే తల్లిదండ్రులు నిఖిల్‌కు చెప్పకుండా బంధువుల పెళ్లికి వెళ్లిపోయారు. ఇంటర్‌ చదివే తన అన్నతో కలిసి ఆ రాత్రి ఇంట్లోనే ఉండిపోయాడు. మరుసటి రోజు నిఖిల్‌ స్కూల్‌కు వెళ్లలేదు. ఫోన్‌లో అతని తల్లి మందలించినా వినిపించుకోలేదు. తనను పెళ్లికి తీసుకుపోనందుకు ఇంట్లోనే ఉంటానని మొండిగా వ్యవహరించాడు. అన్న కాలేజీకి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న నిఖిల్‌ ఉరి వేసుకున్నాడు. తల్లి పక్కింటి వారికి ఫోన్‌ చేసి ‘మా బాబు ఇంట్లో ఏం చేస్తున్నాడో’ చూడమని చెప్పడంతో వారు చూసేందుకు వెళ్లారు. ఎంత పిలిచినా బాలుడు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా నిఖిల్‌ ఉరి వేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:56 PM