Ganja chocolate: రూపాయికి కొని రూ.40కి విక్రయం
ABN , First Publish Date - 2023-03-09T12:34:24+05:30 IST
గంజాయి చాక్లెట్ రూపాయికి కొనుగోలు చేసి రూ.40కి విక్రయిస్తుండడంతో అధిక లాభం వస్తోందని చెన్నైలో అరెస్టయిన బిహార్(Bihar) రాష్ట్ర గంజా

పెరంబూర్(చెన్నై): గంజాయి చాక్లెట్ రూపాయికి కొనుగోలు చేసి రూ.40కి విక్రయిస్తుండడంతో అధిక లాభం వస్తోందని చెన్నైలో అరెస్టయిన బిహార్(Bihar) రాష్ట్ర గంజాయి వ్యాపారి పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. చెన్నైలో ఇటీవల గంజాయి చాక్లెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. కాగా వాటిని విక్రయిస్తున్న వారిని పోలీసులు అస్టు చేస్తున్నారు. అన్నాసాలై పోలీస్‌స్టేషన్(Annasalai Police Station) పరిధిలోని వెంకటేశన్ 2వ వీధిలోని ఓ ఇంట్లో గంజాయి చాక్లెట్లు భారీగా నిల్వచేశారనే సమాచారంతో, డిప్యూటీ కమిషనర్ భాస్కరన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ వీరసామి నేతృత్వంలో ఆ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. 38 కిలోల గంజాయి చాక్లెట్లు, ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని, బిహార్ రాష్ట్రానికి చెందిన గంజాయి వ్యాపారి కస్రతూరి (28)ని అరెస్టు చేసి విచారించారు. గంజాయి కన్నా గంజాయి చాక్లెట్ల విక్రయాలతో అధిక లాభం వస్తోందని, బిహార్‌లో చాక్లెట్లు తయారుచేసే సంస్థలు అధికంగా ఉన్నాయని తెలిపాడు. అక్కడ చాక్లెట్ రూ.1 కొనుగోలు చేసి చెన్నైలో ఒక్కో దాన్ని రూ.40కి విక్రయిస్తున్నామని, చిల్లరగా అయితే రూ.50 వరకు అమ్ముడవుతోందని తెలిపాడు. కళాశాల విద్యార్థులు, యువకులు అధికంగా కొనుగోలు చేస్తున్నారన్నారు. బీడా దుకాణాల్లో ఇలాంటి చాక్లెట్లు రహస్యంగా విక్రయస్తున్నారని తెలిపాడు. బిహార్ నుంచి రైళ్ల ద్వారా సులభంగా వీటిని తీసుకొని రావచ్చని వాంగ్మూలమిచ్చాడు. బిహార్‌లో గంజాయి చాక్లెట్ల తయారీకి అనుమతి ఉందా అనే విషయమై విచారణ చేపట్టినట్లు, బీడా దుకాణాల్లో కూడా తనిఖీలు చేపడతామని పోలీసులు తెలిపారు. కాగా, అయనావరం బస్ డిపో సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ప్రేమ్‌కుమార్ (29)ను అరెస్టు చేసిన పోలీసులు, అతని నుంచి 13 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.