Delhi horror: కారు కింద అంజలి చిక్కుకున్న విషయం తెలిసినా వాహనం ఆపలేదు.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-01-08T17:24:58+05:30 IST

నూతన సంవత్సరం రోజున ఢిల్లీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి (Delhi Car Horror) సంబంధించి రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది.

Delhi horror: కారు కింద అంజలి చిక్కుకున్న విషయం తెలిసినా వాహనం ఆపలేదు.. ఎందుకంటే?

న్యూఢిల్లీ: నూతన సంవత్సరం రోజున ఢిల్లీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి (Delhi Car Horror) సంబంధించి రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. జనవరి 1న తెల్లవారుజామున స్కూటర్‌పై వెళ్తున్న అంజలి సింగ్ (20)ని ఢీకొట్టిన కారు ఆమెను 12 కిలోమీటర్లకుపైగా ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె శరీరం ఛిద్రమై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి వెలుగులోకి వస్తున్న సీసీటీవీ ఫుటేజీల ద్వారా రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది.

ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తాజాగా మరో విషయాన్ని వెల్లడించారు. సుల్తాన్‌పురి(Sultanpuri)లో ప్రమాదం జరగ్గా కంజావాల వరకు అంజలి(Anjali)ని కారు ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో కారు బోల్డన్ని మలుపులు తిరిగింది. స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత యువతి తమ కారు కింద చిక్కుకున్న విషయం నిందితులకు తెలుసని పోలీసులు తెలిపారు. అయితే, భయం వల్ల కారును ఆపకుండా పోనిచ్చినట్టు చెప్పారు. కారు ఆపి, దానికింద చిక్కుకున్న యువతిని రక్షిస్తే తమపై హత్యకేసు నమోదు చేస్తారన్న భయంతోనే వారు కారును ఆపకుండా వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.

ప్రమాదం తర్వాత వారు భయభ్రాంతులకు గురయ్యారని, అందుకనే చిక్కుకున్న మృతదేహం దానంతట అది పడిపోయే వరకు కారును ఆపకుండా డ్రైవ్ చేశారని పేర్కొన్నారు. కారులో పెద్ద శబ్దంతో పాటలు వింటుండడంతో అంజలి చిక్కుకున్న విషయాన్ని గుర్తించలేకపోయామని, తెలిశాక మాత్రం అక్కడి నుంచి పారిపోయామని నిందితులు పోలీసులకు తెలిపారు. వారు ఇప్పుడు తప్పు జరిగిన విషయాన్ని అంగీకరించారని పోలీసులు వివరించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కోసం పోలీసు ఉన్నతాధికారులు మొత్తం 18 బృందాలను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-01-08T17:25:12+05:30 IST