Chennai: విషాదం.. ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు.. 30 ఏళ్లు దాటినా..
ABN , First Publish Date - 2023-05-26T09:11:20+05:30 IST
మూడు పదుల వయస్సు దాటిన తన ఇద్దరు కుమారులకు వివాహం జరగలేదన్న బాధతో ఓ తల్లి ఆత్మాహుతి చేసుకుంది. ఆ తల్లి మృతిని తట్టుకోలేక ఆమె

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మూడు పదుల వయస్సు దాటిన తన ఇద్దరు కుమారులకు వివాహం జరగలేదన్న బాధతో ఓ తల్లి ఆత్మాహుతి చేసుకుంది. ఆ తల్లి మృతిని తట్టుకోలేక ఆమె రెండో కుమారుడు కూడా ఆమెలాగే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన న్యూవాషర్‌మెన్‌పేటలో చోటుచేసుకుంది. వివరాలిలా... న్యూ వాషర్‌మెన్‌పేట క్రాస్‌రోడ్డు ప్రాంతంలో నివశిస్తున్న అశోకన్, నాగేశ్వరి (57) దంపతులకు నవీన్ (34), వివేక్ (32) అనే ఇద్దరు కుమారులున్నారు. అశోకన్ మిలటరీ ఆస్పత్రిలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కుమారులకు మూడు పదులు దాటినా వివాహం జరగలేదని నాగేశ్వరి బాధపడుతుండేది. తన కుమారులకు వీలైనంత త్వరగా వివాహం చేయాలంటూ ఆమె భర్తతో రోజూ గొడవపడుతుండేది. బుధవారం ఉదయం కూడా నాగేశ్వరి భర్తతో ఇదే విధంగా గొడవపడింది. దీంతో ఆగ్రహించిన అశోకన్ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. దీంతో విరక్తి చెందిన నాగేశ్వరి వంటగదిలోకి వెళ్లి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో నాగేశ్వరి రెండో కుమారుడు తల్లి మృతిని తట్టుకోలేక రోదించాడు. కుటుంబ సభ్యులు అతడిని ఓదార్చినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నాగేశ్వరి రెండో కుమారుడు వివేక్ కాశిమేడు నాగూరు గార్డెన్ ప్రాంతానికి వెళ్ళి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అది గమనించి స్థానికులు వెళ్ళి మంటలు ఆర్పారు. కాని వివేక్‌ను కాపాడలేకపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెళ్ళి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. 24 గంటల వ్యవధిలో తల్లీ కొడుకు ఆత్మహత్యలు చేసుకోవడం రాయపురం ప్రాంతంలో స్థానికులకు కంటతడిపెట్టించింది.